Thursday, August 18, 2011

అన్నా నీ పోరాటం లో నేను హాజరే....


అన్నా హజారే...

ప్రపంచ మీడియా లో మార్మోగిపోతున్న హాట్ టాపిక్. దశాబ్దాలుగా అవినీతిలో మగ్గి పోతున్న సగటు భారతీయుని  ప్రతిరూపం.ఆర్.కే.లక్ష్మన్ కామన్ మాన్. ఆయన ఉపవాసం చేస్తానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ భయం తో భోజనం మానేసింది. చేష్టలుడిగి తిక్క పనులు చేసి ఛీ అనిపించుకుంది. పెద్దాయన అంటే పెరుగన్నం అంతా తినేసాడని మన గొప్ప ప్రధాని గారు  సి.వీ.రామన్ క్రికెట్ ప్లేయర్ అని, అర్మాన్ హుష్మి ఆస్ట్రోనాట్ అన్నట్టు ఏవోవో గందర గోల ప్రకటనలు చేసి ఆహా ఈయన కు నిజం గానే వయసు అయిపొయింది,ఇంకా ఇంటికెళ్ళి విశ్రాంతి తీస్కో వచ్చు అని పించుకున్నత పని చేసారు.

ఆంగ్లం లో ఈ పార్టీ పేరు అవినీతి రెండు ఒకే అక్షరం తో ప్రారంభం కావటం యాదృచ్చికం కాదు. మొత్తం పటాలం అంతా ఇప్పుడు అన్నా వెంట పడ్డారు.అవును మరి, నిజం గానే జన లోక్ పాల్ బిల్లైతే కేంద్ర కాబినెట్ లో ఎవ్వరు మిగలరని అంటే అతిశయోక్తి కాదు.అందరూ తీహారు దారి పట్టాల్సిందే. అందుకే, పిచ్చి కుక్క కరిసినట్టు ఒకరు ఈ పోరాటం వెనక అమెరికా హస్తం ఉందంటే ఇంకొకరు అంతరిక్ష వాసులే ఏదో చేస్తున్నారని వాపోతున్నారు.

నిజం చెప్పాలంటే ఎన్నికలప్పుడు ఏదో హడావుడి చేసి డబ్బు మందు ప్రవహిప చేసి గద్దెనెక్కే రాజకీయులకి, జనం నాడి ఎప్పుడు తెలియదు. అందుకే ఎలాగోలా ఈ ఉద్యమాన్ని అణచాలని చెత్త కూతలు కూసిన వాళ్ళు నేడు ఆయన కు లభిస్తున్న ప్రజాభిమానం చూసి తోక ముడుస్తున్నారు.

మరి అన్నాకు లభిస్తున్న మద్దత్తు. దీనికి ఆయన మచ్చ లేని వ్యక్తిత్వం ఒక కారణం ఐతే, ఈ కుళ్ళిన వ్యవస్థతో ముక్కు మూసుకు బతుకుతున్న జనం ఓర్పు కోల్పోవడం మరో  పెద్ద కారణం. ఇంట్లో నుంచి బైట పడ్డప్పడి నుంచి మళ్ళీ ఇల్లు చేరేవరకు ట్రాఫ్ఫిక్ పోలీసు  నుంచి ప్రభుత్వ ఆఫీసులలో అల్లావుద్దీన్ దీపం లోంచి వచ్చిన భూతం ఇంతింతై అన్నట్టు అడుగడుడున రాజ్యమేలుతున్న అవినీతి, జనం చీదరకు కారణం.ఎన్నేళ్ళు గడచినా దేశం అభివృద్ధి అలా వుంచి ఈ పరాన్న భుక్కులు స్విస్స్ బ్యాంకులలో దాచిన జనం సొమ్ము ఎన్ని రెట్లు పెరిగిందో లెక్కేలేదు. జాన బెత్తె లేని దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనం సాపాటు ఎటులేదు అని కొన్నేళ్ళు, ఎదగ డానికెన్దుకురా తొందరా అని పాడేసుకుంటూ ఎన్నో తరాలు గడిపేస్తున్నాం. మరి ఎన్నాళ్ళిలా జనం అయ్యవాల్లకు దండం పెట్టు అని బ్రతుకుతారు చెప్పండి.

ఇక ఇంటి కొస్తే ప్రతి న్యూస్ ఛానల్ లోను మనోల్ల గొప్ప పనులే. నిజం చెప్పాలంటే భారత దేశం యెంత అభ్రివ్రుద్ది చెందిందంటే, ఎనభై లక్షలతో ప్రారంభమైన మొదటి కుంభకోణం యాభై ఏళ్ళలో లక్షల కోట్లు దాటింది. ఇక్కడ మన దేశం ఎన్నో దేశాలని అధిగమించింది.

ఈ సంఘటనకు ఇంకో కోణం ఉంది. అదే మన వ్యవస్థ గొప్పతనం. శాంతి యుతం గా ఆందోళన పోరాటం చేసే హక్కు మనకు మన రాజ్యాంగం కల్పించింది. ఈ వ్యవస్థలో ఒక సామాన్య మానవుడు ప్రభుత్వాన్నే వూపెస్తున్నడంటే ఆ గొప్పతనం నిజం గా ఆ వ్యవస్థదే. ఈ హక్కును ఏ  ప్రభుత్వం మన నుంచి లాక్కోలేదు.మరి ఇలాంటి గొప్ప వ్యవస్తను ప్రతి ఐదేళ్లకు మనం అపహాస్యం చేస్తున్నాం. మందుకో, డబ్బు కో, కులం పేరుతోనో మతం మత్తు లోనో వేసే వోటు తో మనమే దీనికి తూట్లు పోడుస్తున్నాం.

ఇవన్ని సరిదిద్దు కోవడానికి మొదటి అడుగు...అన్నా ఆందోళన. ఇలాంటి ఆవకాశం చారిత్రాత్మకం.సద్వినియోగం చేసుకుంటే భారత చరిత్ర లోనూతన అద్యాయమే.అందుకే అన్నా నీ పోరాటం లో నేను హాజరే....


1 comment:

  1. Rightly said. anna nenu sitam nee porataniki maddatu palikutunna...

    ReplyDelete