౨౦ నవంబర్ ౨౦౧౦.
అమెరికా కు మరో ప్రయాణం.అమ్మ, నాన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ విమానాశ్రయం కి నాతొ పాటు వచ్చారు.వెళ్ళేటప్పుడు ఎప్పట్లాగే అమ్మ కళ్ళలో చెమ్మ.మొదటి సారి నాది అదే ఫీలింగ్.ఇంతకూ ముందెప్పుడూ ఈ ఫీలింగ్ లేదు.ప్రయాణాలు కొత్త కాకున్నా, ఈ సారెందుకో ఎప్పట్లాంటి ఉత్సాహం లేదు. ఉద్యోగ పరం గా, ఆర్దికం గా ఈ ప్రయాణం ఏంతో ముఖ్యమైంది కావచ్చు.కాని, వ్యక్తిగతం గా ఏదో కోల్పోతున్న ఫీలింగ్.అక్కడ సంపాదించేది, ఇక్కడ కోల్పోతున్న దాని కన్నా తక్కువేమో, ఇది నష్టం వచ్చే వ్యాపారమేమో…
చెక్-ఇన్ లో ఎక్కువ బరువున్న బాగేజీ నన్ను వెక్కిరించింది.డు ఐ నీడ్ టు పే ఎనీ తింగ్? అర్ధోక్తిలో అడిగాను. ౨ కిలోలకి ఏమి కదతారులే? జవాబు కూడా అర్దోక్తి లోనే ఇచ్చింది కౌంటర్ లో అమ్మాయి. మొత్తానికి కొంచెం ఎక్కువ బరువున్న ఆవకాయ పచ్చడి పాస్ అయిపొయింది.ఇమ్మిగ్రెషున్ ముందు యౌజర్ చార్జి కౌంటర్. కట్టి మూడేళ్ళు దాటిన విమానాశ్రయం కి ఇప్పుడు ఈ తద్దినము ఏమిటో ఏలిన వారికే తెలియాలి. తెనాలి రామ లింగ సినిమాలో చాకలి రంగడు అన్నట్టు, ఏలినోల్లు చల్లగా చూస్తె ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు, అదీ సంగతి.
కాని ఇక్కడో కొసమెరుపు.ఎయిర్ ఇండియా వాళ్ళు రాత్రి ౧౨:౩౦ కి అఘోరించిన మిస్సేడ్ కాల్ కి ఉత్సాహవంతుడనగు టచే నేను కాల్ బ్యాక్ చేసి ఈ విషయము కనుక్కున్నాను కాబట్టి, తగు పైకము సమర్పించ గలిగితిని.నా వుత్స్తాహవంతులు కాని జనం అక్కడ బిక్క మొహం వేసినారు.౮౫౦ రూప్యంములు తక్కువ రొక్కము కానీ చేతనను, సదరు విమానాశ్రయం వారు చిల్లర దుకాణము వాని వలె డెబిట్/క్రెడిట్ కార్డులు అంగీకరించని కారణమున, ఆ కౌంటరు నందు రాజకీయ సభకు జన సమీకరణ చేసి నట్టు జనం పోగయినారు.నేను కట్టను అని భీష్మించే వాళ్ళు కొందరైతే, బాబ్బాబు ఎంతో కొంత తీస్కోన్డురూ అని బతిమాలేవాళ్ళు కొందరు.గ్రంధి గారి మంత్రాంగం వాళ్ళనేమీ చేసారో మరి.
ఇమ్మిగ్రేషన్ లో ఇంకో చిత్రం. డ్యూటీ దిగిపోయ్యే హడావుడి లో ఉన్న మహాతల్లి, వర్క్ వీసా మీద కొట్టాల్సిన ముద్ర విసిటర్ వీసా మీద కొట్టింది. ఆమె విసిరేసిన తర్వాత పీ.ఎస్.ఎల్.వీ రాకెట్టు వలె నా పైకి దూసుకొస్తున్న పస్స్పోర్టు ను స్లిప్స్ లో రాహుల్ ద్రావిడ్ క్యాచ్ పట్టినట్టు ఒడుపుగా పట్టి, ఆ తప్పు గమనించి కౌంటరు మూసి వడివడి గా వెళ్తున్న ఆమె వెంట బడి అడిగితె అదేమీ కాదు లే, అమెరికా వాళ్ళు చూసే వేస్తారు వాళ్ళకు చెప్పు అని అభయం ఇచ్చింది.
ఎంతైనా వాళ్ళమీద యెంత గురి.డిల్లి నుంచి బిల్లి లు తిరిగే గల్లిల దాక..హతోస్మి.
ఇక విమానాశ్రయం లో తినదగ్గ పదార్దాలున్న ఒకే ఒక పూటకూళ్ళ ఇంట్లో ఒక్కొక్కింటి ధర ౨-౩ డాలర్లు మన కరన్సీ లో మార్చి పెట్టినారు.బైట ౫ రుప్యంములకు దొరికే ఇడ్లి ఇక్కడ దాని సిగదరగ ౨౫ రూపాయలు అయి కూర్చున్నది. ప్రతి విషయం లో అమెరికా ను పోలో మని ఫాలో అయిపొయ్యే మన జనం ఇందులో ఎందుకు కారు. పెద్ద పెద్ద విమానాశ్రయంలలో కూడా కి.ఎఫ్.సి.,మేక దోనల్డు లాంటి వోటేలులు బైట రేట్ లే వసూలు చేస్తాయి. అబ్బే అలాంటి చెడ్డ అలవాట్లు మనకెందుకూ.
సరేలే ఏదొకటి అని సగటు భారతీయ ప్రయనీకుని లా ఆరోజు రాత్రి భోజన కార్యక్రమమును “మమ” అనిపించి,నా టెర్మినల్ దగ్గరకు వచ్చాను.నా పక్క సీట్ లో తెలుగు జంట.చికాగో వెళ్తున్నార్ష.గమ్మత్తేమిటంటే, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్ లో ఉద్యోగి .మూడేళ్ళుగా ఉంటున్నారట.అతను డిపెండెంట్ వీసా.లేచింది మహిళాలోకం.నెత్తికి టవల్ కట్టుకుని అన్న గారు పిండి రుబ్బుతున్న దృశ్యం కాన్పించింది.
మనిషి మనిషి దీ ఒక చరిత్ర అన్నట్టు, ఇక్కడ ఒక్కక్కళ్ళ దీ ఒక్కో కధ.కొడుకులు,కూతుళ్ళ దగ్గరకెళ్ళే పెద్దోళ్ళు,మొగుళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళే పెళ్ళాలు,విద్యార్దులు ఉద్యోగార్దులు ఒక్కరేమిటి రక రకాలు.
౯ కి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మామూలు గానే ౨ గంటలు ఆలీసమైనాది. జనం పిచ్చ పాటి మొదలెట్టినారు.విజయవాడ రంగా రావు ౧౦ ఏళ్ళుగా వేర్మౌంట్ లో స్తిర పడ్డ దరిమిలా,వనస్తలిపురం నుంచి మొదటి సారి అమెరికా వెళ్తున్న వెంకట్ రావు కు అక్కడి డ్రైవింగ్ లైసెన్సు దాని కధ కమామీషు ఊదర గొట్టేస్తున్నాడు.గుడివాడ గుర్నాధం వాళ్ళ అమ్మాయి ని చూసి రావటానికి బైలుదేరాడు.అక్కడ ఆడంగులు మందు సిగరెట్టు ఊదేస్తారషగా..అని నోరు నొక్కుకున్నాడు.బెజావాడ భోగారావు కిష్ణ భగవానుడిలా చిద్విలాసం చేస్తూ, అవన్నీ మామూలే గురూ గారు అంటున్నాడు.
ఈ చిత్రాలు చూసే టప్పటికి అదుగో ఎయిర్ ఇండియా ఫ్లైట్ రానే వచ్చింది.రేపో ఎల్లుండో రిటైర్ అయ్యేవయసున్న ఎయిర్ హోస్తేస్స్ “నమస్కారం” చెప్పి ఆహ్వానించింది.సరే నా సీట్ లో కూర్చున్నాను.విమానం బైలు దేరింది.నా హెడ్ ఫోనులో నుంచి శబ్దం రాక పొయ్యే టప్పటికి ఎయిర్ హోస్తేస్స్ ను పిలి చాను. సరిగ్గా హోల్ లో పెట్టు అదే వస్తుంది. విసురు గా చెప్పి విసా విసా వెళ్లి పోయింది.ముసలావిడ కు చాదస్తం అంటే ఇదే నేమో.నా పక్క సీట్ లో పెద్దాయనకు ఫోను లేదు సీట్ లో ఉండాల్సిన సాకెట్టు లేదు. గొడవ లేని పని.
చూస్తుండ గానే ఢిల్లీ చేరాము.మళ్ళా సెక్యూరిటీ చెక్కు.బ్రతుకు జీవుడా అని రాత్రి ౨:౩౦ గంటలకు చికాగో వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము. మిగతా సంగతులన్ని ఇక్కడ పట్టవు కాని మల్ల చెప్తా..
No comments:
Post a Comment