Monday, July 17, 2023

కలగాపులగం హైకూలు

ప్రేమ పిచ్చి లోనో దైవ భక్తి లోనో

మమేకమై పుడుతుంది 

ఒక  కావ్యం ఒక కవిత 

ఓ గ్రంధం ఓ ప్రభందం


జీవితాంతం వదలనిది భాధ కాదు

వదిలి పోయేది ప్రేమ కాదు


దేశం లో దొంగలు పడక్కర్లా

దేశ మంతా దొంగలే


అరిషడ్వర్గాలు ఉండని  ప్రదేశం

ఆకాశం భూమి కలిసేచోటు 


కోటి  తారల మధ్య చందమామవు నువ్వు 

నిన్ను చూసి మురిసిపోయే గడ్డి పరకను నేను 


నువ్వు వరమిస్తానంటే ఏమడగను 
ఆకాశం నుండి దిగిరమ్మనా 
వాడిపోయిన నన్ను హత్తుకొమ్మనా 
ఏదడిగినా  అది నా అత్యాశే కదా 











పరాధీన

ప్రపంచం ఇంకా నిద్రలేవని 

శుభోదయాలలో 

నీ చిరు మందహాసం నా రోజు 

మొత్తాన్ని మురిపిస్తే 

సన్నగా మంచు తెమ్మెర విరిసే 

సీతా కాలపు సాయంత్రాలలో 

పేరు లేని వీధుల్లో 

నీతో కలిసి నడిచే నాలుగడుగులు 

నా రాత్రి ని మరపిస్తే 

నాకేమి కానీ నీ కళ్ళలో 

నీకేమి కానీ నాకోసం 

మనకే ప్రత్యేకమైన 

ఆ కొన్ని క్షణాల్లో 

ద్యోతకమయ్యే 

విలువ కట్టలేని భావాలు 


నువ్వులేని ప్రతిక్షణం 

రాని నీ పిలుపుల కోసం 

వేచిచూసి 

నాదేది కాని కోసం 

నాకోసం లేనిదానికోసం 

వెతికి వెతికి వేసారి 

నిర్లిప్తల నిట్టూర్పుల 


నాకు తెలిసిన నరకాలలో 

నన్నే నేను వధించుకుంటూ 

బ్రతికి ఉన్న కళేబరాన్ని 

మరిగే నూనె అగడ్తలలో 

మరల మరల దహించుకుంటూ.... 






నేనేమి ఇవ్వను

ఈ చిరుగాలికి విరబూసి 
నవ్వుతున్న పువ్వులు 
అందాలు ఆరబోస్తూ 
దూరం తెలియని దారులు 
పువ్వుల లోగిళ్ళలో 
మధువు గ్రోలు తుమ్మెదలు 
ఆకాశపు అంచుల్లో స్వేచ్చగా 
ఎగిరే పక్షులు 

నాదైన  ప్రపంచపు ఊహలలో  
నీకోసం దాచుకున్న చిత్రం
అనుక్షణం నీతో 
పంచుకోవాలని 
జన్మల కొద్దీ వేచి ఉన్నా 

నువ్వే లేని ఈ లోకానికి 
నేనేమి ఇవ్వను 
ఇంకా ఈ కళ్ళలో 
ఏ కన్నీళ్లు మిగిలున్నాయని 

వడగాలికి  రేకలు  మండి 
పువ్వులన్ని నేల కొరగని 
రంగులన్నీ ఆవిరయ్యి 
మట్టిలోన  కలవనీ 

స్వప్నాల రహదారులు 
దయ్యాల మిట్టలవనీ 
ఎవరికీ పట్టని 
గుట్టలవనీ 

అమృత తుల్యమవు 
పూల మధువు 
విషాహారమవని 
మదోన్మత్తమైన 
నా లాంటి తుమ్మెదలు 
ముళ్లపొదల్లో 
ఒడలు మండి రక్తమోడని 

అందాలొలుకు నా పూదోట 
శ్మశాన సదృశ్యమవనీ 
వసంతాలు శరత్తులు 
మరిచి యుగాంతానికి 
ఎదురుచూడనీ