Sunday, July 3, 2011

మేకినా ( meckina) ద్వీపం-అమెరికథలు 5

కళ్ళు తెరిచేసరికి యెర్ర గా వొళ్ళు కాలి పోతుంది. అమ్మా దూరంగా నీళ్ళలో కరుగుతున్నట్టు మా అమ్మ.నన్నెందుకు దూరం గా విసిరేసావు . గొంతు పెగల్లేదు.వడి వడి గా మీద పడుతున్న నీరు. నా శరీరం మాడి పోతుంది. పైకొచ్చిన నీరు నన్ను మా అమ్మను వేరు చేసేసింది.
గాఢ  సుషుప్తి. ఎన్ని ఏళ్ళు గడిచి పోయాయే తెలియదు.ఇక ఎప్పటికీ మా అమ్మ ను మాత్రం చేరుకోలేనని మాత్రం తెలిసింది.అనంత మైన నీరు.దూరంగా నాకై చేతులు చాచి పిలుస్తున్నట్టు ఉన్న  మా అమ్మ.ఈ మద్య నా మీద కొత్త కొత్త గా జీవం పురుడు పోసుకోవడం గమనించాను.నేను మా అమ్మ లా పచ్చదనం పరుచుకున్నాను.చిన్ని చిన్ని ఆకులతో నా తనువును తడిమిన పిల్లల ఆలనా పాలనా చుసుకోవడంతో ఎన్నేళ్ళు కరిగి పోయాయో గుర్తేలేదు.
ఒక వేసవి సాయంత్రం.దూరం నుంచి అరుపులు,కేకలు.తలమీద చిత్ర విచిత్రం గా పక్షి ఈకలు కట్టుకున్న జనం,చిన్న చిన్న పడవల్లో నా దగ్గరకి వస్తున్నారు.పొడవైన కర్రల్లాంటి ఆయుధాలతో వాళ్ళు చేపలు వేటాడుతున్నారు .వేట పూర్తయ్యాక నా దగ్గరకి వచ్చి నాకు పూజలు చేసారు. నాకు చాల సంతోషం వేసింది.ఇన్ని వేల ఏళ్ళ తర్వాత మా అమ్మ దగ్గరి నుంచి వచ్చిన బంధువులు వీళ్ళు.
అలా ప్రతి వేసవి కి వీళ్ళు నా దగ్గరకి వచ్చే వాళ్ళు.మిగత కాలాల్లో మంచు కప్పబడి ఉంటానేమో, నేను మంచి కునుకు తీసే దాన్ని. వాళ్ళు నాకో పేరు కూడా పెట్టారు తెలుసా.మిచి మాకిన  అని. అంటే పెద్ద తాబేలు అని అట. నేను తాబేలు ఆకారం లో ఉంటాను అని వాళ్ళు అనడం విన్నాను . 
ఇంకోన్నేల్లకు తెరచాపలు కట్టుకుని ఉత్తరం నుంచి కొందరు మనుషులు వచ్చారు. వీళ్ళు పోయినసారి వాళ్ళలా లేరు.కొన్నాళ్ళకి అర్ధం అయింది వీళ్ళు వాళ్ళలా అమాయకులు కూడా కారు అని. నా మీద బ్రంహాండమైన కోట కట్టారు. ఇంతకూ ముందు వచ్చిన వాళ్ళని మచ్చిక చేసుకుని, గొప్ప ఉన్ని వ్యాపారం చేసారు. మెయిన్ స్ట్రీట్ అనే వీధి లో చూడాలి ఉదయం నుండి సాయంత్రం వరకు కోట్ల డాలర్ల వ్యాపారం జరిగేది.
ఈ వ్యాపారమేమో కాని, నా మీద ఎన్నో ఇల్లు కట్టి, జనం ఉండటం మొదలెట్టారు. అబ్బ ఇన్ని ఏళ్ళకు నావాళ్ళు అని చెప్పుకునే జనం నాకున్నారు.కాని కాలం యెంత వేగం గా పరిగెత్తుతుందో. ఈ మధ్యలోనే నేను అమెరికా అనే దేశం లో భాగం అయ్యాను. వాళ్ళ సివిల్ వార్ లో ను మరి రెండో ప్రపంచ యుద్ధం లోను నా మీద ఉన్న కోట యుద్దాలకు ఉపయోగ పడింది. ఇంకో విషయం చెప్పడం మరిచాను,సివిల్ వార్ టైం లో నన్ను ఒక జైలు లా కూడా వాడుకున్నారు.
నా మీద గ్రాండ్ హోటల్ అనే పెద్ద హోటల్ ఒకటి కట్టారు. ఎవరైనా ఇక్కడి కొస్తే, అక్కడ హోటల్ లో ఉండకుండా, ఫడ్జ్ మిఠాయి రుచి చూడకుండా ఉండరు. బ్రిటిష్ వాళ్ళు మొదటి సారి కాలు పెట్టిన ప్రదేశం, అమెరికన్లు బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేసిన ప్రాంతం మిమ్మలను ఆ కాలం లోకి తీసుకెళ్తాయి.
మరి నన్ను చూడడానికి వస్తారా..ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, నేను ఒక ౨-౩ వందల ఏళ్ళ క్రితం ఎలా ఉన్నానో అలానే ఉన్నాను. నా మీద కార్లు, మోటార్లు తిరగటం నిషేదించారు. అందుకేనేమో, చాల మంది సైకిల్ ల మీద, జట్కా బండ్ల మీద నా చుట్టూ తిరిగి చూసి వస్తారు.ఇంకా నా దగ్గర ఎన్నో వింతలూ విశేషాలు ఉన్నాయి.షుగర్ లోఫ్ అనే దానంతట అదే ఏర్పడ్డ మట్టి దిబ్బ, డెవిల్స్ కిచెన్, ఆర్చ్ రాక్ లాంటివి ఎన్నో...అలా సంవత్సరాల బట్టి అల్లానే ఉన్నాయి.నన్ను చూడటానికి రావటానికి మే-అక్టోబర్ మంచి సమయం...మరి మీరు ఎప్పుడు వస్తారు నన్ను చూడడానికి...

అప్పుడప్పుడు తెలుగు చదివే మా అన్నయ్య పిల్లల కోసం పై మెకిన కధ...

ఇది కూడా చూడండి : http://www.mackinacisland.org/


No comments:

Post a Comment