Sunday, July 27, 2014

జనం

నాన్నా...

రైల్వే స్టేషన్లో రైలు కూతకన్న పెద్దగా అరుస్తూ పరిగెడుతున్నాడు ఒక పెద్దాయన. రైలు బయలు దేరింది. ఆయనకు కావాల్సిన వాళ్ళెవరో ట్రైన్ లో ఉన్నట్టున్నారు. నెరిసిన జుట్టు, సోడాబుడ్డి కళ్ళజోడు ఆయన వయసు చెప్పకనే చెప్తున్నాయి ఒక డెబ్బై ఎనభై ఉంటాయని. కాని ఈయన నాన్నా అని పిలుస్తున్నాడంటే ఆ ట్రైన్లో ఉండే ఆయనకెంత వయసుంటుందో...

నాన్నా మళ్ళా అరిచాడాయన. ట్రైన్ కిటికీ లోంచి తొంగి చూసాడు ఒక ఇరవై ఏళ్ళ యువకుడు. ఇప్పుడిప్పుడే మీసాలు గడ్డాలు వస్తున్నట్టున్నాయి.  అయోమయంగా ఆ పరిగెత్తే శాల్తీ ని చూస్తున్నాడు.ఈ వయసులో ఈ ముసలాయనకి డీ డీ ఎల్ జే లో షారుక్ లాగ ఇదేమి రన్నింగ్ ఆనందం. ఓపిక నశించి లేచాడు ఆ యువకుడు. చేయందించి ఆయన్ను లోనికి లాగాడు. ఖాళీ గా ఉన్న సీట్ లో కూలబడి ఆయాసం తీర్చుకున్నాక అడిగాడు ఆ యువకుడు. ఈ వయసులో మీరిలా పరిగెత్తడం ఎంటండి తాతగారు... అతని మాటలు పూర్తవక ముందే జేబులోంచి ఒక ఫోటో బైటకు తీసాడు ఆ  పెద్దాయన.

బాగా నలగి పోయి ఉంది ఆ బ్లాకు అండ్ వైట్ ఫోటో. అతి కష్టం మీద కనబడుతున్నాయ్ అందులో ఆకారాలు.    చూడండి  నాన్నా వగరుస్తూ అన్నాడాయన. మసక మసక గా ఆ ఫోటోలో కనపడుతుంది ఈ కుర్రాడే. కాని బుర్ర మీసాలు, పంచె, పిలక జుట్టూ, పెద్ద బొట్టు. అయోమయం గా చూసాడు ఆ అబ్బాయి. మీరే నాన్నా ... నా చిన్నప్పుడే మీరు అమ్మా    నాగార్జున సాగర్ ;)  పునాదుల్లో పని చేస్తూ మట్టి పెల్ల విరిగి పడటం తో మీరు సబ్బు బిళ్ళ కంట్లో పడటం తో అమ్మ ఒకే నెలలో పోయారు. ఆ పని ఈ పని చేస్కుంటూ ఇంత వాడ్నయ్యాను. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్పాడాయన.

ఇలాంటి సంఘటనలు ఈ కాలం లో చాల జరిగాయి. దాంతో మార్ఫింగ్ చేయించి ఫోటోలు పట్టుకొని మీ నాన్న నేనే మీ అమ్మ నేనే అని డబ్బున్న ముసలాళ్ళ వెనక పడే ప్రభుద్దులు దేశంలో ఎక్కువైయ్యారు. దాంతో ప్రభుత్వం దీనికో ప్రత్యెకము గా నాన్న అమ్మా  శాఖ ను ఏర్పాటు చేసింది. వాళ్ళు ప్రతి కేసును పరిశీలించి పరిసోదించి ప్రతి ఇంటి  వంశ వృక్షం ఆకులు కొమ్మలు వేళ్ళూ గీసే పనిలో పడ్డారు.

ఇంకొంత మంది ప్రబుద్దులు ఇంకొంచెం ముందుకు వెళ్లి మీ పూర్వీకులను వెతికి పెట్టే  ఏజెన్సీలు పెట్టేసారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తే చాలు వాళ్ళు ఇంటర్నెట్లు ఔటర్నెట్లు వెతికి పట్టేస్తారన్న మాట. పెళ్ళిళ్ళు గట్రా  వాళ్ళు ఇలాంటి ఏజెన్సీల వెంట తిరగటం కూడా పరిపాటే. ఆ పెళ్లి కొడుకు/కూతురు వరస కుదరటానికన్న మాట.

కొస మెరుపు : ఈ వ్యవహారం చాల రోజులు నెలలు పట్టడంతో దేశంలో పెళ్ళిళ్ళు ఆగిపోయి జనాభా వృద్ది రేటు 50 శాతం తగ్గిపోయింది. చాల కళ్యాణ మండపాలు వృద్దాశ్రమాలో, నానా అమ్మ పరిచయ వేదికలకిందో మారి పోయాయి.

చట్టం బద్దలు  కాని హెచ్చరిక : పై కధనం పూర్తిగా కల్పితం. ఇదీ, ఇంకొటేదో  ; ) చూసి inspire అయ్యి మీ తాతయ్య అమ్మమ్మ ఫోటోలు పెట్టుకు రోడ్న పడకండి.

