అనుకోకుండా ఒక ఆవకాశం...యు ఎస్ వెళ్ళడానికి...౨-౩ వారాల్లో అంతా ఓ కే అయ్యింది. అంతా చేసి ౨ వారాలే టైం ఉంది..హడావుడి గా మా వూరు బయలుదేరాను.. అమ్మను చూసిరావడానికి..ఆమెకు ఇంకా ఈ విషయం తెలీదు. మా అక్కకు చెప్పాను కొంచెం ముందు నుంచే ప్రిపేర్ చెయ్యమని. అమ్మకి నేను వెళ్ళడం ఇష్టం లేదు.అందుకే ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా కొంచెం నా వైపు నుంచి అనుకూలం గా మాట్లాడి కన్విన్సు చెయ్యమని చెప్పాను.ఇంట్లో పరిస్తితి కొంచెం సానుకూలం గానే కనపడింది.
ఆ రోజు దీపావళి. మా అక్క కూతురుదే ఇంట్లో హడావుడి. ఆ వయసులో మనము అంతే నేమో. పొద్దున్నే లేచిన దగ్గర్నుంచి తనకు టపాకాయల ద్యాసే..అవన్నీ చక్కగా పేపర్ మీద పేర్చి, ఎండ లో పెట్టింది. నేను రానను కున్నారేమో మా నాన్న నాకు టపాకాయలు తాలేదు. దానికి అది చేసిన రాద్దాంతం ఇంతా అంతా కాదు. మా నాన్న మల్ల బజారు కెళ్ళి నా కోటా టపాకాయలు తెచ్చేదాకా ఆయన పైన రాజి లేని పోరాటం చేసింది. నేను తనని అడిగాను, ఏమిటే నీ గోల అని..దానికి అది చెప్పిన సమాధానం ఏంటో తెలుసా..మరి నువ్వు నా టపాకాయలన్ని కాల్చేస్తేనో అని.
కొంచెం రెడీ అయ్యి,నేను అలా బజారు దారి పట్టాను..మద్యలో గుడి దగ్గర కొచ్చేటప్పటికి ఒరేయ్ ఎప్పుడొచ్చావ్ అన్న పిలుపు విని వెనక్కు తిరిగి చూసాను. మా డిగ్రీ దోస్తులు ఇద్దరు కనపడ్డారు.
చిన్నగా మా గ్రంధాలయం మెట్ల మీద కూలబడ్దాం. మా డిగ్రీ దోస్తుల గురుంచి వాళ్ళవాళ్ళ ఉద్యోగ సద్యోగాల గురుంచి, పెళ్లి ఐన వాళ్ళ కధాకమామీషు నుంచి పెళ్లి కాని ప్రసాదుల వరకు అన్ని మాట్లాడుకున్నాం. అదుగో ఒంటి గంట ఐంది. మల్లా కలుద్దాం అని భారం గా ఇళ్ళకు బయలుదేరాం.
కలిసి మెలిసి తిరిగిన మేము రకరకాల కారణాల వల్ల వేరైనప్పటికి ఆ రోజులు నెమరు వేసుకుంటే, ఏదో గొప్ప ఫీలింగ్. ఏ బాదర బందీ లేకుండా, కాలేజీ ల దగ్గర్నుంచి,కొత్త సినిమా రిలీజ్ ఐన హాల్స్ వరకు, ట్యూషన్ పాయింట్ల నుండి బాబా గుడి వరకు అంతా మాదే హల్చల్. ఎన్నో తీపి గుర్తులు జ్ఞాపకాలు.అందరితో కలిసున్నా, మా తొట్టి గ్యాంగ్ లో ౬ గురం. బాషా,నేను,బ్రంహం,కరీం,సురేంద్ర,రాంబాబు. మా స్నేహానికి మొదటి మెట్టు ట్యూషన్ పాయింట్. చివరి వరసలో మాకు చాల స్వతంత్రం ఉండేది. పంతులు గారిపై సెటైర్లు వెయ్యడం మొదలు, పక్క వరసలో అమ్మాయిల మీద కామెంట్ల దాక వెనక వరస వాళ్ళదే ముందడుగు. అలా అని కోతి గుంపు అని జమ కట్టేయ్యకండి. మేము రొజూ పోటీలు పడి చదివే వాళ్ళం. కాలం తో పాటు మా స్నేహం మరింత దృడ పడింది.
