అమ్మ పొత్తిళ్ళలో వూయాలలూగిన చిన్నారి.
నాన్న కంటి దీపం.
ఇంటికి ఆశా జ్యోతి.
బోసి నవ్వుల బుజ్జాయి.
నీ చిన్నారి చిట్టి ప్రపంచంలో
అందరూ నీవారే.
పాల బుగ్గల పసిపాపా..
మమ్మల్ని క్షమిస్తావా...
నువ్వనుకున్న లోకం కాదమ్మా ఇది.
ఎత్తుకు లాలించిన వాడే నీ గొంతు నులుముతుంటే
యెంత బాధ పడ్డావో..
నమ్మిన వాడే నీ ఊపిరి తీస్తుంటే
నీకు నచ్చని లోకాన్ని వదిలి వెళ్లి పోయావా..
ఎందుకిలా చేస్తావ్ అని అడిగేందుకు నీకు
మాటలు కూడా రావు కదా...
పచ్చ నోట్లతో కళ్ళు మూసుకుని
డబ్బే శ్వాసించే పిశాచాల మద్య
నువ్వెలా ఉంటావులే..
నీ బోసి నవ్వుల బాల్యం
కరకు రక్కసి చేతులతో
చిదిమేస్తుంటే
వందేళ్ళ జీవితం పది నెలలకే ముగిసి పొతే...
యేమని రాయను..యేమని నన్ను నేను సమాధాన పరచుకోగలను ..
డబ్బు జబ్బు పట్టిన లోకంలో
ఇమడలేక మరో ప్రపంచపు మహోన్నత దారుల
పట్టవా తల్లీ..
( చిన్నారి సాన్వి స్మృతికి అశ్రు నివాళి )