Thursday, July 21, 2011

క్యో కి సాస్ భి కభి టొమాటో తీ.....

కెవ్వ్...వంటిట్లో వినపడ్డ కేక విని, ఏం తగలడి పోయిందో అని పరిగెట్టా. మేడం టుస్సాడ్ బొమ్మలా మా ఆవిడ  నిలబడి ఉంది. చేతిలో అట్ల కర్ర తో రుద్రమ దేవి కత్తి  పట్టినట్టు.ఏమైంది కంగారు గా అడిగాను. నా సీరియల్ టైం అయింది. గబా గబా హాల్ లోకి పరిగెత్తింది.ఓహ్ అదా...కొంచెం ఊపిరి పీల్చుకున్నా. మా చుట్టు పక్కల పది కొంపల్లో ఏ మిస్సెస్సు  మిస్ కాని మెగా డైలీ  సీరియల్. క్యో కి సాస్ భి కభి టొమాటో తీ...ప్రారంభం అయింది.పదివేల ఎనిమిది వందల తొంభై వోక్కవ భాగం.
నిన్నటి కధ అనుకుంటాను, మల్లా చూపిస్తున్నాడు.అదుగో హీరోయిన్.నేను చుసిన నూట నాలుగో భాగం కన్నా కొంచెం వొళ్ళు చేసింది. ఎవరో అపరిచిత ( నా వరకు నాకు) వ్యక్తి తో ఈ మద్య సూపర్ డుపేర్ హిట్ అయిన మృగ వీర సినిమా పాట బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంటే, నిత్యానంద కపాల మోక్షం సారీ సారీ కుండలిని కిక్ యోగ లో ఊగి పోయినట్టు గా ఊగి పోతూ డాన్సు లాటిది చేస్తుంది. ఎవడీడు?అడిగాను. హీరో అంది తల తిప్పకుండానే. మరి పోయిన సారి నేను చూసి నప్పుడు వేరే వాడు ఉన్నాడే? 
వీడు వాడి మేనత్త పేద బావ చిన్నక ముత్తవ్వ మేన మామ గారి వేలువిడిచిన కాళ్ళు తడిచిన...ఆపూ...అదేదో సినిమా లో అరిచినట్టు అరచాను. మరి పోయిన సారి ఇదే యాక్టర్ హీరోయిన్ పాత్ర లో...నా మట్టి బుర్రకి ఇవన్ని అర్ధం అయితే రోజుకి నాలుగు సీరియల్లు సూసేసే వాడిని కదా. సరేలే ...ఇన్ని వేల భాగాల తర్వాత కధ లో ఈ మాత్రం మలుపులు లేకుంటే ఏం బావుంటుంది.అయినా, ఆవిడ పర్సనల్ గొడవలు మనకెందుకు..మేనర్స్ లేకుండా..
నిన్నటి భాగం పూర్తయింది.వాణిజ్య ప్రకటనలు." నేడే ఆఖరి రోజు" గొప్ప తగ్గింపు ధరలతో,నీది బోడి ఖర్మే  సీరియల్ లో హీరోయిన్ సుబ్బ శ్రీ కట్టిన  చీర. పది కొంటె ఒకటి ఫ్రీ.ఒక్కో చీర పది వేలు మాత్రమె.నేడే వచ్చేయండి.పొమ్మనా బ్రదర్స్ .కుక్కట పల్లి,హైదరాబాద్.
కొంచెం డిన్నర్ కానిద్దూ.నా మాట విని మా ఆవిడా ఉల్లి రేకులు సీరియల్ లో తమిళ మామి తిప్పి  నట్టు నాలుగు సార్లు తల తిప్పింది.సౌండే రాలేదనుకోండి.ఎన్నడా..అని ఏదో అంటున్దనుకున్నా..కాని అన్నీ టేబుల్ మీదే ఉన్నాయి మీరు కానివ్వండి అని మళ్ళా సౌందర్య కిరి కిరి అనే షాంపూ ప్రకటన లో మునిగి పోయింది. ఆ రోజు ఉండే సంబడవే గా..
ఫ్రిజ్ లోంచి కొంచెం డామ్బారు ( మీ ఇంట్లో మా గంటె అనే కార్యక్రమం లో చూపించబడి మా ఆవిడ చే వండ బడ్డ ద్రవ పదార్దం.) తీస్కోని టేబుల్ దగ్గర కూల బడ్డాను. మొదటి ముద్దా నోట్లో పెట్టుకున్నానో లేదో తలుపు దబ దబా బాడిన శబ్దం విని తలుపు తీశాను.పై పోర్షన్ పిన్ని గారు.పాపం ఏమైందో ఏమో కొంగు నోట్లో పెట్టుకుని ఏడుపు ఆపు కోవడానికి ప్రయత్నిస్తుంది.ఏమైందన్ నా నోట్లో మాటలు బైటి కోచ్చాయో లేదో...నన్ను తోసుకుని లోనికి పరిగెత్తింది అమ్మి అంతా అయిపోయిందే అంటూ.ఏమైందో ఏమో అనుకుంటూ..నేను హాల్ లోకి పరిగెట్టాను...