ఫైనల్ ఇయర్ లో మాకు ఇంకా మంచి పోటి ఏర్పడింది..అయినా అది కేవలం చదువుల వరకే పరిమితం. బ్రంహం కి జ్వరం వస్తే వాడి నోట్స్ రాసి పెట్టడం, ౪ ఏళ్ళ నుంచి బాష లైన్ వేస్తున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వటానికి తోడూ వెళ్ళడం, తర్వాత రోజు వాళ్ళ అన్న మమ్మల్ను వెతుక్కుంటూ వస్తే, పక్క వీది లోనుంచి శివ సినిమాలో సైకిల్ చేజ్ లాగ బైట పడటం అన్ని గుర్తొచ్చాయి.ఆ జ్ఞాపకాలు గురుతులు నన్ను పలకరించాయి
ఆనాటి ఆ స్నేహమానంద గీతం అని పాడాలని పించింది. సరే అల్లాగే ఇల్లు చేరాను.మా ఇంటి ముందు అప్పుడే ఆగిన ఆటో నుంచి దిగిన పర్సనాలిటీని చూసి ఉబ్బి తబ్బిబ్బైనాను. మధు. మా మేనత్త కొడుకు. వాళ్ళు మా వూరు నుంచి ౨౫౦ కి.మీ. దూరం లో ఉంటారు.తను వ్రుత్తి రీత్యా బళ్ళారి లో ఉంటాడు. తన వైఫ్ ఇక్కడే ఉద్యోగం చేస్తుండటం తో పండగకు పబ్బానికి తనకు తప్పని ప్రయాణాలు..తనకు నేను మా వూరు వస్తున్నట్టు తెలుసు..కాని తనకు కుదరదని చెప్పాడు .వాడికి ఇద్దరు పిల్లలు.. పెద్దోడు చాల గోడవేట్టేస్తున్నాడు రా.. ఈ సారి నిన్ను కలవటం కుదరదేమో...వాడి గొంతులో ఏదో మూల చిన్న బాధ..పర్లేదు లేరా..మల్లా కలుద్దాం..అయినా ఫోన్ లో రోజు మాట్లాడుకుంటాం కదా..పెద్ద ఆరిందా లాగా నా ఓదార్పు. నన్ను చూడగానే అన్నాడు, మల్లా ఎన్నాళ్ళకు చూస్తానో అని వచ్చేసాను రా..అని.
నేను చాల ఆనంద పడ్డాను.నేను జీవితం లో ఏదైనా దాచకుండా చెప్పానంటే అది వాడికే. వాడు ఇంకా ఒక అడుగు మున్డుకేసాడు.ఇంట్లో ప్రతి చిన్న పెద్ద విషయం నాతొ చెప్పుకొని స్వాంతన పొందటం నాకు తెలుసు.మా స్నేహం మాకు ఊహ తెలిసినప్పటిది. నాకు మొదటి స్నేహితుడు వాడు...
వాళ్ల పిల్లల చదువులు ఆరోగ్యాలు,వాడి ఉద్యోగం ముచట్లు అన్ని తెలుసుకుంటూ భోంచేసాము.
రాత్రి కుదుపుల ప్రయాణం మమ్మల్ని చక్కగా నిద్ర పుచ్చింది.వాడిని బస్సు స్టాండ్ లో వదిలి రావటానికి బైలు దేరాను.కేవలం నన్ను చూడ్డానికే కుటుంబం తో పండగ సంబరాలను వదులుకొని వచ్చిన వాడికి నేనేమివ్వగలను...స్వచ్చమైన స్నేహం తప్ప.వాడితో కొంచెం సమయం గడపటం తప్ప. చిన్నగా నడవటం ప్రారంభించాం.అది కూడా వాడితో ఇంకొంచెం సేపు గడపాలని చిన్న ఆస వల్ల. మా ఇద్దరికీ మా వూరు తో ఎన్నో జ్ఞాపకాలు..ప్రతి వీది ప్రతి మలుపు ఏదో ఒక ఊహను తట్టి లేపుతాయి.అది ఇదీ మాట్లాడుకుంటూ మొత్తానికి బస్సు స్టాప్ చేరాము.
వాడికి ౪ గంటల బస్సు. అది దాటితే మల్లా ఇంకో గంట దాక బస్సు లేదు. ౩:౪౫ కి బస్సు స్టాండ్ చేరాము. కరెంటు బూకింగ్ లో టికెట్ తీస్కోని ప్లాట్ ఫారం మీద కొచ్చాము. మా మాటలు సమయా భావం చూసుకోలేదు. కాసేపటికి అర్ధం అయ్యింది, మేము మాట్లాడే విషయాల వెనుక కేవలం వాడితో ఇంకా సేపు గడపాలనే ఉద్దేశ్యమే ఉందని.ఒక వైపు వాడికి ఆలస్యం అవుతుందని తెలుస్తున్నా నేను ఆసక్తుడనయ్యాను.ఇంకో అర్ద గంట గడిచింది. అప్పుడే వెళ్తావా నేస్తం, మల్లా ఎప్పుడు కనపడతావో,నీ మాటలు వినే అదృష్టం నీతో గడిపే ఆ కాస్త సమయం మల్లా ఎప్పుడు దొరుకుతుందో..ఇదే భావం ఇద్దరిలో...నేనే ఆ ప్రవాహాన్ని ఆపాను.నాకు తెలుసు, తన వైఫ్ పిల్లలు తన గురుంచి ఎదురు చూస్తారని. సరే మరి ఉంటా అన్నానే కాని వాడి మొహం లో దోబూచులాడిన భావం నన్నిక మాట్లడనీయ లేదు. వాడు వెంటనే సర్దుకున్నాడు. నాకని పించింది..నా మొహం లో కూడా అదే ఫీలింగ్ ఏమో..బస్సు వైపు భారం గా కదిలాడు. టాటా చెప్తు చెయ్యి పైకెత్తాను. ఆలాగే సగం లో ఆగిపోయింది.
మృతిలోన ముగిసినా చితి లో న రగిలినా కడతేరి పోనిదీ మధురాను బంధం
ఎద వీది పోనిది మమతాను రాగం...
ఎప్పుడో విన్న చిన్న కవిత చెవుల్లో మారు మోగింది...
No comments:
Post a Comment