మరో వారాంతం.మరో సుదూర ప్రయాణం .ఈ దేశం లో విశాలమైన రోడ్లు.ఒక్కోసారి ఇండియా లో ఇలాంటి రోడ్లు ఎప్పటికైనా వస్తాయా అనిపిస్తుంది.యాబై అరవై ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ ఈ రోడ్లు ఈ దేశపు రవాణా అవసరాలను ఎప్పటికీ తీర్చేసాయేమో. ఈ రోడ్లు రవాణా అవసరాలతో పాటు,మిమ్మల్ని ప్రతి వీకెండ్ అలా లాంగ్ డ్రైవ్ కెల్ల మని ప్రోత్చాహిస్తాయి.౧౨౦-౧౩౦ మైళ్ళ వేగం లో కూడా ఏమాత్రం గతుకులు లేని రోడ్డు ప్రయానికి చాల సౌకర్యం గా ఉంటుంది.కాని గంట గంటన్నర తర్వాత ప్రయాణం విసుగని పిస్తుంది. అల్లాగే సుదూరం గా కొనసాగే రోడ్డు, పక్కనే దరీదాపు లేకుండా సాగే చెట్లు బిల్డింగులు.ఇండియాలో లా కొన్ని మైల్లకే రక రకాలు గా మారి పోయే ఇళ్ళ నిర్మాణ రీతులు ఇక్కడ కనిపించవు.అన్ని ఇల్లూ,భవన నిర్మాణాలు ఒకేలా ఉంటాయి.వాతావరణ పరిస్తితులు ఒక కారణమైతే, మరే ఆచార వ్యవహారాలను మ్యుజియం లకే పరిమితం చేసే వలస సంస్కృతీ ఇంకో కారణం కావచ్చు.
మా మొదటి మజిలి ఇస్కాన్ టెంపుల్ అఫ్ గోల్డ్.ఇస్కాన్ భావజాల ప్రచారకులు ప్రభు పాద కోసం అమెరికా లో ఆయన నివాసం కోసం ఆయన మొదటి భక్తులు నిర్మించిన భవనం.ముప్పై నలభై ఏళ్ళ క్రితం నిర్మించ బడ్డ ఈ భవనం వారి ఆనాటి శ్రమకు మిగిలిన అవశేషం.గుమ్మటాల పైన కట్టడం లోపలా బంగారు పూతలు అత్యవసరంగా మరమ్మత్తుల అవసరాన్ని చూడగానే చెబుతాయి.ఈ రోజు మా గైడ్ చైతన్యానంద భగవాన్.ఆయన లోపల ఉన్న ప్రతి వస్తువును దాని ప్రత్యేకతను వర్ణించి చెప్పారు.భారత దేశం నుంచి వచ్చిన ఒక సాదువు ఇక్కడి వారిపైన వేసిన తనదైన ముద్ర ను ఈ అమెరికన్ ను చూస్తే తెలుస్తుంది.ఆయన దృక్పదం లో వస్తు ప్రధాన మైన ఈ లోకం లో నిజమైన దేవుని చేరే మార్గాన్ని చూపిన గురువు ప్రభుపాద.కాని నాకో విషయం అర్ధం కాలేదు.ప్రాపంచిక విషయాలలో ఏ మాత్రం రుచి లేని ఒక సాధువు ఈ బంగారపు కట్టడం లో ఉండటం ఏమిటి? ఎక్కడినుంచో వచ్చిన ఒక అనామక భారతీయునికి ఎంతో వ్యయం చేసి ఈ అమెరికన్ భక్తులు తమ స్వహస్త్రాలతో ఈ గొప్ప నిర్మాణం చేయడం ఎందుకు? కానీ ఈ ప్రశ్నలకు నాకు తొందర గానే సమాధానం దొరికింది.
టెంపుల్ అఫ్ గోల్డ్ కు అరమైలు దూరం లో కృష్ణ మందిరం.మేము వెళ్ళేటప్పటికి భాగవతం లోని ఒక ఘట్టం ప్రదర్శిస్తున్నారు.దూర్వాసుడు అర్జునుని ఇంటికి వెళ్తారు.తనతో పాటు తన అరవై వేల శిష్యులను తీసుకొని.కాని వారిని తృప్తి పరచడానికి ఇంట్లో ధాన్యం నిన్డుకున్నాయని గ్రహిస్తారు అర్జున సుభద్రలు.అప్పుడు సుభద్ర కృష్ణున్ని ప్రార్దిస్తుంది.ఈ సంకటం నుంచి బైట పడవెయమని. కృష్ణుడు ప్రత్యక్షమై,తనకు ఆకలి గా ఉన్నదనీ తినడానికి ఏమన్నా తెమ్మని అంటాడు.సుభద్ర పరిస్తితి వివరించి, ఖాళి పాత్రను చూపుతుంది.కృష్ణుడు అడగున ఉన్న ఒక్క బియ్యపు గింజను తిని, తను సంత్రుప్తడనయ్యానని అంటాడు. అదే సమయంలో నదీ స్నానానికి వెళ్ళిన దూర్వాసుడు, అతని శిష్యులు తమ ఆకలి మటుమాయం కావడం గమనిస్తారు.కృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షమై తన భక్తులను తను ఎప్పుడూ కాపాడుతానని వ్యాఖ్యానిస్తాడు.దీనితో ఆ అంకం సమాప్తమై భజన ప్రారంభమవుతుంది.
