Friday, September 14, 2012

నిన్న..నేడు…


నిన్న పొద్దున్నే లేవగానే, మళ్ళీ తెల్లారిందా అన్న భావం వచ్చేది.మల్లా అదే దరిద్రగొట్టు ఆఫీసు, అవే తొక్కలో పనులు……ఏదో రెడీ అయ్యాం అనిపించి రోడ్డు మీద పడితే, ఆఫీసు టైం లో
ట్రాఫిక్ సంగతి చెప్పేదేముంది…హాయి గా కార్లో పోదాం అంటే,పెట్రోల్ ధర ఆకసాన్నంటుతుంది. ఆ పెద్దాయన్ని గడ్డం లాగి, వీపు మీద నాలుగు గుభి,గుభి మని కుమ్మాలని పిస్తుంది. సరే,ఏ షేర్ ఆటో లోనో కూలబడితే, మన అదృష్టానికి తోడూ,ఎవరో మగానుభావుడు(మా తమిళ కొలీగు ఇలాగే అంటాడు)  అదే టైం కి ఎక్కడికో బయలుదేరతాడు. వాడి కోసం, మన అటు ౪ కి.మీ. ఇటు నాలుగు కీ.మీ ట్రాఫిక్ ఆపేస్తారు. ఆఫీసు కెళ్ళే వాళ్ళ బాధలు పట్టవా…అయినా,కాస్త ఆఫీసు టైం తర్వాత బయలు దేరచ్చు కదా. ఆ కార్లోంచి బైటకి లాగి బుర్ర రామ కీర్తన పాడిస్తేనా…నా సామి రంగా..ఆయన వల్ల  ౧/౨ గంట లేటు….ఆఫీసు భవనం చూడగానే మల్లా వచ్చేసామా, ఏదైనా సునామి వచ్చి ఇదెందుకు కొట్టక పోదురా భగవంతుడా,  ఎదుట మా మానేజరు, గుడ్ మార్నింగ్ చెప్తే, ఒక సగం నవ్వు నవ్వారు. లేటుగా వచ్చావు అని చెప్పడమేమో…ఆ నవ్వు భావమేమి మల్లిఖార్జునా….

ఇక పని, నా డెస్క్ కొన్నేళ్లుగా ఎవరు క్లీన్ చెయ్యలేదేమో, ఇలాంటి చోట పని చేస్తే ఎలర్జీలు ఖాయం..ఇక సిస్టం ఆన్ చెయ్యగానే, పని పని పని…ఎప్పటికి తరగని పని..ఆన్ సైటు  వాడికి మనం పంపినదేమి నచ్చదు..ఇలా కాకపొతే అలా అలా కాకపొతే ఇంకో లా అని, వీడి దుంపతెగ.. రోజుకో తొక్కలో కొత్త పని, రోజుకో ఫార్మాటు….మల్లి చేసి, తిప్పి తిప్పి చేసి, అదే చేసి..అసంతృప్తి ముందు పుట్టి తర్వాత వీడు పుట్టాడేమో…ఇక మన వాళ్ళ సంగతి…మహా సీనియర్ ఒకాయన..ఉలకడు..పలకడు..బంగారం షాప్ పక్కన మురుగు కాలవలో బగారం రజను వెతికే వాడిలా, ౨౪ గంటలు ఆ మోనిటర్ లో మొహం పట్టుకుని ఉంటాడు..ఏదన్నా సందేహం వచ్చి అడిగితె, ఇది కూడా తెలియదా అన్నట్టు చూసి, నేను బిజీ రేపు డిస్కస్ చేద్దాం అంటాడు…ఆ రేపు ఎన్ని సినిమాల్లో రేపులైపోయినా రాదు..ఇంకా మన కింద వాళ్ళ సంగతి…వాడు సీట్ లో కన్నా, కాంటీన్ లో ఉప్పర మీటింగుల్లో ఎక్కువ పని చేస్తాడు…ఇలాంటి వాడి చేత పని  చేఇంచ దానికి బిన్ లాడెన్ రావాలేమో… ఈ కంపెనీ ని దేవుడే కాపాడాలి…ఇక మా మీటింగులు…వాళ్ళు అడిగే ప్రశ్నలకి, ఈ జీతానికి ఇంతే పని అని గట్టి గా అరవాలనిపిస్తుంది..

ఇంకా నేడు..కొంచెం రెఫ్రెషింగ్ గా అనిపించింది..పొద్దున్న లేవగానే…ఏదో తెలియని ఉత్సాహం…గభాలున రెడీ అయ్యి, బయలు  దేరాను ఒక అరగంట ముందే…అదే కలిసొచ్చింది..కరెక్ట్ గా టైం కి ఆఫీసు చేరాను..నిన్న వాన పడ్డదేమో…దానిదెబ్బకి, బాగా క్లీన్ అయి పోయి, ఇప్పటి ఎండ కాంతి లో మిల మిలా మెరిసిపోతుంది..మా ఆఫీసు భవనం…ఎవడు కట్టాడో కాని మంచి అభిరుచి…..

