Friday, November 20, 2015

జెమ్స్ బొండాము (మంచి బాలుడు) అనబడు శుబ్రముగా శుద్ధి చేసిన చలన చిత్రము

మొదటి అంకము :


జెమ్స్ బాగుగా తలకు ఆముదము పట్టించి ఇప్పుడే వేసిన తారు రోడ్డువలె నున్నగా దువ్వి మోహమంతయు జిడ్డు కారుచున్నవాడై, లంగోటాయు బిర్రుగా గట్టి  , పైన బాగుగా గంజి వైచి ఉతక బడ్డ చొక్కాయు ఉత్తరీయమును ధరించి కార్యాలయమున ఏతెంచెను. 
మొదట కార్యాలయమున కార్య నిర్వాహకురాలికి వినయముగా నమస్కారామిడి తన అధికారి కడకు పొయెను. రండి జెమ్స్ మహాశయా ... మీతో సీగ్రమైన కార్యము కలదు ... అధికారి బ్రుకుటి ముడివేసెను. ఆయన బహు ముదుసలి. రేపో మాపో టపా కట్టు టకు సిద్దముగా నుండెను. ఆయన బహు చుట్ట ప్రియుడై ఉండెను. జెమ్స్ భాద్యతా యుతమైన కధానాయకుడు కావున తన పై అధికారి నోటిలోని చుట్ట లాగి వైచి కింద పడవేసి దాని నార్పు వుద్దెసమున దానిపై దొరలెను. ఆ అవస్త నందు జెమ్స్ చొక్కయు అక్కడక్కడ కాలి ఉండెను. ఈ సన్నివేశము మిక్కుల అద్భుతముగా వచ్చెననియు చలన చిత్ర సుద్ది సమితి దీని మిక్కుల ప్రసంసించు ననియు దర్శకుడు సరిగానే బావించెను. 
అధికారి పాత్రధారి ఇట్లు చెప్ప దొడంగెను.  జెమ్స్ ...పరాయి  దేశ రహస్యములు శత్రు గూడచారుల నుండి తస్కరించవలెను. ఆ మాట పూర్తి చేయకమునుపే అధికారి కెవ్వున అరిచి కిందకు చూసేను. జెమ్స్ ఆయన కాళ్ళపై పది మిగుల దుక్కిన్చును ... అయ్యా ... ఏమి ఐనను తస్కరించుట తప్పు . పెద్ద వారైన మీరే ఇట్లు చెప్పుట తగదు ... అధికారి ఎట్లో అతనిని సమాధాన పరచి జెమ్స్ ను వేరే ఎవరికీ అనుమానం రాకుండా ఎవరు ప్రయాణం చెయ్యని ఎయిర్ మండియా విమానమున ఒక్కనే ఎక్కించి పరాయి దేశమునకు పంపెను. విమాన సేవిక పదహారు గజముల పట్టు చీర కట్టుకొని నడవలేక నడుచు చుండెను. రెండు మూడు సారులు అట్టి ఘనమైన చీర తట్టుకొని ప్రయాణీకుల మీద పడుచుండెను. 
జెమ్స్ దాహర్తుడై అమ్మా కొంచెం దాహము ఇప్పించ గలరు అని ప్రార్ధించెను. విమాన సేవిక జెమ్స్ కడ నిలిచి అయ్యా దశాబ్దముల తరబడి నష్టములలో నడచు ఈ విమానమున నీకివ్వుట కేమియులేవు ... విమానము స్టీరింగు టైరులు ను అద్దెకు తెచ్చి నడిపించు చుంటిమి. నీకేమి ఇవ్వగలను నాయనా అని హరిశ్చంద్ర నాటకమున తారామతి వలెను దుక్కించెను. అమ్మా దాహమునకు మజ్జిగైనను ఇప్పించుము ... నాయన మజ్జిగ అడుగంటేను. జెమ్స్ వూడి పోవు పీఠము యొక్క దట్టి బయముతో గట్టిగ పట్టుకు కూర్చుండి  పోయెను. ఆ   ముదుసలి విమాన సేవిక నటనా పటిమకు వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించిన దర్శకుడు జాతీయ పురస్కారము తనకే నని పొంగ్పోవు చుండెను. 
జెమ్స్ విదేశి విమానస్రయమున దిగెను. బైట అడుగిడెను. చేతిలో నీటి తుపాకీ తో నలు దిక్కులా చూసేను. దూరముగా ఒక పూటకూళ్ళ సత్రము అగుపడగా అటువైపు నడచెను. ఆ సత్రమున పురాణ కాలక్షేపము నడుచు చుండెను. భక్తులు పారవస్యమున నర్తించు చుండిరి. జెమ్స్ కు ఏంతో ఆనందం వేసెను. పూనకము వచ్చినట్టుల నర్తించెను. ఈ లోగా తన జేబు కత్తిరించ బడిన దని గమనించ కుండెను. కాలక్షేప భాగవతారిని జెమ్స్ పై జాలి పొంది , ఆ సాయంత్రం భోజనం పెట్టించెను. మిక్కిలి ఆనందముతో ఆనంద భాష్పములు రాల్చుచు జెమ్స్ ఆమె కాళ్ళకు నమస్కరించెను. 

చలన చిత్ర శుద్ధి సమితి చే విశేషముగా ప్రసంసించ బడిన    జెమ్స్ బొండాము (మంచి బాలుడు) అన  బడు చలన చిత్రం మొదటి అంకము. పై అన్కమున ఘనత వహించిన సమితి వారి సూచన మేరకు మార్పులు చేయబడెను. ప్రేక్షకులు గమనించి తల బాదుకో ప్రార్ధన ... 

Wednesday, November 11, 2015

సె(తు)స్సు ???

కేంద్ర ప్రభుత్వం 7 నవంబర్ నుంచి అన్ని సర్విసుల పై .5 శాతం సెస్సు విదించింది. ఇది స్వచ్చ భారత్ అభియాన్ కోసం. అబ్బే ... వంద రూపాయల సర్వీస్ టాక్స్ లో ఇది ఇంకో యాభయ్ పైసలు మాత్రం అదనం అంతే .. అని ఆర్ధిక శాఖా తన ప్రకటనలో వక్కానించింది కూడా.
కొన్ని నెలల క్రితం, సరిగ్గా గుర్తులేదు ... ప్రాధాన్యత లేదు కాబట్టి సరైన రోజు గురుంచి వెతకలేదు ...ఈ స్వచ్ భారత్ అభియాన్ ప్రారంభమయింది. మంత్రులు , గవర్నర్లు , వారి వంది మాగధులు చేట చీపురు పట్టుకొని రోడ్డున పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో లేని చెత్తను పోయించి మరీ చిమ్మారు. వార్తా పత్రికల నిండా నిండారు. బావుంది. సినిమా ధియేటర్ లలో, టీవి లో ఎవడైనా సిగిరేట్తో, బీడినో పట్టుకొని కనపడితే చాలు ... పొగ ప్రమాదకరం ... కాన్సర్ కారకం అని సీన్ ముందో సారి వెనకో సారి ఊదర గొట్టారు ... చాల బావుంది. అయ్యా ... ఒక నెల తర్వాత అంతా మామూలే ... స్వత్చ్ భారత్ ...ప్రారంభ రిబ్బన్ కత్తిరించాక మూలన పడే ప్రభుత్వ ప్రాజెక్ట్ లా అటకెక్కింది.
ఇక ప్రాధాన్యాల లోకేల్తే :
1. చెత్త ని ఏం చేద్దాం : నగరాల్లో పట్టణాల్లో పోగు పడ్డ చెత్త ఎక్కడో వూరికి దూరంగా వేసి కాల్చేయ్యడం లేక పూడ్చెయ్యడం మనకు అలవాటే. కాని విపరీతంగా పెరుగుతున్న జనా వాసాలతో ఇలాంటి ప్రాంతాలు కను మరుగవుతున్నాయి. హైదరాబాద్లోనే ఇలాంటి ప్రాంతాల్లో చుట్టూ పక్క కాలనీలు కాలుష్యం బారిన పడటం కద్దు .
మరి స్వచ్చ భారత్ కార్యక్రమం లో వేస్ట్ మేనేజ్మెంట్ కి ఏమన్నా పరిష్కారాలున్నయా  ....
2. స్వచ్చత అంటే చెత్తేనా : మరి వాయు కాలుష్యం. వెయ్యి రెండు వేలు లంచాలు తీస్కుంటే పట్టుకునే ఏ సి బీ వేలకోట్ల అవినీతిని వదిలేసి నట్టు ... స్వచ్చ్ భారత్ అంటే కేవలం రోడ్డుమీద చెత్త వూడవడం ఏనా.. దేశ రాజధానిలో గాలి కాన్సర్ కారకం అని ఏళ్ల కిందే తెలుసుకుని మనం ఏం చేస్తున్నాం. యూ పీ మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ లో దాదాపు అన్ని నగరాల్లో గాలి మనుషులు పీల్చ డానికి పనికి రాకుండా కాలుష్యం బారిన పడిందనేది అందరికి తెలుసు... మరి దీనికి స్వచ్చ్ భారత్ లో ప్రత్యామ్యయాలున్నాయా ....
3 మరి నీరు : తొంభై శాతం కన్నా పైన నగరాలూ పట్టణాల్లోని మురికి నీరు నేరుగా నదుల్లో కాలవల్లో చివరికి సముద్రంలో కలుస్తుంది. ఇలాంటి నీటిని శుద్ధి చేసి నీటిలో విడుదల చేసే సాధనాలు ఉన్నా వేళ్ళమీద లెక్కించచ్చు.
4. ఆహారం అరహరమ్ విషం : తినే ఆహారం , పాలు చివరికి పళ్ళు అన్నీ పురుగు మందుల తో, కావాలని చేసే కల్తీలతో మనవ వినియోగానికి పనికి రాకుండా పోతున్నాయని ఈ మద్య ప్రతి చోట వార్తలు వింటున్నాం . మరి స్వచ్చత వీటిలో వద్దా ??
దేశం లో అడుగడుగునా నిండి మనం ఎప్పుడో పట్టించుకోవడం మానేసిన  అవినీతి లంచగొండితనం లా కాలుష్యం సర్వ వ్యాప్తం. సరైన ప్రణాళిక, ఆలోచన  లేకుండా చేసే ప్రతి పధకం మొదట్లో మురిపించినా తర్వాత అటక ఎక్కడం మామూలే. మనకిలాంటివి కొత్త కాదు.. మరి స్వచ్చ భారత్  మరో ప్రభుత్వ పధకంలా ఫొటోలకి పేపర్ ప్రకటనలకి పరిమితమై తుస్సు మంటుందో ... లేక  ఘట్టి మేలేమన్న చేస్తుందో ....