Sunday, March 20, 2011

సచ్చినోళ్ళు..

మా వూళ్ళో కబడ్డీ పోటీలు. పక్క వూరికి మా వూరికి మద్య. మంచి కాలక్షేపం సంకురాత్రికి. మావోల్లైన వాల్లోల్లైన చెడ్డ కస్టపడి ఆడేవాళ్ళు లెండి. ఊర్కి సంబందించిన విషయమాయే.ఈ సారి ఓడిపోతే మల్ల ఇంకో ఏడు ఆగాల్సిందే. మా వాళ్ళు కిందా మీద పడి కష్ట పడేవాళ్ళు. మిగతా పన్లన్నీ వొదిలేసి జట్టు వాళ్ళంతా పొద్దన్నే సాధన చేసే వాళ్ళు. ఆ రోజుల్లో బూట్లు లేవు. మంచి గ్రౌండ్లన్న ఉండేవి కాదు. అయినా అదో తపన. అదో ఆవేశం. గిలిచి తీరాలని. ఏదో సాదించాలని.వూరి పేరు నిలబెట్టాలని.
అల్లానే వాళ్ళు పెద్ద పెద్ద పోటీల్లో గెలిచేవాళ్ళు. మా వూరి జట్టు జాతీయ పోటీల్లో గెలిసినప్పుడు వూరు ఊరంతా, పండగ రోజుల్లో కొత్త పెళ్లి కూతుర్లా ముస్తాబై సంబరాలు చేసుకుంది. మా వాల్లకందరికీ ఉన్నంతలో మంచి మంచి బట్టలు పెట్టారు. వాళ్ళకి ఊర్ల మంచి గౌరవం దక్కింది. వూరి పెద్దమనుషులంతా వాళ్ళని పోగిడేసేవాళ్ళు.
అక్కడనుంచి ప్రారంభమైంది అసలు కధ.ఒక్కసారి మా వూరి గెలవ గానే, ఆటగాల్లందరికి ఎక్కడలేని ప్రాధాన్యత. ఊళ్ళో ప్రతి చిన్న పెద్ద పనుల్లో వాళ్లకి ప్రాధాన్యం .దాంతో ఆట వెనక పడి మిగత విషయాల్లో వాళ్లకు అభిరుచి పెరిగింది.కొంత మంది అమ్మాయిల చుట్టూ తిరుగుతుంటే, మిగతావాళ్ళు ఆయా వ్యాపారాల్లో వాళ్లకు లభించిన పేరు ప్రతిష్ట లు పెట్టుబడి పెట్టి సంపాదించే పనిలో పడ్డారు. ఆ పనిలో భాగం గానే, ఎప్పుడో సంకురాత్రి కి జరిగే ఆటలు రోజు పెట్టే సౌలబ్యం పెట్టారు. దాంతో, ఆట మీద జనాలకు మొహం మొత్తింది. ఎప్పుడో తినే పాయసం రోజు తినమంటే, కష్టమే కదా..
ఇంకా వినండి.ఇందులో ఇంకా కొందరు తెలివైన జనం పోటీల మీద పందాలు పెట్టడం, వాళ్ళిచ్చే పదో పరకో పుచ్చుకొని, వాళ్ళ కు అనుకూలంగా గెలవదమో, ఓడిపోవడం . అది ఆ నోట ఈ నోటా, అందరికి తెలియడంతో వూరి జట్టు నాయకుడిని జట్టు లోంచి తొలగించడం. ఇవన్ని జరిగిన చరిత్ర.
ఈ సారి జరుగుతున్న విషయం చెప్తా వినండి. సగం మంది జట్టు సభ్యులు ఆ వూళ్ళో ఈ వూళ్ళో జరిగిన పోటీల్లో పాల్గుని, ఈ సారి జాతీయ పోటీలు వచ్చేసరికి సగం చేవ చచ్చి సగం అలసిపోయి ఉన్నారాయే. ఇంకో సగం మంది ఆ వ్యాపారం, ఈ అమ్మాయి అని అటుయిటు ఎటో కటు తిరుగుతా అసలు విషయం మర్చి పాయె. ఇంకా మిగిలినోల్లు ఆ పెద్దాయన పలుకు బడి తోనో, ఈ పేట నాయకుడి పలుకు బడి తోనో,జట్టు లో ముక్కుతూ మూల్గుతూ కొనసాగుతున్నారు. ఏదో ఒక రౌండ్ గడిచింది గాని, ఇంకో రౌండ్ దాటే అవకాశమే కనపడట్లా...మా పక్కూరోల్లు మంచి కసి మీదున్నారు...ఏదో అద్బుతం జరిగితే తప్ప మావోల్లు ఇంకో పోటీ గెలిసే లా కనపళ్ళా..
ఇదే మా వూరి కబడ్డీ బోర్డు అధ్యక్షుడ్ని అడిగితె, తాంబూలా లిచ్చాం ఇంకా తన్నుకు చావండి అన్నట్టేదో నసిగాడు.. ఆయనకెంత ముట్టిందో.ఇప్పటి కైనా మా కబడ్డీ బోర్డు సచ్చినోళ్ళు కళ్ళు తెరచి ఆట కోసం ఆడే వాళ్ళని పెడితే, వచ్చేసారికైన మా ఊరోళ్ళు బాగా ఆడితే చూడాలని ఉంది...

3 comments: