Tuesday, March 22, 2011

ఒక రోజు...అమెరికతలు-4

రాత్రి ౩ గంటలు.
టక్ టక్ టక్ . బెడ్ రూం తలుపు కొట్టిన శబ్దం. గబుక్కున లేచి కూర్చున్నాను. మా పక్క అపార్ట్మెంట్ వాళ్ళు బాత్రూం తలుపు తీసిన వేసినా, ఈ చెక్క భవంతి లో శబ్దాలు రావటం మామూలే. కాని, తలుపు ఎవరు. ఐన ఈ టైం లో. నాది ఒక బెడ్రూం అపార్ట్మెంట్. ఒకటో అంతస్తులో ఉంది. కింద ఉండే మెయిన్ తలుపు తెలిసిన వాళ్ళు ఓపెన్ చేస్తే కాని కాదు. బైట నుండి లాక్ అయి ఉంటుంది.
ఈ టైం లో..వచ్చే వాళ్ళెవరూ లేరు. అయినా, కింద తలుపు ఎవరు తీసి ఉంటారు. ఎవరు తీసినా, పైన నా అపార్ట్మెంట్ తలుపు తీసుకొని, బెడ్ రూం తలుపు??
టక్ టక్ టక్ మళ్ళా ఇంకో సారి. మెల్లగా లేచి అడుగు లో అడుగు వేసుకుంటూ, తలుపు దగ్గరకు వెళ్లాను. క్నాబ్ తిప్పి తలుపు ఓపెన్ చేసాను. చీకటి. నెలకు ౬౦ డాలర్లు వస్తున్న కరెంట్ బిల్ తప్పించుకోవటానికి ఇంట్లో లైట్ లు అన్ని ఆర్పెయ్యటం గుర్తొచ్చింది, మొదటి సారి నామీద నాకే చిరాకు.
"ఎవరు?" గొంతు పెగల్చుకుని మెల్లగా అడిగాను. ఏమి జవాబు లేదు. ఇంకొచెం ముందుకు వచ్చాను. బెడ్ రూం కి హాల్ కి మద్య ౪ అడుగుల సన్న దారి. ఇంకొంచెం ముందుకు వెళ్తే, హాల్.సోఫా లో తెల్లగా ఏదో. గుండె ఆగి పోయినంత పని అయింది. కొంపదీసి??౨ రోజుల క్రితం చూసిన రింగ్ సినిమా గుర్తొచ్చింది.ఈ ఇంట్లో చేరే టప్పుడు ల్యాండ్ లేడీ అన్న మాటలు గుర్తొచ్చాయ్. ఎనభైఏళ్ళు అయింది ఈ అపార్ట్మెంట్ కట్టి అని. ఇందులో యెంత మంది ఉన్నారో. యెంత మంది పొయ్యారో. ఎవరెవరు ఇంకా ఇక్కడే ?? తలుచుకుంటేనే భయం వేసింది.

'ఎవరది ?' ధైర్యం కూడా గట్టుకుని, పెద్దగా అడిగాను. మల్లా జవాబు లేదు. హాల్ కి పక్కగా బాత్రూం. గోడ పట్టుకుని నడుస్తున్న నాకు, నిన్న క్లీన్ చేస్తూ వదిలేసినా చీపురు దొరికింది. అప్రయత్నం గా అది గట్టి గా పట్టుకుని ముందుకు నడిచాను. కుప్పలా ఉంది ఆ ఆకారం. ఎవరో చిన్న పిల్ల తల వంచుకుని కూర్చున్నట్టు. దాని జుట్టు బాగా పెద్దదేమో, కాళ్ళ వరకు వేలాడు తుంది." ఎవరంటే పలకవే ?" అన్నాను గట్టిగా. చేతి లో చీపురు కొంచెం ధైర్యం ఇచ్చినట్టుంది.
కదలలేదు. చీపురు పైకెత్తి గట్టిగా కొట్టాను. కుప్ప లా ఉన్న ఆకారం ముడుచుకు పోయింది. దగ్గర గా వెళ్లి పట్టుకుని చూసాను. నిన్న స్నానం చేసి ఓపిక లేక నేను పారేసిన, తువ్వాలు అది. ఇండియా నుండి వచ్చే టప్పుడు అమ్మ బాగ్ లో కుక్కిన చీరాల మేడ్.దాని పొడవైన అంచు, దయ్యం జుట్టు లా భయపెట్టింది.
ఉఫ్ఫ్ఫ్.
మరి తలుపు కొట్టింది ఎవరు?? మల్లా ఆ ఆలోచన రాగానే, గుండె జారి పోయింది. మెల్లగా లేచి నిలబడ్డా. మొన్న పక్క స్ట్రీట్ లో జరిగిన రోబెరి గుర్తొచ్చింది. రాత్రి ఎవరో తలుపు కొడితే, కీ హోల్ లోంచి చూడకుండా తలుపు తీసి, రోబెరి తో పాటు మర్డర్ కి అవకాసం ఇచ్చింది ఒకావిడ. మా ఇంట్లో ఇంకా మిగిలింది చిన్న కిచెన్. అక్కడ దొంగలు దాక్కున్నరేమో.

మెల్లగా, అటు నడిచాను. సన్న గా కిటికీ లోంచి పడుతున్న, వీధి లైట్ వెలుతుర్లో ఒక కప్ బోర్డు ఓపెన్ ఉండటం చూసాను. డిష్ వాషేర్ పక్కన. సన్నటి కాలు బైట కు కనపడుతుంది. అదీ సంగతి. దొంగ వాడు అక్కడ దాక్కున్నా డన్నమాట. పొయ్యి మీద ఉన్న కడాయి తీసుకుని, బలం గా విసేరేసాను. ధన్ మని శబ్దం చేస్తూ పగిలింది. నా ట్రాష్ కాన్. అప్పటికి అర్ధం అయ్యింది. ఫుల్ ఐన ట్రాష్ కాన్ కొంచెం బైట కు వచ్చింది కప్ బోర్డు నుంచి.
లైట్ వేసి చూద్దును కదా..కిచెన్ అంతా చిందర వందర. కూరగాయల చెత్తా...రామ రామ ఇవన్ని రేపు క్లీన్ చెయ్యాలన్న మాట.
ఆ లైట్ అలాగే వదిలి మెల్లగా మల్లి బెడ్ రూం లోకి వచ్చాను. తలుపు వేసి పడుకున్నా.
టక్ టక్ టక్ మల్లా అదే చప్పుడు. ఎవరో అదే పని గా తలుపు కొడుతున్నారు. ఆగకుండా , నన్నిలా వదిలి నువ్వెలా పడుకున్నావ్ అన్నట్టు. ఈ రాత్రి నిన్ను వదలను లే అన్నట్టు. గోడకు జారగిల పడి కూచున్నాను. కొంచెం తీసిన కిటికీ లోంచి గాలి వస్తున్నా, నా వొళ్ళంతా చెమట పట్టడం తెలుస్తుంది. ఎవరు?? ఇప్పుడేగా ఇల్లంతా చూసి వచ్చాను.అదేదో సినిమా లో చూపించినట్టు, దేయ్యలేమైనా నాతొ ఆడుకుంటూ ఉన్నాయా ? లేక ఇంకో సినిమా లో చూపించినట్టు అవి నాకేమన్న చెప్పాలను కుంటూ ఉన్నాయా ?? ఈ సారి తలుపు తెరవక పొతే అదే లోపలి కొచ్చి, దాని చొట్టలు పడ్డ మొహం నా మొహం మీద పెట్టి వినపదట్లేదుబే అనదు కదా??
టక్ టక్ టక్
ఏదో ఒకటి చెయ్యాలి. దాన్ని ఆపాలి లోనికి రాకుండా. మొన్ననే కొనుక్కొచ్చిన వార్ద్రోబ్. దాన్ని ఎక్కడికి కావాలన్న జరపోచ్చు. మెల్లగా దాని తలుపుకు జరిపాను. శబ్దం రాకుండా. బైట ఆ దయ్యానికి తెలియ కుండా. దాన్ని తలుపుకు ఆనించ గానే శబ్దం ఆగి పోయింది. ఇందాక కూడా ఇంతే??? అది నాతో ఆడుకుంటుంది.
ఇంకా ఈ రూం లో బరువైనదేమిటి అని వెతికాను. ఇంకేంటి నా మంచమే. సరే...కస్టపడి దాన్ని కూడా వార్డ్ రోబ్ కి ఆనించాను. తలుపునే చూసుకుంటూ, పడుకున్నాను.
శబ్దం ఆగిపోయింది, దానికి ఈ బరువు నెట్టడం కుదర్లేదేమో. పిల్ల దయ్యమేమో.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు కాని, కిటికీ లోంచి వచ్చి పడ్డ ఎండ చురుక్కు మనడం తో లేచి కూర్చున్నా. టైం ౧౦.
రాత్రి జరిగిందంతా గుర్తు రావటం తో, మెల్లగా బెడ్ వార్డ్ రోబ్ జరిపాను. శబ్దం లేదు. బోర్ కొట్టి వెళ్లి పోయిందేమో...
గబా గబా రెడీ అయి ఆఫీసు కి వెళ్ళాను. సాయంత్రం తిరిగి వచ్చే టప్పుడు గుర్తొచ్చింది, రాత్రి జరిగిందా దంతా.
అదేంటో రెండు మూడు రోజులు ఏమి జరగలేదు.
మల్లా ఒక వారానికి,
టక్ టక్ టక్ అదే శబ్దం, అదే తలుపు కొట్టిన శబ్దం. అదే టైం లో ఎవరో వచ్చినట్టుంటే, కిటికీ లోంచి బైటకు చూసాను. చల్లని గాలి మొహానికి కొట్టింది.
నా మట్టి బుర్ర కి అప్పుడు అర్ధం అయింది. కిటికీ లోంచి డైరెక్ట్ గా వచ్చే గాలికి మా చెక్క కొంప లో ఉన్న సన్న చెక్క తలుపు కదులుతుంది. ఆ దెబ్బ కి దాని క్నాబ్ లాక్ కదలటం తో, ఆ శబ్దం.
అహో ఆంధ్ర భోజ అని పాట పాడుతూ, హాయి గా తలుపు తీసి పడుకున్నా..


