Monday, October 20, 2014

కావ్య నాయిక

అశాంతితో స్మశాన ప్రశాంతత  నిండిన నా హృదిలో 
శరత్కాల వెన్నెల వన్నెలతో తలుక్కున మెరిసావు నువ్వు 

జీవితం క్షణ భంగురమే కాని 
దానిలో కాలాని  కందని అనుభూతులెన్నో 

నీ స్నేహం అజరామరం 
నీ పలుకులే జీవన వేదం 

రుద్రభూమిలో విరిసిన చిరునవ్వువు నువ్వు 
వడగాలుల్లో మెరిసి మురిపించే చిరుజల్లువు 

వివర్ణమైన నా జీవితఆకాశంలో వేయి వర్ణాల హరి విల్లువు నీవు 
మతిలేని మరీచికల మద్య నిలిచి మురిపించే ఒయాసిస్సువు 

నీ సాంగత్యం శాస్వతం 
మిగిలిన ఈ జగమంతా నిస్తేజం నిరాకారం 

నీ నవ్వుల కాంతుల్లో ఉదయమైనదోయి 
నిద్రించే నీ కనుదోయి సాయంత్రపు చల్లని హాయి 

చల్లని సాయంత్ర సమీరమే చివ్వున మోమున తగిలింది 
కాల మెరుగని మన ప్రణయం మొదటి నాడే  ముగిసింది 

చెదరిన ఊహలో చివుక్కున చుట్టూ చూసాను 
నీ స్తానం పదిలమనే నా మదిలో వెతికాను 

చప్పున స్పురించినది నిన్న చదివిన ప్రణయ కావ్యం 
అందులో కావ్యనాయిక వర్ణన నిత్య నూతనం 

నా ఊహల వుద్రుతికి చిన్నబోయి నిలచాను 
కావ్య నాయకలతో ప్రణయం సరికాదని తలచాను 









Sunday, October 12, 2014

కుక్క కాటుకు.....

సుచేత్ గర్హ్ ..జమ్ము ప్రాంతం... 
భూమ్.... 
ఇండియా హోవిత్జేర్ శత్రుగ్ని ఘర్జన... 
గడచిన రెండు వారాల్లో ఇన్నాళ్ళు మూగవోయిన భారత శత్రుగ్నులు అవిరామంగా ఘర్జిస్తున్నాయి. 2003 కాల్పుల నిషేద ఉల్లంఘన ఎన్నో సార్లు జరిగినా , మొదటి సారి భారత్ ఇలా స్పందించింది. 
భారత రక్షణ  విధానంలో ఎవరికీ అర్ధం కాని పార్శ్వాలు ఎన్నొ. పరాయి దేశం ఎన్ని సార్లు కవ్వించినా నోరు విప్పని సుషుప్తావస్తలో మునిగి తేలింది మన ప్రభుత్వం. గడచిన ఏళ్లలో ఎప్పుడు ఇటువంటి సంఘటన జరిగినా , 
హోం మంత్రులు పేపర్లలో బొరలు విరుచు కోవడం తప్ప చేసిందేమీ లెదు. ఒక హోం మినిస్ట్రీ ఆఫీసర్ చెప్పినట్టు... మనమెప్పుడూ ఇంత భారీగా స్పందించలేదు. 
ఇజ్రాయల్ లాంటి దేశాలు చుట్టూ శత్రువులతో ఉన్నప్పటికీ, వారి ఆయుధ సంపత్తి మిగతా వారికేమాత్రం తీసిపోనప్పటికీ, సరి హద్దులలో కవ్వింపులకు వారెప్పుడు సమ్మతించలెదు. మన విషయమే చుద్దామ్... 
ఎప్పుడు కొత్త తీవ్రవాదులను సరి హద్దులు దాటించాలి అన్నా, శత్రు దేశం కాల్పులకు తెగబడుతుంది. అక్కడ ఎన్నికలు వచ్చినా, ప్రతిపక్షాలు రెచ్చి పోయినా, మత ఛందస వర్గాలను బుజ్జగించాలన్న, సర్వ నాశనం అయిన ఆర్ధిక వ్యవస్తల నుంచి జనం ద్రుష్టి మరల్చాలన్న, వాళ్ళకు కాశ్మీర్ గుర్తొస్తుంది. అమ్మ కొట్టిందని కొంటె కుర్రాడు పక్కింట్లో రాళ్ళు వేసినట్టు, అక్కడ ఏమి జరిగినా  మనమే భరించాలి. 
మరి అక్కడ ఉన్న జనా వాసాల మాటేమిటి. నిత్యం మోర్టార్ల మోతలతో ఎనిమిశాన మిన్ను విరిగి పడుతుందో, ఎప్పుడు ఆర్మీ వచ్చి ఇల్లు వదిలి సురక్షిత స్తానలకు వేల్లమంటుందో, బైటకు వెళ్ళిన కుటుంబ సబ్యులు తిరిగి వస్తారో రారో అన్న పరిస్తితి. 
మరి ఈ సారి ఏమి జరిగింది. చైనా అధ్యక్షుడు మన దేశం లో ఉన్నప్పుడే , వారి బలగాలు లడఖ్లో దురాక్రమణకు పాల్పడ్డాయి. కొత్త ప్రభుత్వాన్ని , వారి విధానాన్ని పరీక్షించా దానికి చీనియుల ఎత్తుగడ కావచ్చు. కాని, మనం ఈ సరి శత్రువు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసాం. వారి బలగాలకు ప్రతిగా భారత్ తన బలగాలను నిలిపింది. ఈ కొత్త పరిస్తితి కి వారు ఆశ్చర్యపోయి ఉంటారు అనటంలో అతిశయోక్తి లేదు. మనం వాళ్లతో బలంలో బలగంలో సాటి కాక పోవచ్చు. కాని ప్రత్యర్ది దాన్ని అలుసుగా తీసుకోవనివ్వకూడదు. ప్రపంచం లో ఎ దేశము బలమైన ప్రత్యర్ది కోసం తన భూమి వదులుకొదు. అది ఫిలిప్పీన్స్ ఐన సరే, ఉక్రెయిన్ అయిన సరె.. శత్రువు మన భూమిని ఆక్రమించిన ప్రతి సారి అది జీవన్మరణ పోరాటమే. 
ఇక ఇప్పటి స్తితికి వద్దాం. పరాయి దేశంలో ప్రభుత్వం బాగా బలహీన పడింది. వారి ఈశాన్య ప్రాంతాల్లో ఉగ్రవాదులతో, రాజధాని దిగ్భందనం చేసిన ప్రతిపక్షాల రాలీలతో దేశం అట్టుడుకుతోంది. ఏ క్షనానైన మరల దేశం సైన్యం చేతికి వెళ్ళే పరిస్తితి. ఇంకా ప్రభుత్వానికి మిగిలిన దారి, సరిహద్దుల్లో హడావుడి. కాని ఈ సారి వాళ్ళు మనల్ని తక్కువ అంచనా వెసారు. సరిహద్దుల్లో అటువైపునుంచి పచ్చిన ఒక తూటాకు మనం ఆరు సార్లు బదులిస్తున్నాం . ప్రత్యర్ది దేశం సైన్యం వాళ్ళవైపు జరిగిన వినాశనం  ప్రచురించ వద్దని పత్రికలకు తాఖీదులిచ్చిందంటే పరిస్తితి అర్ధం  చేసుకో వచ్చు. 
ఇలాంటి చిన్న ఘటనలు పూర్తీ యుద్ధం గా మారే పరిస్తితి లేదు కాని, మారిన భారత దృక్పదాన్ని పూర్తిగా ఆవిష్కరిస్తాయి. ఇకపై తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో గిల్లి కజ్జాలు పెట్టుకునేందుకు శత్రువు పది సార్లు ఆలోచిస్తాడు. 

Sunday, July 27, 2014

జనం

నాన్నా...

రైల్వే స్టేషన్లో రైలు కూతకన్న పెద్దగా అరుస్తూ పరిగెడుతున్నాడు ఒక పెద్దాయన. రైలు బయలు దేరింది. ఆయనకు కావాల్సిన వాళ్ళెవరో ట్రైన్ లో ఉన్నట్టున్నారు. నెరిసిన జుట్టు, సోడాబుడ్డి కళ్ళజోడు ఆయన వయసు చెప్పకనే చెప్తున్నాయి ఒక డెబ్బై ఎనభై ఉంటాయని. కాని ఈయన నాన్నా అని పిలుస్తున్నాడంటే ఆ ట్రైన్లో ఉండే ఆయనకెంత వయసుంటుందో...

నాన్నా మళ్ళా అరిచాడాయన. ట్రైన్ కిటికీ లోంచి తొంగి చూసాడు ఒక ఇరవై ఏళ్ళ యువకుడు. ఇప్పుడిప్పుడే మీసాలు గడ్డాలు వస్తున్నట్టున్నాయి.  అయోమయంగా ఆ పరిగెత్తే శాల్తీ ని చూస్తున్నాడు.ఈ వయసులో ఈ ముసలాయనకి డీ డీ ఎల్ జే లో షారుక్ లాగ ఇదేమి రన్నింగ్ ఆనందం. ఓపిక నశించి లేచాడు ఆ యువకుడు. చేయందించి ఆయన్ను లోనికి లాగాడు. ఖాళీ గా ఉన్న సీట్ లో కూలబడి ఆయాసం తీర్చుకున్నాక అడిగాడు ఆ యువకుడు. ఈ వయసులో మీరిలా పరిగెత్తడం ఎంటండి తాతగారు... అతని మాటలు పూర్తవక ముందే జేబులోంచి ఒక ఫోటో బైటకు తీసాడు ఆ  పెద్దాయన.

బాగా నలగి పోయి ఉంది ఆ బ్లాకు అండ్ వైట్ ఫోటో. అతి కష్టం మీద కనబడుతున్నాయ్ అందులో ఆకారాలు.    చూడండి  నాన్నా వగరుస్తూ అన్నాడాయన. మసక మసక గా ఆ ఫోటోలో కనపడుతుంది ఈ కుర్రాడే. కాని బుర్ర మీసాలు, పంచె, పిలక జుట్టూ, పెద్ద బొట్టు. అయోమయం గా చూసాడు ఆ అబ్బాయి. మీరే నాన్నా ... నా చిన్నప్పుడే మీరు అమ్మా    నాగార్జున సాగర్ ;)  పునాదుల్లో పని చేస్తూ మట్టి పెల్ల విరిగి పడటం తో మీరు సబ్బు బిళ్ళ కంట్లో పడటం తో అమ్మ ఒకే నెలలో పోయారు. ఆ పని ఈ పని చేస్కుంటూ ఇంత వాడ్నయ్యాను. కళ్ళ నీళ్ళు తుడుచుకుంటూ చెప్పాడాయన.

ఇలాంటి సంఘటనలు ఈ కాలం లో చాల జరిగాయి. దాంతో మార్ఫింగ్ చేయించి ఫోటోలు పట్టుకొని మీ నాన్న నేనే మీ అమ్మ నేనే అని డబ్బున్న ముసలాళ్ళ వెనక పడే ప్రభుద్దులు దేశంలో ఎక్కువైయ్యారు. దాంతో ప్రభుత్వం దీనికో ప్రత్యెకము గా నాన్న అమ్మా  శాఖ ను ఏర్పాటు చేసింది. వాళ్ళు ప్రతి కేసును పరిశీలించి పరిసోదించి ప్రతి ఇంటి  వంశ వృక్షం ఆకులు కొమ్మలు వేళ్ళూ గీసే పనిలో పడ్డారు.

ఇంకొంత మంది ప్రబుద్దులు ఇంకొంచెం ముందుకు వెళ్లి మీ పూర్వీకులను వెతికి పెట్టే  ఏజెన్సీలు పెట్టేసారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపిస్తే చాలు వాళ్ళు ఇంటర్నెట్లు ఔటర్నెట్లు వెతికి పట్టేస్తారన్న మాట. పెళ్ళిళ్ళు గట్రా  వాళ్ళు ఇలాంటి ఏజెన్సీల వెంట తిరగటం కూడా పరిపాటే. ఆ పెళ్లి కొడుకు/కూతురు వరస కుదరటానికన్న మాట.

కొస మెరుపు : ఈ వ్యవహారం చాల రోజులు నెలలు పట్టడంతో దేశంలో పెళ్ళిళ్ళు ఆగిపోయి జనాభా వృద్ది రేటు 50 శాతం తగ్గిపోయింది. చాల కళ్యాణ మండపాలు వృద్దాశ్రమాలో, నానా అమ్మ పరిచయ వేదికలకిందో మారి పోయాయి.

చట్టం బద్దలు  కాని హెచ్చరిక : పై కధనం పూర్తిగా కల్పితం. ఇదీ, ఇంకొటేదో  ; ) చూసి inspire అయ్యి మీ తాతయ్య అమ్మమ్మ ఫోటోలు పెట్టుకు రోడ్న పడకండి.

