Thursday, July 21, 2011

క్యో కి సాస్ భి కభి టొమాటో తీ.....

కెవ్వ్...వంటిట్లో వినపడ్డ కేక విని, ఏం తగలడి పోయిందో అని పరిగెట్టా. మేడం టుస్సాడ్ బొమ్మలా మా ఆవిడ  నిలబడి ఉంది. చేతిలో అట్ల కర్ర తో రుద్రమ దేవి కత్తి  పట్టినట్టు.ఏమైంది కంగారు గా అడిగాను. నా సీరియల్ టైం అయింది. గబా గబా హాల్ లోకి పరిగెత్తింది.ఓహ్ అదా...కొంచెం ఊపిరి పీల్చుకున్నా. మా చుట్టు పక్కల పది కొంపల్లో ఏ మిస్సెస్సు  మిస్ కాని మెగా డైలీ  సీరియల్. క్యో కి సాస్ భి కభి టొమాటో తీ...ప్రారంభం అయింది.పదివేల ఎనిమిది వందల తొంభై వోక్కవ భాగం.
నిన్నటి కధ అనుకుంటాను, మల్లా చూపిస్తున్నాడు.అదుగో హీరోయిన్.నేను చుసిన నూట నాలుగో భాగం కన్నా కొంచెం వొళ్ళు చేసింది. ఎవరో అపరిచిత ( నా వరకు నాకు) వ్యక్తి తో ఈ మద్య సూపర్ డుపేర్ హిట్ అయిన మృగ వీర సినిమా పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే, నిత్యానంద కపాల మోక్షం సారీ సారీ కుండలిని కిక్ యోగ లో ఊగి పోయినట్టు గా ఊగి పోతూ డాన్సు లాటిది చేస్తుంది. ఎవడీడు?అడిగాను. హీరో అంది తల తిప్పకుండానే. మరి పోయిన సారి నేను చూసి నప్పుడు వేరే వాడు ఉన్నాడే? 
వీడు వాడి మేనత్త పేద బావ చిన్నక ముత్తవ్వ మేన మామ గారి వేలువిడిచిన కాళ్ళు తడిచిన...ఆపూ...అదేదో సినిమా లో అరిచినట్టు అరచాను. మరి పోయిన సారి ఇదే యాక్టర్ హీరోయిన్ పాత్ర లో...నా మట్టి బుర్రకి ఇవన్ని అర్ధం అయితే రోజుకి నాలుగు సీరియల్లు సూసేసే వాడిని కదా. సరేలే ...ఇన్ని వేల భాగాల తర్వాత కధ లో ఈ మాత్రం మలుపులు లేకుంటే ఏం బావుంటుంది.అయినా, ఆవిడ పర్సనల్ గొడవలు మనకెందుకు..మేనర్స్ లేకుండా..
నిన్నటి భాగం పూర్తయింది.వాణిజ్య ప్రకటనలు." నేడే ఆఖరి రోజు" గొప్ప తగ్గింపు ధరలతో,నీది బోడి ఖర్మే  సీరియల్ లో హీరోయిన్ సుబ్బ శ్రీ కట్టిన  చీర. పది కొంటె ఒకటి ఫ్రీ.ఒక్కో చీర పది వేలు మాత్రమె.నేడే వచ్చేయండి.పొమ్మనా బ్రదర్స్ .కుక్కట పల్లి,హైదరాబాద్.
కొంచెం డిన్నర్ కానిద్దూ.నా మాట విని మా ఆవిడా ఉల్లి రేకులు సీరియల్ లో తమిళ మామి తిప్పి  నట్టు నాలుగు సార్లు తల తిప్పింది.సౌండే రాలేదనుకోండి.ఎన్నడా..అని ఏదో అంటున్దనుకున్నా..కాని అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి మీరు కానివ్వండి అని మళ్ళా సౌందర్య కిరి కిరి అనే షాంపూ ప్రకటన లో మునిగి పోయింది. ఆ రోజు ఉండే సంబడవే గా..
ఫ్రిజ్ లోంచి కొంచెం డామ్బారు ( మీ ఇంట్లో మా గంటె అనే కార్యక్రమం లో చూపించబడి మా ఆవిడ చే వండ బడ్డ ద్రవ పదార్దం.) తీస్కోని టేబుల్ దగ్గర కూల బడ్డాను. మొదటి ముద్దా నోట్లో పెట్టుకున్నానో లేదో తలుపు దబ దబా బాడిన శబ్దం విని తలుపు తీశాను.పై పోర్షన్ పిన్ని గారు.పాపం ఏమైందో ఏమో కొంగు నోట్లో పెట్టుకుని ఏడుపు ఆపు కోవడానికి ప్రయత్నిస్తుంది.ఏమైందన్ నా నోట్లో మాటలు బైటి కోచ్చాయో లేదో...నన్ను తోసుకుని లోనికి పరిగెత్తింది అమ్మి అంతా అయిపోయిందే అంటూ.ఏమైందో ఏమో అనుకుంటూ..నేను హాల్ లోకి పరిగెట్టాను...
అదేనే అమ్మాయి, అనుకున్నదంతా అయి పోయిందే  తల్లి...ఆ ముడనస్తపు సచ్చినోడు బంగారం లాటి  పిల్ల ని పొట్టన పెట్టుకున్నాడే...మా అపార్ట్మెంట్ వాచ్ మాన్ మంచి మందు గాడు.అవకూడని దేమైనా అయ్యిందేమో అని నోరు తెరిచే లోగా మా ఆవిడ మొదలెట్టింది.కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటూ..ఎలా చంపాడు అయ్యో అలా జరిగిందా..నా బీ పీ డబల్ సెంచరీ దగ్గర పడింది. ఏమోనమ్మ..ఈ రోజు మొత్తం చూపించలేదు. ఆ పిల్ల నాన్న వచ్చి ఇంట్లో వెతుకు తున్నాడు. అమ్మాయి అమ్మాయి అని అరుచుకుంటూ.మద్యలో ఆపేసాడు, చింపనా బ్రదర్స్ ప్రకటన తో...నాకిప్పుడు అర్ధం అయింది.
జూ టీవి లో వచ్చే ఒక నాన్న వంద కూతుళ్ళు కొత్త ఎపిసోడ్ గురుంచి చెప్తుందని. జై మనీ టీవి లో ఈ సీరియల్ వచ్చే టప్పుడు ఆ చానెల్ లో అది తగలడుతుందన్న మాట. ఇరు దేశాలు ఒప్పందాల మీద సంతకాలు చేసుకుని మార్చు కున్నాట్టు, పిన్ని గారు మా ఆవిడ అ రోజు స్టొరీ ఆ రోజు  ఇచ్చి పుచ్చు కున్టారన్న మాట.మా ఆవిడ తేల్చేసింది, ఆ ఇదేమన్న కొత్త..పదహారు వందల యాభై ఎపిసోడ్ లోను ఇంతే, ఆ పిల్ల ఏ కూరగాయలకో వెల్లుంటుంది.మరి అన్నీ తెలిసి ఇక చూడటం ఎందుకో..
సరే అమ్మి, ఈ రోజు హీరోయిన్ ఎల్లాంటి చీర కట్టిన్దనుకున్నావ్.తప్పకుండ కంచి పట్టే ననుకో.దాని బోర్డరు,మద్యలో హ్యాండ్ వర్క్ అదిరి పోయాయే..నీకేలాగు మంచి పట్టు చీర లేదన్నావు, ఈ వారం వెల్దామేవిటి...మీ బాబాయ్ గార్ని తోడూ తీస్కుని...పొతే పోనిద్దూ చూసి వూర్కొక ఇదొకటా మళ్ళా...
లేదులే పిన్ని...బతికించింది అనుకున్నా...నిన్న మీ టీవి లో అడిగితె ఇచ్చిన గొలుసు  లో  హీరోయిన్ వేస్కున్న జుంకాలు చాల బావున్నాయ్.ఈ వీకెండ్ షాపింగ్ కెల్దామా, ఏ షాప్ లో దొరుకుతాయో..ఏమో...ఈ వీకెండ్ నాకు జ్వరం వస్తుందని ఇప్పుడే అనిపించింది.ఇదీ వరస..
సరేలే నాకెందుకు అని...నా డామ్బారు ఆస్వాదిస్తూ భోన్చేసాను.నేను హాల్ లోకి వెళ్ళేటప్పటికి కొంచెం ప్రశాంతం గా ఉంది వాతావరణం.సీరియల్ కి సీరియల్ కి మద్య వచ్చే ప్రకటన లాగ.నిజమే..నీ జన్మ కి నేనే సీరియల్ ప్రారంభం.ఇక్కడ టైటిల్స్ వచ్చే టైం కి సోనీ ఛానల్ లో ఏ రిక్షా క్యా కహనా హాయ్ అనే సీరియల్ వస్తుంది. మా ఆవిడ నాగఫణి శర్మ గారి లా ద్వందావ దానం చేస్తుంది.ఇంకా నయ్యం మా అమ్మగారు కూడా ఉన్నారు కాదు.ఇంట్లో సీత అనసూయ యుద్దమే.( అదేంటి అంటారా, వీళ్ళిద్దరికీ లింక్ లేకపోయినా ఇద్దరు ఆడాళ్ళు సీరియల్ చూస్తుంటే తన్నుకోక చస్తార మీ భ్రాంతి కాని.ఒకావిడ పేడ పందిరి అంటే ఇంకొకావిడ వివాహ బొందము అంటుంది ).
సరే సడి చేయకో ఎసి  సడి చేయబోకే, మీ టీవీ లో  రాణి సీరియల్ చూసేనే..అని పాడుకుంటూ, నా లాప్ టాప్ పట్టుకుని, నా పనిలో నేను పడి పోయాను.
తెలుగు నాట లక్షలాది ఇళ్ళలో ఈ సీరియల్ వాచింగ్ అనే సాంఘీక దురాచారానికి బలి అయిపోతున్న మగ వాళ్ళకు అశ్రు నయనాలతో.. :)
కొంచెం ఎక్కువైందా...అయిన నువ్వు చెప్పేది ఏంటోయ్ మా ఇంట్లో రోజు ఉండే తంతే ఇది అంటారా..

Tuesday, July 19, 2011

ఉపమాకోపాక్యానము...

మళ్ళా అదే..ఈ రోజు... మా అవిడ అదేదో అమృతం తెస్తున్నట్టు ఫోసు పెట్టి పళ్ళెం లో పెట్టుకోస్తున్న పదార్ధాన్ని చూసి హిచ్ కాక్ సినిమా చివ్వర్లో కనపడ్డ విలన్ ను చూసి నట్టు ఒళ్ళంతా కంపరం వేసింది .ఇంకా అదేవిటో చెప్పలేదు కదూ..అదేనండి పాల సముద్రం చిలికి నప్పుడు వచ్చిన విషాన్ని శివుడు తాగేసి, ఆ గిన్నె చివర్లో మిగిలిన అవశేశాన్ని మానవ లోకం తిక్క కుదర్చడానికి టిఫిన్ పేరు మీద మన మొహాన కొట్టిన పదార్దం.పార్వతి దేవి ఇది వండి పెడితేనే, జీవితం మీద విరక్తి పుట్టి స్మశానాల్లో    తిరిగాట్ట.ఇంకా అర్ధం కాలే, అదే మన విష్ణు మూర్తి ఇది వండి పెడి తేనే విష్ణు లోకం వదిలి భూలోకం పారి పోయ్యాట్ట. నీ పని ఇలా ఉందా అని లక్ష్మి దేవి ఆదే మల్ల పట్టుకొస్తే, ఈ సరి ఇలా కాదు అని గమ్మున తిరుపతి కొండెక్కి బొమ్మై పోయాట్ట. ఇంకా అర్ధం కాలేదా, మన బ్రంహ గారు పువ్వేక్కి ఎందుక్కుచ్చున్నారను  కున్నారు. ఈ పదార్దం పట్టుకు రావటానికి సరస్వతి దేవి నీళ్ళలో ఈది రాలేక లైట్ తీస్కుంటుంది అని.

అదే నండి..ఉప్మా. ఇవి రక రకాలు. బొంబాయి రవ్వ తో చేసే ఉప్మా మన పోస్టర్లు అంటించే పదార్దం కన్నా కొంచెం తెల్లగ ఉన్న, అది చూడగానే నాకు అదే గుర్తుకొస్తుంది. ఇక గోధుమరవ్వ ఉప్మా రోడ్డు మీదేసే కన్కరే.ఇక సేమియా ఉప్మా అని, బియ్యం రవ్వ అని, నా బొంద రవ్వ అని రకరకాలు. మద్య మద్య లో పోపు గింజలు,మాకోసమన్న కొంచెం ఎంగిలి పడు బాబు అని ఎక్కడో కాన పది ప్రాదేయ పడే జీడి పప్పు.సగం తినగానే అసలు ఈ పాడు జీవితానికి ఇది తినాలా అని పింప జేస్తుంది.దేవదాసు ఊరకే అనలేదు ఉప్మా వడలు కష్ట సుఖాలు కావడి లో కుండలే అని.  అందుకే ఉప్మా తిను వాడు ఉడతపిల్లై పుట్టును అని మన గిరీశం ఏనాడో చెప్పాడు. అసలు ఈ మద్య దొరికిన రెండో ప్రపంచ యుద్ద రహస్య పత్రాల్లో తెలిసిన విశేషాలు ఏమిటంటే, యుద్ద ఖైదిలకి, నాజి క్యాంపు గట్రాల్లో, ఇవే వొండి పెట్టె వాళ్ళట.భగవత్ గీతలో కృష్ణుడు గారు ఇంత పెద్ద సమస్య గురుంచి ఎందుకు చెప్పలేదో, చెప్తే ఎక్కడ ఇంట్లో అదే వొండి పెడతారో అని భయపడ్డాడో కాని, మా వూళ్ళో కృష్ణన్ అయ్యర్ మాత్రం బాగా అర్ధం చేస్కున్నాడు. అందుకేగా, హోటలు పెట్టాడు. ఉప్మా భాదితులంతా, ఇంట్లో ఏదో మమ అనిపించి ( లేకుంటే అదో గోల) ఆయన హోటలు ముందే వాలి పొయ్యేవాళ్ళు.మా అయ్యర్ గారి మాటల్లో చెప్పాలంటే, ప్రపంచ ఈ దినం ఆ దినం ఉన్నట్టు, ప్రపంచ ఉప్మా దినం ఉంటె యెంత బావుండు.ఆ రోజు ఆయనకి మరి పండగే.

మొన్న ఇండియా ట్రిప్ కెళ్ళి వచ్చాక,ఒబామా ఈ ఉప్మా మీద ప్రయోగాలకు పురమా ఇంచాట్ట. ఇవే ఏ ఖండార్గత క్షిపణుల్లో పెట్టి ప్రయోగిస్తే ఏమవుతుంది అని. జైళ్లలో ఉన్న ఉగ్రవాదులకు లెవెల్ ౧౦ టార్చర్ లో భాగం గా ఇది వండి పెట్టమని కాంగ్రెస్ ఆల్రెడీ తీర్మానం చేసేసింది అని వినికిడి. మొన్న ఘుర్ఖ ల్యాండ్ ఒప్పందం లో కూడా మమతక్క వేర్పాటు వాదులను దారికి తెచ్చేందుకు వోప్మ మంత్రం వేసింది అని ఆ దెబ్బ కి దారికి వచ్చి బుర్రతిరిగి పరిస్తితి  బోదల్ గయా అని వార్త.అంగన్ వాడీల్లో ఈ ఉప్మా దెబ్బ కే సగం పిల్లలు బడి మానేశారు అని ఈరోజు స్టాటిస్టిక్స్. 
ఎవరైనా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఉప్మా నే వండి పెడుతూ,  ఇది మా ఇంట్లో అందరికి ఇదే ఇష్టం అని చెప్తున్నారా. హీ హీ హీ 
( పై టపా నిను వీడని నీడను నేనే అని ఇన్ని ఏళ్ళు గా నా వెంటపడుతున్న ఉప్మా అను పదార్దానికి ఉడతా భక్తీ గా నా సమర్పణ)

Saturday, July 9, 2011

టాల్ స్టాయ్ -కోసక్కులు

మొన్న పుస్తకాలు సర్దుతుంటే కనపడ్డది ఆ పుస్తకం.చిన్నదే  ఐన పొందికైన అట్ట.చూడగానే ఆకర్షనీయం గా, పోనిలే ఒకసారి చదువుదూ అన్నట్టు  ఉంటుంది. పైన కోసక్కులు అన్న పేరు,మధ్యలో చేతులు కట్టుకుని చదువు తావాలేదా అన్నట్టు  చూస్తున్న బరివి గడ్డం తాతయ్య.కింద ఆయన పేరు..ఇంకెవరు నా అల్ టైం ఫేవరేట్ టాల్ స్టాయ్.
 
రష్యా పుస్తకాలతో నా పరిచయం నా చిన్నప్పటిది.మా నాన్న కమ్యునిస్టు భావాలను గౌరవించేవారు.ఆ భావ జాలానికి అనుగుణంగా ఎప్పుడైనా రష్యా బుక్ exhibition వస్తే నాన్న రక రకాల పుస్తకాలు తెచ్చేవారు.వాటిలో చిన్న పిల్లల కదల పుస్తకాల నుండి, రష్యా చరిత్ర, విప్లవం మొదలైనవి కూడా ఉండేవి. అప్పుడప్పుడు చుట్టం చూపుగా వచ్చే మా మధు బావ గాడికి నాకు ఈ పుస్తకాల దగ్గర డిష్యుం డిష్యుం జరిగేది.
 
ఇక కోసక్కుల విషయాని కొస్తే, నేను డిగ్రీ లో ఉన్నప్పుడు అనుకుంటా..ఒక బుక్ exhibition  లో చూసాను. అప్పటికి సోవిఎట్ విచ్చిన్న మై పోయింది.అలాంటి పుస్తకాలు రావటం ఆగిపోయింది.ఏదో పాత పుస్తకాల వరసలో కాన పడ్డ టాల్ స్టాయ్ తాత నన్ను పలకరించాడు.వార్ అండ్ పీసు లాంటి నవలలు రాసాడని తెలుసు కాబట్టి గబాల్న కొనేసాను.అదే నేను ఆయన పెద్ద అభిమాని అవటానికి ప్రారంభం అవుతుందని నాకు తెలియదు.
ఈ కదా ఒక చిన్న లవ్ స్టొరీ. ఒలేనిన్ అనే మన హీరో, మంచి డబ్బున్న కుటుంబం లో పుడతాడు.మాస్కో లో బాగా అప్పులు చేసి, ఎవరికి మొహం చూపించడం ఇష్టం లేక ఆ అప్పులు తీర్చడానికైన అన్నట్టు అర్మి లో చేరతాడు. కావాలని ఆ వూరు నుంచి దూరం గా పోదామని దేశ పోలిమేరల్లో పోస్టింగ్ తీసుకుంటాడు. వెళ్తూ వెళ్తూ తన దోస్తులకు చిన్న పార్టీ ఇస్తాడు.ఈ సందర్భం లో ఆ సన్నివేశాలు, బార్ లో దృశ్యాలు,బైట గుర్రబ్బండి వాడి పాట్లు,ఒలేనిన్ పూర్వ పరిచయాల్లో తలుక్కున మెరిసే మాస్కో అందగత్తెల గురించి రచయిత వర్ణన కళ్ళకు కడుతుంది.ఇక ప్రయాణం పొడుగునా అతని మనఃస్తితి,దోబూచులాడే పాత సంగతులు, రా రమ్మని పిలిచే పర్వత శ్రేణులు, విశాల మైన దేశము లో పోలి మేరలదాక సాగే ప్రయాణం చదవదగ్గవే.
 
 
ఇక అసలు కధ విషయాని కొస్తే, మన హీరో ఒక చిన్న కుగ్రామం లో పడతాడు. అక్కడి అనాగరిక జాతి పేరు కోసక్కులు. పొలిమేరలు రక్షించే సైన్యం లో వాళ్ళ జనాభా ఎక్కువే. అక్కడి జనం, వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆర్దిక తారతమ్యాలు, రచయిత కళ్ళకు కట్టిస్తాడు. హీరో ఉన్న చిన్న ఇల్లు అక్కడి గ్రామ పెద్దది. ఆయన, ఆయన పెళ్ళాం మన హీరో ని చూసి ముచ్చట పడతారు. మన హీరో వాళ్ళ అమ్మాయి ని చూసి ప్రేమ లో పడతాడు. మొరటుగా, పొలాల్లో పనిచేసి ఆ పిల్ల పొగరు, బింకం మన హీరో గారికి బాగా నచ్చేస్తాయి. ఆ పల్లెటూళ్ళో మంచి కాలక్షేపం ఒరేష్కా.ఎప్పుడో సైన్యం లో పనిచేసినా ఆ ముసలాయనకు నవల పోడుగూతున తాగటం వేటాడటం తెప్ప వేరే పని ఉన్నట్టుకన పడదు. మన హీరో భావాలు పసిగట్టి, ప్రోత్సహిస్తాడు,మంచి supporting  charector అన్నమాట.ఇక హీరోఇన్ విషయానికొస్తే ఆ పిల్ల కు లూక అనేవాడి మీద మనసు. ఆ వయసుకు తగ్గ చిలిపితనం తో ఒలేనిన్ ని కొన్ని సార్లు ప్రోత్సహిస్తున్నట్టు కనపడ్డా,ఎక్కడా మనసు పడ్డట్టు అనిపించదు.
 
ఇవన్ని అర్ధం అయ్యాక మన హీరో గారు డల్ ఐపోతారు.మనసులోనే తన ప్రేమ ను దాచుకుంటాడు. ఇవన్ని మరిచి పోవటానికి మరింత తాగుడు కి , ఎరోష్క తో వేట కి బైలు దేరతాడు. కాని మద్యలో దారి తప్పుతాడు.నిర్జన మైన అడవి లో ఎటు పోవాలో తెలియని స్తితి లో తన పరిస్తితి గురించి ఆలోచిస్తాడు.
ఇక్కడ, ౨-౩ పేజీలు చాలండి, ఒక రచయిత యెంత విషయం ఉన్నవాడో చెప్పటానికి.టాల్ స్టాయ్ ఆ అడవి ని వర్ణించే విధానం,ఆ ప్రపంచం లో ఆ నిర్జనారణ్యం లో అతను యెంత చిన్న వస్తువో అన్న భావం హీరో కు స్పురిస్తుంది.తన బాధ క్షణభంగురం అని, జీవితం చాల విశాల మైన దాని, అతనికి జ్ఞానోదయం అవుతుంది.ఇలాంటి వర్ణన , ఆ రచన లో  పట్టు చదవాల్సిందే కాని వర్ణించలేము. ఆ పేజీలు నేను ఎన్ని సార్లు చదివానో లెక్కలేదు.
 
ఇక ఉపసంహారాని కొస్తే, ఒలేనిన్, ఆ ప్రాంతాన్ని ఒదిలి దూరం గా పోతాడు. అది వ్రుతిరీత్యా అని మిగిలిన పాత్రలు నమ్మినా, కేవలం హీరొయిన్ నుంచి దూరం గ వెళ్ళే ప్రయత్నం అని మనకు తెలుస్తూనే ఉంటుంది. మల్లా ప్రయాణం మొదలవుతుంది. మల్లా అవే దారులు, అవే దృశ్యాలు, అవే పర్వత శ్రేణులు...
 
జీవితం గొప్పతనం చాటి చెప్పే ఈ నవల, బాధలన్ని చిన్నవే అంటుంది. టాల్ స్టాయ్ సొంత కధ అని ముందు మాటలో ఎవరో అన్నారు. అదీ నిజమే అని పిస్తుంది. ఎందుకంటె, ఈ నవల ఒక దృశ్య కావ్యం. సొంత అనుభావాలుంటే కాని, ఎవరు అలా రాయలేరేమో....

వయ్య బాబోయ్...

లిఫ్ట్ బటన్ నొక్కాను. పైనుంచి బీప్ శబ్దం వినపడుతుంది. లిఫ్ట్ వచ్చి ఆగింది. డోర్ తీస్కోని లోపలి కెల్లాను. సెల్లార్ బటన్ నొక్కాను.లిఫ్ట్ మెల్లగా కిందకు కదులుతుంది. ౨ ఫ్ల్లోర్ కిర్రు మన్న శబ్దం. బైట బోరునకురుస్తున్న వాన ఇంకా తగ్గినట్టు లేదు. ఒక పఫ్ కొడదామని కింద బడ్డి కొట్టు దగ్గరకు వెళ్తున్నాను. బైట మసక వెలుతురు లో ఒక రూపం. అస్పష్టం గా,మనిషి రూపం. నైట్ గౌన్ వేసుకున్న అమ్మాయి.ఇప్పుడే తల స్నానం చేసిందేమో, జుట్టు తుడుచు కోవడానికి బైట కొచ్చి నట్టుంది.  ౧ ఫ్లోర్ మెల్లగా కిందకు దిగుతుంది లిఫ్ట్.బైట ఎవరో కుడి వైపు నుండి ఎడమ వైపుకు వెళ్ళారు. నేను కొంచెం ఆశ్చర్య పోయ్యా. అదే అమ్మాయి, అదేమిటి ఇందాకే కదా ౨ ఫ్లోర్ లో ఉంది అనుకున్నా. ఏమన్నా ఆట ఆడుతుందా అంటే ఇంకెవరు లేరు. ఇంత రాత్రి పూట, ఇదేమి ఆనందం. గ్రౌండ్ ఫ్లోర్ మల్ల అదే అమ్మాయి. ఈ సారి నన్నే చూస్తుంది. తనకు నాకు మద్య ౨ డోర్లు. కటకటాల మద్య లోంచి కొంచెం బయపడుతూనే చూసా. సగం మొహం జుట్టు కప్పేసింది. మంచి కలర్ ఏమో చాల బాగా కనపడింది మిగతా బాగం. కాదు కలర్ కాదు అదేదో, రోగం వచ్చి పాలి పోయి నట్టు.తెల్లగా, అదేదో రకం గా. గుంటల్లో ఉన్నకళ్ళు, నా మొహం లో ఏదో వెతుకుతున్నట్టు. చెప్పొద్దూ, కొంచెం భయం  వేసింది. మరీ దగ్గర గా ఉన్నామేమో, ఆమె వంటి నుంచి అదేదో వాసన. ఏదో శవం నుంచి వస్తున్నట్టు. ఇంతలో కిర్రు మంటూ లిఫ్ట్ ఆగింది.
వాచ్ మాన్  కుక్క ఎప్పుడు ఆ  లిఫ్ట్ పక్కనే పడుకుంటుంది. తలుపు తీసుకొని బైటకి రాగానే, నా వైపు చూసింది. ఇంత వరకు అది అలా మొరగటం నేను వినలేదు. భయానకం గా అరుస్తూ పరిగెత్తి పోయింది. అది నన్ను కాదు నా వెనక చూస్తుందని అర్ధం అయ్యింది. ఎవరో వెనక నిలబడ్డట్టు అలికిడి.సెల్లార్ లో వాన దెబ్బ కి చల్లటి గాలి వీస్తున్నా, నా నుదుటి మీద చెమట చెంప మీదకు జారటం తెలుస్తూనే ఉంది. నా గుండె వేగం గా కొట్టు కుంటుంది. మెల్లగా తల పక్కకు తిప్పి చూసా. ఎవరు లేరు కాని అదేదో నీడ కదిలి నట్టు అనిపించింది. చప్పున ముందుకు తిరిగాను. సెల్లార్ లో చల్లటి గాలి మొహాన కొట్టింది.మెల్లగా బైటకు నడుస్తున్నాను. జోరున గాలి వాన. మా మియాపూర్ లో ఈ దెబ్బకి ఎప్పుడు కరెంట్ పోతుందో తెలీదు. కార్ల మద్య నుంచి నడుస్తున్నాను.దూరం లో వాచ్ మాన్ రాములు ఇల్లు. చిన్న లైట్ కనపడుతుంది. దాని పక్కనే, బడ్డి కొట్టు.
చుట్టు పక్కల వాళ్ళు అప్పుడప్పుడు అక్కడ అవి ఇవి కొనడానికి రావటం కద్దు.నేను వెళ్ళే టప్పటికి ఎవరో అమ్మాయి ఆ కొట్టు వాడితో మాట్లాడుతోంది.ఏదో కొంటుంది కామోసు. నేను సిగరెట్టు తీస్కోని డబ్బులివ్వ బోతూ ఎధాలాపం గా అటు చూసాను. అవే కళ్ళు. కాని ముక్కు లో నుంచి ఏదో ద్రవం కారు తోంది. చిక్కగా,రక్తమే అది...అప్పుడే కరెంట్ పోయిందేమో, కొట్టువాడు వెలిగించిన కొవ్వొత్తి గాలికి రెప రెప లాడుతుంది.ఆ వెలుతురూ లోంచి ముఖం మీద పడ్డ జుట్టు లోంచి లీల గా కాన పడుతుంది ఆమె మొహం.ఇందాక చూసినప్పుడు కళ్ళు ఉన్న ప్రాంతం లో అదే ఆకారం లో  తెల్లగా, ఉన్న కనుగుడ్లు నాలో భయాన్ని రేకెత్తించాయి.ఉన్నట్టుండి ఒక కంట్లోంచి వచ్చిన పేడ పురుగు చిన్నగా పాకి ఇంకో కంట్లో కి వెళ్ళింది.
బాబోయ్..చిన్నగా నా నోట్లోంచి వచ్చిన కేక అక్కడే ఆగి పోయింది. ఇంకేమన్నా కావాలా అన్ని కొట్టు వాడి మాటలతో ఈ లోకం లోకి వచ్చాను.వాడికి డబ్బులు ఇచ్చి ఇటు చూసేంతలో మాయ మైంది.ఆ చీకట్లో కళ్ళు మిటకరించి చూసాను. దూరం గా స్మశానం లో ఏదో నీడ కదిలి పోతుంది. మా అపార్ట్మెంట్ కి స్మశానానికి మద్య ఎత్తైన ప్రహరీ గోడ ఉంది. మనుష్యులు దూకే అవకాశం లేదు. ఆ ఆకారం అలా ఆగి, నా వైపు చూసినట్టు అనిపించింది. వన్ను లో వణుకు మొదలైంది. బాగా రాత్రి అయిందేమో, కొట్టు వాడు కొట్టు మూసేసి,బయలుదేరాడు. చుట్టు పక్కల నిర్మానుష్యం.భోరున వాన. గాలి. కరెంట్ పోవడం తో కన్ను పొడుచుకున్న కానరాని చీకటి. generator ఉన్నవాళ్ళ అపార్ట్మెంట్ లోంచి వెలుతురూ పడుతోంది.నెమ్మది గా మెట్ల వైపు నడిచాను.
గ్రౌండ్ ఫ్లోర్ దాటాక వినిపించింది. సన్నని ఏడుపు.కర్ణ కటోరంగా.చిన్నగా ప్రారంభమై,కాసేపటి తరవాత ఆగిపోతుంది. తెరలు తెరలు గా, నిదానం గా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాను.౧ ఫ్లోర్ మెట్ల మీద కుర్చుని ఉంది. ఆమె. అదే నైట్ గౌన్, కాని ఆమె కాళ్ళ దగ్గరనుంచి ఏదో కారి మెట్లమీద పారుతుంది. చిక్కటి రక్తం, అదే శవం వాసన. ఉన్నట్టుండి ధైర్యం పున్జుకున్నాను.వడి వడి గా ఆమె పక్కనుంచి పోదామని.ముంగాళ్ళ మీద కుర్చుని సన్నగా ఏడుస్తోంది. తల వొడిలో పెట్టుకోవడం తో ఏమి ముఖం కన పడట్లేదు. ఆమె కూర్చున్న మెట్టు దగ్గరకి రాగానే తలెత్తి చూసింది. అప్పుడు గమనించాను ఆమె పళ్ళు.నల్లగా గార పట్టి, నోట్లోంచి ఆకు పచ్చటి రంగులో...గబా గబా మేట్లేక్కబోయాను. ఆమె నన్ను వెంబడించింది. ఆమె ఆ మెట్ల మీద విచిత్రం గా పాకుతుంది. చేతులు ముందు మెట్ల మీద పెట్టి, పైకి పాకుతుంది చిన్న పిల్లల్లా. ఇంకో మెట్టు,  నా కాలు అందుకుంది.గట్టిగా పట్టి లాగింది.
నా పట్టు సడలింది. నేను జారి పోవడం నాకు తెలుస్తుంది.వెనక్కి చూసాను. చిత్రమైన శబ్దం చేస్తూ, ఆమె నా పైకి వస్తుంది. మెట్ల మీద పడి పోయాను. క్రమక్రమం గా ఆమె నా మీద కోస్తోంది. భయంకరమైన ఆమె మొహం నా మొహం మీదకు...

దిగ్గున లేచి కూర్చున్నాను. వళ్ళంతా తడిచి పోయింది. మంచం కింద పడి ఉన్నాను.చిన్నగా బాటిల్ అందుకుని మొత్తం తాగేశాను. ఓ...ఇదంతా కలా...బతికించావు దేవుడా...ఆనుకొని ఒకసారి గడియారం చూసాను. ౩:౦౦ AM  మల్లా చిన్నగా నిద్రకుపక్రమించాను.మా రూం వాళ్ళంతా, ఊళ్లకు వేల్లారేమో ఒక్కన్నే ఉన్నాను.

టింగ్ టింగ్ డోర్ బెల్.ఈ టైం లో ఎవరు...కొంపదీసి...బయ పడుతూనే,కీ హోల్ లోంచి చూసాను. అవే కళ్ళు...అదే మొహం...ఆశ గా కీ హోల్ ని చూస్తుంది...
(ఇప్పుడే చుసిన హారర్ సినిమా కి నా పైత్యం జోడించి ;) )

లంచా తురానాం న భయం న లజ్జ....

నవంబర్ 21 ,2016.
౧౨ లాలూచి పథ్,కొత్త ఢిల్లీ.
సాముహిక లంచం క్రీడల ప్రారంభోత్సవం  నేడు..
Blocked Games Road.. No Entry… పక్కనే సిగ్న్ బోర్డ్ వేలాడుతుంది..ఆ రోడ్ కి.. సరిగ్గా క్రీడా ప్రాంగణానికి వెళ్ళాలంటే వేరే రోడ్ లో వెళ్ళాలి.కొంచెం దూరం అవుతుంది  ఆ దారి.ముందు నేను అదే దారి లో వెళ్దాం అనుకుంటే, నా దోస్త్ ఎవరో చెప్తే ఈ దారిని వచ్చాను. కాని, రోడ్ బ్లాక్ బోర్డ్ ఉంది ...అప్పుడు చూద్దును కదా...ఈ రోడ్ లో బ్రంహాండ మైన రద్దీ..అందరూ ఇదే దారిలో క్రీడా ప్రాంగణానికి వెళ్తునారు. సరే నేను నా కార్ ని ఇదే రోడ్ లో కి తిప్పాను. బోర్డ్ తీయ్యటం మర్చి పోయారేమో...రోడ్ చివరలో అర్దమైంది అసలు సంగతి. అక్కడి ట్రాఫిక్ పోలీసు చక్కగా ప్రతి వాహనాన్ని ఆపి, పదో పరకో జేబులో వేస్కొని పంపిస్తున్నాడు. ఈ బోర్డ్ అతిక్రమించి నందుకేమో..పొద్దున్నే పెనాల్టి ఏంట్రా బాబు అనుకుంటూ నేను అతని పక్కనే ఆపి విండోస్ దించాను.గుట్కా నమిలి నమిలి, అదేదో రంగులో మారి పోయిన పళ్లన్నీ,నేనేదో డెంటిస్ట్ అన్నట్టు చూపిస్తూ..సౌ రూపాయే అన్నాడు..నేనిచ్చిన నోటు జేబులో వేస్కుని పోమ్మన్నట్టు చెయ్యి ఊపాడు. రసీదు ఇస్తాడేమో అని వెయిట్ చేస్తున్న నాకు అప్పుడర్దమైంది. అయ్యవారు ఇక్కడ మంచి లాభ సాటి వ్యాపారం నడుపుతున్నారని.
సరే కార్ పార్క్ చేసి మెయిన్ గేటు దగ్గరకు వచ్చాను.టికెట్స్ సొల్ద్ ఆఫ్..బోర్డ్ నన్ను వెక్కిరించింది. అయ్యో ఎలాగా అని చూస్తుంటే, వాడెవడో టికెట్ల కట్ట పట్టుకుని గోడ వార గనిలబడి ఉండటం.జనం వాడి మీద పడి, కొనటం చూసాను. దగ్గర కెళ్ళి అడిగాను. టికెట్టు  ౫౦౦౦. బేరం మొదలెట్టాను..వాడు నేనేదో వాడి జేబు కొట్టేసినట్టు మొహం పెట్టి, మేనేజర్ సాబ్ కోభి ఇసీమే ఖిలాన హాయ్ సాబ్..అన్నాడు.ఆహా..ఇది కదా లంచావతారం అంటే. టికెట్లు అన్ని బ్లాక్ లోనే అమ్ముతున్నారు.అందులో అందరు పదో పరకో పుచ్చు కుంటున్నారు. సరేలే అని ఆ డబ్బు వాడి చేతిలో కుక్కి ఎంట్రన్సు దగ్గరకి వచ్చాను. టికెట్టు తీస్కున్న వాడు అదేదో రహస్యం చెప్తున్నట్టు వంగి, ఆగే భైటన హై క్యా..౫౦౦ లగేగా అన్నాడు. ఓహో ఈ సౌలభ్యం కూడా ఉందా నాయనా..సరే..ఆ ౫౦౦ వాడి చేతిలో పెట్టాను. పక్కనే ఉన్న కుర్రాడిని నాతొ పాటు పంపాడు.నేను కొన్న టికెట్టు కన్నా ౧౦ లైన్లు ముందు ఒక సీట్ లో కూర్చో బెట్టాడు వాడు. ఆహ..ఇక్కడినుంచి బాగా కానీ పిస్తుంది. ఇప్పుడే మహా మహులంతా వేదిక నేక్కారు. ప్రదాని, రాష్ట్రపతి, వగైరా వగైరా...అయ్యవారు పెద్ద స్పీచ్ ఇవ్వడం ప్రారంబించారు.ఈ క్రీడలు ఇక్కడ జరపటం గొప్ప విషయం అని, ఏంటో కష్టపడి మన క్రీడా మంత్రి అంతర్జాతీయ మద్దత్తు తో వీటిని ఇక్కడకు తీస్కోచారని. అదేంటి, పొద్దున్న విన్న సి.యెన్.యెన్ లో అలా చెప్పారు. మనోళ్ళు అన్ని దేశాల ప్రతినిదుల్ని డబ్బుతో కొనేసి, ఈ క్రీడలను సంపాదించారని.పెద్దాయన చెప్తుంటే ఇదే నిజం అయి వుంటుంది. వెదవలు , మన గొప్పతనం చూసి వోర్వలేదు విదేశి మీడియా
అదేంటి, పెద్దాయన అలా వొరిగి పోతున్నాడు. అప్పుడు గమనించాను.ఒరిగి పోతుంది పెద్దాయన కాదు. సభ ప్రాంగణం అని.కుప్పకూలి పోయింది. కూర్చున్న వాళ్ళు కూర్చునాట్లే దిగబడి పోయారు. అటు ఇటు పరిగెత్తు తున్న సెక్యూరిటీ వాళ్ళు, అంతా గందర గోళం. మొత్తానికి జంబో సైజు రాజకీయ నాయకులని పైకి లేపడం సెక్యూరిటీ వాళ్ళ వాళ్ళ కూడా కావటం లేదు. ౧/౨ గంట నడిచిన తర్వాత,అమ్బులన్సు లో అందరిని పక్కనే ఉన్న హాస్పిటల్ కి తరలించారు. ఇంతలో ఆయన సైజు కి తగ్గట్టు జనం ముద్దు గా పిల్చుకునే ఖడ్గమృగం నాయకుడు ప్రారంబోత్సవం అయింది అనిపించాడు. లేట్ ది గేమ్స్ స్టార్ట్..
మొదటి పోటీ..౧౦౦ మీటర్ల పరుగు పందెం. మనోళ్ళు ఎప్పుడు విదేశాల్లో జరిగినప్పుడు గెలవని పందెం. ఈ సారి మన దేశం నిర్వహిస్తుందని ఈ కంపు గొట్టే క్రీడా గ్రామాని కి మేము రాము అని కొందరు,శాంతి బద్రతల సమస్య ఉందని మరి కొందరు మానేయడం తో ఈ సారైనా మనకు పతకం వస్తుందేమో. ప్రారంభం అయ్యింది. ౫౦ మీటర్లు మనోడు ఆ చుట్టూ పక్కల కనిపించాలా...కాని అదేంటో సినిమాలో హీరో పరిగెత్తు తుంటే మిగత వాళ్ళు మెల్లగా పరిగెత్తి నట్టు మనోడు పరిగెత్తు తున్నాడు అనేకంటే మిగతా వాళ్ళు మెల్లగా పరిగెత్తు తున్నారని పించింది. మొతానికి ఏది ఏమైనా మనోడు వెంట్రుక వాసి లో గెలుపొందాడు అండి. ఆహ..అప్పుడు చూడాలి..జనం కుర్చిలలో నుండి లేచి కుప్పి గంతులు గోలా..
అదీ ఇదీ కలిపి మద్యాన్నం ప్రాంతానికి జరిగిన అన్ని పోటీలలో మనోల్లదే గెలుపు.. అదేంటి చెప్మా..మిగతా దేశాల్లో పోటీలు జరిగినపుడు..గొప్పగా రాణించే విదేశీ క్రీడాకారులు మన దేశం లో యెందుకిలా..మన వాతావరణం సరి పడి ఉండదు..అంతే అయి వుంటుంది..
మిగతా స్టేడియం లలో మనోళ్ళు ఎలా ఆడుతున్నారో విందాం అని నా మొబైల్ లో రేడియో ఆన్ చేశా..సిగ్నల్ వెతుకుతుంటే వినపడ్డది బీ.బీ.సి. సరే మన గొప్పతనం వీల్లేమి చెప్పుకుంటూన్నారో విందాం అని వింటున్నా..అదేంటి. ౧౪ లంచావతారం రోడ్ లో ఉన్న మేహుల్ గాంధీ ఎనిమిదో నెల   కడుపులో ఉన్న యువనేత భావి భారత ప్రదాని  జీబెల్ గాంధీ పేరు పెట్టిన స్టేడియం లో రన్నింగ్ రేస్ మైదానం లో నీళ్ళు ఉండటం తో ౨ క్రీడాకారులు జారి పడ్డారని, నాసిరకం పోల్ విరగటం తో జారి పడ్డ పోల్వాల్ట్  క్రీడాకారుడి నడుము కూడా విరిగిందని..అవాకులు చెవాకులు...ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే..మన గొప్ప తనం చూసి కళ్ళలో నిప్పులు పోస్కుంటారు.
అంతలో డబ  డబ అని శబ్దం..అదేంటి మబ్బు లేకుండా ఉరుములు...పైకి చూసా...స్టేడియం కప్పు ఒక వైపుకు ఒరుగుతుంది.అబ్బే..అదేదో సెక్యూరిటీ చెక్ అయివుంటుంది.లేక పొతే మొన్న కట్టింది అప్పుడే కూల్తుందా...ఇంతలో నేన్ను కూర్చున్న వైపు కూడా శబ్దం వినిపించింది.పైకి చూద్దును కదా..
కళ్ళు తెరిచే టప్పటికి ఫ్యాన్ తిరుగుతుంది. ఎక్కడున్నాను నేను...ఏదో నొప్పి గా ఉండటం తో తడుము కొని చుస్కున్న..తలకు తల పాగా చుట్టినట్టు...అబ్బో ఇదేంటి...హాస్పిటల్ లో ఉన్నా  అని అర్ధం అయ్యింది...మెల్లగా లేచి రూం లోంచి బైటకు వచ్చా..
రిసెప్షన్ లో జనం అటు ఇటు పరిగెత్తు తున్నారు. మా ఆయన ఎక్కడ అని ఒకావిడ..మా అన్నగారు అని ఒకాయన...చాల మంది కి దెబ్బలు తగిలి నట్టున్నాయి.ఎవర్ని కదిలించిన అసలేం జరిగిందో ఎవరు చెప్పట్లే. ఈ హడావుడి నుంచి దూరం గా లాన్ లో కూర్చున్నాను. పేపర్ ఒకటి కొని అసలేమైందో అన్న ఉత్సుకత తో చదవటం మొదలెట్టా..నిన్న స్టేడియం కూలటం వాళ్ళ ౫౦౦ వందల మంది చని పొయ్యారని..౧౦౦౦౦ మంది గాయ పడ్డారని వార్త...నాసిరకం నిర్మాణాల వల్లే ఇదంతా జరిగిందని విదేశి మీడియా బోగట్ట..ఇదంతా మాములే అని ముక్య మంత్రి వివరణ. స్పోర్ట్స్ పేజిలో మనోళ్ళు ౧౦౦ కి ౯౦ పతకాలు గెలిచారని వార్త..కిందనే విదేశి పత్రికల శూల శోధన...విదేశీ క్రీదాకారులన్దర్నీ మన అధికారులు కోనేసారని..అందుకే మనకు ఇన్ని పతకాల పంట అని...
ఛీ ఈ విదేశి మీడియా ఎప్పుడు ఇంతే అని అన్ని పార్టీల సంయుక్త ప్రకటన...దీన్ని  బలపరుస్తూ..రాజధాని లో అక్కడక్కడా విదేశి మీడియా ఆఫీసుల మీద జోమ్రాస్ పార్టీ దాడులు...తిక్క కుదరాలి సన్నాసులకి....ఏదో ఆ పార్టీ ఈ పార్టీ ఇచ్చిన పదో పరకో పుచ్చుకొని స్వదేశి మీడియా లాగ  వాళ్ళు చెప్పింది చెప్పక..దేశాన్ని వుద్దరిద్దాం అని బయలు దేరితే ఇలాగే అవుతుంది.
వారం  రోజుల తర్వాత ఇంకో వార్తా చదివాను పేపర్లో. ముగింపు ఉత్సవాలలో ఆకాశం నుంచి పూలు చల్లుతున్న మొన్ననే క్రుష్య దేశం నుంచి  కొన్నబుగ్-౪౨౦ విమానం  పక్కనే ఉన్న పొలాల్లో కూలి పోయింది. పోనీలెండి మల్ల ఇంకో కాంట్రాక్టు పిలవచ్చు..మల్లా దానిపైన మన నీటి ఏనుగు  నాయకుడు ఇంతో అంతో ఎనకేసుకోవచ్చు...సర్వే జనా సుఖినో భవంతు..

