Wednesday, September 4, 2013

మన ప్రణయం

మన ప్రణయం ఎప్పుడూ ఇంతే....
వేసవి వడగాల్పుల్లో వాసంత సమీరమై పలకరిస్తుంది...
ఇదే శాశ్వతమని బ్రమసే నా హృది గదిని వీడ్కోలని విడిచి వెల్తుంది...

కోకిల మధురగానంతో మైమరచి
ప్రతి రుతువూ రాగ రంజితమని
తలపోయటం యెంత వెర్రితనం...

పలు వన్నెలతో మురిపించే వాన విల్లు
క్షణ ప్రాయమనే ఎరుక లేక
ఎల్ల కాలం త్వమేవాహం అనుట తగునా..

ఉవ్వెత్తున ఎగసి పడే అలల తాకిడిని
అరచేతి లో వడిసి పట్టాలనే
విఫల ప్రయత్నమని...

ఉషోదయాల్లో గడ్డి పరకల పై
తలుక్కున మెరిసే
తుషార బిందు సౌందర్యం
ప్రతి రోజూ పలకరించదని...

పున్నమి వెలుగులతో
అందాలు ఒలికే  ఈ ప్రక్రుతి
ప్రతిరోజూ ఇలానే ఉండదని...

ప్రతి సారి నువ్వే
ఇదే నిరూపిస్తావు

కాని...

నీ ప్రేమ ఉప్పెనలో
చిక్కుకున్న చిగురుటాకును నేను
ఆ వడిలో నా అస్తిత్వం కోల్పోవటమే నాకు తెలుసు.

దీపసుందరి వగలతో
మైమరచిన శలభాన్ని నేనైతే..
నా నుండి ఏ తెరిపిని ఆశిస్తావు..



2 comments: