Thursday, November 24, 2011

సత్యం..ఒక మరపురాని జ్ఞాపకం...


ఏం శరత్ ఎలా ఉన్నావు... చిరపరిచయమైన పిలుపు. స్నేహం నిండిన ఆ కళ్ళు, స్వచ్చమైన   నగు మోము. సత్యానికివే చిరునామాలు. ప్రతీసారి నా ఒంగోలు యాత్రలో ఎదురై పలకరించే అతికొద్ది మంది మిత్రుల్లో తను ఒకడు. 
మా పరిచయం ౬-౭ ఏళ్లది. అది సంధి కాలం.నేను IT లో ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్న రోజులు. హైదరాబాద్ లో ఏదో ఉద్యోగం వెలగ పెడుతూ, పూర్తి ప్రయత్నం దీని మీద చేసేవాడిని. ప్రతి నెలలో ఒక్కసారైనా వూరికి రావటం. అందరిని కలవటం చేసే వాడిని. వచ్చిన ప్రతి సారి కరెంట్ ఆఫీసు ( మా నాన్నగారు అందులో నే పని చేసేవారు) కి వెళ్ళటం, పొద్దునా సాయంత్రం అక్కడ మిత్రులతో బాతాఖాని, కుదిరితే, సాయం కాలాలు షటిల్ ఆడుకోవటం. వెళ్ళిన ప్రతిసారి సత్యం కలిసేవాడు. తను చిన్న చిన్న ఎలెక్ట్రిక్ పనులు చేస్తూ అదే ఆఫీసు లో టెంపరరీ గా పని చేసేవాడు. 
మాలా వూర్లేమ్మట పడి ఉద్యోగాలు వెతుక్కోవాల్సిన అవసరం లేని స్తితిమంతులు వాళ్ళు. నిజం చెప్పాలంటే తనకు ఆ ఉద్యోగ అవసరం యెంత మాత్రము లేదు. కాని తన కంటూ ఒక పని, గుర్తింపు ఉండాలనే సత్తె కాలపు మనిషి. డిగ్నిటీ అఫ్ లేబర్ గురుంచి తెలుసుకోవాలంటే, సత్యాన్నే అడగాలి.ఆఫీసు లో ఈ పని ఆ పని అని కాకుండా అన్ని పనులు తనవే అన్నట్టు ఉంటాడు. ఇంట్లో పెళ్ళికొచ్చిన ౩  గ్గ్గురు  అక్క చెల్లెళ్ళ భాద్యత, వయసుడిగిన పెద్దవాళ్ళు ,వీళ్ళందరిని వదిలి ఎక్కదికేల్తాంలే బాబాయ్ అని ఒకటి రెండు సార్లు అన్న గుర్తు.
అదే కాలం లో మా పరిచయం పెరిగింది. నెలల కొద్దీ సాగుతున్న ఉద్యోగ ప్రయత్నాల గురుంచి నేను కొద్దిగా నిరాస గా మాట్లాడినా, అదే వస్తాదిలే శరత్ కొంచెం ఓపిక పట్టు. నువ్వు మాత్రం వదలక ప్రయత్నించు అనే వాడు. మిగతావాళ్ళతో కలిసి నా ధైర్యం పెంచే ప్రయత్నం చేసేవాడు. మాకేలాగు కుదరదు ఇల్లాంటి జాబ్స్ ట్రై చేయటానికి, వయసు, అవకాశం ఉన్న మీలాంటి వాళ్ళు ట్రై చెయ్యక పొతే ఎలా...
నిజమే. త్వరలోనే నాకు జాబు వచ్చింది. అలాగే నేను ఒంగోలు రావటం పోవటం తగ్గాయి.నేను చెయ్యకపోయినా వచ్చినపుడల్లా, నా బాగోగుల గురించి ఇంట్లో వాకబు చేసేవాడు.నేనేదో సాధించేసాను అన్న భావం తనతో మాట్లాడిన ప్రతి సారీ నాకు కలిగేది. జీవితం లో కష్టపడి పైకి వచ్చావ్ అబ్బాయి...సామాన్యంగా ఇంట్రోవేర్ట్ అయిన సత్యం నుంచి వచ్చిన నేనెప్పుడు తలుచుకునే కామ్ప్లిమెంట్లు. 
అల్లాంటి సత్యం నేడు లేడు అని అమ్మ ఫోన్ చేసినప్పుడు నమ్మ బుద్ది కాలేదు.  నిజంగా పొద్దున్నే నిద్రలో నేను కలవరిస్తున్నానేమో..ఇదంతా కలేనేమో...
లేదురా...కరెంట్ పని చేస్తూ షాక్ కొట్టి..అమ్మ ఇంకా మాట్లాడలేదు...తన నవ్వు మొహం నా ఊహల్ని కప్పేసింది. ఏం ఎందుకని ఏం తప్పు చేసాడు తను...నేనేరుగగా..ఎవరిని పల్లెత్తు మాట అనలేదు..ఎవరి గురుంచి తప్పు మాట్లాడలేదు...నిజంగా దేవుడనే వాడు ఒకడు ఉండి, తనే జన్మ మరణాలకు కారణం అయితే, ఆయన చాలా తప్పు చేసాడు. తన ఇద్దరు చిన్నారుల మొహం చూసి అయినా ఆ పాపిష్టి దేవునికి దయ రాలేదా...నాన్న యేడి అని వాళ్ళు అడిగితె, అయన ఏమి సమాధానం చెప్తాడు..ఇంకా నూరేళ్ళ జీవితం ముందుంది కదా...అప్పుడే ఎందుకిలా..
తన మరణం నాకింకా నమ్మ శక్యం కాదు...నా లాజిక్ కి అందదు...కాని ఒకటి మాత్రం నిజం.దేవుడు చాల చిన్న చూపు చూసాడు...అతనిమీద అతని కుటుంబం  మీదే కాదు...తన చిరునవ్వుతో రోజు స్పూర్తిని పంచే పలకరించే నాలాంటి యెంతో మంది మీద..

2 comments:

  1. మంచి వాళ్ళనే దేముడు తొందరగా తీసుకుని వెళ్ళిపోతాడు.. పాపి చిరాయువు..
    పుణ్యం చేసే వాళ్ళకి తొందరగా మోక్షం లభిస్తుందేమో.. అయితే వాళ్ళ కుటుంబానికి తీరని లోటే..

    ReplyDelete
  2. heart touching sir, may his soul peace

    ReplyDelete