Friday, March 9, 2012

పెద్ద మనిషి రిటైర్- అమెరికతలు-౧౬



మొన్నెప్పుడో పర్సులో చెత్త ఎక్కువైందని చూస్తుంటే, బైట పడ్డది. డిగ్రీ నుంచి నేను పదిలంగా కాపాడు కొంటున్న చిన్న ఫోటో.కట్ కొట్టాడో ఏమో అటు వైపు చూస్తూ, తనదైన స్టైల్ లో బాట్ ఇంకో చేతులో పదిలం గా పట్టుకొని రన్ కోసం పోతున్న యువకుడు. రాహుల్ ద్రావిడ్.
రికార్డులు ప్లకార్డులు పక్కన పెడితే, ఇండియన్ క్రికెట్ లో నేను చూసిన   స్టైలిస్ట్ బాట్స్మన్.కట్ కొట్టినా, స్ట్రైట్ డ్రైవ్ చేసినా, పుల్ చేసినా,లేట్ కట్ చేసినా, అతను ఆడితేనే చూడాలి. టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఉంటుందో కాని, ద్రావిడ్ ఆట చూసి టెక్స్ట్ బుక్స్ రాయచ్చేమో అన్నట్టు  అనిపిస్తుంది.
ద్రావిడ్ ఆట తీరు బహు ముచ్చట గొలుపుతుంది. ప్రతి షాట్ లో ఖచితత్వం.అదేదో డాక్టర్ శాస్త్ర చికిత్శ చేస్తున్నట్టు, శిల్పకారుడు , శిల్పాన్ని మలుస్తున్నట్టు, ఏకాగ్రత సున్నితత్వం కలగలిపి, ఇంకెవరైనా అదే షాట్ ఆడితే చూడబుద్ది కానంత నైపుణ్యం తో ఆడటం ద్రావిడ్ కే చెల్లు.
రాహుల్ వ్యక్తిత్వం అతనిలో మరో కోణం. గెలుపోటములలో తొణకని నైజం.నేటి క్రికెటేర్లలాగా  ప్రతి చిన్న విషయానికి పేపర్ల కు ఎక్కటం, నానా యాగి చెయ్యటం రాహుల్ కు తెలియదు. బైట వచ్చే ఆరోపణలను, విమర్శలను తన ఆట తీరు తో జవాబు చెప్పడం తనకు అలవాటు. వయసుకి మించిన పరిణతి రాహుల్ లో చూడొచ్చు.అందుకే పెద్దమనుషుల ఆటలో రాహుల్ చాలా పెద్ద మనిషి.
ఇంతకూ,నా పర్సు సంగతి చెప్పలేదు కదూ.నేను ఆ ఫోటోని బద్రంగా  అందులోనే పెట్టాను.

4 comments: