Tuesday, December 24, 2013

మనమెరుగని రాజకీయం

ఢిల్లీ రాజకీయాల్లో సంచలనం.
పట్టుమని వత్సరం పూర్తి  చేస్కోని పార్టీ ఒకటి, దిగ్గజాలను వూడ్చి పారేసింది.
ఇంకా చెప్పాలంటే, తమ పార్టీ గుర్తు ని సార్ధకం చేసింది. 
ఈ చెత్త నిర్మూలన కార్యక్రమం లో మహామహులెందరో మట్టి కరిసారు. 
ఇదంతా ఎలా జరిగింది. 
ఒక సారి మన రాష్ట్రాన్నే గమనిద్దాం. పొద్దున్న లెగిస్తే సాయంత్రం వరకు జీవితం ఒక పోరాటం. చదవటానికి అడ్డదిడ్డంగా పెరిగిన ఫీజులు ఒక అడ్డంకి. ఎలాగోలా చదివొస్తే వుద్యోగం సాదించడం ఒక పోరాటం. ఏదో ఉద్యోగం వస్తే ఆ వచ్చే నాలుగు రాళ్ళతో జీవితం గడపటం ఒక పోరాటం. ఈ రోజు ఉన్న ధరలు రేపు ఉండవు. అదేమీ చిత్రమో ధరలు 200-300 శాతం పెరిగినా మన ప్రభుత్వాలకి చీమ కుట్టినట్టైన ఉండదు.

ఇవన్ని అలా ఉంటె మద్యలో ఎవరికీ ఉపయోగ పడని రాజకీయ దందా. ఎక్కడికైనా వెళ్ళాలంటే సరైన రోడ్లు ఉండవు. ట్రైన్లలో టికెట్లు దొరకవు. ఇంతెందుకు, దశాబ్దాల తర బడి దేశం స్వతంత్రం గానే ఉన్నా, జనాభాలో సగం మందికి పైగా పూట గడవని వాళ్ళే. ఇంకో పెద్ద వింత ఏమిటంటే, ప్రపంచం లో ఎక్కడా కన పడని మన రిజర్వేషన్ సిస్టం లో వ్యక్తి ఆర్ధిక స్తితికి ఎటువంటి స్తానం  లేకపోవటం. కులం మతం లేని దేశాన్ని స్తాపిస్తాం అని జబ్బలు జరుచుకునే మనం ఇంకా ఆ దిక్కుమాలిన బూజుపట్టిన భావజాలాన్నే  నెత్తి నెత్తుకొని సంబర పడటం.

మనకు అర్ధం కాలేదు కాని మన రాజకీయులు దీన్నేప్పుడో సూత్రీకరించి పడేశారు. రోటి కపడా మకాన్ అని. అంటే జనాలకు ఈ కనీస అవసరాలు అందకుండా చేస్తే, వాటిచుట్టూనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మన పనులు మనం చక్క పెట్టుకోవచ్చు అని.

ఇవన్నీ సమస్యలే. చాలా పెద్ద సమస్యలు. కాని కర్మ సిద్దాంతాన్ని నిలువెల్లా వంట బట్టించుకున్న ఈ దేశంలో ఈ దిక్కుమాలిన స్తితికి ఎవ్వరు కారణం కాదు. అదేంటో రాజకీయ  నాయకులు అవేవీ తమకు పట్టనట్టు తిరగటం సిగ్గు చేటు. అయ్యా ఒక ఆడపిల్ల  రాత్రి తిరగలేని పరిస్తితి అంటే, ఆ టైం లో తిరగటం ఎందుకు అని వ్రాక్కిచ్చిన ముఖ్యమంత్రులు, వందలాది మంది తీవ్రవాదుల బుల్లెట్లకు ఆహుతైతే, గంట గంటకూ సూట్లు మార్చి విలేఖర్ల సమావేశాలకు ముస్తాబయ్యే మంత్రులు, మన ప్రజాస్వామ్యం మనకిచ్చిన అమూల్య వరాలు.

ఇదంతా సరే... మరి ఇలాంటి వాళ్ళు కాకుండా మంచి వాళ్ళని ఎన్ను కోవచ్చు కదా.. అంటే,
మంచి వాళ్ళు రాజకీయాల్లోకి రావటం మానేసి చాల కాలం అయ్యింది. ఈ రోజుల్లో రాజకీయం ముచ్చటైన వ్యాపారం. ఇదిగో, ఇలాంటి పరిస్తితుల్లో అన్నా హజారే అవినీతి వ్యతిరేక వుద్యమం , అరవింద్ లాంటి వాళ్ళు ఆయన వెంట నడవటం, దానికి ఢిల్లీ కేంద్ర స్తానం కావటం, ఆప్ పుట్టుక, జరిగిపొయాయి.

అన్ని రకాలు గ బ్రస్టు పట్టిన రాజకీయ చెద రంగం లో  ఒకే ఒక నిజాయితీ పరుడు, కొండకొంచో సేవా కాంక్ష ఉన్నవాడుగా అరవింద్ కనపడ్డాడు. ఇదంతా వన్ మాన్ షో అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఆయన పార్టీ అభ్యర్దులు కొంతమందిని మినహాయించి పక్కా నేలబారు వ్యక్తులె.

ఎడా పెడా పెరిగే ధరలు, విద్యుత్ ఛార్జ్, టైం పాడు లేకుండా రోడ్ల మీద రొద చేసే బాబు అమ్మలా కార్లు, ఎప్పుడో కాని రాని నీళ్ళు, దేశ  రాజధాని అయినా దిన దినం దిగజారుతున్న భద్రతా, ఇవన్నీ ఎవరు మాట్లాడని అంశాలే కావచ్చు. కాని అరవింద్ ఇవన్ని మేనిఫెస్టో లో ప్రకటించి నప్పుడు జనభాహుల్యాన్ని యిట్టె ఆకర్షించారు. ఇవన్ని మిగతా పార్టీలు పట్టించు కోక పోయి ఉండచ్చు. అవి వీటిని పట్టించు కున్నా జనం వారి మాటలు నమ్మటం మానేసి చాల కాలం అయ్యింది .

ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నేటి రాజకీయానికి ఒక చెంప పెట్టు. మరో యుగానికి, ప్రజలు మెచ్చే, పనికి వచ్చే మేలు మలుపు.ఈ సమస్యలు దేశం నలు మూలలా ఉన్నవి. కాని ప్రతి రాష్ట్రం లో ఆప్ లాంటి ప్రత్యామ్యాయం లేదు. అలాంటి దేదో వచ్చేదాకా నేనైతే వోటింగ్ ఫర్ నన్ అఫ్ ది ఆబోవ్ ;)


Sunday, December 15, 2013

లంచమున పనులు సమకూరు ధరలోన..లంచాభి పారాయణం

ఒక పదేళ్ళ కిందటి విషయం.
నేవీ ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు అడిగిన సర్టిఫికేట్ లిస్టు లో బర్త్ సర్టిఫికేట్ ఒకటి. 
నాన్నా.. నా బర్త్ రిజిస్టర్ చేయించారా..అడిగాను ... 
కే.బీ.సీ. లో ఏడుకోట్ల ప్రశ్న అడిగినట్టు మొహం పెట్టి.జ్ఞాపకం లేదురా అన్నారాయన. 

సరే.. ఉంటె గింటే మున్సిపాలిటీ ఆఫీసులోనే ఉంటుంది కదా... ఒక మల మల మాడే మద్యాన్నం టైం చుస్కొని.. బయలుదెరాను. ఆ సమయానికైనా మన పర్మనెంటు గుమాస్తా గారు, ఆఫీసు కి వెంచేస్తారనే ధీమాతొ. 

ఒంగోలు మున్సిపాలిటీ ... మొదటి సారి ఇలాటి పని మీద వెళ్ళటం. ఇంతకూ ముందు, ఇంటి పన్ను కట్టడానికి రెండు మూడు సార్లు వెళ్లినట్టు గుర్తు. 

అవి కొన్ని మరచి పోలేని అనుభవాలు. అదేంటో, మద్యాన్నం ఫలానా టైం లోనే ఆ పన్నులు కట్టించుకునే వాల్లు. నిజం చెప్పద్దూ .మన గుమాస్తా గారు అఘోరించే టప్పటికి అంత టైం పడుతుందన్న మాట. ఇంకేముంది. ఇంటి పన్ను కట్టే పది పరకా మంది అదే టైం కి హాజరు అవుతారు. ఇంకా చూస్కోండి నాయనా.. 2 ఫ్లోర్ నుంచి కింద రోడ్డు దాక పెద్ద లైన్ వుండేది. 
సరె...ఇంక ఈ రోజు విషయాని కొస్తే,బర్త్ సర్టిఫికేట్ కి చలాన 25 రూపాయలు.పట్ట్టు సమయం 3 రొజులు.  ఆహా అంతే  కదా...  ఇంకేమి  ఇంటర్వ్యూ ఒక నెల టైం ఉంది కదా ..నా ముందుచూపుకు నేనే జోహార్లు అర్పించుకుని, చలాన కట్టాను. అదే గుమస్తాను తర్వాత ఏం చెయ్యాలి అని అడిగాను. 3 రోజుల తర్వాత ఫలానా సెక్షన్ లో సుబ్బా రావు ని కలవమని చెప్పాడు. ఇంకేమి పని అయి పోయింది కదా అనుకుని ఇంటికి బయలు దేరాను. 

