Tuesday, August 23, 2011

హరే రామ హరే కృష్ణ....అమెరికతలు-౮


మరో వారాంతం.మరో సుదూర ప్రయాణం .ఈ దేశం లో విశాలమైన రోడ్లు.ఒక్కోసారి ఇండియా లో ఇలాంటి రోడ్లు ఎప్పటికైనా వస్తాయా అనిపిస్తుంది.యాబై అరవై ఏళ్ళ క్రితం నిర్మించబడ్డ ఈ రోడ్లు ఈ దేశపు రవాణా అవసరాలను ఎప్పటికీ తీర్చేసాయేమో. ఈ రోడ్లు రవాణా అవసరాలతో పాటు,మిమ్మల్ని ప్రతి వీకెండ్ అలా లాంగ్ డ్రైవ్ కెల్ల మని ప్రోత్చాహిస్తాయి.౧౨౦-౧౩౦ మైళ్ళ వేగం లో కూడా ఏమాత్రం గతుకులు లేని రోడ్డు ప్రయానికి  చాల సౌకర్యం గా ఉంటుంది.కాని గంట గంటన్నర తర్వాత ప్రయాణం విసుగని పిస్తుంది. అల్లాగే సుదూరం గా కొనసాగే రోడ్డు, పక్కనే దరీదాపు లేకుండా సాగే చెట్లు బిల్డింగులు.ఇండియాలో లా కొన్ని మైల్లకే రక రకాలు గా మారి పోయే ఇళ్ళ నిర్మాణ రీతులు ఇక్కడ కనిపించవు.అన్ని ఇల్లూ,భవన నిర్మాణాలు ఒకేలా ఉంటాయి.వాతావరణ పరిస్తితులు ఒక కారణమైతే, మరే ఆచార వ్యవహారాలను మ్యుజియం లకే పరిమితం చేసే వలస సంస్కృతీ ఇంకో కారణం కావచ్చు. 

మా మొదటి మజిలి ఇస్కాన్ టెంపుల్ అఫ్ గోల్డ్.ఇస్కాన్ భావజాల ప్రచారకులు ప్రభు పాద కోసం అమెరికా లో ఆయన నివాసం కోసం ఆయన మొదటి భక్తులు నిర్మించిన భవనం.ముప్పై నలభై ఏళ్ళ క్రితం నిర్మించ బడ్డ ఈ భవనం వారి ఆనాటి శ్రమకు మిగిలిన అవశేషం.గుమ్మటాల పైన కట్టడం లోపలా బంగారు పూతలు అత్యవసరంగా మరమ్మత్తుల అవసరాన్ని చూడగానే చెబుతాయి.ఈ రోజు మా గైడ్ చైతన్యానంద భగవాన్.ఆయన లోపల ఉన్న ప్రతి వస్తువును దాని ప్రత్యేకతను వర్ణించి చెప్పారు.భారత దేశం నుంచి వచ్చిన ఒక సాదువు ఇక్కడి వారిపైన వేసిన తనదైన ముద్ర ను ఈ అమెరికన్ ను చూస్తే తెలుస్తుంది.ఆయన దృక్పదం లో వస్తు ప్రధాన మైన ఈ లోకం లో నిజమైన దేవుని చేరే మార్గాన్ని చూపిన గురువు ప్రభుపాద.కాని నాకో విషయం అర్ధం కాలేదు.ప్రాపంచిక విషయాలలో ఏ మాత్రం రుచి లేని ఒక సాధువు ఈ బంగారపు కట్టడం లో ఉండటం ఏమిటి? ఎక్కడినుంచో వచ్చిన ఒక అనామక భారతీయునికి ఎంతో వ్యయం చేసి ఈ అమెరికన్ భక్తులు తమ స్వహస్త్రాలతో ఈ గొప్ప నిర్మాణం చేయడం ఎందుకు? కానీ ఈ ప్రశ్నలకు నాకు తొందర గానే సమాధానం దొరికింది.

టెంపుల్ అఫ్ గోల్డ్ కు అరమైలు దూరం లో కృష్ణ మందిరం.మేము వెళ్ళేటప్పటికి భాగవతం లోని ఒక ఘట్టం ప్రదర్శిస్తున్నారు.దూర్వాసుడు అర్జునుని ఇంటికి వెళ్తారు.తనతో పాటు తన అరవై వేల శిష్యులను తీసుకొని.కాని వారిని తృప్తి పరచడానికి ఇంట్లో ధాన్యం నిన్డుకున్నాయని గ్రహిస్తారు అర్జున సుభద్రలు.అప్పుడు సుభద్ర కృష్ణున్ని ప్రార్దిస్తుంది.ఈ సంకటం నుంచి బైట పడవెయమని. కృష్ణుడు ప్రత్యక్షమై,తనకు ఆకలి గా ఉన్నదనీ తినడానికి ఏమన్నా తెమ్మని అంటాడు.సుభద్ర పరిస్తితి వివరించి, ఖాళి పాత్రను చూపుతుంది.కృష్ణుడు అడగున ఉన్న ఒక్క బియ్యపు గింజను తిని, తను సంత్రుప్తడనయ్యానని అంటాడు. అదే సమయంలో నదీ స్నానానికి వెళ్ళిన దూర్వాసుడు, అతని శిష్యులు తమ ఆకలి మటుమాయం కావడం గమనిస్తారు.కృష్ణుడు మళ్ళీ ప్రత్యక్షమై తన భక్తులను తను ఎప్పుడూ కాపాడుతానని వ్యాఖ్యానిస్తాడు.దీనితో ఆ అంకం సమాప్తమై భజన ప్రారంభమవుతుంది.

రామాయణ కాలం లో ఇచ్చిన మాట ప్రకారం, ద్వాపర కాలం లో గోపికా ప్రేమను స్వీకరించిన శ్రీ కృష్ణుని అదే గోపికా భక్తితో ప్రేమించడం ఇస్కాన్ మూల సూత్రాలలో ఒకటి.భజన జరుగుతున్న సమయం లో కొందరు భక్తులు తన్మయత్వం తో నృత్యం చేయటం చూసాను. అందం గా అలంకరించ బడ్డ విగ్రహాలను చూడటానికి దగ్గర గా వెళ్ళాను.ప్రక్కనే రక రకాల వాయిద్యాలు లయ బద్ధముగా వాయిస్తున్న భక్తులు అలౌకిక ఆనందం తో మునిగి పోవటం చూసాను. నృత్యం చేస్తున్న ఒక పూజారి ఉన్నట్టుండి ఎవరో చెప్పినట్టుగా, నన్నూ ఆ నృత్య బృందం లోకి లాగాడు.పది పదిహేను మంది భజనకు తగ్గట్టు, కాళ్ళు కదిలిస్తూ నృత్యం చేస్తున్నారు.ఆ హరే రామ హరే కృష్ణ భజన హోరులో అందమైన రాధా కృష్ణ విగ్రహాలు తప్ప వేరేమి కనపడలేదు.ఇంత మందిలో మేము మాత్రమె అలా నృత్యిస్తున్నామన్న స్పృహ లేదు.హరే రామ హరే కృష్ణ.అదే హోరు అదే జోరు.ఎవరో చూస్తారు ఏమను కుంటారో అన్న సామాన్య మైన బిడియం లేదు.హరే రామ హరే కృష్ణ.యెంత సమయం గడిచిందో తెలియదు.హరే రామ హరే కృష్ణ.ఎవరో పట్టుకు బైటికి లాగితే తప్ప నేను ఆ బృందం నుండి బైట పడలేదు.అప్పుడు గమనించాను అంతసేపు డాన్సు చేయటం వల్ల చెమట తో ముద్దైన నా షర్టు.

భక్తీ మార్గం ఒక ప్రవాహం.ఒక మత్తు.అందులో పడి పోయిన వాళ్లకు ఈ లోకం తో పని లేదు.ఎవరేమనుకున్నా సంభందం లేదు.ప్రభుపాద ఒక సన్యాసి అని ఆయనకు బంగారు మందిరాలతో సంభందం లేదని సంవత్సరాల తరబడి ఆ భవన నిర్మాతలకి     స్పురించ లేదంటే దీన్ని ఎలా వివరించగలం. అలా ఒక గొప్ప అనుభవం తో ఆ రోజు ముగిసింది.


Thursday, August 18, 2011

అన్నా నీ పోరాటం లో నేను హాజరే....


అన్నా హజారే...

ప్రపంచ మీడియా లో మార్మోగిపోతున్న హాట్ టాపిక్. దశాబ్దాలుగా అవినీతిలో మగ్గి పోతున్న సగటు భారతీయుని  ప్రతిరూపం.ఆర్.కే.లక్ష్మన్ కామన్ మాన్. ఆయన ఉపవాసం చేస్తానంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ భయం తో భోజనం మానేసింది. చేష్టలుడిగి తిక్క పనులు చేసి ఛీ అనిపించుకుంది. పెద్దాయన అంటే పెరుగన్నం అంతా తినేసాడని మన గొప్ప ప్రధాని గారు  సి.వీ.రామన్ క్రికెట్ ప్లేయర్ అని, అర్మాన్ హుష్మి ఆస్ట్రోనాట్ అన్నట్టు ఏవోవో గందర గోల ప్రకటనలు చేసి ఆహా ఈయన కు నిజం గానే వయసు అయిపొయింది,ఇంకా ఇంటికెళ్ళి విశ్రాంతి తీస్కో వచ్చు అని పించుకున్నత పని చేసారు.

ఆంగ్లం లో ఈ పార్టీ పేరు అవినీతి రెండు ఒకే అక్షరం తో ప్రారంభం కావటం యాదృచ్చికం కాదు. మొత్తం పటాలం అంతా ఇప్పుడు అన్నా వెంట పడ్డారు.అవును మరి, నిజం గానే జన లోక్ పాల్ బిల్లైతే కేంద్ర కాబినెట్ లో ఎవ్వరు మిగలరని అంటే అతిశయోక్తి కాదు.అందరూ తీహారు దారి పట్టాల్సిందే. అందుకే, పిచ్చి కుక్క కరిసినట్టు ఒకరు ఈ పోరాటం వెనక అమెరికా హస్తం ఉందంటే ఇంకొకరు అంతరిక్ష వాసులే ఏదో చేస్తున్నారని వాపోతున్నారు.

నిజం చెప్పాలంటే ఎన్నికలప్పుడు ఏదో హడావుడి చేసి డబ్బు మందు ప్రవహిప చేసి గద్దెనెక్కే రాజకీయులకి, జనం నాడి ఎప్పుడు తెలియదు. అందుకే ఎలాగోలా ఈ ఉద్యమాన్ని అణచాలని చెత్త కూతలు కూసిన వాళ్ళు నేడు ఆయన కు లభిస్తున్న ప్రజాభిమానం చూసి తోక ముడుస్తున్నారు.

మరి అన్నాకు లభిస్తున్న మద్దత్తు. దీనికి ఆయన మచ్చ లేని వ్యక్తిత్వం ఒక కారణం ఐతే, ఈ కుళ్ళిన వ్యవస్థతో ముక్కు మూసుకు బతుకుతున్న జనం ఓర్పు కోల్పోవడం మరో  పెద్ద కారణం. ఇంట్లో నుంచి బైట పడ్డప్పడి నుంచి మళ్ళీ ఇల్లు చేరేవరకు ట్రాఫ్ఫిక్ పోలీసు  నుంచి ప్రభుత్వ ఆఫీసులలో అల్లావుద్దీన్ దీపం లోంచి వచ్చిన భూతం ఇంతింతై అన్నట్టు అడుగడుడున రాజ్యమేలుతున్న అవినీతి, జనం చీదరకు కారణం.ఎన్నేళ్ళు గడచినా దేశం అభివృద్ధి అలా వుంచి ఈ పరాన్న భుక్కులు స్విస్స్ బ్యాంకులలో దాచిన జనం సొమ్ము ఎన్ని రెట్లు పెరిగిందో లెక్కేలేదు. జాన బెత్తె లేని దేశాలు ఎంతో అభివృద్ధి చెందుతుంటే మనం సాపాటు ఎటులేదు అని కొన్నేళ్ళు, ఎదగ డానికెన్దుకురా తొందరా అని పాడేసుకుంటూ ఎన్నో తరాలు గడిపేస్తున్నాం. మరి ఎన్నాళ్ళిలా జనం అయ్యవాల్లకు దండం పెట్టు అని బ్రతుకుతారు చెప్పండి.

ఇక ఇంటి కొస్తే ప్రతి న్యూస్ ఛానల్ లోను మనోల్ల గొప్ప పనులే. నిజం చెప్పాలంటే భారత దేశం యెంత అభ్రివ్రుద్ది చెందిందంటే, ఎనభై లక్షలతో ప్రారంభమైన మొదటి కుంభకోణం యాభై ఏళ్ళలో లక్షల కోట్లు దాటింది. ఇక్కడ మన దేశం ఎన్నో దేశాలని అధిగమించింది.

ఈ సంఘటనకు ఇంకో కోణం ఉంది. అదే మన వ్యవస్థ గొప్పతనం. శాంతి యుతం గా ఆందోళన పోరాటం చేసే హక్కు మనకు మన రాజ్యాంగం కల్పించింది. ఈ వ్యవస్థలో ఒక సామాన్య మానవుడు ప్రభుత్వాన్నే వూపెస్తున్నడంటే ఆ గొప్పతనం నిజం గా ఆ వ్యవస్థదే. ఈ హక్కును ఏ  ప్రభుత్వం మన నుంచి లాక్కోలేదు.మరి ఇలాంటి గొప్ప వ్యవస్తను ప్రతి ఐదేళ్లకు మనం అపహాస్యం చేస్తున్నాం. మందుకో, డబ్బు కో, కులం పేరుతోనో మతం మత్తు లోనో వేసే వోటు తో మనమే దీనికి తూట్లు పోడుస్తున్నాం.

ఇవన్ని సరిదిద్దు కోవడానికి మొదటి అడుగు...అన్నా ఆందోళన. ఇలాంటి ఆవకాశం చారిత్రాత్మకం.సద్వినియోగం చేసుకుంటే భారత చరిత్ర లోనూతన అద్యాయమే.అందుకే అన్నా నీ పోరాటం లో నేను హాజరే....