Sunday, May 22, 2011

తెలుగదేల యన్న....

పదవ తరగతి ఫలితాలు ప్రకటించారు. ఆ స్కూల్ ఈ ఇన్స్టిట్యూట్, మా ఫలితాలు ఇవి అంటే మా ఫలితాలు ఇవి అని ఊదర గొట్టడం పరిపాటే.అలాగే, ఒక స్కూల్ విద్యార్ధులతో పరిచయం,ఒక ఛానల్ లో. ఆ న్యూస్ రీడర్ ఏదో ప్రశ్నఅడిగాడు, తెలుగు లోనే. ఇక చూస్కోండి, ఆ విద్యార్ధి ఆంగ్లమున తన స్కూల్ గురించి, వాళ్ళ ఉపాద్యాయుల గురించి ఊదర కొట్టేసింది.అక్కడ ఉన్న ముగ్గురిలో ఒక్కరును తెలుగులో మాట్లాడలేదు. అది పక్కా తెలుగు ఛానల్. న్యూస్ రీడర్ అడిగింది తెలుగు లో.మరి ఇదేమిటి, అంటే ఏమి లేదు. మనోళ్ళకి తెలుగు లో మాట్లాడటం నామోషి. అదేమన్న అంటే, మా పిల్లోడు ఫలానా ఛానల్ ఇంటర్వ్యూ లో ఇంగ్లీష్ లో అదరగొట్టాడు తెలుసా అని చెప్పుకోవచ్చు. తెలుగు లో మాట్లాడితే గొప్పేముంది.
కావచ్చు. సామాన్య ఆర్దిక శాస్త్ర విజ్ఞానం ప్రకారం, ఏ వస్తు వైనా ఎక్కువ అందుబాటులో ఉంటె, విపణి లో దాని విలువ తగ్గి పోతుంది. మనోల్ల విషయాని కొస్తే, మనకు చరిత్ర ఎక్కువ. అందుకే అదంటే మనకు విలువ లేదు.మనకు గొప్ప గొప్ప భాషలు సంస్కృతులు ఉన్నాయి.అందుకే అవంటే మనకు చిన్న చూపు. అదే ఏ ఇంగ్లాండ్ నో, అమెరికా నో వెళ్ళండి. ౨-౩ వందల ఏళ్ళ వస్తువులను, కట్టడాలను, చక్కగా పరిరక్షిస్తారు.అదొక గొప్ప చారిత్రిక ప్రదేశం లా కాపాడుకుంటారు. మనోళ్ళంతా టికెట్టు కొనుక్కుని మరీ లైన్ లో నిలబడి చూసి వస్తారు. మొన్నేదో ఛానల్ లో తిక్కన ఇంటిని పరిరక్షించాలి అని, అది పాడు బడి అసాంఘిక కార్య కలాపాలకు నేలవైనదని వార్త. చెప్పొద్దూ, ప్రభుత్వాని కంటే ముందు, అలాంటి ప్రదేశాన్ని అపవిత్రం చేసే వాళ్ళకు ఉండాలి బుద్ది.
ఇంకా మన భాషల మీద మనకు చిన్న చూపు.కొత్త ఒక వింత అన్నట్టు, మన పిల్లలు మమ్మీ దాడి ( కావాలనే సరి చెయ్యలేదు) అంటే మనకు యెంత ఆనందమో.
.మా పిల్లోడికి తెలుగే రాదండి.వాడు చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ కాన్వెంట్ అని చెప్పేవాళ్ళను చూసి ఏడవాలో నవ్వాలో అర్ధం కాదు. ఆర్ధిక కారణాల వల్ల ఈ పర భాష మనకు ఎంతో అవసరం కావచ్చు. కాని దానికి మన భాష ను చంపేసుకోవడం యెంత వరకు సమంజసం.మనం మన భాష సంస్కృతీ సంప్రదాయాలు ముందు తరాలకు అందించక పొతే అవి మృతప్రాయమే కదా.
ఇలాంటి విషయాలలో మన తమిళ అన్నల ( ఈ విషయం లో వాళ్ళు ఎన్నటికి తంబిలు కారు) నుంచి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. ఇద్దరు తెలుగు వాళ్ళు ఎదురైతే ఆంగ్లమున దేబిరించడం యెంత సహజమో, తమిళులు తమిళ్ లో మాట్లడటం అంత సహజం. బావున్నారా అండి అనడం లో ఉన్న గౌరవం హౌ ఆర్ యు లో ఉందా అంటే మీరే చెప్పాలి.
సుందర తెలుగు అని తమిళులు చెప్పినా,తెలుగు తేట అని కన్నడిగులు అన్నా,ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని బైట వాళ్ళు వర్ణించినా, పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు అన్నట్టు, మనకే మన భాష భారమై పోయింది.
కొన్ని పరిశోధన ప్రకారం, మాతృ బాష లో ఆలోచించే విద్యార్ధి చక్కని ఫలితాలను సాధిస్తాడని నిరూపితమైంది.కనీసం పదవ తరగతి వరకైనా పిల్లలు తెలుగు మాధ్యమం లో చదివితే, నష్టం ఏముంది.అప్పటికి వాళ్లకు భాష పై మంచి అవగాహన ఏర్పడుతుంది.పై తరగతుల్లో ఇబ్బంది లేకుండా, వేరే మాధ్యమాలలో ఆంగ్లమును నేర్పించ వచ్చును కదా.
ఈ టపా ను కృష్ణ దేవ రాయల మాటలతో ముగిస్తాను. మా గొప్ప ఇంగ్లీష్ మీడియం పిల్లలు పెద్దలు చదువుకోవటానికి ఆంగ్ల మునకూడా ప్రచురించితిని.
తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు
ఏను తెలుగు వల్లభుండ తెలుగొకొండ
ఎల్ల నృపులు గొలువ ఎరుగ వె బాసాడి
దేశ భాష లందు తెలుగు లెస్స
Telugadela yenna desambu Telugu
Yenu Telugu vallabhunda Telugokunda
Yella nrupulu goluva Yeruga ve baasaadi
Desa bhasha landu telugu lessa