Saturday, December 10, 2011

హ్యాపీ ప్రిన్స్-అమెరికతలు-౧౪

ఒక మహా నగరం. నగరం కూడలి లో ఒక పెద్ద విగ్రహం. ఒకానొక కాలంలో ఆ దేశాన్ని పాలించిన రాజకుమారునిది. జనం మురిపెంగా ఆ విగ్రహాన్ని హ్యాపీ ప్రిన్స్ అని పిలుచుకునే వాళ్ళు. అందుకు అనుగుణం గానే ఆ విగ్రహం ఎంతో అందంగా ఉండేదట.కంచు తో చెయ్యబడ్డ ఆ విగ్రహానికి బంగారు పూతలు పూసారు. కళ్ళు నీలాలు.ఆయన నడుముకు వేళ్ళాడే కత్తి కూడా బంగారమే.దాని పిడికి ఒక కెంపు ఉండేదట. నగరం నది బజారులో ఆ విగ్రహం బంగారు వన్నెలతో కాన్తులీనేది.
ఒక రోజు ఎక్కడనించి వచ్చిందో ఒక చిన్న పిట్ట. ఆ నగర వీధుల్లో గిరికీలు కొట్టింది. తన వాళ్ళంతా దక్షిణ దిక్కుకి పోతున్నారు కాబోలు..అది కూడా అటే బయలు దేరింది. వచ్చేది సీతా కాలం ఏమో, చలి ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. చిన్న పిట్ట చలి నుంచి కాచుకోవటానికి తన రెక్కలను అదే పని గా అల్లార్చుతుంది. సాయంత్రం దాక ఆ వూరి అందాలను చూసిన పిట్ట, తన వాళ్ళనుంచి విడిపోయినట్టు గ్రహించింది. అరె..వీళ్ళంతా చాల దూరం వెళ్లి ఉంటారు..కాని ఏమి చేస్తుంది.చీకటి పడింది. రాత్రి కి ఎక్కడో తలదాచుకోవాలని చూస్తున్న  దానికి, హ్యాపీ ప్రిన్స్ విగ్రహం కనపడింది. ఈ విగ్రహం కాళ్ళ దగ్గర ఈ రాత్రి గడిపెయ్యాలని  అనుకుంది.
హాయిగా కాళ్ళదగ్గర పడుకున్న దానికి ఏదో పెద్ద చినుకు మీద పడ్డట్టు అనిపించింది.తలెత్తి చూస్తుంది కదా,రాకుమారుడి కళ్ళనుండి నీళ్ళు.ఏమైంది రాకుమారా...తన చుట్టూ తిరుగుతూ అడిగింది.
నేను రాజ భవనంలో ఉన్నప్పుడు నా ప్రజలు ఎలా ఉన్నారో నాకు తెలిసేది కాదు. కాని ఇప్పుడు చూస్తే, నా నగరం అంతా విషాదం,ఆకలి, చావు లతో నిండి ఉంది. మరి నా ప్రజలు ఇంత కష్టపడుతుంటే నా కళ్ళలో కన్నీరు తిరగటం లో ఆశ్చర్యం ఏముంది. అదుగో చూడు, ఆ నది వొద్దు అవతల ఒక తల్లి గుడ్డి దీపపు వెలుగు లో ఒక గౌన్ కుడుతుంది. ఆ చీకటి లో సూది గుచుకోవటం వల్ల ఆమె వేళ్ళు గుల్లబారి పోయినాయి. అదే గది లో ఒక మూల ఆమె కుమారుడు జ్వరం తో పడి ఉన్నాడు. వాడు మూడు రోజుల నుండి కమలా పళ్ళు అడుగుతున్నాడు. కాని ఆమె దగ్గర వాడికివ్వటానికి నది నీరు తప్ప వేరేమి లేదు.
ఓ నా చిన్నారి పిట్టా, నా ఖడ్గం నుండి కెంపు తీసుకెళ్ళి వారి కివ్వు. అది వారిని కొన్నాళ్ళైనా సుఖపెడుతుంది. పిట్ట ఆలోచించింది. ఆహా, యెంత మంచి ఆలోచన ఈ రాజకుమారునిది. చటుక్కున అది కెంపు నందుకొని తుర్రున ఎగిరింది. ఊరంతటి ని దాటి నదిని దాటి ఎగిరింది.ఆ ఇంటి కిటికీ లోంచి కెంపు ను జార విడిచింది.
ఆ రాత్రి విగ్రహం కాళ్ళ మద్య వెచ్చగా నిదురించింది.మరుసటి రోజు ఉదయం.పిట్ట తొందరగా లేచింది. తన దక్షిణ ప్రయాణానికి బయలుదేరుతూ రాకుమారునికి ఒక మారు చెప్పేందుకు వెళ్ళింది.ఓ  నా చిన్నారి పిట్టా..నీ ప్రయాణం   సుఖమగుగాక... కాని వెళ్ళే ముందు నాకొక పని  చేసిపెడతావా...అలానే..అంది పిట్ట.
వూరికి ఉత్తరాన ఒక కవి ఉన్నాడు. తను అందమైన కావ్యం రాయ పూనుకొన్నాడు. కాని పేదరికం ఆకలి వల్ల ఏమి చెయ్యలేకున్నాడు. వానికి రోజుల తరబడి ఆహారం  లేదు. రమణీయమైన కావ్య రచన చేసే కవి అలా బాధ పడటం నేను చూడలేకున్నాను.నా కళ్ళు నీలాలు. ఒక కన్ను తీసుకొని తనకివ్వు.
పిట్ట తటపటాయించింది. మరి మీ కళ్ళు. ఇంకొక కన్ను ఉంటుంది కదా మరేం పర్లేదు.పిట్ట అలానే చేసింది. అలా ఆరోజు కూడా పిట్ట ప్రయాణం వాయిదా పడింది.
తర్వాత రోజు రాజకుమారిని విగ్రహం కింద ఒక చిన్నారి కూర్చొని ఏడవటం మొదలు పెట్టింది. రాజు పిట్టను పిలిచాడు.చూడు..ఆ పిల్ల అగ్గిపెట్టెలు అమ్ముతుంది.ఈ రోజు అగ్గిపెట్టెలు అన్ని కాలవలో పడి పోయాయి.ఖాళి చేతులతో ఇంటికి వెళ్తే వాళ్ళ నాన్న అసలే తాగు బోతు. ఆ పిల్లను చంపేస్తాడు.నా రెండో కన్ను కూడా ఆ పిల్ల కు ఇచ్చేద్దు..నీకు పుణ్యం ఉంటుంది.
సరే..విగ్రహం రెండో కన్ను కూడా ఆ పిల్లకు ఇవ్వబడింది.పిట్టకు ఆ రాజకుమారుని మీద యెనలేని ప్రేమ కలిగింది. అయ్యో ఇప్పుడు అతను ఎలా చూస్తాడు..మరి కొన్ని రోజులు అక్కడే ఉండి, నగర విశేషాలన్నీ చెప్పాలని నిర్ణయించుకుంది.
అది చెప్పే బాధలు కస్టాలు విని, రాజు గుండె కదిలింది. తన విగ్రహం మీదున్న బంగారు పూతలను నగరం లో బాధలు  పడే ఒక్కొక్కరికి పంచమని అర్దిస్తాడు.కొన్ని రోజులకు విగ్రహం మీద ఉన్న బంగారం అంతా ఖాళి అయిపోతుంది.విగ్రహం కళా విహీనం అవుతుంది.
ఇలా జరుగుతుండగా, పిట్ట చలికి తాళలేక పోతుంది. మంచు కాలమేమో, దానికి తల దాచుకునే ప్రదేశము కరువవుతుంది. రోజుల తరబడి నగర ప్రయాణంతో తనలో చివరి శక్తీ హరించుకు పోయిందని అర్ధం అవుతుంది.చివరి సారి విగ్రహం తో అది మాట్లాడుతుంది. మిత్రమా..నువ్వు నాకు నా ప్రజలకు ఎంతో సేవ చేసావు..నీ దక్షిణ ప్రయాణమునకు చాలా ఆలస్యం అయింది.బయలు దేరు..తిరుగు ప్రయాణం లో నను మరువకు సుమీ..రాజు అభ్యర్ధించాడు.రాకుమారా, నాలో శక్తి లేదు అంతదూరం వెళ్ళడానికి, నా అంతం సమీపించింది.ఈ తనువు భూమిపై రాలే ముందు చిన్న అభ్యర్ధన. చెప్పు మిత్రమా. చివరి సారి మీ పెదవులు చుంబించాలని కోరిక.
పిట్ట కోరిక తీర్చబడింది. ఆయువు వీడిన దాని శరీరం నిర్జీవమై విగ్రహం పాదాల దగ్గర పడిపోయింది.అదే సమయం లో విగ్రహం లో పెద్ద శబ్దం.దాని గుండె పగిలింది.
నగర పర్యటనకు వచ్చిన ఆ నగర మేయర్, విగ్రహాన్ని చూసాడు.పూర్తిగా కళా విహీనం అయన  దానిని అక్కడనుంచి తొలగించాలని అజ్ఞాపిస్తాడు.అట్లే, విగ్రహం తొలగించ బడుతుంది.కంచు కోసం అది కరగించబడుతుంది.
కాని వారు విగ్రహం గుండెను కరగించలేక పోతారు. ఎన్ని సార్లు కరిగించినా, అదే అట్లే ఉండెను.వారు దానిని రోడ్డు పక్కన పారవేసిరి.యాదృచ్చికమేమో పక్కనే పిట్ట శరీరం పడి ఉండెను.
ఆస్కార్ వైల్డ్ రాసిన ఈ కధ. మానవ లక్షణాలైన దయ,స్నేహం,ప్రేమలను విగ్రహాలకు, పక్షులకు ఆపాదించినా,కధ చదువుతున్నంత సేపు మీకా ఆలోచన రాక పోవడం కధకుని గొప్పతనం.
చిన్నప్పుడు చదివిన ఈ కధ.ఈ రోజు చదివినా, ఎంతో బావుంటుంది.అంతం కొంచెం బాధా కరమైనను, అవ్యాజమైన ప్రేమ,స్నేహం విడిపోని బంధాలన్నీ, అవి ప్రతి పరిస్తితి లో తోడు నిలుస్తాయని అనిపిస్తుంది.ఈ కధకు ఇంత కన్నా గొప్ప అంతం ఉండదేమో అనిపిస్తుంది.

