Friday, May 1, 2020

నీ రూపం...

లోకం  మరిచినా  మనపై  కాలం  గెలిచినా
ఆకాశం  భూమి  కలవవని  ఎవరో  చెప్పినా
చిప్పిల్లిన  కళ్ళలో నీ  రూపం నింపుకుని
బతికేయడంలో  ఏమి  ఆనందం ఉందని నువ్వే  అడిగినా
నీవులేని ప్రతి  క్షణం  నా  ఉనికినే వెక్కిరించినా

ఈ  జన్మకు నిండిన  జ్ఞాపకాల దొంతరల్లో  నీతో గడిపిన  క్షణాలు  ప్రత్యేకం
ఆ సూదూర  దర్శనాలు  నీకోసం గంటలకొద్దీ వేచిన ఆ రోజులు
ముసిముసి  నవ్వుల్లో వికసించిన  పరిచయాలు
అపురూపంగా  దాచుకున్న
అనుభూతులు
నీనుంచి  దూరం వెళ్లిన  ప్రతీ సారి
నన్నే  మోసగించి నీ దరి  వాలే నా తలపులు

లోకంలో ఏమూల  దాగున్నా నీ ఊహలతో
ఉక్కిరిబిక్కిరి  అవటమే నాకు తెలుసు...
గుండెల్లో ఏళ్ల  క్రితం గీసుకున్న నీ చిత్రం
పదిలంగా పొదివిపట్టుకోవడమే నాకు తెలుసు...



Thursday, April 30, 2020

బాటసారి

చాలా  కాలం  గడిచిందేమో
చేతివేళ్ళమధ్య  నీళ్లలా  జారిపోయిందేమో
జ్ఞాపకాలు  ఇష్టాలు
ముసురు  పట్టాయేమో
పరిచయాలు  స్నేహాలు  మసకబారాయేమో
ఎవరికైనా  నేను  గుర్తున్నానో  లేదో

ఏమో  నన్నెవరూ  పలకరించినట్టులేదు
ఎన్నో  యుగాల  నుంచి
ఎవరో  వచ్చి విడుదల  చేస్తారని
ఆశగా ఎదురుచూసే  కాలనాళికను నేను
నడివేసవిలో  మిట్టమద్యాన్నం
వాన  చినుకై ఎదురుచూసే
బహుదూరపు  బాటసారిని