Friday, September 14, 2012

అమెరికతలు-2..


౨-౩ రోజులుంచి అటు ఇటు తిరుగుతూ  సరిగ్గా నిద్రలేదేమో, బాగా నిద్ర పట్టేసింది. లెగిచి చూద్దును కదా ఏ దేశం మీదున్నామో తెలియక పోయినా  తెల్లారినట్టు తెలిసింది. వాచి చూసుకుంటే ఒక ౮ గంటలు నిద్రేసాం  అని అర్ధం అయ్యింది. బ్రేక్ ఫాస్టు అవి కానిచ్చి, పక్కనున్న బాబాయి గారితో లోకాభిరామాయణం మొదలెట్టాను. ఆయన అదే మొదటి సారి యు.ఎస్ పిల్లల దగ్గరకు వెళ్తున్నారని తెలిసింది.లావేట్రి దగ్గర కునికి పాట్లు పడుతున్న ఇద్దర్ని చూపించి, అదేంటబ్బాయి అందరు ఇక్కడే నిలబడక పొతే బైటకేల్లోచ్చు కదా…అన్నాడు.అప్పుడే ఏదో కొంచెం ఉన్న నిద్ర మత్తంతా దెబ్బకి యెగిరి పోయింది.
విమానం లో సందడి అంతా సీమ టపా కాయలదే. ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, తల్లి దండ్రులను నానా హైరానా పెడుతున్నారు. మనోల్లలాగా ఒక దెబ్బేస్తే, గమ్ముగా ఉండే ఘటాలు కాకపోయె. అదీ కాక, అమెరికా లో ఉన్న చట్టాల ప్రకారం, వీళ్ళను రెండు దేబ్బలేస్తే, అదేదో నెంబర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ చేసెయ్యచ్చు.ఎందుకొచ్చిన గొడవ అని, ప్లీజ్ కన్నా, కం హియర్ అని ఒకా యన బ్రతిమాలుతుంటే, హే బడ్డి, ప్లీజ్  డూ దట్ అని ఇంకో కాయన బామాలుతున్నాడు. అయినా వాళ్ళు అంత సులభం గా వింటే, విమానం లో సందడి ఏముంది.
మొత్తానికి చికాగో చేరాము.ఇప్పుడే మొదలవుతున్న చలి కాలం. విమానాశ్రయం లోనికి ప్రవేశించే ద్వారం దగ్గర ఎలా వచ్చిందో చలి గాలి గిలిగింతలు పెట్టింది.అమెరికాకు స్వాగతం నేస్తం…ఇమ్మిగ్రేషన్ పనులు ముగించుకుని బైట పడే సరికి, నా లింకు విమానం కాస్తా తుర్రున పోయింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కౌంటరు లో పిల్ల యు మిస్సేడ్ ఇట్ బై  టెన్ మినిట్స్ అని పళ్లన్నీ బైట పెట్టి చెప్పింది. నా ఫ్లైట్ మిస్ ఐతే ఈమె కెందు కింత ఆనందమో…లేక టీవీ లో వార్తలు చదివే వాళ్ళలాగా అలవాటయి పోయిందేమో.సరే తల్లి ఎప్పుడు ఫ్లైట్ మల్లి అని ఏడవలేక ఒక చచ్చు నవ్వు నవ్వి అడిగాను. ఇంకో ౨ గంటల్లో అని చెప్పింది.
ఇంకేం చేస్తాం, కే.ఎఫ్.సి లో ఏదో కొన్ని వేపుడు దుంపలు, మరి టొమాటో సాసు తలగేసు కొని కుర్చీ లో కూల బడ్డాను.ఇంత బతుకు బతికి అన్నట్టు, యెంత మొనగాడైనా, ఈ దేశం లో ఈ చెత్తంతా  తినాల్సిందే…ఎదవ జీవితం
