Friday, November 20, 2015

జెమ్స్ బొండాము (మంచి బాలుడు) అనబడు శుబ్రముగా శుద్ధి చేసిన చలన చిత్రము

మొదటి అంకము :


జెమ్స్ బాగుగా తలకు ఆముదము పట్టించి ఇప్పుడే వేసిన తారు రోడ్డువలె నున్నగా దువ్వి మోహమంతయు జిడ్డు కారుచున్నవాడై, లంగోటాయు బిర్రుగా గట్టి  , పైన బాగుగా గంజి వైచి ఉతక బడ్డ చొక్కాయు ఉత్తరీయమును ధరించి కార్యాలయమున ఏతెంచెను. 
మొదట కార్యాలయమున కార్య నిర్వాహకురాలికి వినయముగా నమస్కారామిడి తన అధికారి కడకు పొయెను. రండి జెమ్స్ మహాశయా ... మీతో సీగ్రమైన కార్యము కలదు ... అధికారి బ్రుకుటి ముడివేసెను. ఆయన బహు ముదుసలి. రేపో మాపో టపా కట్టు టకు సిద్దముగా నుండెను. ఆయన బహు చుట్ట ప్రియుడై ఉండెను. జెమ్స్ భాద్యతా యుతమైన కధానాయకుడు కావున తన పై అధికారి నోటిలోని చుట్ట లాగి వైచి కింద పడవేసి దాని నార్పు వుద్దెసమున దానిపై దొరలెను. ఆ అవస్త నందు జెమ్స్ చొక్కయు అక్కడక్కడ కాలి ఉండెను. ఈ సన్నివేశము మిక్కుల అద్భుతముగా వచ్చెననియు చలన చిత్ర సుద్ది సమితి దీని మిక్కుల ప్రసంసించు ననియు దర్శకుడు సరిగానే బావించెను. 
అధికారి పాత్రధారి ఇట్లు చెప్ప దొడంగెను.  జెమ్స్ ...పరాయి  దేశ రహస్యములు శత్రు గూడచారుల నుండి తస్కరించవలెను. ఆ మాట పూర్తి చేయకమునుపే అధికారి కెవ్వున అరిచి కిందకు చూసేను. జెమ్స్ ఆయన కాళ్ళపై పది మిగుల దుక్కిన్చును ... అయ్యా ... ఏమి ఐనను తస్కరించుట తప్పు . పెద్ద వారైన మీరే ఇట్లు చెప్పుట తగదు ... అధికారి ఎట్లో అతనిని సమాధాన పరచి జెమ్స్ ను వేరే ఎవరికీ అనుమానం రాకుండా ఎవరు ప్రయాణం చెయ్యని ఎయిర్ మండియా విమానమున ఒక్కనే ఎక్కించి పరాయి దేశమునకు పంపెను. విమాన సేవిక పదహారు గజముల పట్టు చీర కట్టుకొని నడవలేక నడుచు చుండెను. రెండు మూడు సారులు అట్టి ఘనమైన చీర తట్టుకొని ప్రయాణీకుల మీద పడుచుండెను. 
జెమ్స్ దాహర్తుడై అమ్మా కొంచెం దాహము ఇప్పించ గలరు అని ప్రార్ధించెను. విమాన సేవిక జెమ్స్ కడ నిలిచి అయ్యా దశాబ్దముల తరబడి నష్టములలో నడచు ఈ విమానమున నీకివ్వుట కేమియులేవు ... విమానము స్టీరింగు టైరులు ను అద్దెకు తెచ్చి నడిపించు చుంటిమి. నీకేమి ఇవ్వగలను నాయనా అని హరిశ్చంద్ర నాటకమున తారామతి వలెను దుక్కించెను. అమ్మా దాహమునకు మజ్జిగైనను ఇప్పించుము ... నాయన మజ్జిగ అడుగంటేను. జెమ్స్ వూడి పోవు పీఠము యొక్క దట్టి బయముతో గట్టిగ పట్టుకు కూర్చుండి  పోయెను. ఆ   ముదుసలి విమాన సేవిక నటనా పటిమకు వాస్తవికతకు దగ్గరగా చిత్రీకరించిన దర్శకుడు జాతీయ పురస్కారము తనకే నని పొంగ్పోవు చుండెను. 
జెమ్స్ విదేశి విమానస్రయమున దిగెను. బైట అడుగిడెను. చేతిలో నీటి తుపాకీ తో నలు దిక్కులా చూసేను. దూరముగా ఒక పూటకూళ్ళ సత్రము అగుపడగా అటువైపు నడచెను. ఆ సత్రమున పురాణ కాలక్షేపము నడుచు చుండెను. భక్తులు పారవస్యమున నర్తించు చుండిరి. జెమ్స్ కు ఏంతో ఆనందం వేసెను. పూనకము వచ్చినట్టుల నర్తించెను. ఈ లోగా తన జేబు కత్తిరించ బడిన దని గమనించ కుండెను. కాలక్షేప భాగవతారిని జెమ్స్ పై జాలి పొంది , ఆ సాయంత్రం భోజనం పెట్టించెను. మిక్కిలి ఆనందముతో ఆనంద భాష్పములు రాల్చుచు జెమ్స్ ఆమె కాళ్ళకు నమస్కరించెను. 

చలన చిత్ర శుద్ధి సమితి చే విశేషముగా ప్రసంసించ బడిన    జెమ్స్ బొండాము (మంచి బాలుడు) అన  బడు చలన చిత్రం మొదటి అంకము. పై అన్కమున ఘనత వహించిన సమితి వారి సూచన మేరకు మార్పులు చేయబడెను. ప్రేక్షకులు గమనించి తల బాదుకో ప్రార్ధన ... 

2 comments: