Friday, November 20, 2015

జెమ్స్ బొండాము (మంచి బాలుడు) అనబడు శుబ్రముగా శుద్ధి చేసిన చలన చిత్రము

మొదటి అంకము :


జెమ్స్ బాగుగా తలకు ఆముదము పట్టించి ఇప్పుడే వేసిన తారు రోడ్డువలె నున్నగా దువ్వి మోహమంతయు జిడ్డు కారుచున్నవాడై, లంగోటాయు బిర్రుగా గట్టి  , పైన బాగుగా గంజి వైచి ఉతక బడ్డ చొక్కాయు ఉత్తరీయమును ధరించి కార్యాలయమున ఏతెంచెను. 
మొదట కార్యాలయమున కార్య నిర్వాహకురాలికి వినయముగా నమస్కారామిడి తన అధికారి కడకు పొయెను. రండి జెమ్స్ మహాశయా ... మీతో సీగ్రమైన కార్యము కలదు ... అధికారి బ్రుకుటి ముడివేసెను. ఆయన బహు ముదుసలి. రేపో మాపో టపా కట్టు టకు సిద్దముగా నుండెను. ఆయన బహు చుట్ట ప్రియుడై ఉండెను. జెమ్స్ భాద్యతా యుతమైన కధానాయకుడు కావున తన పై అధికారి నోటిలోని చుట్ట లాగి వైచి కింద పడవేసి దాని నార్పు వుద్దెసమున దానిపై దొరలెను. ఆ అవస్త నందు జెమ్స్ చొక్కయు అక్కడక్కడ కాలి ఉండెను. ఈ సన్నివేశము మిక్కుల అద్భుతముగా వచ్చెననియు చలన చిత్ర సుద్ది సమితి దీని మిక్కుల ప్రసంసించు ననియు దర్శకుడు సరిగానే బావించెను. 
అధికారి పాత్రధారి ఇట్లు చెప్ప దొడంగెను.  జెమ్స్ ...పరాయి  దేశ రహస్యములు శత్రు గూడచారుల నుండి తస్కరించవలెను. ఆ మాట పూర్తి చేయకమునుపే అధికారి కెవ్వున అరిచి కిందకు చూసేను. జెమ్స్ ఆయన కాళ్ళపై పది మిగుల దుక్కిన్చును ... అయ్యా ... ఏమి ఐనను తస్కరించుట తప్పు . పెద్ద వారైన మీరే ఇట్లు చెప్పుట తగదు ... అధికారి ఎట్లో అతనిని సమాధాన పరచి జెమ్స్ ను వేరే ఎవరికీ అనుమానం రాకుండా ఎవరు ప్రయాణం చెయ్యని ఎయిర్ మండియా విమానమున ఒక్కనే ఎక్కించి పరాయి దేశమునకు పంపెను. విమాన సేవిక పదహారు గజముల పట్టు చీర కట్టుకొని నడవలేక నడుచు చుండెను. రెండు మూడు సారులు అట్టి ఘనమైన చీర తట్టుకొని ప్రయాణీకుల మీద పడుచుండెను. 
జెమ్స్ దాహర్తుడై అమ్మా కొంచెం దాహము ఇప్పించ గలరు అని ప్రార్ధించెను. విమాన సేవిక జెమ్స్ కడ నిలిచి అయ్యా దశాబ్దముల తరబడి నష్టములలో నడచు ఈ విమానమున నీకివ్వుట కేమియులేవు ... విమానము స్టీరింగు టైరులు ను అద్దెకు తెచ్చి నడిపించు చుంటిమి. నీకేమి ఇవ్వగలను నాయనా అని హరిశ్చంద్ర నాటకమున తారామతి వలెను దుక్కించెను. అమ్మా దాహమునకు మజ్జిగైనను ఇప్పించుము ... నాయన మజ్జిగ అడుగంటేను. జెమ్స్ వూడి పోవు పీఠము యొక్క దట్టి బయముతో గట్టిగ పట్టుకు కూర్చుండి  పోయెను. ఆ   ముదుసలి విమాన సేవిక నటనా పటిమకు వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించిన దర్శకుడు జాతీయ పురస్కారము తనకే నని పొంగ్పోవు చుండెను. 
జెమ్స్ విదేశి విమానస్రయమున దిగెను. బైట అడుగిడెను. చేతిలో నీటి తుపాకీ తో నలు దిక్కులా చూసేను. దూరముగా ఒక పూటకూళ్ళ సత్రము అగుపడగా అటువైపు నడచెను. ఆ సత్రమున పురాణ కాలక్షేపము నడుచు చుండెను. భక్తులు పారవస్యమున నర్తించు చుండిరి. జెమ్స్ కు ఏంతో ఆనందం వేసెను. పూనకము వచ్చినట్టుల నర్తించెను. ఈ లోగా తన జేబు కత్తిరించ బడిన దని గమనించ కుండెను. కాలక్షేప భాగవతారిని జెమ్స్ పై జాలి పొంది , ఆ సాయంత్రం భోజనం పెట్టించెను. మిక్కిలి ఆనందముతో ఆనంద భాష్పములు రాల్చుచు జెమ్స్ ఆమె కాళ్ళకు నమస్కరించెను. 

చలన చిత్ర శుద్ధి సమితి చే విశేషముగా ప్రసంసించ బడిన    జెమ్స్ బొండాము (మంచి బాలుడు) అన  బడు చలన చిత్రం మొదటి అంకము. పై అన్కమున ఘనత వహించిన సమితి వారి సూచన మేరకు మార్పులు చేయబడెను. ప్రేక్షకులు గమనించి తల బాదుకో ప్రార్ధన ... 

Wednesday, November 11, 2015

సె(తు)స్సు ???

కేంద్ర ప్రభుత్వం 7 నవంబర్ నుంచి అన్ని సర్విసుల పై .5 శాతం సెస్సు విదించింది. ఇది స్వచ్చ భారత్ అభియాన్ కోసం. అబ్బే ... వంద రూపాయల సర్వీస్ టాక్స్ లో ఇది ఇంకో యాభయ్ పైసలు మాత్రం అదనం అంతే .. అని ఆర్ధిక శాఖా తన ప్రకటనలో వక్కానించింది కూడా.
కొన్ని నెలల క్రితం, సరిగ్గా గుర్తులేదు ... ప్రాధాన్యత లేదు కాబట్టి సరైన రోజు గురుంచి వెతకలేదు ...ఈ స్వచ్ భారత్ అభియాన్ ప్రారంభమయింది. మంత్రులు , గవర్నర్లు , వారి వంది మాగధులు చేట చీపురు పట్టుకొని రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో లేని చెత్తను పోయించి మరీ చిమ్మారు. వార్తా పత్రికల నిండా నిండారు. బావుంది. సినిమా ధియేటర్ లలో, టీవి లో ఎవడైనా సిగిరేట్తో, బీడినో పట్టుకొని కనపడితే చాలు ... పొగ ప్రమాదకరం ... కాన్సర్ కారకం అని సీన్ ముందో సారి వెనకో సారి ఊదర గొట్టారు ... చాల బావుంది. అయ్యా ... ఒక నెల తర్వాత అంతా మామూలే ... స్వత్చ్ భారత్ ...ప్రారంభ రిబ్బన్ కత్తిరించాక మూలన పడే ప్రభుత్వ ప్రాజెక్ట్ లా అటకెక్కింది.
ఇక ప్రాధాన్యాల లోకేల్తే :
1. చెత్త ని ఏం చేద్దాం : నగరాల్లో పట్టణాల్లో పోగు పడ్డ చెత్త ఎక్కడో వూరికి దూరంగా వేసి కాల్చేయ్యడం లేక పూడ్చెయ్యడం మనకు అలవాటే. కాని విపరీతంగా పెరుగుతున్న జనా వాసాలతో ఇలాంటి ప్రాంతాలు కను మరుగవుతున్నాయి. హైదరాబాద్లోనే ఇలాంటి ప్రాంతాల్లో చుట్టూ పక్క కాలనీలు కాలుష్యం బారిన పడటం కద్దు .
మరి స్వచ్చ భారత్ కార్యక్రమం లో వేస్ట్ మేనేజ్మెంట్ కి ఏమన్నా పరిష్కారాలున్నయా  ....
2. స్వచ్చత అంటే చెత్తేనా : మరి వాయు కాలుష్యం. వెయ్యి రెండు వేలు లంచాలు తీస్కుంటే పట్టుకునే ఏ సి బీ వేలకోట్ల అవినీతిని వదిలేసి నట్టు ... స్వచ్చ్ భారత్ అంటే కేవలం రోడ్డుమీద చెత్త వూడవడం ఏనా.. దేశ రాజధానిలో గాలి కాన్సర్ కారకం అని ఏళ్ల కిందే తెలుసుకుని మనం ఏం చేస్తున్నాం. యూ పీ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ లో దాదాపు అన్ని నగరాల్లో గాలి మనుషులు పీల్చ డానికి పనికి రాకుండా కాలుష్యం బారిన పడిందనేది అందరికి తెలుసు... మరి దీనికి స్వచ్చ్ భారత్ లో ప్రత్యామ్యయాలున్నాయా ....
3 మరి నీరు : తొంభై శాతం కన్నా పైన నగరాలూ పట్టణాల్లోని మురికి నీరు నేరుగా నదుల్లో కాలవల్లో చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి నీటిని శుద్ధి చేసి నీటిలో విడుదల చేసే సాధనాలు ఉన్నా వేళ్ళమీద లెక్కించచ్చు.
4. ఆహారం అరహరమ్ విషం : తినే ఆహారం , పాలు చివరికి పళ్ళు అన్నీ పురుగు మందుల తో, కావాలని చేసే కల్తీలతో మనవ వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయని ఈ మద్య ప్రతి చోట వార్తలు వింటున్నాం . మరి స్వచ్చత వీటిలో వద్దా ??
దేశం లో అడుగడుగునా నిండి మనం ఎప్పుడో పట్టించుకోవడం మానేసిన  అవినీతి లంచగొండితనం లా కాలుష్యం సర్వ వ్యాప్తం. సరైన ప్రణాళిక, ఆలోచన  లేకుండా చేసే ప్రతి పధకం మొదట్లో మురిపించినా తర్వాత అటక ఎక్కడం మామూలే. మనకిలాంటివి కొత్త కాదు.. మరి స్వచ్చ భారత్  మరో ప్రభుత్వ పధకంలా ఫొటోలకి పేపర్ ప్రకటనలకి పరిమితమై తుస్సు మంటుందో ... లేక  ఘట్టి మేలేమన్న చేస్తుందో .... 

Thursday, October 1, 2015

నా వస్తువులు కొన్ని

నా వస్తువులు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి
తిరిగిస్తావా...

కాఫీ షాపుల్లో కరిగిన లెక్కలేని వర్షపు రాత్రులు
మనిద్దరమే ఈ లోకంలో అనేలా ఎన్నెన్నో ఊసులు













మొదటి వానతో పులకరించిన మట్టి వాసన
జోరు వానలో ఇద్దరు పట్టని గొడుగులో
సగం సగం తడుస్తూ కలసి నడిచిన దారులు

తడిచిన నా హృదయం నీ వాకిట్లో పడుందేమో
తిరిగిస్తావా

ఆకురాలు కాలం లో కొన్ని ఆకులు రాలిన చప్పుడు
వారాంతపు దూర ప్రయాణాల్లో మన సాంగత్యం

ఇంకా ఆరని నీ మెహంది
ఊసు పోనీ గిల్లి కజ్జాలు

నా కెంతో వెలలేనివై  నీకేమి కానివి
అన్నీ మర్చిపోకుండా వెతికి పంపిస్తావా

నా వస్తువులు కొన్ని నీ దగ్గర ఉండిపోయాయి
తిరిగిస్తావా...

( Inspired by one and only Gulzar)





Sunday, July 19, 2015

నాకు తెలుసు

నీమీద నాకున్నది ప్రేమ లేక మరొకటా
ఈ లోకం లెక్కల్లో నా వాదనలు కలిపి కంగాలి చేయ్యదలచలేదు
నా మనసులో భావాలకు కొలబద్దలతో కొలత వెయ్యలేదు

నువ్వంటే నాకిష్టం అని చెప్పడానికి
ఆల్జీబ్రా లెక్కలు అవసరం లేదు

ఎంత అని నువ్వడిగితే
నువ్వు లేకపోతె బతకలేనంత
అని మాత్రమె నాకు తెలుసు

ప్రేమంటే ఇది అది ఇంకోటని
ఎవరన్నా ఎమన్నా చెప్పనీ
నీకే నా వాదన అసంబ్బద్దం
అనిపించనీ

కాని నా కివన్నీ తెలీదు
కానీ ప్రేమంటే నువ్వని మాత్రం నాకు తెలుసు

నీతో గడిపిన ప్రతిక్షణం
చేత చిక్కిన ఇసుక రేనువులైతే
ఈ రేణువులు జారిపోయ్యేలోగా
నా గుండె ఆగిపోతే బావుంటదని నాకు తెలుసు

ఈ ప్రపంచం దృష్టిలో నాకేం తెలియక పోవచ్చు
కాని ఈ ప్రపంచానికి తెలియని మరో పార్శ్వంలో నాకున్నదంతా నువ్వే నని నాకు తెలుసు




Saturday, June 27, 2015

చిలుకూరు...ఒక ప్రారంభం



 చిలుకూరు బాలాజీ దేవాలయం.
5-6 ఏళ్ళ క్రితం ఎలా ఉందో అలానే ఉంది. అక్కడ జరిగే పూజాదికాలు , ప్రదక్షిణాలు, జన సందోహం గురించి నేను రాయబోవటం లేదు. రాష్ట్రం లో ఎక్కడా లేని ఒక సంప్రదాయం గురించి, చిలుకూరు ప్రారంభించిన ఒక పోరాటం గురించి రాయాలని పించింది.

చిలుకూరులో హుండీ లేదు. ఎటువంటి కానుకలు స్వీకరించ బడవు. ఎవరైనా దేవుని ముందు సమానమే అన్న భావన ప్రతిఫలిస్తూ గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా వరసలో నిలబడే దర్శనం చేస్కోవాలి. దర్సనానికి ఎటువంటి టికెట్లు లేవు. దేవుని ముందు అందరూ సమానమే. మరి ఇక్కడ కానుకలకు ప్రత్యేకతలకు అధికార దర్పానికి ఎటువంటి చోటు లేదు. దేవుని మీద అచంచలమైన భక్తీ, నమ్మకమే దేవుని చేరే దారులైతే , భక్తులనుంచి ఇవి తప్ప ఇంకేమి ఆశించనిది చిలుకూరు బాలాజీ ఆలయమే  అని ఘoటా పధం  గా చెప్పవచ్చు. 
మనది లౌకిక రాజ్యం. కాని మనం కేదార్ నాథ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వం. ఎండోమెంట్ డిపార్టుమెంటు కేవలం ఒక మతం వ్యవహారాల మీదే అజమాయిషీ చెలాయిస్తుంది. వారి హుండీ కానుకలలో వాటా తీస్కుంటుంది. సినిమాలలో కామెడీ షోలలో ఒక మతం దేవుళ్ళే అభాసు పాలవుతారు. సెన్సార్ కూడా వాటిని చూసి నవ్వి వూరుకుంటుంది.కొన్ని మతాల సంస్తలకు మాత్రమె  ప్రత్యెక వేసులుబాట్లు వుంటాయి.  ఇలాంటి విషయాలు విశదీకరించి రాయటం మళ్ళీ మళ్ళీ మనల్ని మనం అభాసు పాలు చేసుకోవడం కాబట్టి , ఇంతటితో ముగిస్తాను.

ఏ మతానికైనా వ్యవస్థ కైనా పునరిజ్జీవం అవసరం. ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చిన్న గానే ప్రారంభం అవుతుంది. ఇలాంటి చిన్న ప్రయత్నం చిలుకూరు లో జరుగుతుంది. చిలుకూరు  బాలాజీ వీసా బాలాజీ గా ప్రసిద్ది. వేలాది మంది భక్తులు ప్రతి రోజు ప్రదక్షిణాలు చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో  ఏ దేవాలయం లో లేనట్లు ఆలయ పూజారులు భక్తుల నుద్దేశించి ప్రసంగించడం విశేషం. వారు వివరించే విషయాలు ఆలయంలో వ్యవహారాల నుంచి స్వధర్మ వినాశన  కారణాల వరకు, కుంచిచుకు పోతున్న నైతిక విలువల నుంచి, ధర్మ  పరిరక్షన దిశ గా సాగుతాయి. సర్వ ధర్మాలు దేవుని చేరేవే అయితే స్వధర్మ పాలనలో , దాని రక్షణలో  ఏ మాత్రమూ అలసత్వం  పనికి రాదనీ ప్రభోదిస్తాయి. ఇది తప్పని సరిగా చేయవలసిన మంచి ప్రయత్నం. హుండీ లేని దేవాలయం, ఎండోమెంట్ ఆంక్షలకు అందని దేవాలయం, దేవునికి భక్తునికి డబ్బు దస్కం అడ్డురాకూడనే ప్రభల ప్రయత్నం ఎంత సఫలమైనదో మీరు ఒక సారి చిలుకూరు దర్శించి తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రతి దేవాలయము దీనిని ఒక నమూనా గా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఈ సందర్భంలో మనుస్మృతి నుంచి ఒక వాక్యం "ధర్మో రక్షతి రక్షితః "

Sunday, June 21, 2015

చలి చీమల చేత చిక్కి

బలవంతుడ నాకేమని 
పలువురతో నిగ్రహించిపలుకుట మేల 
బలవంతమైన సర్పము 
చలి చీమల చేత చిక్కి చావదె సుమతి 

ఈ సుమతి శతకం ప్రస్తుత భారత క్రికెట్  జట్టుకి అతికి నట్టు సరిపోతుంది. వరల్డ్ కప్ టైంలో ఓవర్ ఆప్టిమేస్టిక్ మిత్రులతో వాదించలేక , ధోనికి పిల్లి ఎదురోచ్చిందని , విరాట్ కోహ్లి రూంలో బల్లి చచ్చిందని అందుకే మనోళ్ళు సెమి ఫైనల్లో బాటు తిప్పలేక ఎయిర్పోర్ట్ దారి పట్టారని ముఖ పుస్తకాలు ఎక్కి వాదించే మేధావులతో ఇప్పుడు మల్ల మాట్లాడతాం అని... మా కొలీగు ఒకాయన్ని కదిలిస్తే ఆ రోజుకి ఈ రోజుకి పోలికేవిటోయ్ అని ఒక నవ్వు నవ్వేసి చక్కా వెనక్కితిరక్కుండా కాంటీన్ దారి పట్టాడు.

ఇంకా చెప్పొచ్చే దేంటంటే, మన జట్టు దిక్కుమాలిన డొక్కు ప్రదర్శన కి చాల కారణాలు కనిపిస్తున్నాయ్

1. ఓవర్ క్రికెట్ : వరల్డ్ కప్, ఐ పీ ఎల్ లలో నాన్ స్టాప్ గా ఆడి ఆడి అలసిపోయి ఉండొచ్చు

2. ఓవర్ ఆడ్స్ : మనోళ్ళు ఒళ్ళు  దగ్గరేట్టుకొని చేసే పనులు. వీటిలో స్మైల్ ఇచ్చి ఇచ్చి మైదానంలో ఎం చేయాలో మనోళ్ళు మరచి పోయి ఉండవచ్చు

3. వెర్రివాళ్ళు అమాయకులు మీదు మిక్కిలి ఆశా జీవులైన అభిమానులు : మీరేమైనా అనండి... ఈ మద్య కాలంలో మన క్రికెట్ టీం యవ్వారం కాకుండా స్టార్ల భాగోతం అయిపోయింది. ఆడలేనయ్యకు  బాటు వంకర అన్నట్టు , పూర్తిగా అన్ని రంగాల్లో మట్టి గరిచి సెమీఫైనల్ లో ఇంటి దారి పట్టిన వాళ్ళను ప్లేయర్ ప్లేయర్ కి భజన బృందాలు మొదలయ్యాయి. టీం మొత్తం ఆడక పొతే పాపం పసోడు ధోని ఏం చేస్తాడని ఒకాయన అంటే, విరాట్ విశ్వరూపం ఫైనల్ కోసం దాచాడు కాబట్టి ఆ తొక్కలే అని సెమి ఫైనల్ లో ఆడలేదని వ్యూహాత్మకం గా  వాదన చేసేది ఇంకో  కాయన.

4. జట్టేనా అది : మన బౌలింగ్ మంచి డాల్ డమాల్ అని అందరికి తెలుసు. ప్రపంచంలో క్రికెట్ అదే అన్ని దేశాల బాట్స్మన్ కి రికార్డ్స్ ఇవ్వడానికి బౌలింగ్ చేస్తున్నారా అన్నట్టు అనుమానాలు రావడం సహజమే . ఇక మహారధులతో కూడిన మన బాటింగ్ మంచి బహుళ అంతస్తుల పేక మేడ. అబ్బో ధావన్ వామ్మో కోహ్లి అనుకునే లోపల మైదానం లో చలి ఎక్కువుందని అందరు డ్రెస్సింగ్ రూం కి పరిగేట్టుకోచ్చేస్తారు.

నా మటుకి నేను మ్యాచ్ చూడటం మానేసి చానా కాలమైంది. అంటే మనోళ్ళు సన్నాసులని కాని ఇంకోటి కాని నా స్తిరాభిప్రాయం కానే కాదు. ఓడి పోవటంలో ఇన్ని రకాలు గా ఓడిపోవచ్చు అని ప్రయోగం చేసే గొప్ప శాస్త్రజ్ఞులలా అనిపిస్తున్నారు ఈ మద్య. అందుకే ఆ ప్రయోగాలేవో పూర్తయ్యాక చూడచ్చు లెద్దు. సంవత్స్తరం పొడుగునా దొరికేది క్రికెట్ ఏగా ...ఎప్పుడైనా చూసి ఏడవచ్చు అని...


Wednesday, May 6, 2015

యక్ష ప్రశ్నలు.... కొందరికి అర్ధం కానివి కొందరికి అర్ధం లేనివి



1. గ్యాస్ సబ్సిడీ లో రిజర్వేషన్లు ఎందుకు లేవు ;)
2. పబ్లిక్ ప్లేసులలో పొగ తాగొద్దని ఊదర గొట్టే ప్రభుత్వం రోడ్ల మీద వాహన కాలుష్యం గురించి ఎందుకు పట్టించుకోదు
3. ఇంటి ముందు చెత్త వెయ్యక పొతే అంతా స్వచ్చమేనా.... మరి నదుల్లో కలిసే వ్యర్ధాలు పారిశ్రామిక వ్యర్ధాలు ?? అసలు మనకు వేస్ట్ మేనేజ్మెంట్ అంటే తెలుసా...
4. మనకు విధాన మండలి , రాజ్య సభ అవసరమా... అనవసరపు ఖర్చు కాదా ???
5. ద్రవ్యోల్బలానికి అనుగుణంగా పెరిగే జీతాలు గోవేర్నమేంట్ ఉద్యోగులవే... మరి  ఇంకొటేదో ముడితే తప్పపని ఎందుకు ముందుకు జరగదు
6. ఇన్సురన్సు ఈజ్ ఎ సబ్జెక్ట్ మాటర్ అఫ్ మొహమాటం .... కాదంటారా ?
7. మొన్న భూకంపం వచ్చాక ఒక బ్లాగ్లో ఎవరో పెద్దాయన రాసింది. ఫలానా గ్రహగోచారం ఇంకో సంచారం వల్లే  జరిగింది అని.. అంత విద్యుత్తు ఉండి చస్తే ముందే ఆ ఏడుపేదో ఏడవచ్చు గా... అబ్బే అల్లా కుదరదు మరి. ఆయనకి తెలిసి సస్తే కదా ....
8.  ఐ పీ ఎల్ లో ఇంతా ఇరగదీసే బాట్స్మన్ మొన్న వరల్డ్ కప్ లో ఏమి చేసారు... స్టాన భలిమి కాని.... తన.... ;)
9. కుక్క తోకా వర్మ నాలుకా వంకరేనా
10. పేవ్మెంట్ల మీద పడుకునేది మనుషులు కాదు అనే వాళ్ళని అక్కడే పడుకో పెట్టి, మల్ల ఇంకో సారి ఏక్షన్ రిప్లై చేయిస్తే

Sunday, April 26, 2015

మిస్సింగ్ టిమ్మీ :(


నవంబర్ 2008.
నా మొదటి విదేశి యానం. కెనడా లో అడుగు పెట్టాక, నేరుగా హోటల్ లో దిగాం నేను నా సహా ఉద్యోగి, ఇప్పుడు వన్ అఫ్ మై బెస్ట్  ఫ్రెండ్స్ కిరణ్. క్రౌన్ హోటల్  ఇన్  విన్ఫోర్డ్ డ్రైవ్. మొదటి రోజంతా ఆ హోటల్ బైట చూస్తూ గడిపేసాం.
బైట చలి. దానిపైన కొత్త ప్రదేశం ఏమో బైటకి వెళ్ళాలంటే భయం. రెండో రోజు  అనుకుంటాను వచ్చాడు మా ఇంకో సహోద్యోగి అజయ్. వాడికి టొరంటో కొట్టిన పిండి. అలా బైటకి వెళ్దాం పదండి అని బయల్దేరాదీసాడు.
గొప్ప ట్రాన్స్పోర్ట్ సిస్టం టొరంటోలొ. ఏదో మారుమూల ప్రాంతం కాకపోతే తప్ప ప్రతి పది నిమిషాలకి ఒక బస్సు ఏ స్టాప్ లో నైనా. అక్కడ బస్సు లో కండక్టర్ ఉండడు. డ్రైవర్ ఎ టికెట్ ఇస్తాడు. మీరు డ్రైవర్ పక్కన బాక్స్ లో సరి పడా చిల్లర వెయ్యాలి అంతే.భలే తమాషా అని పించింది. మీరు వేసే చిల్లర డ్రైవర్ లెక్కించడు. సరే, అజయ్ చెప్పినట్టు 3 స్టాప్ ల తర్వాత దిగాం. టిం హోర్టన్స్ . కాఫీ షాప్. త్రీ స్మాల్ ఫ్రెంచ్ వనిల్లా. బైట చలి కి ఆ వేడి వేడి  వనిల్లా ఫ్లేవోర్ గొంతు దిగుతుంటే ఏదో కొత్త అనుభూతి. అప్పటి నుంచి టిం కి రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయాం నేను కిరణ్. ఆ బాచిలర్ హడావుడిలో మద్యాన్నం లంచ్ బ్రేక్ లో షేర్ చేస్కున్న సాండ్ విచేస్. మేమంతా ఎంతో ఇష్ట పడే వెజి సూప్. నా అల్ టైం ఫేవరిట్ టిం బిట్స్. 
సందర్భం ఏదైనా మా మీటింగ్ పాయింట్ టిం హోర్టన్ ఏ అయ్యేది. పైన ఉన్న టిమ్మీ కిరణ్ వాళ్ళ అపార్ట్ మెంట్ బైటది. ఆఫీసు కూడా దగ్గర అవడం తో, ఏ మద్యన్న బ్రేక్ అయినా, సమ్మర్ టెన్నిస్ గేమ్ మద్యలో బ్రేక్ టైం అయినా, వీక్ ఎండ్ లోకల్ ఫ్రెండ్స్ తో మీటింగ్ పాయింట్ అయినా,ఏ కొత్త ఎంప్లాయ్ వచ్చినా వీకెండ్ పిచ్చా పాటి కైనా ఇదే వేదిక అయ్యేది. కెనడాలో ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు మా కళ్ళు టిమ్మీ కోసమే వెతికేవి. చివరికి పక్కా  ఫ్రెంచ్ సెట్ అప్ క్విబెక్ డౌన్ టౌన్ లో అంతా వెతికి అక్కడ టిం లేదని నిర్ణయించు కొన్నాక లోకల్ రెస్టారెంట్ కి వెళ్లినట్టు గుర్తు మా సెండ్ ఆఫ్ కి  క్లైంట్ టీం అంతా  వచ్చి టిం లోనే బై చెప్పినట్టు గుర్తు. 
మొన్న జనవరి లో కూడా యు ఎస్ వెళ్ళినప్పుడు పట్టు బట్టి టిం కి వెళ్లి మా ఆఫీసు కి టిం బిట్స్ పట్టుకేల్లడం గుర్తుంది . మాకు టిం తో ఈ అనుభంధం కేవలం ఒక కొత్త ప్రదేశంలో మొదటి అనుభవం అనుభూతుల వల్ల కావచ్చు కాని... ఎప్పుడు ఎక్కడ ఈ సింబల్ కనపడ్డా ఆ పాత రోజులు ఆ మధురాను భూతులు ఎలా వున్నావ్ నేస్తం అని మనసార  పలకరిస్తాయి. ఈ రోజు టిమ్మీ ఇస్ టేకెన్ ఓవర్ బై బెర్గేర్ కింగ్ అంటే ఎందుకో మింగుడు పడలేదు. ఎక్కడ విస్తరించినా టిం ఒక పక్కా  కెనడియన్ బ్రాండ్. నా అంచనా నిజం ఐతే కొత్త సంస్త బర్గర్ కింగ్ ఏ అవుతుంది. మార్పు సహజమే కాని సం హౌ ఐ ఆల్రెడీ స్టార్టేడ్ మిస్సింగ్ టిమ్మీ............. 



Monday, April 6, 2015

నువ్వు నేను.... నా హైకులు


వడిగా సాగిపోయే నది హోరువు నీవు 
నీ  మార్గంలో నిలచిన  గడ్డి పరకను  నేను 
నీ వొడిలో చేరే వేలకు 
దూరంగా నన్ను నేట్టేస్తావు 

సాయంకాలం వేళల్లో సంద్యా మారుతం నీవు 
చీకటి ముసిరితే ముడుచుకు పోయే చిగురుటాకును నేను 
నీ సాన్నిద్యంలో నన్ను నేను మరచేవేలకు నా ఉనికి లేక పోతాను 

వేయి ఉదయాల కాంతి నువ్వు 
తుషార బిందువు నేను 
నీ స్పూర్తితో నిలిచి వెలిగే కాలం క్షణ భంగురం 

చేష్టలుడిగిన ఈ జీవితంలో 
అచేతనంగా నిలచిన నన్ను 
నీ చిన్న నవ్వుతో తట్టి లేపావు 

క్షణ క్షణం నీ ఊహలో నా ఉనికే మరచిన నేను 
నువ్వు లేని ఈ లోకం వూరకైన ఊహించలేను 
మరపు రాని నీ స్నేహం మరణమైన మరవలేను 










Sunday, March 22, 2015

డాకా లో అంతే...

ఇండియా సెమి ఫైనల్ కి చేరిన తర్వాత కొన్ని ఆసక్తికర సంఘటనలు  చేసుకున్నాయి. బంగ్లా  క్రికెట్ బోర్డు చైర్మన్ అంపైర్ల నిర్ణయాల వల్లే తమ దేశం వోడిపొయిందని అవసరమైతే రాజీనమాకైనా సిద్దం అని ప్రకటించేశారు. ఒక ఫాన్స్ గా తను ఈ ఫలితాన్ని జీర్నిన్చుకోను అని దేబరించారు. 
బంగ్లా  మీడియా మరో అడుగు ముందుకేసి యుద్ద  నేరాల కింద అంపైర్లను విచారించాలని పతాక  శీర్షికలలో విషం  కక్కాయి.   అతి హాస్యాస్పదమైన విషయం ఆ దేశ ప్రధాని కూడా అంపైర్ల నిర్ణయాల వల్లే తమ దేశం వొడి పోయిందని ఎప్పటికైనా బంగ్లా పులులు జగజ్జేతలవుతారని జోస్యం చెప్పారు. రెండో విషయం లో ఎవరికీ ఆక్షేపనలు వుండక్కర్లేదు కాని మొదటి సంగతే అత్తా కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వి నందుకు అన్నట్టుంది. 
ఇక మనం నిజా నిజాలు చూస్తే రోహిత్ ఆ వివాదాస్పదమైన బంతి కి అవుట్ అయ్యాడే అనుకుందాం. ఏమి అయి వుండేది. రోహిత్ తర్వాత 40 పరుగులు చేసాడేమో. మరి బంగ్లా జట్టు 109 పరుగుల తేడాతో కదా వొడి పోయింది. 
మరి బంగ్లా జట్టు అవుట్ అవడానికి అంపైర్లే కారణం అంటే ఇంకేమి చెప్పలేం.
బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు, ఉమేష్ యాదవ్ వేసిన మొట్టమొదటి ఓవర్ నాలు గో బంతికే ఇమ్రుల్ కేస్ కాట్ బిహైండ్ రూపంలో ఔటయ్యాడు. స్నికోమీటర్ దాన్ని స్పష్టంగా చూపిం చింది కూడా. కాని అప్పీల్‌కు అంపైర్ స్పందిం చలేదు. మరి ఇదీ తప్పేగా. కాని పక్క దేశం జనాలకు మాయ బజార్ లో ప్రియ దర్శిని ఉన్నట్టుంది. వాళ్ళు వాళ్ళ ప్రియ మైనదే చూస్తారు కామొసు. 
ఇంకొంచెం ముందుకు వెళ్లి చూస్తె, ఇంకే పరంగాను అభివృద్ధి చెందని మన సమాజాలకు ( నేను ఇందుకో ఉప ఖండం జట్టులన్నిటిని కలుపుతున్నాను) జాతీయతా భావం   మనం ఎంతో కోంత బాగా ప్రదర్శన చేస్తున్న క్రికెట్ లాంటి క్రీడల్లో బాగా ప్రతిఫలిస్తుంది.బ్రెజిల్ చిలి లాంటి దేశాల్లో ఫుట్ బాల్ కున్న క్రేజ్ ను నేను దీంతో పోలుస్తాను.  సంస్కృతీ వ్యవహారాలూ పరిణతి పరిగణలోకి తీసుకుంటే, ఇండియా శ్రీలంక లతో పోలిస్తే మిగతా రెండు దేశాల్లో ఇలాంటి భావనలు విపరీతం స్తాయి చేరుతాయని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితం రావల్పిండిలో ఆ దేశ క్రికెట్ కు జనం తద్దినం పెట్టిన సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి.  
కొంచెం ఎక్కువ అని చెప్పక పొతే తర్కానికందని ఈ జాతీయ భావాలు అనవసరమైన చోట్ల ఇలా ప్రతిఫలించడం  ఆయా సమజాలకేమి మేలు చెయ్యదు. మన దేంతో గొప్ప దేశం కావచ్చు. మనం దాన్ని ఎంత గానో ప్రేమించచ్చు. కాని ఒక క్రీడ ను అదే స్పూర్తీ తో చూడాల్సిన అవసరం వుంది. 

Tuesday, February 10, 2015

ప్రేమ

ప్రేమంటే రెండు గుండెల చప్పుడే కావక్కర్లేదు 
ఒక గుండె పడే వేదనా ప్రేమ కావచ్చు 

ప్రేమంటే వసంత సమీరమే కావక్కర్లేదు 
వేసవి వడగాల్పు కూడా ప్రేమ కావచ్చు 

ప్రేమంటే  గాఢ పరిశ్వన్గమే కావక్కర్లేదు 
ఒంటరి నిట్టుర్పు ప్రేమే కావచ్చు 

ప్రేమంటే తలుక్కున మెరిసే ప్రేయసి  నవ్వే కావక్కర్లేదు 
ప్రియతము  గానని  కంటి నీరే కావచ్చు 

ప్రేమంటే ఒక కలయికే కావక్కర్లేదు 
నిరీక్షణ కూడా  ప్రేమ కావచ్చు 

ప్రేమంటే నువ్వే కావక్కర్లేదు 
నీ ఊహల్లో నిండా మునిగిన నేను కావచ్చు

Friday, January 2, 2015

నా మ్యూజింగ్స్



 1. డబ్బు కూడా వంటి బరువు  లాంటిదే. ఎంత అవసరమయితే అంత వుంటే బావుంటుంది.
2. ప్రపంచం లో అన్నీ ఉన్నాయి అనుకునే వాడే ఏమిలేనివాడు. ప్రాపంచిక విషయాలన్నీ క్షనభంగురాలే. ఆత్మ సంతృప్తి కి మించిన ఆస్తి లేదు.
3. మంచి చెడులు నాణానికి రెండు వైపులు. ఎవరు ఏది చూడాలను కుంటే అదే చూస్తారు. అందరూ ఒకే వైపుని ఒకేలా పిలుస్తారని నమ్మకం పెట్టుకోకు. ఒకడికి పనికి రానిది వేరేకరు ఇంట్లో పెట్టుకోవచ్చు.
4. పాత జన్మ నుంచి ఏవీ నీకు తోడూ రావు. నీ బౌతిక శరీరం మీ జననీ జనకులు నిర్ణయిస్తే, నీ భవిష్యత్తు నీ చేతల ద్వారా నువ్వే రాసుకుంటావు.
5. సంసారి కన్నా సన్యాసి సుఖి.
6. నీ సుఖం తో దుక్ఖం తో కాలానికి  లోకానికి పని లేదు. ఆహ అనో అయ్యో అనో ప్రపంచం నిన్ను మర్చి పోతుంది.
7. కన పడే దంతా నిజం కాదు... కన  పడనిది అబద్దం అసలే కాదు.
8. ప్రపంచం లో అన్ని బంధాలు ఇచ్చి పుచ్చుకునేవే.
9. రాజ్యం వీర భోజ్యం. రాజకీయం సన్నాసుల చోద్యం.
10. ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎంత చెట్టుకు అంత గాలి.