మా మానేజరు..నేను గుడ్ మార్నింగ్ చెప్పినా తల పైకేత్తలేదు…బిజీ గా ఉన్నాడేమో..ఆన్ సైట్ వాడు,కొత్త చెత్త పని పంపాడు…పాపం దేశం కాని దేశం లో ఆ తెల్లోళ్ళ మద్య యెంత కష్టపడుతున్నాడో బిడ్డ…నా జేబులో కర్చీఫ్ తీసి మోనిటర్ ని సుబ్రం గా తుడిచాను. నా స్క్రీన్ మద్య లో ఎప్పుడూ కాన పడే పెద్ద చుక్క..మోనిటర్ ప్రాబ్లం వల్ల కాదని అప్పుడే తెలిసింది..నా పక్కన సీనియర్ ఏదో అడిగితె మళ్ళా రేపన్నాడు..ఆ రేపు కోసం ఎదురు చూడాల్సిందే..పాపం చాల కిందా మీద పడుతుంటాడు..ఆయనకీ, టైం ఉండాలి కదా..ఇక మా కింద వాడి ని కాంటీన్ లోనే పట్టుకుని, ఏమి చెయ్యల్లో బాగా డిస్కస్ చేశా…ఆ చిప్స్ కరకర లో ఏమి విన్నాడో..ఏమో…అయినా కొత్త వాడు కదా..కొంచెం టైం పడుతుంది…వీడు జనజీవన స్రవంతి లో కలవడానికి…

వీడి సిగ తరగా…వీడికేం పొయ్యేకాలం వచ్చింది..ఇందాకటి దాక బానే ఉన్నాడు గా అందర్నీ తిట్టు కుంటూ…అనుకుంటున్నారా…

ఈ రోజే మాకు ఇంక్రిమెంట్ వచ్చింది లెండి…



ఇట్లు మీ శ్రేయోభిలాషి, రోశయ్య నగర్.


అదేనండి మా ఒంగోలు.రేపో మాపో మన ప్రియతమ ము.మ మీద పైవాల్లకు దయ కలిగితే, ప్రకాశం రోశయ్య జిల్లా అయి పోవచ్చు.ఒంగోలు ఏ రోశయ్య నగరో, రోసి వాడో అయి పోవచ్చు.ఏమీ, కడప వై.ఎస్.ఆర్ జిల్లా అయి నప్పుడు ఇదెందుకుకాదు.భేషుగ్గా అవ్వచ్చు.అయినా , ఈ లెక్కన కొన్నాళ్ళకు విశాఖ తిక్కరామ జిల్లా అవ్వచ్చు,విజయనగరం బొత్స జిల్లా అవ్వచ్చు.వీల్లెమన్న చిన్న చితక నాయకులా సమస్యే లేదు.ఐన ఇప్పుడు చిరంజీవి కూడా మనోడే కదా, కృష్ణ జిల్లా చిరు జిల్లా చేస్తే పోలా.
ఎన్నో శతాబ్దాలు గా ఏర్పడ్డ జిల్లాల పేర్లు, ఆ ప్రాంత చరిత్ర ను ప్రతిబింబిస్తాయి.వంగవోలు ఒంగోలు అయినట్టే, దేవుని గడప కడప అన్నటు. కోల్కత్త పేరు మార్చినా, ముంబై పేరు మార్చినా నాకు నచ్చలేదు.ఎందుకంటె, రకరకాల కారణాలవల్ల ప్రాంతాల పేర్లు మార్పుకు లోను కావటం సహజం.కనట కెనడా అయినట్టు.మరి దానిని మల్ల కనట అనటం కొంచెం ఇబ్బందికరము, అనవసరము కూడా. మరి ఆ విషయమే అలావుంటే, మనం ఇంకొంచెం ముందడుగేసాము. పురాతన ప్రాంతాల పేర్లు మార్చి, మనోల్ల పేర్లు పెట్టుకుంటూ పొతే కొన్నాలకు ఒక విజయవాడ మిగలదు ఒక అమరావతి  మిగలదు.
మాయావతి బొమ్మలు పెట్టుకుందని నసిగే ముందు మనమేమి చేస్తున్నామో పునరావలోకనం చేసుకుంటే మంచిది.ఈ పేరు మార్పు వల్ల, ఎవరికి లాభం.ఒక్క కొత్త ఉద్యోగమైన పుడుతుందా.ఏమైనా వీసమెత్తు అభివృద్ధి జరిగిందా.బొమ్మలు పెట్టి పేర్లు మార్చి మనం సాదించే దేమిటో. రోడ్డు మీద ట్రాఫ్ఫిక్ సమస్యలు సృష్టించడం తప్ప.మన చరిత్ర మనమే మరిచి పోవడం తప్ప.అయినా ఈ నాటి నాయకులు ఇంకొక ఎన్నికల తర్వాత జనాలకు గుర్తుంటార అనేది వంద కోట్ల ప్రశ్న.అలాంటప్పుడు వందల ఏళ్ళ నుంచి వస్తున్న పేర్లని మార్చడం అవసరమా?? ఈ నాటి నాయకులలో  ఏ ఒక్కరికి అంత విషయం లేదు అనేది నిర్వివాదాంశం.
నా భయం ఏమి టంటే, మన పురాతన పార్టీ లో ముసలోల్లకేమి కొదవ లేదు.రేపో ఎల్లుండో ఎవరైనా బాల్చి తన్నేస్తే, ఈ సారి ఏ జిల్లాకు మూడుతుందో

కరునామయులు…


మొన్నామధ్య మన కసాబ్ తీర్పు మీద అదేదో ఛానల్ లో చర్చా కార్యక్రమం. ఒకామె తెగగింజుకోవడం చూసాను.ఉరిశిక్ష వేస్తె, ఆయనకీ తను చేసిన తప్పు తెలియదట…శిక్ష పరివర్తన తేవాలి అని భాధ పడి పోయింది. ఇలాంటి వాళ్ళకు మన దేశం లో తక్కువేమీ లేదు. ఈవిడ ఇంట్లో వాళ్ళో బంధువులో ఆ దాడి లో పోయుంటే ఆమె ఇలా మాట్లాడేద?? సి.ఎస్.టీ లో జరిగిన మారణ హోమం, ప్లాట్ ఫోరం పైన అటు ఇటు చెల్లాచెదరైన మృతదేహాలు, ఎటు చుసిన రక్తం, తామెందుకు చనిపోతున్నమో తెలీక, ఏమి జరుగుతుందో తెలీక ప్రాణాలు విడిచిన ప్రజలు…పిల్లలు, మహిళలు, వ్రుద్దులని తేడాలేక జరిగిన దారుణం…మత పిచ్చి తో మదమెక్కిన మూకల నర మేధం…మీరు దేశభక్తి తో ఆలోచించక పోయినా మానవత్వకోణం లో నైన హృదయ విదారకం.
నారిమన్ హౌస్ లో అమాయకుల ఊచకోత, తాజ్ ముట్టడి ఇవన్ని ఎలా మర్చి పోతారు. సలస్కర్, ఆమ్టే, ఉన్నికృష్ణన్  లాంటి వీరుల బలిదానం, మనమెలా మర్చి పోగలం. మరి వీటన్ని టికి కారణం అయిన వాళ్ళను వదిలెయ్యాలా…
నారిమన్ హౌస్, తాజ్, మరి ఇతర చోట్ల జరిగిన సంఘటనలు ఈ దేశం ఉగ్రవాదులకు యెంత సాఫ్ట్ కార్నెర్ గా మారిందో చెప్పకనే చెప్తున్నాయి. మరి దొరికిన వాడిని కూడా క్షమాభిక్ష లేక పరివ్వర్తన అని వదిలేస్తే, రేపు ఈ ఇలాంటి సంఘటనలు రొజూ జరగోచ్చు. ఇంత జరిగిన మన ఘనత వహించిన న్యాయ వ్యవస్థ కసాబ్ గారికి ఎన్నో బంపర్ ఆఫేర్లు ఇస్తోంది…ఆయన మల్ల supreme కోర్ట్ కి వెళ్ళచ్చు. అక్కడా అదే తీర్పు వస్తే రాష్ట్రపతి క్షమా భిక్ష అడగడానికి ఇలాంటి తిక్క జనానికి మన దేశం లో కొదువ లేదు.
౧౬౧ మంది మరణానికి కారణమైన ఒక కిరాతక ఉగ్రవాదిని ఉరి తియ్యాలి అని డిసైడ్ కావటానికి మనకి ఇన్ని రోజులు పట్టింది. ఐన అది జరుగుతుందో లేదో తెలీదు.ఇలాంటి మానవతా వాదులు కరునామయులు ఉన్న దేశం లో యెంత మంది కసాబ్ లు లాడెన్ లు వచ్చిన మనం వాళ్ళను పరివర్తన చేసి పంపాలి కాని… అనే నసిగే జనాలను ముందు ఉరి తీయ్యాలి. ఇలాంటి  విషయం లో నైన మనం ఐక్యత చూపక పొతే రేపు ఈ సంఘటన మీ వీదిలో మీ ఇంట్లో జరగోచ్చు…అప్పుడు ఆలోచించ డానికి, ఆరోపించడానికి ఏమి మిగలదు…

పరమ గురుడు చెప్పిన వాడు పెద్దమనిషి కాదు రా..


