ఎన్నో రోజులు గా ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నేను ఎప్పుడు ఏ కచ్చేరి కి వెళ్ళింది లేదు. ఇండియా లో ఏదో ఒక పని అడ్డం పడటమో లేక ఆ సరిగమ పదనిసలతో ఎక్కడ చావ కొట్టేస్తారో అన్న భయమో తెలీదు కాని, ఎప్పుడూ ధైర్యం చెయ్యలేదు.
దూరం పెరిగితే మనది మనవాళ్ళు అన్న మమకారం పెరుగుతుందని చెపితే వినడం తప్ప అనుభవైక వేద్యం అవడం ఇప్పుడిప్పుడే మొదలైంది. కే జే ఏసుదాస్ కచ్చేరి ఆ రోజు. మా కోలీగులు అందరు అప్పటికే ఏదో ఒక సంగీత కార్య క్రమానికి వెళ్ళడం ఆ విశేషాలు చెప్పడం తో యెంతో కొంత ఆసక్తి కలిగింది.
ఏడు గంటలకు ప్రారంభం అయిన కార్య క్రమానికి అయిదుకే వెళ్లి కూర్చున్నాం. కొంచెం సాంస్కృతిక కార్య క్రమాలు సాగాక ప్రారంభమైంది ఆ సంగీత ఝరి . ఎక్కడో కేరళ మారుమూల పుట్టిన కట్టాసెరి జోసెఫ్ ఏసుదాస్ ఈ మద్యనే యాభై ఏళ్ళ సంగీత ప్రయాణాన్ని పూర్తీ చేసారు. కర్నాటిక్ సంగీతం లో ఏమి లేక సినిమా సంగీతం లో ఏమి ఆయన పేరు తెలియని వాళ్ళు దక్షిణ భారతం లో లేరంటే అతిశయోక్తి కాదు.
మెల్లగా గణపతి స్తోత్రం తో ప్రారంభించిన గాన మాధుర్యం త్యాగరాజ పంచ రత్నాలలో ఓల లాడించారు. నాకు కర్ణాటిక సంగీతం లో ఏమాత్రం ప్రవేశము లేక పోయినా ఆకలి గొన్న చిన్నారిని తల్లి ఒడిలో తీసుకొని లాలించి బుజ్జగించి ఆకలి తీర్చిన భావం కలిగింది. పిల్లలకు ఆకలి తెలుస్తుంది కాని తమకు ఏమి తినాలో తెలియదు. ఆ భ్రమలో ఏడవటం తప్ప. అది అమ్మకే తెలుస్తుంది, ఆయన పాటలు కూర్చిన విధానము కూడా అట్లే ఉంది.
ఏడు నుంచి తొమ్మిది వరకు రెండు గంటలు ఎలా భరించ గలనా అని మొదట్లో ఆలోచించిన నేను నిజంగానే పాట పాట కు మద్య టైం చూడటం మొదలెట్టాను, ఎప్పుడు అయిపోతుందా అని కాదు అప్పుడే అయిపోతుందా అని. ఆ ప్రవాహం లో అమృత తుల్యమైనా ఆ ఒరవడి లో ఎన్ని గంటలైనా అలాగే వినగలం అనిపించింది.
సంగీతం గొప్పతనం గురుంచి చెప్తూ అది దేవుని చేరటానికి దగ్గర దారి అని మాటల మద్యలో ఏసుదాస్ అన్నారు. నాకు అది కొంచెం ఎక్కువ చేసి చెప్పటం అనుకున్న...కాని అది నిజం అని తెలుసుకున్నా...
పది హేనవ శతాబ్దానికి చెందిన వ్యాస రాయరు రాసిన కృష్ణా నీ బెగనే బారో అని కన్నడ కృతి. ఏసుదాస్ కంఠం లో మృదు మధురం గా పలికింది. కృష్ణుని వేగమే రమ్మని పిలుస్తున్న ఈ పాట చాల సరళము, వాడుక భాషలో రాసింది. కన్నడ రాని వారైనా కొంచెం జాగ్రత్త గా వింటే సులభం గానే అర్ధం అవుతుంది. కృష్ణుని ఆయన అలంకారాలను పొగుడుతూ సాగే ఈ పాట చివరలో భావంలో వేగం లో శిఖరాగ్రాన్ని చేరుతుంది.
అక్కడక్కడా అటు ఇటు తిరుగుతున్నా జనాన్ని చూడకుండా, కళ్ళు మూసుకొని ఆ పాట వింటూ ఒక అవ్యక్త అనుభూతిని పొందాను. నల్లనయ్యా చేతులకు కాళ్ళకు అలంకారాలతో వైజయంతి మాలతో అలరారే కృష్ణా వేగంగా రావయ్యా నీ ముఖార విందాన్ని చూడనివ్వు అని సాగుతూ ఉండే పాట . చివరలో జగదోద్ధారక ఎవరో అనుకునేవు ఓ ఉడిపి శ్రీకృష్ణ స్వామీ వేగంగా రావయ్య.. అంటాడు కవి. ఉన్నట్టుండి తలుక్కున మెరిసింది నా కళ్ళ ముందు ఆ లీలా మానుష విగ్రహం. చేతిలో పిల్లన గ్రోవితో ఒంటి నిండా గంధపు పూతలతో చేతి కడియాలతో నల్లని శ్రీ కృష్ణుని విగ్రహం. ఉన్నట్టుండి ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను. అప్పుడే పాట అయి పోయిందేమో చప్పట్లతో హాలు దద్దరిల్లింది.
నిజమే సంగీతం దేవుని చేరటానికి దగ్గర దారే. కాని దారి చూపే మార్గదర్శిలు ఇటు వంటి కళా కారులు. ఇలాంటి వారి సమయం లో మనము ఉండటం, వారిని మన మద్య చూడటం, మన లాంటి వాళ్ళ అదృష్టమే...
నేను తాగిన ఆ గానామృతం మీకు పంచాలనే చిన్ని ఆశ .