అదేనే అమ్మాయి, అనుకున్నదంతా అయి పోయిందే  తల్లి...ఆ ముడనస్తపు సచ్చినోడు బంగారం లాటి  పిల్ల ని పొట్టన పెట్టుకున్నాడే...మా అపార్ట్మెంట్ వాచ్ మాన్ మంచి మందు గాడు.అవకూడని దేమైనా అయ్యిందేమో అని నోరు తెరిచే లోగా మా ఆవిడ మొదలెట్టింది.కళ్ళలో నీళ్ళు కుక్కుకుంటూ..ఎలా చంపాడు అయ్యో అలా జరిగిందా..నా బీ పీ డబల్ సెంచరీ దగ్గర పడింది. ఏమోనమ్మ..ఈ రోజు మొత్తం చూపించలేదు. ఆ పిల్ల నాన్న వచ్చి ఇంట్లో వెతుకు తున్నాడు. అమ్మాయి అమ్మాయి అని అరుచుకుంటూ.మద్యలో ఆపేసాడు, చింపనా బ్రదర్స్ ప్రకటన తో...నాకిప్పుడు అర్ధం అయింది.
జూ టీవి లో వచ్చే ఒక నాన్న వంద కూతుళ్ళు కొత్త ఎపిసోడ్ గురుంచి చెప్తుందని. జై మనీ టీవి లో ఈ సీరియల్ వచ్చే టప్పుడు ఆ చానెల్ లో అది తగలడుతుందన్న మాట. ఇరు దేశాలు ఒప్పందాల మీద సంతకాలు చేసుకుని మార్చు కున్నాట్టు, పిన్ని గారు మా ఆవిడ అ రోజు స్టొరీ ఆ రోజు  ఇచ్చి పుచ్చు కున్టారన్న మాట.మా ఆవిడ తేల్చేసింది, ఆ ఇదేమన్న కొత్త..పదహారు వందల యాభై ఎపిసోడ్ లోను ఇంతే, ఆ పిల్ల ఏ కూరగాయలకో వెల్లుంటుంది.మరి అన్నీ తెలిసి ఇక చూడటం ఎందుకో..
సరే అమ్మి, ఈ రోజు హీరోయిన్ ఎల్లాంటి చీర కట్టిన్దనుకున్నావ్.తప్పకుండ కంచి పట్టే ననుకో.దాని బోర్డరు,మద్యలో హ్యాండ్ వర్క్ అదిరి పోయాయే..నీకేలాగు మంచి పట్టు చీర లేదన్నావు, ఈ వారం వెల్దామేవిటి...మీ బాబాయ్ గార్ని తోడూ తీస్కుని...పొతే పోనిద్దూ చూసి వూర్కొక ఇదొకటా మళ్ళా...
లేదులే పిన్ని...బతికించింది అనుకున్నా...నిన్న మీ టీవి లో అడిగితె ఇచ్చిన గొలుసు  లో  హీరోయిన్ వేస్కున్న జుంకాలు చాల బావున్నాయ్.ఈ వీకెండ్ షాపింగ్ కెల్దామా, ఏ షాప్ లో దొరుకుతాయో..ఏమో...ఈ వీకెండ్ నాకు జ్వరం వస్తుందని ఇప్పుడే అనిపించింది.ఇదీ వరస..
సరేలే నాకెందుకు అని...నా డామ్బారు ఆస్వాదిస్తూ భోన్చేసాను.నేను హాల్ లోకి వెళ్ళేటప్పటికి కొంచెం ప్రశాంతం గా ఉంది వాతావరణం.సీరియల్ కి సీరియల్ కి మద్య వచ్చే ప్రకటన లాగ.నిజమే..నీ జన్మ కి నేనే సీరియల్ ప్రారంభం.ఇక్కడ టైటిల్స్ వచ్చే టైం కి సోనీ ఛానల్ లో ఏ రిక్షా క్యా కహనా హాయ్ అనే సీరియల్ వస్తుంది. మా ఆవిడ నాగఫణి శర్మ గారి లా ద్వందావ దానం చేస్తుంది.ఇంకా నయ్యం మా అమ్మగారు కూడా ఉన్నారు కాదు.ఇంట్లో సీత అనసూయ యుద్దమే.( అదేంటి అంటారా, వీళ్ళిద్దరికీ లింక్ లేకపోయినా ఇద్దరు ఆడాళ్ళు సీరియల్ చూస్తుంటే తన్నుకోక చస్తార మీ భ్రాంతి కాని.ఒకావిడ పేడ పందిరి అంటే ఇంకొకావిడ వివాహ బొందము అంటుంది ).
సరే సడి చేయకో ఎసి  సడి చేయబోకే, మీ టీవీ లో  రాణి సీరియల్ చూసేనే..అని పాడుకుంటూ, నా లాప్ టాప్ పట్టుకుని, నా పనిలో నేను పడి పోయాను.
తెలుగు నాట లక్షలాది ఇళ్ళలో ఈ సీరియల్ వాచింగ్ అనే సాంఘీక దురాచారానికి బలి అయిపోతున్న మగ వాళ్ళకు అశ్రు నయనాలతో.. :)
కొంచెం ఎక్కువైందా...అయిన నువ్వు చెప్పేది ఏంటోయ్ మా ఇంట్లో రోజు ఉండే తంతే ఇది అంటారా..

2 comments:

  1. అయ్యబాబోయ్ ఈ సీరియల్ ఇంకా కొనసా.....గుతోందా? అప్పుడెప్పుడొ స్వదేశీ బహూ అంటూ స్మృతీ ఇరానీకి ని భాజపా వాళ్ళు టికెట్టిచ్చినప్పుడు మొదటిసారిగా దీనిగురించి విన్నాను. ఇప్పటికీ ఆవిడ ఈ సీరియల్లో నటిస్తున్నారా?

    ReplyDelete
  2. title ki bavuntundani vada..inka vastundo ledo teleedu..ika smruti sangati..pedda parichayam ledu

    ReplyDelete