రష్యా చరిత్ర లో ఒక సంఘటన. జార్ చక్రవర్తి పీటర్ ఖజానా నింపుకునేందుకు ఒక చిన్నచిట్కా వేస్తారు. ఎవరైతే కొన్ని అంగుళాల కన్నా ఎక్కువ గడ్డం పెంచుతారో వారు నెల వారి గా ప్రభుతవానికి పన్ను కట్టాలి. అప్పట్లో గడ్డం పెంచడం ఒక కులీనుల సరదా, అవసరమున్ను. యెంత గడ్డం ఉంటె అంత పెద్దమనిషి అన్నమాట. మరి చచ్చినట్టు అలాటి వాళ్ళంతా పన్ను కట్టేరు. ఆ డబ్బు వాళ్లతో  వీళ్ళతో యుద్దాలు చెయ్యడానికి మరి పీటర్స్ బుర్గ్ అనే గొప్ప నగరాన్ని కట్ట డానికి ఉపయోగపడింది.
ఈ మద్య నడుస్తున్న చరిత్రను చూస్తే ఎందుకో దీన్ని మన దేశానికి అన్వయిద్దాం అనిపించింది. ఈ రోజుల్లో మన దేశం లో గడ్డం పెంచితే బాబా జుట్టు పెంచితే స్వామీ. గీత, రామ అంటే పరమహంస. నేనే దేవుణ్ణి అంటే భగవాన్. దేవుడి పెళ్ళాం, అనుమానం ఎందుకు అమ్మ భగవాన్. ఇంకా నయం మరిది భగవాన్, కొడుకు భగవాన్ రాలేదెందుకో. వీళ్ళు పోయాక వాళ్ళేమో. ఈ లాజిక్ పనిచేస్తే ఇలా అవడం పెద్ద కష్టం కాదు. ఒక ౪ నెలలు క్షురకుడి దగ్గరకు వెళ్ళాక పొతే సరి…మీరే ఒక స్వామి. పైన పీటర్ లా ఆలోచించిన మన ఖజాన కి  ఎంతో కొంత డబ్బు రాక పోదు.
ఇంకో కధ. పూర్వం ఒక స్వామిజి వాళ్ళ శిష్యులతో  కలిసి అదేదో నది దాటుతున్నారట. అక్కడ ఒక అమ్మాయి నది దాటలేక అవస్త పడుతుంటే స్వామీజీ తన భుజాలపై ఎక్కుంచుకొని నది దాటిన్చారట. నది దాటాక వాళ్ళు నగరమంతా తిరిగి భిక్ష తీస్కుని ఒక చెట్టు కింద కూర్చున్నారు. కాని శిష్యులు సర్వ సంఘ పరిత్యాగి ఐన గురుజి ఇలా చెయ్యడం ఏంటి అని ఆలోచిస్తున్నారట. అప్పుడాయన అబ్బాయిలు నేను ఆ అమ్మాయిని ఎప్పుడో దిన్చేసాను. మీరు ఇంకా నెత్తి నెట్టుకున్నారెందుకు అని అడిగారట.
ఈ గురు వేవడో సత్తే కాలపు మనిషి లా మీకు అనిపించటం లో ఆశ్చర్యం లేదు. ఎందుకని పించదు. గురూజీ అంటే జనం ముందు గీత పారాయణం. రాత్రి కి ఏమిటో మీరీ పాటికి రకరకాల టీవీ చాన్నేల్లలో రక రకాలు గా చూసే ఉంటారు. ఆ nityananda కి నా స్నేహితులు చాల మంది మంచి ఫాన్స్. నన్ను కూడా విన మని రెండు మూడు సార్లు డీ వీ డీ లు గట్త్ర ఇచ్చారు. కాని, టైం కుదరకో టైం బాగుందో మరి నేను చూడలేదు. కాని nityananda చాల శక్తి వంతులు. ఆయన లీల వినోదం చూపించే తీరారు.
ఇక గడ్డం పెరిగిన భగవాన్. మత్తు మందులో మరో ప్రపంచం చూపించే కల్కి. ఆ మత్తు లో ప్రపంచం చూడటం ఏమి ఖర్మ, కొత్త  ప్రపంచం స్తాపించేయ్యోచ్చు. అనుమానమా, మన దాసాజిలను అడగండి. ఆత్మా పరమాత్మ సంగమం అంటే మంచిగా ౪ రౌండ్లు ప్రసాదం పుచ్చుకుంటే ఇట్లే అర్ధం అయిపోతుందట. అమ్మ భగవాన్ సంస్కృత ఘోష కూడా ఆంధ్ర దేశం అంతా విని తరించేసింది.
ఇవన్ని అనవసరం అండి, ఈ బాబా లు భగవాన్ లా వెంట పడి పోయే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న. సర్వ సంఘ పరిత్యాగి కి డబ్బులెందుకు. ప్రపంచాన్నే మార్చే భగవాన్ లకు పైసా లెందుకు. దర్శనం కి ఒక రేటు. ఇంకో డానికి ఇంకో రేటు, ఆ డబ్బులన్నీ పెట్టి అయ్యవారు పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే కొడుకు భగవాన్ ౬-౭ కంపెనీలు నడుపుతున్నారట. మన భక్తులు అది కూడా సమాజ ఉద్దరణ అంటారేమో.
నాకొక అనుమానం. మన nityananda రేపు మల్ల ఒక ప్రెస్ మీటింగ్ పెడతారేమో. ఆ అమ్మాయి కి కామి కాని వాడు మోక్ష గామి కాదు అని భోదిస్తుంటే మీడియా వక్రీకరించింది అని. ఇన్ని నమ్మిన గొర్రెలు అదీ నమ్మినా ఆశ్చర్యం లేదు….
కల్కి దర్శనం…nityanandam…nityanando ranjito rajnithaha ;)

అమెరికతలు-2..


౨-౩ రోజులుంచి అటు ఇటు తిరుగుతూ  సరిగ్గా నిద్రలేదేమో, బాగా నిద్ర పట్టేసింది. లెగిచి చూద్దును కదా ఏ దేశం మీదున్నామో తెలియక పోయినా  తెల్లారినట్టు తెలిసింది. వాచి చూసుకుంటే ఒక ౮ గంటలు నిద్రేసాం  అని అర్ధం అయ్యింది. బ్రేక్ ఫాస్టు అవి కానిచ్చి, పక్కనున్న బాబాయి గారితో లోకాభిరామాయణం మొదలెట్టాను. ఆయన అదే మొదటి సారి యు.ఎస్ పిల్లల దగ్గరకు వెళ్తున్నారని తెలిసింది.లావేట్రి దగ్గర కునికి పాట్లు పడుతున్న ఇద్దర్ని చూపించి, అదేంటబ్బాయి అందరు ఇక్కడే నిలబడక పొతే బైటకేల్లోచ్చు కదా…అన్నాడు.అప్పుడే ఏదో కొంచెం ఉన్న నిద్ర మత్తంతా దెబ్బకి యెగిరి పోయింది.
విమానం లో సందడి అంతా సీమ టపా కాయలదే. ఇటు పరిగెత్తి అటు పరిగెత్తి, తల్లి దండ్రులను నానా హైరానా పెడుతున్నారు. మనోల్లలాగా ఒక దెబ్బేస్తే, గమ్ముగా ఉండే ఘటాలు కాకపోయె. అదీ కాక, అమెరికా లో ఉన్న చట్టాల ప్రకారం, వీళ్ళను రెండు దేబ్బలేస్తే, అదేదో నెంబర్ కి ఫోన్ చేసి తల్లిదండ్రుల మీద కూడా కంప్లైంట్ చేసెయ్యచ్చు.ఎందుకొచ్చిన గొడవ అని, ప్లీజ్ కన్నా, కం హియర్ అని ఒకా యన బ్రతిమాలుతుంటే, హే బడ్డి, ప్లీజ్  డూ దట్ అని ఇంకో కాయన బామాలుతున్నాడు. అయినా వాళ్ళు అంత సులభం గా వింటే, విమానం లో సందడి ఏముంది.
మొత్తానికి చికాగో చేరాము.ఇప్పుడే మొదలవుతున్న చలి కాలం. విమానాశ్రయం లోనికి ప్రవేశించే ద్వారం దగ్గర ఎలా వచ్చిందో చలి గాలి గిలిగింతలు పెట్టింది.అమెరికాకు స్వాగతం నేస్తం…ఇమ్మిగ్రేషన్ పనులు ముగించుకుని బైట పడే సరికి, నా లింకు విమానం కాస్తా తుర్రున పోయింది. అమెరికన్ ఎయిర్ లైన్స్ కౌంటరు లో పిల్ల యు మిస్సేడ్ ఇట్ బై  టెన్ మినిట్స్ అని పళ్లన్నీ బైట పెట్టి చెప్పింది. నా ఫ్లైట్ మిస్ ఐతే ఈమె కెందు కింత ఆనందమో…లేక టీవీ లో వార్తలు చదివే వాళ్ళలాగా అలవాటయి పోయిందేమో.సరే తల్లి ఎప్పుడు ఫ్లైట్ మల్లి అని ఏడవలేక ఒక చచ్చు నవ్వు నవ్వి అడిగాను. ఇంకో ౨ గంటల్లో అని చెప్పింది.
ఇంకేం చేస్తాం, కే.ఎఫ్.సి లో ఏదో కొన్ని వేపుడు దుంపలు, మరి టొమాటో సాసు తలగేసు కొని కుర్చీ లో కూల బడ్డాను.ఇంత బతుకు బతికి అన్నట్టు, యెంత మొనగాడైనా, ఈ దేశం లో ఈ చెత్తంతా  తినాల్సిందే…ఎదవ జీవితం
పక్క సీట్ లో ఒక తెలుగు అమ్మాయి. వాళ్ళ స్నేహితులు.కార్తిక మాసం అంట…యేవో పళ్ళు,దుంపలు తెచ్చుకుంది.ఆహ ఏ దేశమేగిన, యందు కాలిడినా, తల పాగా తీసి గౌరవించాల్సిందే ఇలాంటి వాళ్ళని  ( హాట్స్ ఆఫ్ కు నా తెలుగీకరింత…పోయిన టపా లో మిత్రుల కోరిక మేరకు,సాద్యమైనంత వరకు తెలుగు లోనే రాద్దామని చిన్న ప్రయత్నం ;) )
డిట్రాయిట్ చేరే టప్పటికి ౫ అయింది. బ్రతుకు జీవుడు ..ఇక హోటల్ కెళ్ళి బజ్జుంటాను అని లోపల్నించి గోలేట్టేస్తున్నాడు. లగేజు చూద్దును కదా..ఒక బాగు మిస్సింగ్…ఎయిర్ లైన్స్ వాళ్ళను అడిగితె, ఇదేమన్న కొత్తా అన్నట్టు మొహం పెట్టి, వచ్చే ఫ్లైట్ లో రావచ్చు ఇంకో గంట పడుతుంది, లేకుంటే, ౨ రోజుల్లో మీ అడ్రస్సు కు పంపుతాము.అన్నది.ఏమి చేస్తాం, ఇంకో గంట వెయిటింగ్ అన్న మాట.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ ఆంధ్ర ( యు.ఎస్.ఏ లో ఉన్న మన తెలుగోళ్ళ సంతతి ని చూసి కళ్ళు కుట్టి, మా తమిళ కొలీగు చేసిన కామెంట్) లో తెలుగోల్లకేం తక్కువ.మళ్ళా ఒక తెలుగాయన.డిట్రాయిట్ లో కన్సుల్టేన్సీ ఉందట.అక్కడే పరిచయం అయ్యాడు. కాసేపట్లోనే, ఇది వరకు జాబు మార్కెట్, ఇప్పుడు పరిస్తితి అదీ ఇదీ అని బాగా ఊదర కొట్టేసాడు.ఎంతలా అంటే ఇంకాసేపుంటే నేనే హెచ్౧ కి అప్లై చేసేటట్టు అబ్బే చాల ఈజీ అండీ…మా ఆఫీసు లో నిన్ననే ౪ హెచ్ ౧ లు చేసాము. అన్నాడు.నా వివరాలు కనుక్కున్నాడు.ఫోన్ నెంబర్ తీస్కున్నాడు. వీకెండ్ ప్లాన్స్ ఏంటి కలుద్దాం బ్రదర్ అన్నాడు. అమాయకున్డను, నిజమే అనుకుంటిని, ఇంత వరకు మాట మంతీ లేదు. నా నెంబర్ తీస్కున్నంత తొందరగా మీ కార్డు ఇస్తారా అన్నా స్పందించలేదు. అబ్బే మీ నెంబర్ ఉంది గా..నేనే పిక్ చేస్కుంటాను…అని వాగ్దానం చేసాడు. ఇంతలో వాళ్ళ స్నేహితుడు రావటం తో బాయ్ చెప్పి బయలు దేరాడు. అంటే, అయ్యవారికి మంచి టైం పాస్ గాడు దొరికాడన్నా మాట ( నాక్కా దండోయ్   ).
ఇంతలో నా బాగేజు రావటం తో ప్రాణం లేచొచ్చి నట్టయ్యి, వడి వడి గా బైట పడి,హోటల్ చేరాను.
అదండీ, ఈ సారి నా ప్రయాణం లో పదనిసలు, అపసవ్యం గా గార్ధభ రాగం లో సాగాయి…మళ్ళా ఇంకో టపా లో  కలుద్దాం…ప్రస్తుతానికి ఇటు అటు కాని టైం జోన్ లో నా నిద్రా ప్రపంచం లో తిరుగాడుతున్నా …డోంట్ డిస్టర్బ్…

