Tuesday, March 22, 2011

ఒక రోజు...అమెరికతలు-4

రాత్రి ౩ గంటలు.
టక్ టక్ టక్ . బెడ్ రూం తలుపు కొట్టిన శబ్దం. గబుక్కున లేచి కూర్చున్నాను. మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూం తలుపు తీసిన వేసినా, ఈ చెక్క భవంతి లో శబ్దాలు రావటం మామూలే. కాని, తలుపు ఎవరు. ఐన ఈ టైం లో. నాది ఒక బెడ్రూం అపార్ట్మెంట్. ఒకటో అంతస్తులో ఉంది. కింద ఉండే మెయిన్ తలుపు తెలిసిన వాళ్ళు ఓపెన్ చేస్తే కాని కాదు. బైట నుండి లాక్ అయి ఉంటుంది.
ఈ టైం లో..వచ్చే వాళ్ళెవరూ లేరు. అయినా, కింద తలుపు ఎవరు తీసి ఉంటారు. ఎవరు తీసినా, పైన నా అపార్ట్మెంట్ తలుపు తీసుకొని, బెడ్ రూం తలుపు??
టక్ టక్ టక్ మళ్ళా ఇంకో సారి. మెల్లగా లేచి అడుగు లో అడుగు వేసుకుంటూ, తలుపు దగ్గరకు వెళ్లాను. క్నాబ్ తిప్పి తలుపు ఓపెన్ చేసాను. చీకటి. నెలకు ౬౦ డాలర్లు వస్తున్న కరెంట్ బిల్ తప్పించుకోవటానికి ఇంట్లో లైట్ లు అన్ని ఆర్పెయ్యటం గుర్తొచ్చింది, మొదటి సారి నామీద నాకే చిరాకు.
"ఎవరు?" గొంతు పెగల్చుకుని మెల్లగా అడిగాను. ఏమి జవాబు లేదు. ఇంకొచెం ముందుకు వచ్చాను. బెడ్ రూం కి హాల్ కి మద్య ౪ అడుగుల సన్న దారి. ఇంకొంచెం ముందుకు వెళ్తే, హాల్.సోఫా లో తెల్లగా ఏదో. గుండె ఆగి పోయినంత పని అయింది. కొంపదీసి??౨ రోజుల క్రితం చూసిన రింగ్ సినిమా గుర్తొచ్చింది.ఈ ఇంట్లో చేరే టప్పుడు ల్యాండ్ లేడీ అన్న మాటలు గుర్తొచ్చాయ్. ఎనభైఏళ్ళు అయింది ఈ అపార్ట్మెంట్ కట్టి అని. ఇందులో యెంత మంది ఉన్నారో. యెంత మంది పొయ్యారో. ఎవరెవరు ఇంకా ఇక్కడే ?? తలుచుకుంటేనే భయం వేసింది.

'ఎవరది ?' ధైర్యం కూడా గట్టుకుని, పెద్దగా అడిగాను. మల్లా జవాబు లేదు. హాల్ కి పక్కగా బాత్రూం. గోడ పట్టుకుని నడుస్తున్న నాకు, నిన్న క్లీన్ చేస్తూ వదిలేసినా చీపురు దొరికింది. అప్రయత్నం గా అది గట్టి గా పట్టుకుని ముందుకు నడిచాను. కుప్పలా ఉంది ఆ ఆకారం. ఎవరో చిన్న పిల్ల తల వంచుకుని కూర్చున్నట్టు. దాని జుట్టు బాగా పెద్దదేమో, కాళ్ళ వరకు వేలాడు తుంది." ఎవరంటే పలకవే ?" అన్నాను గట్టిగా. చేతి లో చీపురు కొంచెం ధైర్యం ఇచ్చినట్టుంది.
కదలలేదు. చీపురు పైకెత్తి గట్టిగా కొట్టాను. కుప్ప లా ఉన్న ఆకారం ముడుచుకు పోయింది. దగ్గర గా వెళ్లి పట్టుకుని చూసాను. నిన్న స్నానం చేసి ఓపిక లేక నేను పారేసిన, తువ్వాలు అది. ఇండియా నుండి వచ్చే టప్పుడు అమ్మ బాగ్ లో కుక్కిన చీరాల మేడ్.దాని పొడవైన అంచు, దయ్యం జుట్టు లా భయపెట్టింది.
ఉఫ్ఫ్ఫ్.
మరి తలుపు కొట్టింది ఎవరు?? మల్లా ఆ ఆలోచన రాగానే, గుండె జారి పోయింది. మెల్లగా లేచి నిలబడ్డా. మొన్న పక్క స్ట్రీట్ లో జరిగిన రోబెరి గుర్తొచ్చింది. రాత్రి ఎవరో తలుపు కొడితే, కీ హోల్ లోంచి చూడకుండా తలుపు తీసి, రోబెరి తో పాటు మర్డర్ కి అవకాసం ఇచ్చింది ఒకావిడ. మా ఇంట్లో ఇంకా మిగిలింది చిన్న కిచెన్. అక్కడ దొంగలు దాక్కున్నరేమో.

మెల్లగా, అటు నడిచాను. సన్న గా కిటికీ లోంచి పడుతున్న, వీధి లైట్ వెలుతుర్లో ఒక కప్ బోర్డు ఓపెన్ ఉండటం చూసాను. డిష్ వాషేర్ పక్కన. సన్నటి కాలు బైట కు కనపడుతుంది. అదీ సంగతి. దొంగ వాడు అక్కడ దాక్కున్నా డన్నమాట. పొయ్యి మీద ఉన్న కడాయి తీసుకుని, బలం గా విసేరేసాను. ధన్ మని శబ్దం చేస్తూ పగిలింది. నా ట్రాష్ కాన్. అప్పటికి అర్ధం అయ్యింది. ఫుల్ ఐన ట్రాష్ కాన్ కొంచెం బైట కు వచ్చింది కప్ బోర్డు నుంచి.
లైట్ వేసి చూద్దును కదా..కిచెన్ అంతా చిందర వందర. కూరగాయల చెత్తా...రామ రామ ఇవన్ని రేపు క్లీన్ చెయ్యాలన్న మాట.
ఆ లైట్ అలాగే వదిలి మెల్లగా మల్లి బెడ్ రూం లోకి వచ్చాను. తలుపు వేసి పడుకున్నా.
టక్ టక్ టక్ మల్లా అదే చప్పుడు. ఎవరో అదే పని గా తలుపు కొడుతున్నారు. ఆగకుండా , నన్నిలా వదిలి నువ్వెలా పడుకున్నావ్ అన్నట్టు. ఈ రాత్రి నిన్ను వదలను లే అన్నట్టు. గోడకు జారగిల పడి కూచున్నాను. కొంచెం తీసిన కిటికీ లోంచి గాలి వస్తున్నా, నా వొళ్ళంతా చెమట పట్టడం తెలుస్తుంది. ఎవరు?? ఇప్పుడేగా ఇల్లంతా చూసి వచ్చాను.అదేదో సినిమా లో చూపించినట్టు, దేయ్యలేమైనా నాతొ ఆడుకుంటూ ఉన్నాయా ? లేక ఇంకో సినిమా లో చూపించినట్టు అవి నాకేమన్న చెప్పాలను కుంటూ ఉన్నాయా ?? ఈ సారి తలుపు తెరవక పొతే అదే లోపలి కొచ్చి, దాని చొట్టలు పడ్డ మొహం నా మొహం మీద పెట్టి వినపదట్లేదుబే అనదు కదా??
టక్ టక్ టక్
ఏదో ఒకటి చెయ్యాలి. దాన్ని ఆపాలి లోనికి రాకుండా. మొన్ననే కొనుక్కొచ్చిన వార్ద్రోబ్. దాన్ని ఎక్కడికి కావాలన్న జరపోచ్చు. మెల్లగా దాని తలుపుకు జరిపాను. శబ్దం రాకుండా. బైట ఆ దయ్యానికి తెలియ కుండా. దాన్ని తలుపుకు ఆనించ గానే శబ్దం ఆగి పోయింది. ఇందాక కూడా ఇంతే??? అది నాతో ఆడుకుంటుంది.
ఇంకా ఈ రూం లో బరువైనదేమిటి అని వెతికాను. ఇంకేంటి నా మంచమే. సరే...కస్టపడి దాన్ని కూడా వార్డ్ రోబ్ కి ఆనించాను. తలుపునే చూసుకుంటూ, పడుకున్నాను.
శబ్దం ఆగిపోయింది, దానికి ఈ బరువు నెట్టడం కుదర్లేదేమో. పిల్ల దయ్యమేమో.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కాని, కిటికీ లోంచి వచ్చి పడ్డ ఎండ చురుక్కు మనడం తో లేచి కూర్చున్నా. టైం ౧౦.
రాత్రి జరిగిందంతా గుర్తు రావటం తో, మెల్లగా బెడ్ వార్డ్ రోబ్ జరిపాను. శబ్దం లేదు. బోర్ కొట్టి వెళ్లి పోయిందేమో...
గబా గబా రెడీ అయి ఆఫీసు కి వెళ్ళాను. సాయంత్రం తిరిగి వచ్చే టప్పుడు గుర్తొచ్చింది, రాత్రి జరిగిందా దంతా.
అదేంటో రెండు మూడు రోజులు ఏమి జరగలేదు.
మల్లా ఒక వారానికి,
టక్ టక్ టక్ అదే శబ్దం, అదే తలుపు కొట్టిన శబ్దం. అదే టైం లో ఎవరో వచ్చినట్టుంటే, కిటికీ లోంచి బైటకు చూసాను. చల్లని గాలి మొహానికి కొట్టింది.
నా మట్టి బుర్ర కి అప్పుడు అర్ధం అయింది. కిటికీ లోంచి డైరెక్ట్ గా వచ్చే గాలికి మా చెక్క కొంప లో ఉన్న సన్న చెక్క తలుపు కదులుతుంది. ఆ దెబ్బ కి దాని క్నాబ్ లాక్ కదలటం తో, ఆ శబ్దం.
అహో ఆంధ్ర భోజ అని పాట పాడుతూ, హాయి గా తలుపు తీసి పడుకున్నా..


3 comments:

  1. చిన్నతనం లో తెలుగు డిటెక్టివ్ చదివినప్పుడు కలిగిన ఫీల్

    ReplyDelete
  2. రజ్జు సర్ప భ్రాంతి :)

    ReplyDelete
  3. manah branti anaalemi...its all imagination :)

    ReplyDelete