Saturday, July 26, 2014

ఇండియా ఈజ్ నాట్ సేఫ్

వాన రాకడ ప్రాణం పోకడ ఎప్పుడు ఖచ్చితంగా చెప్పలేమంటారు. నిజమే... రోజూ మాదిరే స్కూల్ కి బైలుదేరిన పిల్లలు ఇంటికి ఇక రారు అంటే నమ్మశక్యం కాదు.కాని బైటకెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగొచ్చే దాక నమ్మకం లేని ఈ దేశంలో ( కారణాలేమైనా) ఇలాంటి సామెత పుట్టిందంటే పెద్ద ఆశ్చర్య పోవక్కర్లేదు.

ఎకనామిక్స్ లో ఒక మౌలిక సూత్రం ఉంది. ఏ వస్తువైతే ఎక్కువ ఉంటుందో దాని విలువ తక్కువ. అల్లాగే మన దేశం లో జనం ఎక్కువ. రోజుకింత మంది రక రకాల కారణాలతో పోతున్నారు అంటే, పేపర్లో అదో వార్త. మిగతా వార్తల్లాగానే. రేపటికి పాత పడిపోయే జనం మరిచి పోయే  వార్త. బ్రేకింగ్ న్యూస్ అని చావగొట్టే చానళ్ళకు రేపటికి కంపు కొట్టే చద్ది.

ఈ పోస్ట్ కొంచెం నిష్టురం గా ఉండొచ్చు. కాని ఇది నిజం. రోజు పిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సుల్లో ఎన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో సర్వ విదితమె. కాలం చెల్లిన బస్సులు నడిపి నాలుగు రాళ్ళు వెనకేసుకునే యాజమాన్యాలు, పచ్చ కామెర్లు కమ్మి వాటికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే ఆర్ టి ఎ ఆఫీ'సురులు', వాయనం ముట్టి చూసి చూడనట్టు పొయ్యే  ప్రబుత్వాలు, చివరగా వీటికి ఓట్లేసి గెలిపించే జనాలు... జరిగిన సంఘటనలో పైవారందరి చేతికి రక్తం అన్టిందనే అంటాను.

అసలు డ్రైవర్ రాకుంటే ట్రాక్టర్ డ్రైవర్ ని పంపారని కొన్ని పేపర్లలో వచ్చిన వార్తలో నిజానిజాలు ఏమైనా, అది నిజమైనా ఆశ్చర్యం లేదు. ఇలాంటి దేదో జరగగానే ఈగల్లా మూగే నాయకులు , వీడోచ్చాడు వాడో రాలేదు అని ఊదరగొట్టే చానళ్ళు, పరిహారం చాలదు అని జబ్బలు కొట్టుకునే వాళ్ళు షరామాములే. ఐనా ఎంత డబ్బులిస్తే ఆ కుటుంబాలకు జరిగిన నష్టం పూడ్చగలం.

మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఏమైనా చెయ్యగలమా అనేది ఆలోచించాలి. ఏదో జరిగాక హడావుడి కాకుండా భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చెయ్యాలి. ఈ రోజు ఒక హాస్యాస్పదమైన ప్రకటన చదివాను. ప్రమాణాలు పాటించని స్కూల్ బస్సు డ్రైవర్ల లైసెన్ కేన్సిల్ చేస్తాం అని. అయ్యా ఇంకో చిన్న విషయం. ఇలాంటి దేదో జరిగితే కాని మనం కళ్ళు తెరవమా..ఇన్ని రోజులు ఈ రూల్లు రూళ్ళ పుస్తకంలో బైండు చేసి దాచి పెట్టారా... రోడ్డుమీద బండి నడిపే ప్రతి వాడు డ్రైవర్ ఏ నండి. ఏలిన మగా పెబువులు ఆ అసెంబ్లీ నుంచి బైటికొచ్చి బైట ఉన్న రోడ్డుని పది నిమిషాలు పరికిస్తే మా రాజ ఎంత మంది ద్డ్రైవర్లు రూల్లు పాటిస్తున్నారో తెలుస్తుంది.

మొన్న జరిగిన ఘటన తీవ్రత ను తక్కువ చెయ్యడం నా ఉద్దేశ్యం కాదు కాని, రోజు మన రోడ్ల మీద జరుగుతున్నా ప్రమాదాలలో నూటికి నూరు  శాతం రూల్స్ పాటించక పోవటం వల్లనే అంటాను. లైసెన్స్ లేని డ్రైవర్లు, ప్రమాణాలు లేని వాహనాలు, ఎక్కడ కాస్త జాగా దొరికితే దూరి పోవ్వడమే డ్రైవింగ్ అనుకునే మేధావులు, అతివేగమే డ్రైవింగ్ అనుకునే తలలేని జనం,ఇవన్నీ చూసి చూడనట్టు వదిలేసే ట్రాఫిక్ సిబ్బంది. పైన  చెప్పిన వాటిలో ప్రతి ఒక్కటి ప్రమాద కారణమే...

ఇంకో చిన్న వివరణ. జరుగుతున్న ఈ ప్రమాదాలు దైవ ఘటనో, లలాట లిఖితమో, పాత జన్మ రుణ విముక్తో కాదు. పూర్తి  మనవ తప్పిదమే. విఫలమైన వ్యవస్థ దీనావస్తే. మనం ఇలాంటివన్నీ జస్ట్ న్యూస్ అని వదిలేసినంత కాలం, మా కొలీగు ఒకాయన అన్నట్టు " ఇండియా ఈస్ నాట్ సేఫ్"


Wednesday, May 21, 2014

నా సఖి

పచ్చని అందాలతో పులకరించే వృక్ష శోభ 
అనుదినము ఆహ్లాద పరచు ప్రకృతి 
వేసవి కాంత సొబగులు వర్ణించక మూగనైతి 

వర్నోప వర్ణములై ఆయువు మూడి 
వదలిన దేహముతో రాలు పత్రభామల 
హొయలు మెచ్చక మనసు నిలిపితి 

ధారలుగా కురిసి 
హృది తలుపుల 
వలపు తలపులు 
మెరియించు వర్ష కాంత 
మెరుపు వన్నెలు తెలుపక మానుకుంటి 

అంతరాత్మయు స్తంభింప చేయు 
పవన ద్రుతి 
ఆవరణమే కాదు మనమ్మునే 
సీతలీకరించు భీష్మ 
హిమపాతమును చూచి చూడక వదిలితి 

తానె నవ్వుల వెలయు మురిపించు పవనమెలె 
తన సిగ్గుల మెరయు శరత్కాలం 
నల్లని కురుల వెలయు నీలి మేఘాల వాలు 
తన కోపమే వేసవి వదగాల్పులైన 
రుతువులేల్ల తనలో నింపు నా సఖి మోము చూడ వేరేల నే ఋతువుల పొగడువాడ


Monday, May 19, 2014

మోడీ హవా తగలని ఊరు

 నిజమే.... అలా కళ్ళు నులుముకోకండి.

మీరు చదివింది నిజమే..యావత్ భారతం మోడీ కి బ్రంహరధం పడుతుంటే ఎంతైనా మాది ఒంగోలు కదా... మేమింతే.. మనోడు అనుకున్నోడ్ని నెత్తి  నెత్తుకుంటాం. మంచోడు మంచోడు అన్న చందంగా తేడా  వస్తే ... ;) అంతే సంగతులు....

వూళ్ళో 3-4 చెరువులున్నా, 4 రోజులకి ఒక సారి నీళ్లిస్తే   ఊరుకున్నాం . ఎవడో పేరు తెలియని వాళ్ళ బొమ్మలు ఊరంతా పెట్టి, రోడ్లు ఖరాభు చేస్తే, పోనిలే అని పక్క నుంచి పోయాం. విమానాశ్రయం పేరు చెప్పి వ్యవసాయ భూములు ఆక్రమించి   అమ్ముకుంటే, సరేలే అనుకున్నాం. సెజ్ ల పేరు చెప్పి బంగారం లాంటి తీరాన్ని ఆక్రమిస్తే
1-2 ఉద్యోగాలు రాక పోతాయా  అనుకున్నాం. పారిశుద్యం  కధ  పక్కన పెడితే,
నడుస్తున్న గోవేర్నమెంటు స్కూల్లెన్ని మూత పడ్డవేన్ని, జిల్లాకేంద్రం లో పెద్దాసుపత్రి లో సౌకర్యాల సంగతి దేవుడెరుగు... సొంత ప్రాక్టీసులో  తనమునకలై  ఆసుపత్రి కొచ్చే డాక్టర్లు ఎన్దరు.. లోగుట్టు ఆరోగ్య శ్రీ కర్తలకెరుక.  కార్పొరేషన్ చేసావ్ సరే బిల్లులు మోత తప్ప సౌకర్యలేమన్న పెరిగాయా  అంటే సమాధానం చెప్పనీకి ఎమిలియే అన్న వూళ్ళో ఉంటె కదా ... అదేదో కొత్త కూత  పార్టీ అని తిరుగుతుండే. అది  లేనప్పుడు ఉన్నాడా అంటే, ప్రతి సారి ఆయనకే వోట్లేస్తే ఎందుకు కనపడాలే... స్కూల్ ఎగ్గొట్టే కొంటె కుర్రాడికి మొట్టికాయలు తప్పవు కదా... అదే అయింది .

ఇదంతా ఒక యెత్తు. ఇకా మా ఏం పీ ( ఏం పీకలేనోడు-అంటార్లెండి మా వూళ్ళో మోటు జనం ;)  ) మా తాతలు నేతులు తాగారు అన్నట్టు , ఎప్పుడో ఓ మహానుభావుడు చేసిన మేళ్ళు మరవని జనం ప్రతి సారీ గెలిపిస్తూ వస్తుంటే, అయ్యా వారు పక్క జిల్లాలో వ్యాపారం ఎలగ బెట్టారు. పండగకి పబ్బానికి వోట్లు అన్నీ పచ్చ గా ఉన్నాయా అని సూసుకోడానికి అలా కాన పడి  ఫ్రీ గా ఓ సిరునవ్వు  మొహాన కొట్టి పొయ్యే సిన్నోడ్ని , జనం గుర్తు పెట్టుకు మరీ పొగ బెట్టారు ఈసారి.

మరి గెలిసినోల్లు మంచోల్లా , మరి వాళ్ళు పలానా పార్టీ వాళ్ళే అని ఎదవ కోస్యనింగులు సీ బాకండి. తెలుగు లో చెప్తే మరీ మోటుగా ఉంటది కాబట్టి, నేను దీన్ని Choosing the lesser Devil అంటాను. ఈళ్ళు ఈసారి ఎదవ కటింగ్ లు ఇస్తే, వచ్చే సారికి  ఇంతే సంగతులు. అంత గట్టిగా ఎలా చెప్తావ్ అంటారా... మావాళ్ళు  తెలివి మీరి పొయారు. నేనైతే తెలివి తెచ్చు కున్నారు అంటాను. అదేదో పవన్  కళ్యాన్ చెప్పినట్టు, అందరి దగ్గరా డబ్బులు తీస్కొని వెయ్యాలనుకున్న వాళ్లకి   వేసారన్న మాట... LET THE SENSE PREVAIL ;)


Saturday, April 26, 2014

ఎన్నికలలో

మళ్ళీ ఎన్నికలొచ్చేసాయి.
ఆ పార్టీలు ఈ పార్టీలు అని లేకుండా వాగ్దానాలతో ఊదర కొట్టేస్తున్నాయి
ప్రతి నాయకునికి తన వైన కలలు.
ఒక సామాన్య వోటరు గా నాకు కొన్ని కలలున్నాయి.
వీటికి దగ్గరగా ఏ పార్టీ వస్తే వాళ్ళకే నా వోటు అని చెప్పక్కరలేదు.

1. రోటి కపడా ఔర్ మకాన్  రోజ్గార్ కి జరియే

స్వతంత్రం వచ్చి ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా, కనీస వసతులకు మొహం వచ్చి ఉండటం. 60 ఏళ్ళ తర్వాత ఇంకా వీటి గురించి రాయటం సిగ్గుచేటే అయినా ఇన్నాళ్ళ కుహనా వ్యవస్తలు సాధించలేక పోయిన సత్యాలివి.
అలాని జనాలకు కావాల్సింది వూరికి దూరంగా ఇందిరమ్మ ఇల్లో, రూపాయి కొచ్చే ముక్కిపోయిన బియ్యమో కాదు. తమ కాళ్ళ మీద తాము నిలబడే సామర్ద్యం. జనాలని మరింత సోమరిపోతులను చేసే పధకాలను పక్కన పెట్టి, విద్య ఉపాది పై ద్రుష్టి పెట్టె యోచన కావాలి

2. ధరల పై నియంత్రణ

నాకింకా గుర్తుంది. 2007 లో US వెళ్ళినప్పుడు పాల ధర ఏంటో ఇప్పుడు అంతే. మిగతా వస్తువులు పెద్ద మార్పులున్నట్టు కనపడవు.కాని ఇక్కడ ప్రతి వస్తువు కనీసం 2 రెట్లు పెరిగిన వైనం. ఇది ప్రభుత్వ పూర్తీ వైఫల్యం.
ఇంకెవరినీ దీనిలో భాద్యులం చెయ్యలెము. ఉత్పత్తి లో హెచ్చుతగ్గులు మార్కెట్ డైనమిక్స్ అని సర్ది చెప్పుకున్నా ఇంకా ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు.

