Sunday, February 12, 2012

పెన్ను కొచ్చెను పొయ్యేకాలం..అమెరికతలు-౧౪

అదేమీ రాత రా..కృష్ణా నదిలా అని వంకరలు తిరిగింది..మా తెలుగు మేస్టారి గొంతు నాకింకా గుర్తుంది. బడిలో ఉన్నప్పుడు నా చేతి రాత మీద ఆయనకున్న అభిమానమంతా రెండు మూడు పదాల్లో పెట్టలేక తెగ ఇబ్బంది పడేవాడు ఆయన.మనసులో భావం గొంతులో సరిగ్గా పలికించలేక.పోనిలే పాపం ఆయన కోసమైనా సరిగ్గా రాద్దాం అంటే, దాని దుంప దెగ, నా పెన్ను ఒక దున్నపోతును కట్టి లాగుతున్న నాగలి లాగ సహస్ర వంకరలు పోయేది.ఇక మన బాషలో ఉన్న వత్తులు పొల్లులు, వీటి సిగదరగ..అదేమిటో మా చెడ్డ తల పొగరు వాటికి..
తప్పంతా నాది కాదు పెన్నుది అని చాల పెన్నులే మార్చినట్టు గుర్తు. ప్రతి పరీక్షకి నేను పొద్దునే వెళ్ళటం, పెన్నుల కొట్టు సుబ్బా రెడ్డి 'ఎమబ్బా...నిన్ననే గదా పెన్ను కొనినావు..అప్పుడే యమాయే' అని అడగటం...ఈ తంతు ఒక సంవత్సరమే నడిచింది. తర్వాత్తర్వాత , నాలుగు తన్నులు పడ్డ కొంటె కుర్రాడువలె ఆయన కొన్ని ప్రశ్నలు అడగటం మానుకున్నాడు. ౫ పరీక్షలకి ౫ రకాల పెన్నులు సిద్దం గా పెట్టడం నేర్చుకున్నాడు.
ఈ నా పెన్నుదారా వ్రతానికి బెంబేలెత్తిన మరో మనిషి మా నాన్నగారు.రోజుకో పెన్ను దేనికి అంటే, నిన్న అది సరిగా రాయలేదు అని నా గోడ మీద కొట్టిన బంతి జవాబు. ఆయన పరిశోధన లో తేలిందేమంటే, తప్పు పెన్నులో లేదు నాలో ఉంది అని.ఇంకా చూస్కో నాయనా, కాపీ పుస్తకాలు,అదేమిటో పెద్ద పెద్ద లైన్ లవి, రెండు లైన్ ల మద్య కక్కుర్తిగ  ఉండే చిన్నచిన్న లైన్లవి. కట్టలు కట్టలు తెచ్చి ఇంట్లో పడేసేవాళ్ళు. రెండు మూడు సార్లు ఆయనే చేత్తో పట్టి రాయించడం గుర్తే.
కొన్ని రోజుల తర్వాత, మా నాన్నగారు మంచి గుండ్రటి అక్షరాలూ రాయటం నేర్చుకుంటే, గుడ్డి లో మెల్ల లా నా రాత మనుషులు చదివే విదంగా తయారయ్యింది.అప్పుడప్పుడు నా పుస్తకాల్లో కనపడి పలకరిస్తాయి అ రాత పుస్తకాలు. తరతరాల అణచివేతకు గుర్తుగా వాటిలోంచి తొంగి చూస్తుంటాయి నా చిన్నప్పటి అక్షరాలూ.
ఈ మద్య కాలం లో నా చేతి రాత పేపరు మీద చూస్కొని చాల కాలం అయింది.చేతి రాత ను బట్టి మనస్తత్వం కనిపెట్టేవాళ్ళు నైల్ కట్టర్లు కొనటం మానేసి కూడా చాల కాలం అయి వుంటుంది.ఈ దెబ్బతో నా రాత బాలేదు అనేవాల్లకీ ఆ ఛాన్స్ లేదు.అసలు పెన్ను వాడటమే అక్కర్లేదు కదా ఇప్పుడు.
ఆ మద్య కొన్ని రోజులు పెన్ను , ఫోన్ నం గట్రా రాసుకోటానికి ఒక చిన్న పుస్తకం జేబులో ఉండటం గుర్తే.
ఇప్పుడు నా ఫోన్ తోనే అన్ని పనులు అయిపోతున్నాయి.చెక్కుల మీద సంతకం పెట్టడం లాంటి పనులకు కూడా ఎలెక్ట్రిక్ పాడ్లు వచ్చాక పెన్నుతో ఆ పని కూడా లేకుండా పోయింది.
బ్లాగులు గట్రా రాసుకోవటానికి, పెన్నెందుకు టైపు చేస్కో వచ్చు కదా.ఇక్కడైతే  హాయి గా ఎన్ని సార్లైనా రాసుకోవచు తుడుపు కోవచ్చు. వొక సారి వెనక్కు తిరిగి చూసుకుంటే,అందరి అక్షరాలూ ఒకేలా ఉండటం నాకు పెద్ద ఉపసమనం.
ఈ లెక్కన కొన్ని రోజులకి మా పిల్లలు మీ పిల్లలు, సత్తే కాలం లో మా పూర్వీకులు పెన్ను వాడేవాల్లని చదువు కోవటం.మ్యుజియంలో డైనోసార్ ఎముకల పక్కన మనం ఈ నాడు వాడుతున్న పెన్నులు అపురూపం గా పెట్టుకు చూసుకోవటం జరగుతుందేమో. ఒకానోకాపుడు కనిపెట్టబడి వాడబడి అవసరం లేకుండా పోయిన వేలాది వస్తువులలో పెన్ను చేరటం తద్యం అనిపిస్తుంది. 
ఈ విషయం పై తాజాగా ఈనాడు లో ప్రచురితమైన వ్యాసం.
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20120624a_003101013&ileft=270&itop=1196&zoomRatio=133&AN=20120624a_003101013



5 comments:

  1. అవునండీ!! అంతెందుకు..నేను కలం పట్టాలంటే..చాలా బద్ధకం పెరిగిపోయింది. ఇదిగో..ఇలా అలవాటు అయిపొయింది. అక్షరం అక్షరం కూడా బలుక్కుంటూ నిరక్షరాస్యులు.. అర్జంట్గా చదువు బాట పట్టి సంతకం కి సరి పడా నేర్చుకుని అక్షరాస్యులు అయిపోయినట్లు అని బ్రతికేస్తామేమో అని దిగులు పట్టుకుని.. డైరీ..వ్రాయడం,మిత్రులకి ఉత్తరాలు వ్రాయడం చేస్తుంటాను.
    ఒక అయిడియా.. బ్లాగ్ పోస్ట్ లు చేతి వ్రాతతో ..వ్రాస్తే.. బాగుంటుంది కదా!

    ReplyDelete
  2. ఏమండోయ్,

    'పెన్ను పోటు' తప్పిందంటారు అయితే !

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. Guess we are 0.09% in agreement with this PEN point. Please allow me to share this old post of mine.

    http://sangharshana.blogspot.in/2008/05/blog-post_14.html

    ReplyDelete