మా ఇంట్లో పావురాలు

 ఒక రోజు ఉదయం.బాల్కనీ లో ఏదో శబ్దం అయినట్టుంటే వెళ్లి చూసాను. పావురం ఒకటి మా బాల్కనీ లో గూడు కడుతుంది.ఒక పుల్ల అక్కడ పెట్టి మళ్ళీ తుర్రున యెగిరి పోయింది.మల్ల కొంచెం సేపటికి ఎక్కడి నుంచో ఇంకో పుల్ల పట్టు కొచ్చింది.వాటినన్నిటిని, పద్దతి గా అమరుస్తుంది. మద్య మద్య లో నీకేం పని ఇక్కడ అన్నట్టు నన్నో చూపు చూస్తుంది.ఆఫీసు కి టైం కావటం తో దాన్ని అల్లా వదిలి బైటి కొచ్చాను. నాకు రొజూ బాల్కానీ లో కూర్చొని పేపర్ చదవటం అలవాటు కావటం వల్ల రొజూ ఆ పావురాల జంటని పరిశీలిస్తూ వచ్చాను.౨-౩ రోజుల తర్వాత గూడు చక్కగా అమరింది. ఆడ పావురం రెండు చిన్ని చిన్ని గుడ్లు పెట్టి,పొందిక గా వాటిపై కూర్చుంది.ఆహారం వ్యవహారం మగ పావురం పని ఏమో, అది ఇక్కడా అక్కడా తిరుగుతుందేమో.హత విధీ, పావురాల్లో కూడా ఇదే తంతా అనిపించింది. :)
రెండు పావురాలు ఎంతో అందం గా ఉన్నాయి కదా అనుకుంటూ ఎందుకో నేల వైపు చూసాను.రామ,రామ మా ఇంటి వోనరు ఆ దృశ్యం చూసి వుంటే, బాల్కనీ చువ్వలు వంచుకుని మూడో అంతస్తు నుంచి దూకేస్తాడేమో అనిపించింది. ఎంతో ముచ్చట పడి వేయించుకున్న తెల్లని టైల్సు మీద, పావురాలు బాత్రూం ఇత్యాదివి కట్టుకున్నట్టు లేదు తమ ఇంట్లో.పాపం కదా కొత్త జంట అని నేనే కొంచెం శ్రమదానం చేసి శుబ్రం చేసాను.
ఇలా రొజూ నడిచి పోతుంది. కొన్ని రోజుల తర్వాత, పావురాలు బాల్కనీ మొత్తం మాదే అన్నట్టు ప్రవర్తించడం మొదలెట్టాయి. ఏదో ఒక మూల పేపర్ చదువుకుంటున్న నన్ను మొదట్లో గుడ్లు ఎట్టు కేల్లెవాడిలా చూసేది ఆడ పావురం. వాటి భాష లో కొంచెం ఘాటు గానే తిడుతున్నట్టు అప్పుడప్పుడు అనుమానం కలిగేది.కొన్నాళ్ళ తర్వాత, బాల్కనీ డోర్ తియ్యం గాల్నే మగపావురం థిస్ ల్యాండ్ బెలొంగ్స్ టూ అస్ అన్నట్టు మీద మీద కోచ్చేది.మా స్నేహితుడోకాయన చల్ల గాలి కోసం తలుపు తీసాడో లేదో ఆయన మొహం మీద పికాసో బొమ్మ వేసినంత పని చేసింది. అదే చివరాఖరు సారి, మల్ల ఆ బాల్కనీ తలుపు తియ్యలేదు కొన్ని రోజులు. ల్యాండ్ వోనెర్ మీద ఆక్రమణ దారుని దురాక్రమణ లా పావురాలు మా బాల్కనీ ఆక్రమించేశాయి. నేనే అప్పుడప్పుడు, తలుపు కొంచెం తీసి దొంగ లా చూస్తూ ఉండేవాడిని.మగ పావురం బైటి కేల్లిందని నిర్దారించు కున్నాక, అప్పుడప్పుడు శుబ్రత పరిశుబ్రత కార్యక్రమం చేపట్టేవాడిని.

ఒక రోజు ఉదయం, జాగింగ్ కెళ్ళి వచ్చేటప్పటికి పావురాల కూతల్లో తేడ వినిపించింది. రెండు కన్నా ఎక్కువే ఉన్నాయి, పొద్దున్నే కిట్టి పార్టీ ఏమన్నా పెట్టాయ అనుకుంటూ,తలుపు సందు లోంచి తొంగి చూసాను.చిన్ని చిన్ని పావురాలు రెండు వాళ్ల అమ్మ దగ్గర ఏదో తింటూ అరుస్తున్నాయి. ఒకటి నల్లది ఒకటి కొంచెం తెల్లది. ఆడది మొగది అనాలేమో.యెంత ముద్దు గా ఉన్నాయో, ఒకసారి ఎత్తు కుందాం అని బైట పడ్డ అడుగు, తెలుగు సినిమా చివర్లో హీరో విలన్ ని చూసి నట్టు మగ పావురం చూస్తుండటం తో ఆగిపోయింది. ఇప్పుడు ఈ దిశ్కుం దిశ్కుం ఎందుకు లే అని మల్ల లోపలి కెల్లాను, తలుపు మెల్లగా మూసి.

చెప్పద్దూ, భలే ఆనందం వేసింది. బాల్కనీ ఆక్రమించినందుకు, మీదు మిక్కిలి కంపు చేసినందుకు, దాన్ని శుబ్రం చేసినందుకు తెగ తిట్టుకుంటూ ఉండే వాడిని. అదంతా  బుజ్జి  తెల్ల పావురాన్ని చూసే టప్పటికి హుష్ కాకి సారీ హుష్ పావురం అని యెగిరి పోయింది. ఇంకో ఆనందం ఏమిటి అంటే, ఎలాగు పిల్లలు పుట్టాయి కదా, బాల్కనీ ఖాళి చేస్తాయి లే అని.కొన్ని రోజులు ఓపిక పడదాం చిన్న పిల్లలు ఎలా వెళ్తాయి అని నన్ను నేను సమర్దిన్చుకున్నాను. సరే, కొన్నాళ్ళు ఇలానే గడుపుదాం అని. కాని, రాను రాను పరిస్తితి అద్వాన్నం అయింది.పెద్ద చిన్న పని కట్టుకుని బాల్కనీ అంతా ఆక్రమించి ఇంకెందుకు లెండి...కడుపు చించు కుంటే ఫాంట్ మీద పడుతుంది.