3. జనాభా నియంత్రణ

జనం అంటే వోట్లు గా కనపడే ఈ దేశం లో జనాభా నియంత్రణ ఎవరు గుర్తించని ఒక ప్రధాన సమస్య. తోలి జనాభా నియంత్రణ అమలు చేసింది ఇండియా అని చెప్పుకునే ముందు మన జనాభా వృద్ది రేట్ చుస్తే అతి దారుణం గా విఫలమైన పధకం ఇదే అని తేట తెల్ల మవుతుంది. చైనా రష్యా లాగ పక్క దేశాల మీద పడి భూభాగం పెంచుకునే దమ్ము మనకు ఎలాగు లేదు కాబట్టి, జనాభా వృద్ది అరికట్టే పదకాలు కావాలి

4. రిజర్వేషన్ సబ్ పరేషాన్

పిచ్చోడి చేతిలో రాయి ఇండియా లో రిజర్వేషన్. కులాల ప్రతి పాదిక పై మరో రాజకీయ ఎత్తుగడ. రిజర్వేషన్ వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన చేసి ఆర్ధిక పరిస్తితుల ఆధారం తో పని చేసే వ్యవస్థ కావాలి. అగ్ర కులాల్లో ఆర్ధికం గా వెనక బడ్డ వారు లేరా... మరి వాళ్లకు రిజర్వేషన్ అక్కర్లెదా.. ఇక్కడే ప్రస్తుత వ్యవస్థ మనిషిని మరచి కులం వెనక పాకు లాడినది. ఇది ప్రజాస్వామ్య స్పూర్తి కే  విరుద్దం.

5. అవినీతి

ఇందుగల దండులేడని శ్రీహరి అన్నట్టు  మన వ్యవస్తలో అంతర్లీనమైన అద్భుత దుర్వ్యవస్త  అవినీతి, లంచగొండి తనం, భన్దుప్రీతి. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ హద్దుల దాకా ఏ ఒక్క సర్కారి పని పడిందా. అయ్యనో అమ్మనో సంతృప్తి పరచాల్సినదే. అది కామన్ వెల్త్ గేమ్స్ అనండి 2 జి  అనండి బళ్ళారి గనులనండి మరి
ప్రకాశం జిల్లా సెజ్ అనండి ఏలిన వారి హయాం లో సర్వం కైంకర్యమె. జనం లో వ్యవస్తల పట్ల ఏహ్య భావం కలగడానికి ఇంత కన్నా ఇంకేం కావాలి

6. రవాణ ఇతర సౌకర్యాలు

అభివృద్ధి చెందినా దేశాలకు మనకు అదో పెద్ద తేడా. పెద్ద అడ్డంకి  కూడా.

ఇంకా నా లిస్టు లో చాల కలలున్నాయి. సత్వరం పని చేసే న్యాయ వ్యవస్థ, దృఢమైన విదేశాంగ విధానం, ఎకానమీ వృద్ది, అధికార వికేంద్రికరణ, గట్రా గట్రా

కాని ఇవన్నీ ఆశించే ముందు ;

ఎదా ప్రజా తదా రాజా అని భేషుగ్గా నమ్మే మొదటి వాడిని నేను. ఈ రాజకీయులంతా మనలో వాళ్ళే. సిగ్గులేకుండా మనం ఎన్నుకున్న వాళ్ళే, కాబట్టి వల్లనేదో తిట్టేసేముందు  మనం నిజాయితీగా వోటు వేస్తున్నామా అనేది చుస్కొవాలి.

ఈ సందర్భం లో రవీంద్రుని గీతాంజలి జ్ఞాపకమోస్తుంది

Where the mind is without fear and the head is held high;
Where knowledge is free;
Where the world has not been broken up into fragments by narrow domestic walls;
Where words come out from the depth of truth;
Where tireless striving stretches its arms towards perfection;
Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit;
Where the mind is led forward by thee into ever-widening thought and action---
Into that heaven of freedom, my Father, let my country awake.

Oh my father...give my people more wisdom to chose the right....





Wednesday, January 22, 2014

నువ్వు

ఆ అద్భుతమైన క్షణం నాకింకా గుర్తుంది
నువ్వు నా కళ్ళ ముందు తలుక్కున 
మెరిసిన క్షణం, 
ఒక నీడలా సాగిపోయే దృశ్య కావ్యం

భాదాకరమై ఆశలుడిగిన నిర్లిప్తలో
నిశీధిలో, భారమైన జనారణ్యంలో
నీ కోమలమైన పిలుపు నాకింకా పరిచయమే
నీ రూపం నా కెప్పుడూ గుర్తే

కాలం గడచింది  నిట్టూర్పుల
సుడిగాలులలో నా కలలు కల్లలైనాయి
నీ పిలుపులు మరచాను
నా మదిలో మెదిలే నీ రూపం మ్లానమైంది

నా జీవితం నిర్జీవమైన మరుభూమి
ఒంటరి రోజులు భారంగా గడిచాయి
నమ్మకం, ఆశలు,
కన్నీళ్లు చివరికి బ్రతుకే లేదని నమ్మాను

కాని మళ్ళీ ఆ రోజులు తిరిగి వచ్చాయి
బీటలు వారిన మరుభూమి నుండి నా ఆత్మ తిరిగి మేలుకుంది
నీవు తిరిగి కనిపించావు
నువ్వు నా కళ్ళ ముందు తలుక్కున 
మెరిసిన క్షణం, 
ఒక నీడలా సాగిపోయే దృశ్య కావ్యం

నా హృదయం మరలా స్పందిస్తుంది
జీవితం మరలా చిగురించింది
నమ్మకం, ఆశలు,
కన్నీళ్లు, చివరికి అందమైన నా ప్రేమ మరల మేలుకున్నాయి 


Thursday, January 9, 2014

జండా ఊంచా రహే హమారా




ఫిబ్రవరి 7.
2014 సోచి ఒలింపిక్స్ .ప్రారంభోత్సవం.  
యావత్ ప్రపంచం టీవి సెట్లకు అతుక్కు పోయింది. 
ఒక్కో దేశం క్రీడాకారులు అబివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. 
ఆహ... ఎంత అదృష్టం. ఒక్కో దేశం నుంచి వచ్చిన అత్యుత్తమ క్రీడాకారులు. ముందు జండా పట్టుకు వెళ్తున్న వారిది ఇంకెంత అదృష్టమో. అదుగో అమెరికా జట్టు. ఆ జెండా పట్టు కెళ్తున్న క్రీడాకారుడు తల పైకెత్తి గర్వం అతిశయించిన మోముతో ఆ జండా గాలిలో ఊపుతూ ఆనందిస్తున్నాడు. ఈ దృశ్యం తర తరాలకు జన యవనికలపై అలాగే నిల బడి పోతుందని అతనికి తెలుసేమో.
హంగరి, ఐస్లాండ్, ఇండోనేషియా...అదేంటబ్బా .... ఇండియా ఏది .... ఇండియా క్రీడా కారులు ఒలింపిక్ జండా పట్టుకు వస్తునారు. అదేంటి .. అని విస్తు పోకండి... మన వాళ్ళు ఈ సారి ఇండియా కి ప్రాతినిద్యం వహించడం లెదు... మరి... ఎవరికీ వారే .. అంటే ఈ ఒలింపిక్స్ కి వెళ్ళే ప్రతి క్రీడాకారుడు తమకు తానె ప్రాతినిద్యం వహిస్తారన్నమాట. 
నాకెటు వంటి బ్రమలు లేవు కాని అదృష్టం బాగోక మనోళ్ళకి ఏదైనా పతకాలు వచ్చినా, పతకాలు తీసుకునే టప్పుడు, జనగణ మన విని పించదు.
ఇది జాతి మొత్తానికి మన ఘనత వహించిన (అ)రా(చ)జకీయులు ఇచ్చిన బహుమతి. ప్రపంచ ఒలింపిక్ కమిటి, భారత దేశ సభ్యత్వాన్ని రద్దు చేసింది.కారణం. మన ఒలింపిక్ కమిటీ లో ఉన్న వారిపై వచ్చిన అవినీతి ఆరోపణలు. 
కొత్త సభ్యులను ఎన్నుకోవడానికి ఫిబ్రవరి 7 దాక సమయం ఇస్తే, మనోళ్ళు ఫిబ్రవరి 9 న ఎన్నిక కార్యక్రమం పెట్టుకున్నారు. ఎందుకంటా ఎవరికో ఎక్కడో అందాల్సినవి ఆలోగా అందవేమో. లో గుట్టు పెరుమాళ్ళ కెరుక. 
ఏది ఏమైనా ఇది ఒక అవమాన కరమైన పరిస్తితి. పతకాలు సాదించడం తర్వాత సంగతి. తమ దేశం జండా పట్టుకు తిరగలేని దుస్తితి. ఆహా.. మన గొప్పతనం ప్రపంచం మంతా తెలుసుకొని, ముక్కున వేలేసుకొని తర్వాత ముసి ముసి నవ్వులు నవ్వుకోడానికి  మంచి అవకాశం.