3 రోజులు అయి పొయాయి. ఆ ఫలానా సెక్షన్ లో సుబ్బా రావు ని కలవటం తో నా పాట్లు ప్రారంభమయ్యాయి. నా కధ అంతా విని, నేను అర్పించిన చలాన ముక్కను క్రీగంట పరిశీలించి , అబ్బే ఇదింకా నా దాక రాలేదబ్బాయ్ .. ఆ చలాన వాళ్ళనే అడుగు అన్నారాయన . సరే మళ్ళా ఆ గుమస్తా దగ్గరకు వెళ్లాను. నా చలన నెంబర్ అడిగి అర్రే ఇది ఇంకా ఆయన దగ్గరకు వెల్లలెదా... ఇప్పుడే పంపిస్తా... సరే కాని నేను కాఫీ తాగటానికి వెళ్తున్నా వస్తావేమిటి ... అబ్బే ,,ఇప్పుడే తాగి వచ్చానండి...మల్ల కలుస్తా.. 

మల్ల మూడు రొజులు... మల్ల సుబ్బరావు దర్సనము. అయ్యవారు... చిద్విలాసం గా నవ్వుతూ నిన్ననే నీ ఫైల్ వచ్చిన్ దబ్బా.. బర్త్ డేట్ చాల పాతది కదా.. వెతుకుతున్నా... అబ్బ ..ఎంత  ఓపిక సారు మీకు...పద బైట కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం ... ఇంత మద్యాన్నం కాఫీ ఏంటి సార్...మరల కలుస్తా... 

నేనెంత తప్పు చేస్తున్నానో ఇంకో 4-5 సార్లు ఆఫీసు చక్కర్లు కొట్టే దాకా నాకు అర్ధం కాలెదు. ఈ మద్యలో నా ఫైల్ కనపడకుండా పోయింది. సుబ్బారావు కి అసలు నా బర్త్ రిజిస్టర్ అయిందా లేదా అని అనుమానం వచ్చింది. 
అదేదో మొహంజదారో  తవ్వకాల్లో నీ రిజిస్టర్ వెతకాలి అన్నట్టు మొహం పెట్టి,  ఇంకా కొంచెం టైం పడుతుందయ్యా అనేసాడు. 

ఇంకా ఇంటర్వ్యూ కి 7 రోజులే ఉంది. నా కు టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ సారి వెళ్ళినప్పుడు కొంచెం పక్కకు పిలచి 
సర్ నాకు ఇంకో 1 వీక్ లో నవి ఇంటర్వ్యూ ఉంది..కొంచెమ్ తొందరగా చూసి పెట్టండి అని బతిమాలు కున్నాను. 

కర్ణుడు కవచ కుండలాలు దానం చేస్తున్నట్టు మొహం పెట్టి, అలాగ.. ఈ రోజే చేద్దాం   అబ్బాయి... ఇక్కడే ఉండు. 
హడావుడి గా లోపలికి వెళ్ళాడు .. పది నిమిషాల తర్వాత.. ఒక ఫైల్ పట్టుకొని వచ్చి, ఆఫీసు బైట చెట్టుకింద భుద్ధ భగవానునిలా బాసింపట్టు వేసుకొని కూర్చొని రమ్మ న్నట్టు పిలచాడు. ఫైల్లోంచి చిద్విలాసం గా బైటకు తీసాడు నా బర్త్ సర్టిఫికేట్. చాల కష్టపడ్డాను అబ్బాయి... ఎక్కడెక్కడో వెతకాల్సి వచ్చింది. ఆయన పది నిమిషాల్లో రావటం చూసి నాకైతే నమ్మ బుద్ది కాలెదు. సరేలే పని అయింది కదా.. థాంక్ యు చెప్పి ఆయన పెట్ట మన్న చోట సంతకం పెట్టి బయలు దేరాను... బాబు కొంచెం నా సంగతి చూడు... చాల వెతకాల్సి వచ్చింది .. అప్పుడప్పుడే కొంచెం కొంచెం అర్ధం అయ్యింది విషయం. ఎంత ఇవ్వమంటారు. అయన అడిగిన దానికి అయిదవ వంతు చేతిలో పెట్టి అయిందని పించి ఇంటికి బయలుదేరాను. 

ఇది ఒక సగటు నేల  బారు మనిషి జీవితంలో ఒక అవినీతి పర్వం లో లంచం అనే కాండం. ఇందుగల డందు  లేదన్నట్టు నిరుద్యోగులైతే నెమి.. ఉదొగస్తులు, వ్యాపారులు చివరకు రిటైరీలకు తప్పని తంతు. ఇక్కడా అక్కడా అని  ఏల తెలంగాణా పల్లెల నుండి తిరుపతి కొండల దాక వీళ్ళకి ఆరని అసంతృప్తి.

అబ్బో..ఈ మాత్రానికే అంటారా. తర్వాత ఎన్ని సార్లు వీళ్ళను నేను తృప్తి పరచానో గుర్తు లేదండి. గొప్ప విషయం ఏమిటంటే మనం దీనికి అలవాటు  పొయామ్. సూర్యుడు తూర్పున వుదయించినట్టు సర్కారి పనులంటే లంచం లేకుండా పని కాదు అనే నగ్న సత్యానికి గతిలేక బానిసలై పోయాం.

నిజం చెప్పాలంటే, లంచం అనేది స్వతంత్రం మనకిచ్చిన హక్కు.. మన సర్కారి ఉద్యోగ మహారాజులకు అడగక ఇచ్చిన వరమ్. మన దౌర్భాగ్యం. 


Saturday, November 9, 2013

ప్రేమని ప్రేమించాను

నేను నిన్నుప్రెమించానా..
ఏమో...
నీకోసం పగలు రాత్రి పలవరించింది నిజం
నీ ఊహల్లో నన్ను నేను మరచింది నిజం

నీ క్రీగంటి చూపులకై
యుగాలు వేచింది నిజం
నీ చిన్ని నవ్వుతో
నిలువెల్లా పులకరించింది నిజం

మరి నేను నిన్ను ప్రెమించానా..
నేనెపుడు ఎదురైనా ఎరుకలేక నిలచావు
నా భావం తెలుసుకుని నేనెవరో అన్నావు

శిలలా నే మిగులుంటే మరి ఎవరినో వలచావు
నీకై నే కట్టిన గుడిలో శిల నవను పో పోమ్మన్నావు


ఆ ఆశకు శ్వాశవు నీవైనావని
మురిసిన నాకలలకు
కలకాలం నిలచే
కరకు సమాధిని  కట్టావు

మరి నేను నిన్ను ప్రేమించానా...
నేను ప్రేమించింది నిన్ను కాదేమో...


నీవే నా ప్రాణమని
పది పది తెలిపే తలపు

చివరి శ్వాస నిలచే వరకు
వెంట నిలచె నా వలపు

అనునిత్యం నేనే నువ్వని
నా ప్రేమే నిక్కమని
నీవెక్కడున్నా
వెంట నడచే నా మనము
నే ప్రేమించింది
నీపైగల నా ప్రేమనే...
నిన్ను కాదేమో ప్రియతమా..





 

Wednesday, September 4, 2013

మన ప్రణయం

మన ప్రణయం ఎప్పుడూ ఇంతే....
వేసవి వడగాల్పుల్లో వాసంత సమీరమై పలకరిస్తుంది...
ఇదే శాశ్వతమని బ్రమసే నా హృది గదిని వీడ్కోలని విడిచి వెల్తుంది...

కోకిల మధురగానంతో మైమరచి
ప్రతి రుతువూ రాగ రంజితమని
తలపోయటం యెంత వెర్రితనం...

పలు వన్నెలతో మురిపించే వాన విల్లు
క్షణ ప్రాయమనే ఎరుక లేక
ఎల్ల కాలం త్వమేవాహం అనుట తగునా..

ఉవ్వెత్తున ఎగసి పడే అలల తాకిడిని
అరచేతి లో వడిసి పట్టాలనే
విఫల ప్రయత్నమని...

ఉషోదయాల్లో గడ్డి పరకల పై
తలుక్కున మెరిసే
తుషార బిందు సౌందర్యం
ప్రతి రోజూ పలకరించదని...

పున్నమి వెలుగులతో
అందాలు ఒలికే  ఈ ప్రక్రుతి
ప్రతిరోజూ ఇలానే ఉండదని...

ప్రతి సారి నువ్వే
ఇదే నిరూపిస్తావు

కాని...