అమెరికతలు-౧


౨౦ నవంబర్ ౨౦౧౦.
అమెరికా కు మరో ప్రయాణం.అమ్మ, నాన్న అక్క వాళ్ళ ఫ్యామిలీ విమానాశ్రయం కి నాతొ పాటు వచ్చారు.వెళ్ళేటప్పుడు ఎప్పట్లాగే అమ్మ కళ్ళలో చెమ్మ.మొదటి సారి నాది అదే ఫీలింగ్.ఇంతకూ ముందెప్పుడూ ఈ ఫీలింగ్ లేదు.ప్రయాణాలు కొత్త కాకున్నా, ఈ సారెందుకో ఎప్పట్లాంటి ఉత్సాహం లేదు. ఉద్యోగ పరం గా, ఆర్దికం గా ఈ ప్రయాణం ఏంతో ముఖ్యమైంది కావచ్చు.కాని, వ్యక్తిగతం గా ఏదో కోల్పోతున్న ఫీలింగ్.అక్కడ సంపాదించేది, ఇక్కడ కోల్పోతున్న దాని కన్నా తక్కువేమో, ఇది నష్టం వచ్చే వ్యాపారమేమో…
చెక్-ఇన్ లో ఎక్కువ బరువున్న బాగేజీ నన్ను వెక్కిరించింది.డు ఐ నీడ్ టు పే ఎనీ తింగ్? అర్ధోక్తిలో అడిగాను. ౨ కిలోలకి ఏమి కదతారులే? జవాబు కూడా అర్దోక్తి లోనే ఇచ్చింది కౌంటర్ లో అమ్మాయి. మొత్తానికి  కొంచెం ఎక్కువ బరువున్న ఆవకాయ పచ్చడి పాస్ అయిపొయింది.ఇమ్మిగ్రెషున్ ముందు యౌజర్ చార్జి కౌంటర్. కట్టి మూడేళ్ళు దాటిన విమానాశ్రయం కి ఇప్పుడు ఈ తద్దినము ఏమిటో ఏలిన వారికే తెలియాలి. తెనాలి రామ లింగ సినిమాలో చాకలి రంగడు అన్నట్టు, ఏలినోల్లు చల్లగా చూస్తె ఎవరి పని వాళ్ళు చక్కగా చేసుకుంటారు, అదీ సంగతి.
కాని ఇక్కడో కొసమెరుపు.ఎయిర్  ఇండియా వాళ్ళు రాత్రి ౧౨:౩౦ కి అఘోరించిన మిస్సేడ్ కాల్ కి ఉత్సాహవంతుడనగు టచే నేను కాల్ బ్యాక్ చేసి ఈ విషయము కనుక్కున్నాను కాబట్టి, తగు పైకము సమర్పించ గలిగితిని.నా వుత్స్తాహవంతులు కాని జనం అక్కడ బిక్క మొహం వేసినారు.౮౫౦ రూప్యంములు తక్కువ రొక్కము కానీ చేతనను, సదరు విమానాశ్రయం వారు చిల్లర దుకాణము వాని వలె డెబిట్/క్రెడిట్ కార్డులు అంగీకరించని కారణమున, ఆ కౌంటరు నందు రాజకీయ సభకు జన సమీకరణ చేసి నట్టు జనం పోగయినారు.నేను కట్టను అని భీష్మించే వాళ్ళు కొందరైతే, బాబ్బాబు ఎంతో కొంత తీస్కోన్డురూ అని బతిమాలేవాళ్ళు కొందరు.గ్రంధి గారి మంత్రాంగం వాళ్ళనేమీ చేసారో మరి.
ఇమ్మిగ్రేషన్ లో ఇంకో చిత్రం. డ్యూటీ దిగిపోయ్యే హడావుడి లో ఉన్న మహాతల్లి, వర్క్ వీసా మీద కొట్టాల్సిన ముద్ర విసిటర్ వీసా మీద కొట్టింది. ఆమె విసిరేసిన తర్వాత పీ.ఎస్.ఎల్.వీ రాకెట్టు వలె నా పైకి దూసుకొస్తున్న పస్స్పోర్టు ను స్లిప్స్ లో రాహుల్ ద్రావిడ్ క్యాచ్ పట్టినట్టు ఒడుపుగా పట్టి, ఆ తప్పు గమనించి కౌంటరు మూసి వడివడి గా వెళ్తున్న ఆమె వెంట బడి అడిగితె అదేమీ కాదు లే, అమెరికా వాళ్ళు చూసే వేస్తారు వాళ్ళకు చెప్పు అని అభయం ఇచ్చింది.
ఎంతైనా వాళ్ళమీద యెంత గురి.డిల్లి నుంచి బిల్లి లు తిరిగే గల్లిల దాక..హతోస్మి.