పక్క సీట్ లో ఒక తెలుగు అమ్మాయి. వాళ్ళ స్నేహితులు.కార్తిక మాసం అంట…యేవో పళ్ళు,దుంపలు తెచ్చుకుంది.ఆహ ఏ దేశమేగిన, యందు కాలిడినా, తల పాగా తీసి గౌరవించాల్సిందే ఇలాంటి వాళ్ళని  ( హాట్స్ ఆఫ్ కు నా తెలుగీకరింత…పోయిన టపా లో మిత్రుల కోరిక మేరకు,సాద్యమైనంత వరకు తెలుగు లోనే రాద్దామని చిన్న ప్రయత్నం ;) )
డిట్రాయిట్ చేరే టప్పటికి ౫ అయింది. బ్రతుకు జీవుడు ..ఇక హోటల్ కెళ్ళి బజ్జుంటాను అని లోపల్నించి గోలేట్టేస్తున్నాడు. లగేజు చూద్దును కదా..ఒక బాగు మిస్సింగ్…ఎయిర్ లైన్స్ వాళ్ళను అడిగితె, ఇదేమన్న కొత్తా అన్నట్టు మొహం పెట్టి, వచ్చే ఫ్లైట్ లో రావచ్చు ఇంకో గంట పడుతుంది, లేకుంటే, ౨ రోజుల్లో మీ అడ్రస్సు కు పంపుతాము.అన్నది.ఏమి చేస్తాం, ఇంకో గంట వెయిటింగ్ అన్న మాట.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఆంధ్ర ( యు.ఎస్.ఏ లో ఉన్న మన తెలుగోళ్ళ సంతతి ని చూసి కళ్ళు కుట్టి, మా తమిళ కొలీగు చేసిన కామెంట్) లో తెలుగోల్లకేం తక్కువ.మళ్ళా ఒక తెలుగాయన.డిట్రాయిట్ లో కన్సుల్టేన్సీ ఉందట.అక్కడే పరిచయం అయ్యాడు. కాసేపట్లోనే, ఇది వరకు జాబు మార్కెట్, ఇప్పుడు పరిస్తితి అదీ ఇదీ అని బాగా ఊదర కొట్టేసాడు.ఎంతలా అంటే ఇంకాసేపుంటే నేనే హెచ్౧ కి అప్లై చేసేటట్టు అబ్బే చాల ఈజీ అండీ…మా ఆఫీసు లో నిన్ననే ౪ హెచ్ ౧ లు చేసాము. అన్నాడు.నా వివరాలు కనుక్కున్నాడు.ఫోన్ నెంబర్ తీస్కున్నాడు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి కలుద్దాం బ్రదర్ అన్నాడు. అమాయకున్డను, నిజమే అనుకుంటిని, ఇంత వరకు మాట మంతీ లేదు. నా నెంబర్ తీస్కున్నంత తొందరగా మీ కార్డు ఇస్తారా అన్నా స్పందించలేదు. అబ్బే మీ నెంబర్ ఉంది గా..నేనే పిక్ చేస్కుంటాను…అని వాగ్దానం చేసాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు రావటం తో బాయ్ చెప్పి బయలు దేరాడు. అంటే, అయ్యవారికి మంచి టైం పాస్ గాడు దొరికాడన్నా మాట ( నాక్కా దండోయ్   ).
ఇంతలో నా బాగేజు రావటం తో ప్రాణం లేచొచ్చి నట్టయ్యి, వడి వడి గా బైట పడి,హోటల్ చేరాను.
అదండీ, ఈ సారి నా ప్రయాణం లో పదనిసలు, అపసవ్యం గా గార్ధభ రాగం లో సాగాయి…మళ్ళా ఇంకో టపా లో  కలుద్దాం…ప్రస్తుతానికి ఇటు అటు కాని టైం జోన్ లో నా నిద్రా ప్రపంచం లో తిరుగాడుతున్నా …డోంట్ డిస్టర్బ్…

No comments:

Post a Comment