Tuesday, July 30, 2013

పాప...పాల పీక...

మా పాప
దిగ్గున లేచింది...
పీడ కల చూచెనేమో
చిరాకు పడింది

ఇటు దొర్లింది
అటు దొర్లింది
ఏదో వెతికింది
దుప్పటి ఎత్తి చూసింది

దిండు వెనక అమ్మ దాచిన
అప్పాలేమన్న ఉన్నవేమో
అటు నిటు కదిపి చూసింది

చిన్నారి చిట్టి చేతులతో
ఏదేదో సైగ చేసింది
అర్ధం కాని తనదైన భాషలో
మరేదో  చెప్పింది

కోపమందుకుందేమో
నొసలు చిట్లించింది
మూతి ముడిచింది

దగ్గరగా వెళ్లాను నేను
తల్లి ఏమైంది అని
అనునయించాను

బిగ్గిరిగా ఏడ్చింది
చేతులు అటునిటు ఊపింది
అందాను కదా అనుకుందేమో
నా మొహం పై చప్పున
చెయ్యి విసిరింది

ఎన్నో ప్రయత్నాలలో
దొరింకిందేమో
తాను  వెతికేది
ఆనందంతో చిరునవ్వు నవ్వింది

అల్పసంతోషి ఉక్కిరి బిక్కిరి అయింది
తీరా తేర చూచును కదా
పట్టినది ఒక పాల పీక

నోట పెట్టుకు చప్పరించెను
తలచినది కాసేపు
పీక బైటకు తీసివేసి
తేరి పారా పరికించినది

తలచినట్టుల సస్య ధారలు
వెనువెంటలే వెలువడలేదు చెప్మా

బిక్క మోహము వేచె  చిన్నది
అయ్య ఏది దారి
అన్నటుల
తలను ఎత్తి నన్ను చూసెను

తల్లి నీవు తలచినది
ఆకలి దప్పుల మాన్పు
అమృత మయమవు
పాల ఊటలు

తలచినదేదో వదలి
ఆవేశము పూనినచో
వలసిన దప్పుడు దొరకదు

ఆలోచన చేయవలెను
ప్రతి కార్యం చేయుముందర

పాల పీకలు తీర్చలేవు ఆకలి దప్పులు
ఆవేశాలు మాన్పలేవు చేసిన తప్పులు

ఇల్లలికిన పండగ కాదని
చరిత్ర చెప్పిన సత్యం

రొట్టె చాలదని  ముక్కలు చేసిన
ఎవరికీ గడవదు పబ్బం

( అంధులు చూడలేని నిజాలు మరల మరల రాయట ఎట్లను తలపోయు నా మది భావం చెప్పకనే చెప్పిన నా చిన్నారి కి )






Wednesday, July 17, 2013

శవాల మీద వోట్లు ....

ఏరుకోండి  రా ఏరుకోండి... 
అన్నెం పున్నెం ఎరుగని పసి పిల్లల శవాల మీద 
మీ వోట్లను ఏరుకోండి... 

రండి రండి పరుగున 
వీడో వాడో ముందొచ్చి మీ వోట్లు కొట్టుకేలత డేమో... 

ఒకటో తరగతి పుస్తకం పై 
తడి ఆరని నెత్తుటి చార 
మీకు పడే వోటు ముద్ర లాగ కనపడుతుంటే 

గుండలవిసేలా ఏడ్చి సొమ్మసిల్లిన 
ఆ తల్లి పెట్టిన ఆక్రందన 
నీ జిందాబాదే అనుకో 

రిక్షలాగే అయ్య 
పాచి పని చేసే టమ్మ 
చచ్చింది పిల్లోడే 
నీకింక రెండోట్లున్నాయ్ గా ఇంట్లో 
పండగ చేసుకో 

యెంత మంది సస్తే ఏందీ 
దేశం స్మసానమైతే ఏంది 
ఆ సమాధుల పునాదులపై 
నీ రాజ్యం నిర్మించుకో 

పొద్దుగాలే బడికి పోయిన చిట్టి పొట్టి చిన్నారులు 
అమ్మ అయ్యా రెక్కలు  ముక్కలు  చేసుకు  
పూట గడవని దుస్తితిలో 
నాలుగు ముక్కలు నేర్చి 
రేపు మార్చే  చిన్న పాపలు. 

నీ  వ్యవస్థ అవ్యవస్థ
వొండి వడ్డించిన 
నెత్తుటి కూడు 
నరనరాన విషమై 
ఉసురు తీసుకుంటుంటే 
యాడ సస్తివోలీడరోడా 

చావు బతుకున 
కొడిగట్టిన పసిప్రాణం 
ఆసుపత్రి బెడ్డు మీద 
కొట్టుమిట్టలాడుతుంటే 
గాలిగూడ ఆడకుండా 
నీ రోదేందిర  సచ్చినోడా... 

చాప్రా విషాదాన్ని రాజకీయం చేస్తున్న రాబందులకు.....