ఇక విమానాశ్రయం లో తినదగ్గ పదార్దాలున్న ఒకే ఒక పూటకూళ్ళ ఇంట్లో ఒక్కొక్కింటి ధర ౨-౩ డాలర్లు మన కరన్సీ లో మార్చి పెట్టినారు.బైట ౫ రుప్యంములకు దొరికే ఇడ్లి ఇక్కడ దాని సిగదరగ ౨౫ రూపాయలు అయి కూర్చున్నది. ప్రతి విషయం లో అమెరికా ను పోలో మని ఫాలో అయిపొయ్యే మన జనం ఇందులో ఎందుకు కారు. పెద్ద పెద్ద విమానాశ్రయంలలో కూడా కి.ఎఫ్.సి.,మేక దోనల్డు లాంటి వోటేలులు బైట రేట్ లే వసూలు చేస్తాయి. అబ్బే అలాంటి చెడ్డ అలవాట్లు మనకెందుకూ.
సరేలే ఏదొకటి అని సగటు భారతీయ ప్రయనీకుని లా ఆరోజు రాత్రి భోజన కార్యక్రమమును “మమ” అనిపించి,నా టెర్మినల్ దగ్గరకు వచ్చాను.నా పక్క సీట్ లో తెలుగు జంట.చికాగో వెళ్తున్నార్ష.గమ్మత్తేమిటంటే, ఆ అమ్మాయి ఇన్ఫోసిస్ లో ఉద్యోగి .మూడేళ్ళుగా ఉంటున్నారట.అతను డిపెండెంట్ వీసా.లేచింది మహిళాలోకం.నెత్తికి టవల్ కట్టుకుని అన్న గారు పిండి రుబ్బుతున్న దృశ్యం కాన్పించింది.
మనిషి మనిషి దీ ఒక చరిత్ర అన్నట్టు, ఇక్కడ ఒక్కక్కళ్ళ దీ ఒక్కో కధ.కొడుకులు,కూతుళ్ళ దగ్గరకెళ్ళే పెద్దోళ్ళు,మొగుళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళే పెళ్ళాలు,విద్యార్దులు ఉద్యోగార్దులు ఒక్కరేమిటి రక రకాలు.
౯ కి రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మామూలు గానే ౨ గంటలు ఆలీసమైనాది. జనం పిచ్చ పాటి మొదలెట్టినారు.విజయవాడ  రంగా రావు ౧౦ ఏళ్ళుగా వేర్మౌంట్ లో స్తిర పడ్డ దరిమిలా,వనస్తలిపురం నుంచి మొదటి సారి  అమెరికా వెళ్తున్న వెంకట్ రావు కు అక్కడి డ్రైవింగ్ లైసెన్సు దాని కధ కమామీషు ఊదర గొట్టేస్తున్నాడు.గుడివాడ గుర్నాధం వాళ్ళ అమ్మాయి ని చూసి రావటానికి బైలుదేరాడు.అక్కడ ఆడంగులు మందు సిగరెట్టు ఊదేస్తారషగా..అని నోరు నొక్కుకున్నాడు.బెజావాడ భోగారావు కిష్ణ భగవానుడిలా చిద్విలాసం చేస్తూ, అవన్నీ మామూలే గురూ గారు అంటున్నాడు.
ఈ చిత్రాలు చూసే టప్పటికి అదుగో ఎయిర్ ఇండియా ఫ్లైట్ రానే వచ్చింది.రేపో ఎల్లుండో రిటైర్ అయ్యేవయసున్న ఎయిర్ హోస్తేస్స్ “నమస్కారం” చెప్పి ఆహ్వానించింది.సరే నా సీట్ లో కూర్చున్నాను.విమానం బైలు దేరింది.నా హెడ్ ఫోనులో నుంచి శబ్దం రాక పొయ్యే టప్పటికి ఎయిర్ హోస్తేస్స్ ను పిలి చాను. సరిగ్గా  హోల్ లో పెట్టు అదే వస్తుంది. విసురు గా చెప్పి విసా విసా వెళ్లి పోయింది.ముసలావిడ కు చాదస్తం అంటే ఇదే నేమో.నా పక్క సీట్ లో పెద్దాయనకు ఫోను లేదు సీట్ లో ఉండాల్సిన సాకెట్టు లేదు. గొడవ లేని పని.
చూస్తుండ గానే ఢిల్లీ చేరాము.మళ్ళా సెక్యూరిటీ చెక్కు.బ్రతుకు జీవుడా అని రాత్రి ౨:౩౦ గంటలకు చికాగో వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము.   మిగతా సంగతులన్ని ఇక్కడ పట్టవు కాని మల్ల చెప్తా..

Saturday, September 8, 2012

చదువులు చట్టు బండలు

బుడి బుడి అడుగుల నా బాల్యం 
నర్సరీ స్కూల్ మెట్ల మీద అంతరించింది.

తాతయ్యతో నా కబుర్లు 
వుయ్యాలతోట్టితో సరి 

నడిచానని నాకే సారీ శిక్ష 

నా కేరింతలు 
స్కూల్ నాలుగు గోడల మధ్యే ప్రతిధ్వనించాయి 

కీ ఇస్తే తిరిగే మర మనిషిని నేను 
సృజన నేనే  పుస్తకాల్లో చూడలేదు  

ఒకటి కి ఒకటి కలిపితే ఎంతో  తెలుసు 
ఎందుకు కలపాలో తెలీదు 

అమ్మకి ఐ ఐ టి ఇష్టం నాన్నకి మెడిసిన్ కాకుంటే కష్టం 
నువ్వేమవుతావు కన్నా అని నన్నెవ్వరు 
అడగలేదు..వినివూర్కొవటమే నాకు తెలుసు 
నేనెప్పుడు చెప్పలేదు

గిజిగాల్ల కూతలు వినని అమ్మజోల తెలియని 
వానవిల్లు రంగులు చూడని నవతరం మేము 
రేపు వచ్చే తరానికి మార్గ దర్శిలము  మేము 

పుస్తకాల బరువుతో విల్లులైన నడుములతో 
చదివీ చదివీ మసకబారిన మా చూపులతో 
దేశానికి దిశా నిర్దేశం చేస్తాం 

**** విద్యా సంస్తల ధన దాహానికి, తల్లి దండ్రుల దూరాశలకు, లాబీ డబ్బులతో కళ్ళు మూసుకున్న ప్రభుత్వ నిష్క్రియ పరత్వానికి బలి అవుతున్న నా దేశపు  బాల్యానికి నా జోహార్లు ****