2 comments:

  1. అయ్యో.. ముగింపు వదిలేసారు మాష్టారూ...

    దేవుడు దేవదూతతో భూలోకంనుండి రెండు విలువైన వస్తువులు తీసుకురమ్మని చెబితే, ఆదేవదూత ఆ చనిపోయిన పక్షిదేహాన్నీ, ఆ సీసపు గుండెను తీసుకువస్తుంది. అప్పుడు దేవుడు దేవదూత ఎన్నిక సరైనదిగానేగుర్తించి దేవదూతను మెచ్చుకుంటాడు.

    అలాగే పక్షిప్రేమకధకూడా. ఒక గడ్డిమొక్కను (reed)ను ప్రేమించి అది వలసవెళ్ళకుండా ఆగిపోతుంది. తీరా తెలుసుకొనేసరికి అన్నిపక్షులూ గుంపులుగా వెళ్ళిపోయుంటయి. ఇదొక్కటిమిగిలిపోతుంది.

    కధలో చాలా అర్ధాలు వెదుక్కోవచ్చు. ఒక్కొక్కపాత్రనీ ఒక్కోదానితో అన్వయించుకోవచ్చు. గుర్తుచేసినందుకు ధన్యవాదములు.

    ReplyDelete
  2. మీరు ముగించారు కదా..:) నేను కావాలనే ఒదిలేసాను. కధలో చర్చించ బడ్డ భావాలకు ఇంకా దైవత్వం ఆపాదించవలసిన అవసరం లేదనిపించింది.

    ReplyDelete