Saturday, December 15, 2012

ఈత రాని వాడివని..అమెరికతలు 22

ధబేల్ ...

యీత కొలనులో నేను వెల్లకిల్లా పడ్డ శబ్దం. చలి కాలం మొదలైన తర్వాత ఇండియా లో ధరల్లాగా అవిశ్రాంతంగా పెరిగి పోతున్న నా శరీర బరువు  తగ్గించుకునే యత్నం  లో మొదలైన వ్యాయామం అనే ప్రహసనంలో ఇదో ఘట్టం.

ఎప్పుడు ఉండే ట్రేడ్ మిల్ లాంటి విసుగెత్తించే పరికరాలతో మొహం మొత్తి , ఈ సారి ఈత మొదలు పెడతాము అని నిశ్చయించుకున్నాం. ఇంతవరకు బానే ఉంది.ఎన్నికల వాగ్దానం వలెనె. కాని, ఇక్కడే మొదలైంది అసలు చిక్కంతా. మా ట్రూప్ లో ఐదుగురు సూపర్ హీరోలకు ఈత వచ్చింది అంతంత మాత్రమే. ఇంతకూ ముందే కెనడా లో నేనేదో ఒకటిన్నర ఏళ్ళు ఈత వెలగ బెట్టి వచ్చాను అని ఇప్పటిదాకా అందరికి ఈస్ట్ మాన్ కలర్లో కధలు చెప్పటము చేతను, అందరిలో కొంచెం నీళ్ళలో కాళ్ళు చేతులు ఆడించగలను అనే వెధవ  నమ్మకం వల్లను , నేనే మా ట్రూప్ మొత్తానికి ఈత నేర్పించే భాద్యత నెత్తి కెత్తుకొ వాల్సి వచ్చింది.

ఆరంభ సూరత్వము వల్ల అందరం పక్కనే ఉన్న స్పోర్ట్స్ షాప్ లో స్విమ్మింగ్ గేర్ కోనేసాము. అప్పటికే నెలకు ముప్పయి తొమ్మిది డాలర్లు జిం కి ధారపోసి, దాన్ని యాభై అయిదుతో హెచ్చించి, మనసులో నాకు నాలుగు అక్షింతలు వేసిన ఇండియా నుంచి మొన్ననే దిగుమతి ఐన మా కొత్త సహద్యోగి రమేష్  అబ్బే నాకొద్దులే అనేసాడు.

ఇకా ఆ శుభదినం రానే వచ్చింది. మొదటి రోజు కదా అని మా వాళ్లతో పూల్ మొత్తం ఇటు అటు పరిగేట్టిన్చేసాను.శరీరాలు నీళ్ళకు అలవాటు పడాలి కదా అని ఏదో సర్ది చెప్పి. నా అదృష్టం కొద్ది మా పూల్ పెద్ద లోతు లేదు. అయినా ఇప్పటికే ఈత కొట్టి నాలుగేళ్ళు అయిందేమో శరీరం అందుకు సహకరించలేదు. మా వాళ్ళు కొంచెం అనుమానంగా చూడటం మొదలెట్టడంతో ఇక తప్పలేదు. కొంచెం దూరం వెళ్ళానో లేదో, 1500 మీటర్లు ఫ్రీ స్టైల్ కొట్టినట్టు షేక్ అవటం మొదలెట్టింది.

దాంతో మధ్యలోనే ఆపేసి ' అల్లాగన్న  మాట' అని వెనక్కి తిరిగి ఒక నవ్వు పారేసాను. మా వాళ్ళ మొహాలు చూస్తుంటే, ఏ నోవా ఆర్క్ నో, మరో యూత్ ఫౌంటెన్ నో చూసినట్టే ఉన్నారు. దాంతో నేను చెలరేగి పోయి ఫ్లోట్ ఎలా అవ్వాలో, ఆధారంతో కాళ్ళు ఎలా ఆడించాలో ఇత్యాది వన్నీ  చెప్పేసి ఆ రోజు మమ అనిపించేసాను మొత్తానికి.

రెండో రోజు కోసం ఆరోజు రాత్రి ఆఫీసు లో చేసేనట్టే, మళ్ళా గూగుల్ మామను బతిమాలి, రక రకాల స్విమ్మింగ్ వీడియోలు చూసేసి, కొంచెం మనోధైర్యం తెచ్చుకున్నాను.

రెండో రోజు. మళ్ళా అదే తంతు. ముప్పాతిక వంతు ఎలాగో లాగించి నాక, శరీరం సహకరించడం మాని పారేసింది. అప్పటికే ప్రిపేర్ అవటం వల్ల , రమేష్ ని అవతల వైపు నిలబెట్టాను. మునిగి పోతున్న శరీరాన్ని కాళ్ళతో తన్ని లేపి, ఇంతే చాల సింపులు అనేసాను. మా వాడు అనుమానాస్పదం గా చూస్తూ, ఆ కాస్త కొట్టేయ్యక  పోయ్యారా..అనేసాడు. అబ్బే..నీకు చూపిద్దామని.

అబ్యాసం కూసు విద్య అన్నట్టు రోజు రోజు కి నేను బాగానే ఈత ప్రాక్టీసు చెయ్యటం మొదలెట్టాను. ఇప్పుడు అప్రయత్నం గానే 2-3 సార్లు కోలనుకు ఇటు అటు ఈదేయ్యటం అలవాటయ్యింది. మా వాళ్ళలో నాపై నమ్మకం పెరిగి పోయింది. అంతా బానే ఉంటె, నేను ఇక్కడే బ్లాగు ఆపేద్దును  కదా. నిన్ననే తగలడ్డ ఒక ముసలాయన నా కొంప కంభం చెరువు చేసి పారేసాడు.

పూల్ చివర్లో వెనక్కి తిరిగి నిలబడి అమాంతం వెల్లకిల్లా దూకేసాడు. అదేమీ ఆనందం నాయనా అని చూస్తె, పూల్ సగం లో నీల్లనుండి  బయట పడి , అలాగే వెల్లకిల్లా ఈదుతూ చివరి దాకా లాగించేసాడు.వారమంతా మమ్మల్ని చూసి ఆవేశపడి, వెయ్యి రూపాయలకు ( మా వాడు 24 $ ని అల్లాగే లేక్కేస్తాడు) స్విమ్మింగ్ గాగుల్స్, కేప్ కొనేసిన రమేష్, కళ్ళు ఆర్పడం మానేసి అది మొత్తం చూసేసాడు. చూసేసి ఊర్కున్నాడా..అబ్బే,,,బాబాయ్ నాకు అదేదో నేర్పించ  కూడదు..భల్లే ఉంది...నేను మొదట అనుకున్నా..అదెంత  సేపు...

ధమాల్...వెనక్కు  తిరిగి పూల్ గోడను కొంచెం పుష్ చేసి కొంచెం దూరం వెళ్ళాక....మొత్తం నీళ్ళలో...టైటానిక్ లా నేను..











3 comments:

  1. దీని వల్ల అర్ధమయ్యిన నీతి ఏమిటంటే? ;)

    ReplyDelete
    Replies
    1. అన్నీ బ్లాగుల్లో రాస్కోకూడదని...

      Delete