Sunday, March 20, 2011

సచ్చినోళ్ళు..

మా వూళ్ళో కబడ్డీ పోటీలు. పక్క వూరికి మా వూరికి మద్య. మంచి కాలక్షేపం సంకురాత్రికి. మావోల్లైన వాల్లోల్లైన చెడ్డ కస్టపడి ఆడేవాళ్ళు లెండి. ఊర్కి సంబందించిన విషయమాయే.ఈ సారి ఓడిపోతే మల్ల ఇంకో ఏడు ఆగాల్సిందే. మా వాళ్ళు కిందా మీద పడి కష్ట పడేవాళ్ళు. మిగతా పన్లన్నీ వొదిలేసి జట్టు వాళ్ళంతా పొద్దన్నే సాధన చేసే వాళ్ళు. ఆ రోజుల్లో బూట్లు లేవు. మంచి గ్రౌండ్లన్న ఉండేవి కాదు. అయినా అదో తపన. అదో ఆవేశం. గిలిచి తీరాలని. ఏదో సాదించాలని.వూరి పేరు నిలబెట్టాలని.
అల్లానే వాళ్ళు పెద్ద పెద్ద పోటీల్లో గెలిచేవాళ్ళు. మా వూరి జట్టు జాతీయ పోటీల్లో గెలిసినప్పుడు వూరు ఊరంతా, పండగ రోజుల్లో కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబై సంబరాలు చేసుకుంది. మా వాల్లకందరికీ ఉన్నంతలో మంచి మంచి బట్టలు పెట్టారు. వాళ్ళకి ఊర్ల మంచి గౌరవం దక్కింది. వూరి పెద్దమనుషులంతా వాళ్ళని పోగిడేసేవాళ్ళు.
అక్కడనుంచి ప్రారంభమైంది అసలు కధ.ఒక్కసారి మా వూరి గెలవ గానే, ఆటగాల్లందరికి ఎక్కడలేని ప్రాధాన్యత. ఊళ్ళో ప్రతి చిన్న పెద్ద పనుల్లో వాళ్లకి ప్రాధాన్యం .దాంతో ఆట వెనక పడి మిగత విషయాల్లో వాళ్లకు అభిరుచి పెరిగింది.కొంత మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే, మిగతావాళ్ళు ఆయా వ్యాపారాల్లో వాళ్లకు లభించిన పేరు ప్రతిష్ట లు పెట్టుబడి పెట్టి సంపాదించే పనిలో పడ్డారు. ఆ పనిలో భాగం గానే, ఎప్పుడో సంకురాత్రి కి జరిగే ఆటలు రోజు పెట్టే సౌలబ్యం పెట్టారు. దాంతో, ఆట మీద జనాలకు మొహం మొత్తింది. ఎప్పుడో తినే పాయసం రోజు తినమంటే, కష్టమే కదా..
ఇంకా వినండి.ఇందులో ఇంకా కొందరు తెలివైన జనం పోటీల మీద పందాలు పెట్టడం, వాళ్ళిచ్చే పదో పరకో పుచ్చుకొని, వాళ్ళ కు అనుకూలంగా గెలవదమో, ఓడిపోవడం . అది ఆ నోట ఈ నోటా, అందరికి తెలియడంతో వూరి జట్టు నాయకుడిని జట్టు లోంచి తొలగించడం. ఇవన్ని జరిగిన చరిత్ర.
ఈ సారి జరుగుతున్న విషయం చెప్తా వినండి. సగం మంది జట్టు సభ్యులు ఆ వూళ్ళో ఈ వూళ్ళో జరిగిన పోటీల్లో పాల్గుని, ఈ సారి జాతీయ పోటీలు వచ్చేసరికి సగం చేవ చచ్చి సగం అలసిపోయి ఉన్నారాయే. ఇంకో సగం మంది ఆ వ్యాపారం, ఈ అమ్మాయి అని అటుయిటు ఎటో కటు తిరుగుతా అసలు విషయం మర్చి పాయె. ఇంకా మిగిలినోల్లు ఆ పెద్దాయన పలుకు బడి తోనో, ఈ పేట నాయకుడి పలుకు బడి తోనో,జట్టు లో ముక్కుతూ మూల్గుతూ కొనసాగుతున్నారు. ఏదో ఒక రౌండ్ గడిచింది గాని, ఇంకో రౌండ్ దాటే అవకాశమే కనపడట్లా...మా పక్కూరోల్లు మంచి కసి మీదున్నారు...ఏదో అద్బుతం జరిగితే తప్ప మావోల్లు ఇంకో పోటీ గెలిసే లా కనపళ్ళా..
ఇదే మా వూరి కబడ్డీ బోర్డు అధ్యక్షుడ్ని అడిగితె, తాంబూలా లిచ్చాం ఇంకా తన్నుకు చావండి అన్నట్టేదో నసిగాడు.. ఆయనకెంత ముట్టిందో.ఇప్పటి కైనా మా కబడ్డీ బోర్డు సచ్చినోళ్ళు కళ్ళు తెరచి ఆట కోసం ఆడే వాళ్ళని పెడితే, వచ్చేసారికైన మా ఊరోళ్ళు బాగా ఆడితే చూడాలని ఉంది...