మా బుజ్జి పావురాలు పెద్దవి అయ్యాయి.కొంచెం కొంచెం ఎగరటం ప్రాక్టిస్ చేస్తున్నాయి.ఆహా,కొంచెం ఎగరటం, మల్లా బాల్కనీ లోకి రావటం.తల్లి కావాలని దాన్ని నెట్టేస్తుంది.చిన్న పిల్లలేమో భయం భయం గా రెక్కలు ఆడించి మల్లా వెనక్కోచ్చేస్తున్నాయి. నా అభిమాన తెల్ల పావురం, మాంచి దూరం ఎగురుతుంది. శభాష్ అనుకున్నాను.అలా యెగిరి యెగిరి ఎల్లి పోండి, పిల్లల్లారా.మళ్ళా రాకండి అని అత్మాశరతుడు లోపలెక్కడో అరుస్తున్నాడు.తదాస్తు.
ప్రాజెక్ట్ పని మీద ౩ వారాలు బెంగుళూరు వెళ్ళటంతో, మా పావురాలేమైనవో తెలుసుకోలేక పోయాను.తిరిగి వచ్చి తలుపుతీస్తుంటే అనిపించింది. ఆహా, ఈ పాటికి బాల్కనీ ఖాలీ అయిపోయి ఉంటుంది కదా.మల్లా ఒక .౫ గంట మనది కాదు అనుకుంటే, హ్యాపీ గా బాల్కనీ లో కాలు మీద కాలేసుకుని, నోట్లో వేలేసుకుని, మాంచి కాఫీ తాగుతూ, పేపర్ చదువుకోవచ్చు అనుకున్నాను.అదే మూడ్ లో బాల్కనీ తలుపు తీసాను.బాబోయ్, పెద్ద పావురం ఒకటి నా ముహం మీద మాంచి బొమ్మ గీస్తాను అని బయలుదేరింది. మనకి మాంచి ప్రాక్టిస్ కదా, కబుక్కున తపుపేసి,కాసేపు దాన్నే అనుకుని నిలబడ్డాను.రేప్ సీన్ లో హీరోయిన్ విలన్ ని బైటకి తోసి, తలుపు గట్టి గా పట్టుకున్నట్టు. ఇదెలా జరిగింది అని చిన్న విచారణ కమిటి వేసాను.దాంట్లో ప్రదాన investigator  నుంచి బంట్రోతు దాక అన్ని నేనే అనుకోండి. కొండను తవ్వి, పండి కొక్కును పట్టి నట్టు, తేలింది ఏమయ్య అంటే,మా పావురాలు ఖాలీ చేసి వెళ్లి పోయాయి. సదరు ప్రస్తుత జంట సరి కొత్తది.అవి పోగానే, ఖాలీ నే కదా అని ఇవి ఆక్రమిన్చాయన్న మాట..అదీ సంగతి. నేను మల్లి చీపురు చాట పట్టుకుని రెడీ ఐపోయాను, తలుపు ఖాలీ లోంచి తొంగి చూడటానికి :(

బెంగుళూరు బస్సు స్టాండ్

బెంగళూరు బస్సు స్టాండ్ ఏమీ మారలేదు. ౫ ఏళ్ళు అయిందేమో ఇక్కడికి వచ్చి. ఏ మాత్రం తేడ లేదు. అవే ప్లాట్ ఫోరమ్స్,అదే ఆశుబ్రత,అదేదో పెద్ద చెత్త డబ్బా లా ఫీల్ అయి పోయి చెత్త వేసే చెత్త జనం, ఆశుబ్రత వల్ల భరించలేని దుర్ఘందం. స్కూల్ వదిలేక నలు వైపులా పరిగెత్తే పిల్లల్లాగా అడ్డదిడ్డంగా పొయ్యే బస్సులు.ప్రభుత్వాలు మారినా, పార్టీలు మారినా మారనిది అదే అలసత్వం,అదే నిరాసక్తత.
ప్రభుత్వాల మాట పక్కన పెడితే మన జనం ౧౦ ఆకులు ఎక్కువే చదివారు. ఎంతైనా ఎడా ప్రజా తదా రాజానే కదా.
ఒకచోట స్తిమితంగా కూర్చోడానికే చాల ఇబ్బంది పడాల్సివచ్చింది.నన్ను తోసుకుంటూ వెళ్ళిన ఒకాయన, వెనక్కితిరిగి అదేదో భాషలో, ఇంకేదో అని విస విసా వెళ్లి పోయాడు, అది సారీ కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.ఇంకో మహానుభావుని నోటి పళ్ళ మద్య భాగం నుండి, విచిత్రమైన శబ్దం చేస్తూ బయల్పడిన ఘుట్కా ఫౌంటైన్ నా కాళ్ళను కొంచెం మిస్  చేసి నేల నిండా పరుచుకుంది. కొంచెం సీరియస్ గానే తలెత్తి చూసాను. కొంచెంలో మిస్ అన్న ఫీలింగ్ కనపడింది ఆయన గారి మోహంలో.ఇక చెత్త తీస్కేల్లే బండి నుండి కారిన జల పదార్ధం మేకేన్నాసు గోల్డ్ కి దారి చూపే మ్యాప్ గీచినట్లు చాల దూరం పారింది.నా పక్కన కూర్చున్న భారి ఫ్యామిలీ ఫలహారం చెయ్యడం మొదలెట్టారు..ఇంకా చూస్కోండి నాయనా, ఇక చుట్టూ పక్కల ఎటు చూసిన తిని పారేసిన స్నాక్ పాకెట్లు,తాగి పారేసిన కాఫీ కప్పులు,అక్కడే ఇంకో అరగంట వుంటే,ఆ చెత్త సముద్రంలో మునిగి పోతానన్న చెత్త ఫీలింగ్ రావటంతో,అతి కష్టం మీద దొరికిన సీట్ ను వదిలి, అయిష్టం గా నైనా మెకన్నాస్ గోల్డ్ మ్యాప్ అనుసరిన్చాల్సివచ్చింది.తపక్ మని నెత్తిమీద ఏదో పడటం తో తలెత్తి చూసాను.పై కప్పు కారుతుంది. ఆ ద్రవ పదార్ధం రసాయన విశ్లేషణ మానేసి, శుబ్రం చేస్కో టానికి toilet  లో దూరాను. అక్కడ చూడాల్సిందే, అదేదో చిరంజీవి సినిమా మొదటి ఆటాకు ఉన్నట్టు ఉన్నారు జనం. ఇక లోపల పరిస్తితి చెప్పుకోదగిందే.నేలంతా రక రకాల సువాసనలతో తడి తడి గా ఉంది.అదేవిటో ఇదేవిటో అంటే ఈ బ్లాగ్ గబ్బు కొడుతుందని, గబా గబా పని ముగించుకొని బైటకు వచ్చాను.
ఇక ఇక్కడి ప్రభుత్వ ఘనత. కొన్ని ప్లాట్ ఫోరమ్స్ కి చెత్త డబ్బాలే లేవు. అవి ఉంటేనే,మనోళ్ళు వాటిని వాడటం బహు అరుదు. ఇక లేని చోట్ల పరిస్తితి, అంటా నేను చెప్తే మీరేం చేస్తారు..ఊహించండి.ఉన్న చోట, బాగా బలిసిన రాజకీయ నాయకుని స్విస్స్ బ్యాంకు ఎకౌంటు లా పొంగి పొర్లుతున్నాయి. అశోకుని కాలం నుండి ఎవరూ శుబ్రం చేసినట్టులేదు.మరి ౩ తుపాకులు,౬ బాంబులు అని మన తీవ్రవాద మిత్రులు చెలరేగి పోతున్న కాలం లో ఈ బస్టాండ్ లో భద్రతా ఎలా ఉందయ్యా అంటే,బస్టాండ్ బైట మీకో మెటల్ detector కాన పడుతుంది.కాని దాంట్లోంచి రావటం పోవటం మీ ఇష్టం అనుకోండి.ఎందుకంటె, అంతకుముందు ఉన్న పెద్ద ఎంట్రీ లో ఇదొక చిన్న భాగం మాత్రమె.పక్కనే కూర్చున్న పోలీసాయన కు దీనికన్నా పేపర్ మీదే మక్కువ ఎక్కువున్నట్టుంది. ఆయన లోకం లో ఆయన ఉన్నాడు.హలప్ప మసాల వార్త చదూతున్నాదేమో ఈ లోకం లో మాత్రం లేదు.నాకిక బస్టాండ్ లో ఇంకో పోలీసాయన కనబల్లా.
చెప్పాలంటే చాల ఉంది చెన్న కేశవా అని ఈ బస్టాండ్ ఘనత వర్ణించడానికి ఈ పోస్ట్ సరిపోదని డిసైడ్ అవుతుంటే, నా బస్సు వచ్చింది,ఇక ఉంటా మరి.మీరు కూడా ఎందుకు ఈ చెత్త బ్లాగ్ లో..పని చూస్కోండి.

బేలూర్-అలిబేడు యాత్ర

పొద్దునే లేవడం యెంత కష్టమైనా, ఎలాగోలా బైలుదేరాం. బస్సు యెక్క గానే మా మిత్రుడు మంచి నిద్ర లోకి జారుకున్నాడు. నాకెందుకో నిద్ర పట్టలేదు.ఈ యాత్ర గురించి ఏంటో కొంత గూగుల్ చేసిన కారణం గా నేమో, అవీ ఇవీ గుర్తొచ్చి కొంచెం excite అయ్యాననే చెప్పొచ్చు. బెంగలూరు దాటాక కనబడ్డ దృశ్యాలు నన్ను నిరాస పరచ లేదు. చుట్టూ అనంత దూరం వరకు పరచుకున్న పచ్చదనం,పొలాలు, చిన్ని చిన్ని గ్రామాలు, కొబ్బరి పోక చెట్ల అంతర సేద్యం అదేదో ప్రణాలికా బద్ధం గా గుంజలు పాటి నట్టు. ఈ పచ్చదనం మద్య పాకి పోతున్న పాము లాగ రోడ్డు, అంటూ పొంతూ లేక సాగుతుంది. రోడ్డు కిరువైపులా బ్రంహాండమైన వృక్షాలు గ్రామ పెద్దలు మనలను ఆహ్వానిస్తున్నట్టున్నాయి.
శ్రావణ బెలగోల సమీపించే కొద్ది, dieting చేసి సన్న బడ్డ అమ్మాయి లా చిక్కింది రోడ్డు. మరీ పక్కింటి దొడ్లోనుండి పోతున్నట్టు సాగింది ప్రయాణం.ఊర్లో ప్రవేసించ గానే కల్యాణి (కోనేరు) స్వగతం పలికింది. పక్కనే కొండ పైకి మెట్ల దారి. ౫౦౦-౬౦౦ మెట్లే కదా అని ఘీన్కరించిన మహానుభావులు సగం దారి లోనే కూలబడ్డారు.వాళ్ళలో నేను ఒకన్నాను కొండి. కొండ లోనే జన్మించాయా అన్నట్టు, సహజ సిద్దం గా ఉన్నాయి మెట్లు. బాహుబలి విగ్రహం స్వచ్చమైన చిరునవ్వు తో మా అలసట మాయమైంది. ప్రాపంచిక విషయాలతో నాకు పనిలేదన్నట్టు, ఊరికి దూరం గా శిఖరాగ్రాన నిలిచి ఉన్న ఏకశిలా విగ్రహం ఆనాటి స్మృతులు నేమరేసుకున్నట్టుంది.



                                                                                                                       ౧౭ మీటర్ల ఎత్తున్న ఈ విగ్రహానికి రోజు అభిషేకం జరుగదట, ఉత్సవ విగ్రహాని కే ఆ భాగ్యం.భరతుడిని యుద్ధం లో ఓడించిన బాహుబలి, ప్రాపంచిక విషయాలకు విరక్తుడై, ఈ కొండ పై తపస్సు చేసి విముక్తుడైనాడని స్తల పురాణం.గంగా సామ్రాజ కాలం లో (౧౧ శతాబ్దం) ప్రతిష్టించిన ఈ విగ్రహం నేటికి అబ్బురపరుస్తుంది.ఎటు వంటి సదుపాయాల్లేని ఆ కాలం లో ఈ విగ్రహ ప్రతిష్ట ఒక చిత్ర మైతే, ఒకే మెట్ల దారి ఉన్న ఈ కొండ పైకి, మహా మస్తకాభిశేక  సమయం లో సంబారాలన్ని పైకి చేర వేయటం ఇంకో ఎత్తు అని పించింది.
మా తదుపరి మజిలి హళిబేడు. ఇరు వైపులా చెట్లు కప్పేసాయ అన్నట్టుంది కొన్ని చోట్ల దారి.పచ్చని పొలాల మద్యలో కాపలా గా కొబ్బరి చెట్లు, ఎత్తు పెరగటం లో వాటికి పోటి పడుతున్న పోక చెట్లు, అక్కడక్కడా నిండు ఘర్భినిల్లాంటి అనాస చెట్లు. విశాలమైన పచ్చిక బయళ్ళలో మేస్తున్న పశువులు, సాంప్రదాయ కట్టు బొట్టులతో మగువలు చిన్ననాటి గుర్తులను తట్టి లేపాయి.ఇటు గాలి అటు పోనీ concrete అరాన్యాల నుండి ఇదొక ఆట విడుపు, మనవైన మూలాలలోకి ప్రయాణం.

హళిబేడు అంటే ద్వంసమైన పట్టణం. ద్వారా సాగారమనే హోయసలుల రాజధాని, బహమనీ దురాక్రమణ వల్ల, దంసమైనది కాబట్టి ఆ పేరు వచ్చింది. హొయసలేశ్వర ఆలయం ఒక అద్బుతం.దాదాపు ౧౦౦ ఏళ్ళు కట్టబడ్డ ఈ ఆలయం అసంపూర్తి గానే మిగిలిపోయింది.ఇది సిమెంట్ అనేది ఉపయోగించకుండా అమరిక పద్దతి లో నిర్మించ బడిన విచిత్రం. రెండు ఆలయాల ప్రాకారం అబ్బురపరుస్తింది. ఆలయాల బైట విగ్రహాలు, శిల్ప సౌందర్యం కదల నివ్వవు.హోయసలేస్వరునికి పూజాదికాలు నేటికి జరుగుతున్నాయి.రెండు నందీస్వరులు  జీవ కళలతో అలరారు తున్నాయి.ఆలయం బైట దేవతామూర్తులు,రామాయణ ఘట్టాలు ఒక రోజు ఐన వెచ్చించి చూడదగ్గవి. ఏనుగు పొట్టలో శివ తాండవం, కృష్ణుడు గోవర్ధనం ఎత్తడం, లాంటి ఘట్టాలు చెప్పదగ్గవి.అసంపూర్తి గా మిగిలిన ఘట్టాలే ఇలా వుంటే పూర్తి ఐతే ఎలా ఉండేవో అన్న ఊహ రాక మానదు.ఈ ఆలయం చుట్టూ పక్కల హోయసలుల శిల్ప సౌందర్యం తో అలరారే ఆలయాలు ౧౦-౧౫ ఉన్నాయట.
బేలూర్ మా చివరి మజిలి. హోయసలుల మొదటి రాజధాని.౧౧ వ శతాబ్దం లో విష్ణు వర్ధనుని చే నిర్మించబడ్డ, చేన్నకేసవ ఆలయం లో నేటికీ పూజాదికాలు జరగటం విశేషం.విజయనగర కాలం లో ఈ ఆలయం జీర్ణోద్దరణ కాబడింది.చేన్నకేసవ విగ్రహం ౨ మీటర్ల ఎత్తు ఉంటుంది.నిజంగానే సుందరుడు ఈ చెన్న కేస్వవుడు.ఆలయం లోని జయ విజయుల విగ్ర హాలు, స్తంభాల పై, ఆలయం పైభాగం లో శిల్ప కల బేలూర్ ఎందుకంత ప్రసిద్ధి పొందిదో తెలియజేస్తాయి.ఆలయం లో ౪౦ స్తంభాలు దేని కదే ప్రత్యేకం.ప్రతి స్తంభం పై చిత్రకళా చూడదగ్గది.
మొత్తానికి ఈ యాత్ర, విజయనగరానికి పూర్వం విరాజిల్లిన హిందూ సామ్రాజ్యం గురించి మంచి పరిచయం.వివిధ కారణాల వల్ల మనకు వారి గురించి మనకు పెద్ద గా తెలియక పోయినా,హోయసలుల కళాదృష్టి,హిందూ ధర్మోద్దారణ కై వారు నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయాలు ఈ నాటికీ వారి గొప్ప తనాన్ని చాటుతున్నాయి.

సృష్టి లో తీయనిది స్నేహమేనోయి..

అనుకోకుండా ఒక ఆవకాశం...యు ఎస్ వెళ్ళడానికి...౨-౩ వారాల్లో అంతా ఓ కే అయ్యింది. అంతా చేసి ౨ వారాలే టైం ఉంది..హడావుడి గా మా వూరు బయలుదేరాను.. అమ్మను చూసిరావడానికి..ఆమెకు ఇంకా ఈ విషయం తెలీదు. మా అక్కకు చెప్పాను కొంచెం ముందు నుంచే ప్రిపేర్  చెయ్యమని. అమ్మకి నేను వెళ్ళడం ఇష్టం లేదు.అందుకే ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా కొంచెం నా వైపు నుంచి అనుకూలం గా మాట్లాడి కన్విన్సు చెయ్యమని చెప్పాను.ఇంట్లో పరిస్తితి కొంచెం సానుకూలం గానే కనపడింది.
ఆ రోజు దీపావళి. మా అక్క కూతురుదే ఇంట్లో హడావుడి. ఆ వయసులో మనము అంతే నేమో. పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి తనకు టపాకాయల ద్యాసే..అవన్నీ చక్కగా పేపర్ మీద పేర్చి, ఎండ లో పెట్టింది. నేను రానను కున్నారేమో  మా నాన్న నాకు టపాకాయలు తాలేదు. దానికి అది చేసిన రాద్దాంతం ఇంతా అంతా కాదు. మా నాన్న మల్ల బజారు కెళ్ళి నా కోటా టపాకాయలు తెచ్చేదాకా ఆయన పైన రాజి లేని పోరాటం చేసింది. నేను తనని అడిగాను, ఏమిటే నీ గోల అని..దానికి అది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..మరి నువ్వు నా టపాకాయలన్ని   కాల్చేస్తేనో అని.
కొంచెం రెడీ అయ్యి,నేను అలా బజారు దారి పట్టాను..మద్యలో గుడి దగ్గర కొచ్చేటప్పటికి ఒరేయ్ ఎప్పుడొచ్చావ్ అన్న పిలుపు విని వెనక్కు తిరిగి చూసాను. మా డిగ్రీ దోస్తులు ఇద్దరు కనపడ్డారు.
చిన్నగా మా గ్రంధాలయం మెట్ల మీద కూలబడ్దాం. మా డిగ్రీ దోస్తుల గురుంచి వాళ్ళవాళ్ళ ఉద్యోగ సద్యోగాల గురుంచి, పెళ్లి ఐన వాళ్ళ కధాకమామీషు నుంచి పెళ్లి కాని ప్రసాదుల వరకు అన్ని మాట్లాడుకున్నాం. అదుగో ఒంటి గంట ఐంది. మల్లా కలుద్దాం అని భారం గా ఇళ్ళకు బయలుదేరాం.
కలిసి మెలిసి తిరిగిన మేము రకరకాల కారణాల వల్ల వేరైనప్పటికి ఆ రోజులు నెమరు వేసుకుంటే, ఏదో గొప్ప ఫీలింగ్. ఏ బాదర బందీ లేకుండా, కాలేజీ ల దగ్గర్నుంచి,కొత్త సినిమా రిలీజ్ ఐన హాల్స్ వరకు, ట్యూషన్ పాయింట్ల నుండి బాబా గుడి వరకు అంతా మాదే హల్చల్. ఎన్నో తీపి గుర్తులు జ్ఞాపకాలు.అందరితో కలిసున్నా, మా తొట్టి గ్యాంగ్ లో ౬  గురం. బాషా,నేను,బ్రంహం,కరీం,సురేంద్ర,రాంబాబు. మా స్నేహానికి మొదటి మెట్టు ట్యూషన్ పాయింట్. చివరి వరసలో మాకు చాల స్వతంత్రం ఉండేది. పంతులు గారిపై సెటైర్లు వెయ్యడం మొదలు, పక్క వరసలో అమ్మాయిల మీద కామెంట్ల దాక వెనక వరస వాళ్ళదే ముందడుగు. అలా అని కోతి గుంపు అని జమ కట్టేయ్యకండి. మేము రొజూ పోటీలు పడి చదివే వాళ్ళం. కాలం తో పాటు మా స్నేహం మరింత దృడ పడింది.
ఫైనల్ ఇయర్ లో మాకు ఇంకా మంచి పోటి ఏర్పడింది..అయినా అది కేవలం చదువుల వరకే పరిమితం. బ్రంహం కి జ్వరం వస్తే వాడి నోట్స్ రాసి పెట్టడం, ౪ ఏళ్ళ నుంచి బాష లైన్ వేస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వటానికి తోడూ వెళ్ళడం, తర్వాత రోజు వాళ్ళ అన్న మమ్మల్ను వెతుక్కుంటూ వస్తే, పక్క వీది లోనుంచి శివ సినిమాలో సైకిల్ చేజ్ లాగ బైట పడటం అన్ని గుర్తొచ్చాయి.ఆ జ్ఞాపకాలు గురుతులు నన్ను పలకరించాయి 
ఆనాటి ఆ స్నేహమానంద గీతం అని పాడాలని పించింది. సరే అల్లాగే ఇల్లు చేరాను.మా ఇంటి ముందు అప్పుడే ఆగిన ఆటో నుంచి దిగిన పర్సనాలిటీని చూసి ఉబ్బి తబ్బిబ్బైనాను. మధు. మా మేనత్త కొడుకు. వాళ్ళు మా వూరు నుంచి ౨౫౦ కి.మీ. దూరం లో ఉంటారు.తను వ్రుత్తి రీత్యా బళ్ళారి లో ఉంటాడు. తన వైఫ్ ఇక్కడే ఉద్యోగం చేస్తుండటం తో పండగకు పబ్బానికి తనకు తప్పని ప్రయాణాలు..తనకు నేను మా వూరు వస్తున్నట్టు తెలుసు..కాని తనకు కుదరదని చెప్పాడు .వాడికి ఇద్దరు పిల్లలు.. పెద్దోడు చాల గోడవేట్టేస్తున్నాడు రా.. ఈ సారి నిన్ను కలవటం కుదరదేమో...వాడి గొంతులో ఏదో మూల చిన్న బాధ..పర్లేదు లేరా..మల్లా కలుద్దాం..అయినా ఫోన్ లో రోజు మాట్లాడుకుంటాం కదా..పెద్ద ఆరిందా లాగా నా ఓదార్పు. నన్ను చూడగానే అన్నాడు, మల్లా ఎన్నాళ్ళకు చూస్తానో అని వచ్చేసాను రా..అని.
నేను చాల ఆనంద పడ్డాను.నేను జీవితం లో ఏదైనా దాచకుండా చెప్పానంటే అది వాడికే. వాడు ఇంకా ఒక అడుగు మున్డుకేసాడు.ఇంట్లో ప్రతి చిన్న పెద్ద విషయం నాతొ చెప్పుకొని స్వాంతన పొందటం నాకు తెలుసు.మా స్నేహం మాకు ఊహ తెలిసినప్పటిది. నాకు మొదటి స్నేహితుడు వాడు...
వాళ్ల పిల్లల చదువులు ఆరోగ్యాలు,వాడి ఉద్యోగం ముచట్లు అన్ని తెలుసుకుంటూ భోంచేసాము. 
రాత్రి కుదుపుల ప్రయాణం మమ్మల్ని చక్కగా నిద్ర పుచ్చింది.వాడిని బస్సు స్టాండ్ లో వదిలి రావటానికి బైలు దేరాను.కేవలం నన్ను చూడ్డానికే కుటుంబం తో పండగ సంబరాలను  వదులుకొని వచ్చిన వాడికి నేనేమివ్వగలను...స్వచ్చమైన స్నేహం తప్ప.వాడితో కొంచెం సమయం గడపటం తప్ప. చిన్నగా నడవటం ప్రారంభించాం.అది కూడా వాడితో ఇంకొంచెం సేపు గడపాలని చిన్న ఆస వల్ల. మా ఇద్దరికీ మా వూరు తో ఎన్నో జ్ఞాపకాలు..ప్రతి వీది ప్రతి మలుపు ఏదో ఒక ఊహను తట్టి లేపుతాయి.అది ఇదీ మాట్లాడుకుంటూ మొత్తానికి బస్సు స్టాప్ చేరాము.
వాడికి ౪ గంటల బస్సు. అది దాటితే మల్లా ఇంకో గంట దాక బస్సు లేదు. ౩:౪౫ కి బస్సు స్టాండ్ చేరాము. కరెంటు బూకింగ్ లో టికెట్ తీస్కోని ప్లాట్ ఫారం మీద కొచ్చాము. మా మాటలు సమయా భావం చూసుకోలేదు. కాసేపటికి అర్ధం అయ్యింది, మేము మాట్లాడే విషయాల వెనుక కేవలం వాడితో ఇంకా సేపు గడపాలనే ఉద్దేశ్యమే ఉందని.ఒక వైపు వాడికి ఆలస్యం అవుతుందని తెలుస్తున్నా నేను ఆసక్తుడనయ్యాను.ఇంకో అర్ద గంట గడిచింది. అప్పుడే వెళ్తావా నేస్తం, మల్లా ఎప్పుడు కనపడతావో,నీ మాటలు వినే అదృష్టం నీతో గడిపే ఆ కాస్త సమయం మల్లా ఎప్పుడు దొరుకుతుందో..ఇదే భావం ఇద్దరిలో...నేనే ఆ ప్రవాహాన్ని ఆపాను.నాకు తెలుసు, తన వైఫ్ పిల్లలు తన గురుంచి ఎదురు చూస్తారని. సరే మరి ఉంటా అన్నానే కాని వాడి మొహం లో దోబూచులాడిన  భావం నన్నిక మాట్లడనీయ లేదు. వాడు వెంటనే సర్దుకున్నాడు. నాకని పించింది..నా మొహం లో కూడా అదే ఫీలింగ్ ఏమో..బస్సు వైపు భారం గా కదిలాడు. టాటా చెప్తు చెయ్యి పైకెత్తాను.  ఆలాగే సగం లో ఆగిపోయింది. 
మృతిలోన ముగిసినా చితి లో న రగిలినా కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎద వీది పోనిది మమతాను రాగం...
ఎప్పుడో విన్న చిన్న కవిత చెవుల్లో మారు మోగింది...

