Wednesday, January 22, 2014

నువ్వు

ఆ అద్భుతమైన క్షణం నాకింకా గుర్తుంది
నువ్వు నా కళ్ళ ముందు తలుక్కున 
మెరిసిన క్షణం, 
ఒక నీడలా సాగిపోయే దృశ్య కావ్యం

భాదాకరమై ఆశలుడిగిన నిర్లిప్తలో
నిశీధిలో, భారమైన జనారణ్యంలో
నీ కోమలమైన పిలుపు నాకింకా పరిచయమే
నీ రూపం నా కెప్పుడూ గుర్తే

కాలం గడచింది  నిట్టూర్పుల
సుడిగాలులలో నా కలలు కల్లలైనాయి
నీ పిలుపులు మరచాను
నా మదిలో మెదిలే నీ రూపం మ్లానమైంది

నా జీవితం నిర్జీవమైన మరుభూమి
ఒంటరి రోజులు భారంగా గడిచాయి
నమ్మకం, ఆశలు,
కన్నీళ్లు చివరికి బ్రతుకే లేదని నమ్మాను

కాని మళ్ళీ ఆ రోజులు తిరిగి వచ్చాయి
బీటలు వారిన మరుభూమి నుండి నా ఆత్మ తిరిగి మేలుకుంది
నీవు తిరిగి కనిపించావు
నువ్వు నా కళ్ళ ముందు తలుక్కున 
మెరిసిన క్షణం, 
ఒక నీడలా సాగిపోయే దృశ్య కావ్యం

నా హృదయం మరలా స్పందిస్తుంది
జీవితం మరలా చిగురించింది
నమ్మకం, ఆశలు,
కన్నీళ్లు, చివరికి అందమైన నా ప్రేమ మరల మేలుకున్నాయి 


Thursday, January 9, 2014

జండా ఊంచా రహే హమారా




ఫిబ్రవరి 7.
2014 సోచి ఒలింపిక్స్ .ప్రారంభోత్సవం.  
యావత్ ప్రపంచం టీవి సెట్లకు అతుక్కు పోయింది. 
ఒక్కో దేశం క్రీడాకారులు అబివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 
ఆహ... ఎంత అదృష్టం. ఒక్కో దేశం నుంచి వచ్చిన అత్యుత్తమ క్రీడాకారులు. ముందు జండా పట్టుకు వెళ్తున్న వారిది ఇంకెంత అదృష్టమో. అదుగో అమెరికా జట్టు. ఆ జెండా పట్టు కెళ్తున్న క్రీడాకారుడు తల పైకెత్తి గర్వం అతిశయించిన మోముతో ఆ జండా గాలిలో ఊపుతూ ఆనందిస్తున్నాడు. ఈ దృశ్యం తర తరాలకు జన యవనికలపై అలాగే నిల బడి పోతుందని అతనికి తెలుసేమో.
హంగరి, ఐస్లాండ్, ఇండోనేషియా...అదేంటబ్బా .... ఇండియా ఏది .... ఇండియా క్రీడా కారులు ఒలింపిక్ జండా పట్టుకు వస్తునారు. అదేంటి .. అని విస్తు పోకండి... మన వాళ్ళు ఈ సారి ఇండియా కి ప్రాతినిద్యం వహించడం లెదు... మరి... ఎవరికీ వారే .. అంటే ఈ ఒలింపిక్స్ కి వెళ్ళే ప్రతి క్రీడాకారుడు తమకు తానె ప్రాతినిద్యం వహిస్తారన్నమాట. 
నాకెటు వంటి బ్రమలు లేవు కాని అదృష్టం బాగోక మనోళ్ళకి ఏదైనా పతకాలు వచ్చినా, పతకాలు తీసుకునే టప్పుడు, జనగణ మన విని పించదు.
ఇది జాతి మొత్తానికి మన ఘనత వహించిన (అ)రా(చ)జకీయులు ఇచ్చిన బహుమతి. ప్రపంచ ఒలింపిక్ కమిటి, భారత దేశ సభ్యత్వాన్ని రద్దు చేసింది.కారణం. మన ఒలింపిక్ కమిటీ లో ఉన్న వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు. 
కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 7 దాక సమయం ఇస్తే, మనోళ్ళు ఫిబ్రవరి 9 న ఎన్నిక కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటా ఎవరికో ఎక్కడో అందాల్సినవి ఆలోగా అందవేమో. లో గుట్టు పెరుమాళ్ళ కెరుక. 
ఏది ఏమైనా ఇది ఒక అవమాన కరమైన పరిస్తితి. పతకాలు సాదించడం తర్వాత సంగతి. తమ దేశం జండా పట్టుకు తిరగలేని దుస్తితి. ఆహా.. మన గొప్పతనం ప్రపంచం మంతా తెలుసుకొని, ముక్కున వేలేసుకొని తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకోడానికి  మంచి అవకాశం.