Thursday, March 10, 2011

తన్నుకు చావండి...

చదవేస్తే ఉన్నమతి పోయిందని అంటారు..
చదువు చెప్పే వాడు చెప్పుడు మాటలాడుతాడు....
పోయినోళ్ళు అందరు మంచోల్లే అంటారు..
ఉన్నోళ్ళు ఎందుకున్నారని పిస్తేనో..

గద్దముక్కు వాడు కొత్త ప్రాంతమిప్పిస్తా నంటాడు..
గద్దేనేక్కు చూపులతో నక్కి నక్కి ఉంటాడు..
నా రక్తం నా తలకాయ్ నా బొందలు అంటాడు..
వీడి బొంద పెట్టి నాక నాలుగు స్వీట్లు పంచుతాను..

బొమ్మ పొతే బొమ్మ పెట్టమనే ఎదవా..
నువ్వు రోడ్న నడవకుంటే ఏడిసింది ఎవడురా...
నా జాతి నా గీతి నా ఇష్టం అని నేనంటే..
నువ్వు యాడ కనపడ్డ చెప్పు తీసుకుంటాను...

నా రాయలు నా శ్రీ శ్రీ నా నన్నయ నా తిక్కన..
అయ్యలారా క్షమించండి ఈ జాతిని..
తల్లి పాలు తాగి రొమ్ము గుద్దు కొడుకులు..
సిగ్గు లజ్జ వదిలి రోమ్మువిరుచుకు తిరుగుదురు...

పగిలింది బొమ్మలు కాదు...
నా తెలుగు జాతి గుండె...
మీ పలుగుల నలిగి సాగరాన కలిసింది
నా జాతి ఆత్మ ఘోష..

మీ చదువులు మీ కొలువులు మీ రేపును చూడండి...
ఎవడెవడో చెప్పిందికాక బుర్ర పెట్టి తలచండి..
ఇంకా తలకేక్కకుంటే , మళ్ళీ తన్నుకు చావండి..
చెప్పు తినేకుక్కలకు చెప్పుట నా తప్పండి.