Sunday, July 3, 2011

మేకినా ( meckina) ద్వీపం-అమెరికథలు 5

కళ్ళు తెరిచేసరికి యెర్ర గా వొళ్ళు కాలి పోతుంది. అమ్మా దూరంగా నీళ్ళలో కరుగుతున్నట్టు మా అమ్మ.నన్నెందుకు దూరం గా విసిరేసావు . గొంతు పెగల్లేదు.వడి వడి గా మీద పడుతున్న నీరు. నా శరీరం మాడి పోతుంది. పైకొచ్చిన నీరు నన్ను మా అమ్మను వేరు చేసేసింది.
గాఢ  సుషుప్తి. ఎన్ని ఏళ్ళు గడిచి పోయాయే తెలియదు.ఇక ఎప్పటికీ మా అమ్మ ను మాత్రం చేరుకోలేనని మాత్రం తెలిసింది.అనంత మైన నీరు.దూరంగా నాకై చేతులు చాచి పిలుస్తున్నట్టు ఉన్న  మా అమ్మ.ఈ మద్య నా మీద కొత్త కొత్త గా జీవం పురుడు పోసుకోవడం గమనించాను.నేను మా అమ్మ లా పచ్చదనం పరుచుకున్నాను.చిన్ని చిన్ని ఆకులతో నా తనువును తడిమిన పిల్లల ఆలనా పాలనా చుసుకోవడంతో ఎన్నేళ్ళు కరిగి పోయాయో గుర్తేలేదు.
ఒక వేసవి సాయంత్రం.దూరం నుంచి అరుపులు,కేకలు.తలమీద చిత్ర విచిత్రం గా పక్షి ఈకలు కట్టుకున్న జనం,చిన్న చిన్న పడవల్లో నా దగ్గరకి వస్తున్నారు.పొడవైన కర్రల్లాంటి ఆయుధాలతో వాళ్ళు చేపలు వేటాడుతున్నారు .వేట పూర్తయ్యాక నా దగ్గరకి వచ్చి నాకు పూజలు చేసారు. నాకు చాల సంతోషం వేసింది.ఇన్ని వేల ఏళ్ళ తర్వాత మా అమ్మ దగ్గరి నుంచి వచ్చిన బంధువులు వీళ్ళు.
అలా ప్రతి వేసవి కి వీళ్ళు నా దగ్గరకి వచ్చే వాళ్ళు.మిగత కాలాల్లో మంచు కప్పబడి ఉంటానేమో, నేను మంచి కునుకు తీసే దాన్ని. వాళ్ళు నాకో పేరు కూడా పెట్టారు తెలుసా.మిచి మాకిన  అని. అంటే పెద్ద తాబేలు అని అట. నేను తాబేలు ఆకారం లో ఉంటాను అని వాళ్ళు అనడం విన్నాను . 
ఇంకోన్నేల్లకు తెరచాపలు కట్టుకుని ఉత్తరం నుంచి కొందరు మనుషులు వచ్చారు. వీళ్ళు పోయినసారి వాళ్ళలా లేరు.కొన్నాళ్ళకి అర్ధం అయింది వీళ్ళు వాళ్ళలా అమాయకులు కూడా కారు అని. నా మీద బ్రంహాండమైన కోట కట్టారు. ఇంతకూ ముందు వచ్చిన వాళ్ళని మచ్చిక చేసుకుని, గొప్ప ఉన్ని వ్యాపారం చేసారు. మెయిన్ స్ట్రీట్ అనే వీధి లో చూడాలి ఉదయం నుండి సాయంత్రం వరకు కోట్ల డాలర్ల వ్యాపారం జరిగేది.
ఈ వ్యాపారమేమో కాని, నా మీద ఎన్నో ఇల్లు కట్టి, జనం ఉండటం మొదలెట్టారు. అబ్బ ఇన్ని ఏళ్ళకు నావాళ్ళు అని చెప్పుకునే జనం నాకున్నారు.కాని కాలం యెంత వేగం గా పరిగెత్తుతుందో. ఈ మధ్యలోనే నేను అమెరికా అనే దేశం లో భాగం అయ్యాను. వాళ్ళ సివిల్ వార్ లో ను మరి రెండో ప్రపంచ యుద్ధం లోను నా మీద ఉన్న కోట యుద్దాలకు ఉపయోగ పడింది. ఇంకో విషయం చెప్పడం మరిచాను,సివిల్ వార్ టైం లో నన్ను ఒక జైలు లా కూడా వాడుకున్నారు.
నా మీద గ్రాండ్ హోటల్ అనే పెద్ద హోటల్ ఒకటి కట్టారు. ఎవరైనా ఇక్కడి కొస్తే, అక్కడ హోటల్ లో ఉండకుండా, ఫడ్జ్ మిఠాయి రుచి చూడకుండా ఉండరు. బ్రిటిష్ వాళ్ళు మొదటి సారి కాలు పెట్టిన ప్రదేశం, అమెరికన్లు బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసిన ప్రాంతం మిమ్మలను ఆ కాలం లోకి తీసుకెళ్తాయి.
మరి నన్ను చూడడానికి వస్తారా..ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, నేను ఒక ౨-౩ వందల ఏళ్ళ క్రితం ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నా మీద కార్లు, మోటార్లు తిరగటం నిషేదించారు. అందుకేనేమో, చాల మంది సైకిల్ ల మీద, జట్కా బండ్ల మీద నా చుట్టూ తిరిగి చూసి వస్తారు.ఇంకా నా దగ్గర ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి.షుగర్ లోఫ్ అనే దానంతట అదే ఏర్పడ్డ మట్టి దిబ్బ, డెవిల్స్ కిచెన్, ఆర్చ్ రాక్ లాంటివి ఎన్నో...అలా సంవత్సరాల బట్టి అల్లానే ఉన్నాయి.నన్ను చూడటానికి రావటానికి మే-అక్టోబర్ మంచి సమయం...మరి మీరు ఎప్పుడు వస్తారు నన్ను చూడడానికి...

అప్పుడప్పుడు తెలుగు చదివే మా అన్నయ్య పిల్లల కోసం పై మెకిన కధ...

ఇది కూడా చూడండి : http://www.mackinacisland.org/