రామాయణ కాలం లో ఇచ్చిన మాట ప్రకారం, ద్వాపర కాలం లో గోపికా ప్రేమను స్వీకరించిన శ్రీ కృష్ణుని అదే గోపికా భక్తితో ప్రేమించడం ఇస్కాన్ మూల సూత్రాలలో ఒకటి.భజన జరుగుతున్న సమయం లో కొందరు భక్తులు తన్మయత్వం తో నృత్యం చేయటం చూసాను. అందం గా అలంకరించ బడ్డ విగ్రహాలను చూడటానికి దగ్గర గా వెళ్ళాను.ప్రక్కనే రక రకాల వాయిద్యాలు లయ బద్ధముగా వాయిస్తున్న భక్తులు అలౌకిక ఆనందం తో మునిగి పోవటం చూసాను. నృత్యం చేస్తున్న ఒక పూజారి ఉన్నట్టుండి ఎవరో చెప్పినట్టుగా, నన్నూ ఆ నృత్య బృందం లోకి లాగాడు.పది పదిహేను మంది భజనకు తగ్గట్టు, కాళ్ళు కదిలిస్తూ నృత్యం చేస్తున్నారు.ఆ హరే రామ హరే కృష్ణ భజన హోరులో అందమైన రాధా కృష్ణ విగ్రహాలు తప్ప వేరేమి కనపడలేదు.ఇంత మందిలో మేము మాత్రమె అలా నృత్యిస్తున్నామన్న స్పృహ లేదు.హరే రామ హరే కృష్ణ.అదే హోరు అదే జోరు.ఎవరో చూస్తారు ఏమను కుంటారో అన్న సామాన్య మైన బిడియం లేదు.హరే రామ హరే కృష్ణ.యెంత సమయం గడిచిందో తెలియదు.హరే రామ హరే కృష్ణ.ఎవరో పట్టుకు బైటికి లాగితే తప్ప నేను ఆ బృందం నుండి బైట పడలేదు.అప్పుడు గమనించాను అంతసేపు డాన్సు చేయటం వల్ల చెమట తో ముద్దైన నా షర్టు.
భక్తీ మార్గం ఒక ప్రవాహం.ఒక మత్తు.అందులో పడి పోయిన వాళ్లకు ఈ లోకం తో పని లేదు.ఎవరేమనుకున్నా సంభందం లేదు.ప్రభుపాద ఒక సన్యాసి అని ఆయనకు బంగారు మందిరాలతో సంభందం లేదని సంవత్సరాల తరబడి ఆ భవన నిర్మాతలకి స్పురించ లేదంటే దీన్ని ఎలా వివరించగలం. అలా ఒక గొప్ప అనుభవం తో ఆ రోజు ముగిసింది.
హ్మ్ ! బావుందండి .
ReplyDeleteశరత్ గారు, మీరు చెప్పిన విషయం, చెప్పిన విధానం ఆద్యంతం ఆసక్తిగా చదివించాయి. మొదటిసారి మీ బ్లాగు చూడతం.
ReplyDeleteఇస్కాన్ సభ్యత్వం కూడా అందుబాటులో ఉంటుంది. మా బాబు, నేను ఇద్దరం జీవితకాల సభ్యులమే. అక్కడి ప్రశాంత వాతావరణం కట్టిపడేస్తుంది. మరొకపక్క వాతావరణం ఉత్సాహంగానూ ఉంటుంది. సభ్యత్వం ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఇస్కాన్ క్షేత్రానికీ ( వాళ్ళకి ప్రపంచం అంతటా 250 కన్నా ఎక్కువ సంఖ్యలో దేవాలయాలున్నాయి. ) మూడు రోజుల పాటు వెళ్ళవచ్చు. ఏసీ లేని గది, భోజన ప్రసాదం ఉచితం. ఈ మధ్యే మేము మొదటిసారిగా తిరుపతిలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాము. గదులు చాలా బాగున్నాయి. మేము ఏసీ గది తీసుకోవడం వల్ల కొంత డబ్బు తీసుకున్నారు. ఇది లెక్కలోకి రాదని, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మూడు రోజులు ఏసీ లేని గది తీసుకోవచ్చనీ చెప్తే ఆశ్చర్యం అనిపించింది.
మాధురి.
ఇస్కాన్ కృష్ణ దేవాలయాల్లో నేను గమనించిందేమంటే భగవంతునికి నమస్కరిస్తున్నప్పుడుగానీ,కీర్తిస్తున్నప్పుడుగానీ,నర్తిస్తున్నప్పుడుగానీ పాశ్చాత్యుల్లో కనిపిస్తున్న అలౌకిక ఆనందం జన్మతః హిందువులైన మన భారతీయుల్లో కనిపించడం లేదు.
ReplyDelete