Saturday, July 26, 2014

ఇండియా ఈజ్ నాట్ సేఫ్

వాన రాకడ ప్రాణం పోకడ ఎప్పుడు ఖచ్చితంగా చెప్పలేమంటారు. నిజమే... రోజూ మాదిరే స్కూల్ కి బైలుదేరిన పిల్లలు ఇంటికి ఇక రారు అంటే నమ్మశక్యం కాదు.కాని బైటకెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగొచ్చే దాక నమ్మకం లేని ఈ దేశంలో ( కారణాలేమైనా) ఇలాంటి సామెత పుట్టిందంటే పెద్ద ఆశ్చర్య పోవక్కర్లేదు.

ఎకనామిక్స్ లో ఒక మౌలిక సూత్రం ఉంది. ఏ వస్తువైతే ఎక్కువ ఉంటుందో దాని విలువ తక్కువ. అల్లాగే మన దేశం లో జనం ఎక్కువ. రోజుకింత మంది రక రకాల కారణాలతో పోతున్నారు అంటే, పేపర్లో అదో వార్త. మిగతా వార్తల్లాగానే. రేపటికి పాత పడిపోయే జనం మరిచి పోయే  వార్త. బ్రేకింగ్ న్యూస్ అని చావగొట్టే చానళ్ళకు రేపటికి కంపు కొట్టే చద్ది.

ఈ పోస్ట్ కొంచెం నిష్టురం గా ఉండొచ్చు. కాని ఇది నిజం. రోజు పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సుల్లో ఎన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో సర్వ విదితమె. కాలం చెల్లిన బస్సులు నడిపి నాలుగు రాళ్ళు వెనకేసుకునే యాజమాన్యాలు, పచ్చ కామెర్లు కమ్మి వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే ఆర్ టి ఎ ఆఫీ'సురులు', వాయనం ముట్టి చూసి చూడనట్టు పొయ్యే  ప్రబుత్వాలు, చివరగా వీటికి ఓట్లేసి గెలిపించే జనాలు... జరిగిన సంఘటనలో పైవారందరి చేతికి రక్తం అన్టిందనే అంటాను.

అసలు డ్రైవర్ రాకుంటే ట్రాక్టర్ డ్రైవర్ ని పంపారని కొన్ని పేపర్లలో వచ్చిన వార్తలో నిజానిజాలు ఏమైనా, అది నిజమైనా ఆశ్చర్యం లేదు. ఇలాంటి దేదో జరగగానే ఈగల్లా మూగే నాయకులు , వీడోచ్చాడు వాడో రాలేదు అని ఊదరగొట్టే చానళ్ళు, పరిహారం చాలదు అని జబ్బలు కొట్టుకునే వాళ్ళు షరామాములే. ఐనా ఎంత డబ్బులిస్తే ఆ కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చగలం.

మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏమైనా చెయ్యగలమా అనేది ఆలోచించాలి. ఏదో జరిగాక హడావుడి కాకుండా భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చెయ్యాలి. ఈ రోజు ఒక హాస్యాస్పదమైన ప్రకటన చదివాను. ప్రమాణాలు పాటించని స్కూల్ బస్సు డ్రైవర్ల లైసెన్ కేన్సిల్ చేస్తాం అని. అయ్యా ఇంకో చిన్న విషయం. ఇలాంటి దేదో జరిగితే కాని మనం కళ్ళు తెరవమా..ఇన్ని రోజులు ఈ రూల్లు రూళ్ళ పుస్తకంలో బైండు చేసి దాచి పెట్టారా... రోడ్డుమీద బండి నడిపే ప్రతి వాడు డ్రైవర్ ఏ నండి. ఏలిన మగా పెబువులు ఆ అసెంబ్లీ నుంచి బైటికొచ్చి బైట ఉన్న రోడ్డుని పది నిమిషాలు పరికిస్తే మా రాజ ఎంత మంది ద్డ్రైవర్లు రూల్లు పాటిస్తున్నారో తెలుస్తుంది.

మొన్న జరిగిన ఘటన తీవ్రత ను తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు కాని, రోజు మన రోడ్ల మీద జరుగుతున్నా ప్రమాదాలలో నూటికి నూరు  శాతం రూల్స్ పాటించక పోవటం వల్లనే అంటాను. లైసెన్స్ లేని డ్రైవర్లు, ప్రమాణాలు లేని వాహనాలు, ఎక్కడ కాస్త జాగా దొరికితే దూరి పోవ్వడమే డ్రైవింగ్ అనుకునే మేధావులు, అతివేగమే డ్రైవింగ్ అనుకునే తలలేని జనం,ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేసే ట్రాఫిక్ సిబ్బంది. పైన  చెప్పిన వాటిలో ప్రతి ఒక్కటి ప్రమాద కారణమే...

ఇంకో చిన్న వివరణ. జరుగుతున్న ఈ ప్రమాదాలు దైవ ఘటనో, లలాట లిఖితమో, పాత జన్మ రుణ విముక్తో కాదు. పూర్తి  మనవ తప్పిదమే. విఫలమైన వ్యవస్థ దీనావస్తే. మనం ఇలాంటివన్నీ జస్ట్ న్యూస్ అని వదిలేసినంత కాలం, మా కొలీగు ఒకాయన అన్నట్టు " ఇండియా ఈస్ నాట్ సేఫ్"