నీ ప్రేమ ఉప్పెనలో
చిక్కుకున్న చిగురుటాకును నేను
ఆ వడిలో నా అస్తిత్వం కోల్పోవటమే నాకు తెలుసు.

దీపసుందరి వగలతో
మైమరచిన శలభాన్ని నేనైతే..
నా నుండి ఏ తెరిపిని ఆశిస్తావు..



Thursday, August 22, 2013

మరీచిక...

నిజమే 

నేను   నిన్ను  ప్రేమించాను 
కళ్ళలో  వేయి వత్తులు వేసుకొని  
నీకై వేచాను 

నిజమె..నీ ప్రేమ ప్రవాహంలో 
అనంత అనందం అనుభవించాను 

నా తలపులలో 
వలపు వేలుపువై నిలస్తే 
తెలవారులు తలచి 
పులకరిస్తాను 

నీ ఊహలలో ఊసులలో 
ప్రపంచాన్నే మరచాను 
తెలతెల వారిందన్న 
తెరపే లేదు 

ఉదయ భానుని చివుక్కుమనే 
కిరణాలతో నిజం తెలుసుకున్నా... 

కలకాలం కరగని 
స్వప్నానివి నువ్వు.. 

నేనేనాటికి చేరుకోలేని మరీచికవు 

Tuesday, July 30, 2013

పాప...పాల పీక...

మా పాప
దిగ్గున లేచింది...
పీడ కల చూచెనేమో
చిరాకు పడింది

ఇటు దొర్లింది
అటు దొర్లింది
ఏదో వెతికింది
దుప్పటి ఎత్తి చూసింది

దిండు వెనక అమ్మ దాచిన
అప్పాలేమన్న ఉన్నవేమో
అటు నిటు కదిపి చూసింది

చిన్నారి చిట్టి చేతులతో
ఏదేదో సైగ చేసింది
అర్ధం కాని తనదైన భాషలో
మరేదో  చెప్పింది

కోపమందుకుందేమో
నొసలు చిట్లించింది
మూతి ముడిచింది

దగ్గరగా వెళ్లాను నేను
తల్లి ఏమైంది అని
అనునయించాను

బిగ్గిరిగా ఏడ్చింది
చేతులు అటునిటు ఊపింది
అందాను కదా అనుకుందేమో
నా మొహం పై చప్పున
చెయ్యి విసిరింది

ఎన్నో ప్రయత్నాలలో
దొరింకిందేమో
తాను  వెతికేది
ఆనందంతో చిరునవ్వు నవ్వింది

అల్పసంతోషి ఉక్కిరి బిక్కిరి అయింది
తీరా తేర చూచును కదా
పట్టినది ఒక పాల పీక

నోట పెట్టుకు చప్పరించెను
తలచినది కాసేపు
పీక బైటకు తీసివేసి
తేరి పారా పరికించినది

తలచినట్టుల సస్య ధారలు
వెనువెంటలే వెలువడలేదు చెప్మా

బిక్క మోహము వేచె  చిన్నది
అయ్య ఏది దారి
అన్నటుల
తలను ఎత్తి నన్ను చూసెను

తల్లి నీవు తలచినది
ఆకలి దప్పుల మాన్పు
అమృత మయమవు
పాల ఊటలు

తలచినదేదో వదలి
ఆవేశము పూనినచో
వలసిన దప్పుడు దొరకదు

ఆలోచన చేయవలెను
ప్రతి కార్యం చేయుముందర

పాల పీకలు తీర్చలేవు ఆకలి దప్పులు
ఆవేశాలు మాన్పలేవు చేసిన తప్పులు

ఇల్లలికిన పండగ కాదని
చరిత్ర చెప్పిన సత్యం

రొట్టె చాలదని  ముక్కలు చేసిన
ఎవరికీ గడవదు పబ్బం

( అంధులు చూడలేని నిజాలు మరల మరల రాయట ఎట్లను తలపోయు నా మది భావం చెప్పకనే చెప్పిన నా చిన్నారి కి )






Wednesday, July 17, 2013

శవాల మీద వోట్లు ....

ఏరుకోండి  రా ఏరుకోండి... 
అన్నెం పున్నెం ఎరుగని పసి పిల్లల శవాల మీద 
మీ వోట్లను ఏరుకోండి... 

రండి రండి పరుగున 
వీడో వాడో ముందొచ్చి మీ వోట్లు కొట్టుకేలత డేమో... 

ఒకటో తరగతి పుస్తకం పై 
తడి ఆరని నెత్తుటి చార 
మీకు పడే వోటు ముద్ర లాగ కనపడుతుంటే 

గుండలవిసేలా ఏడ్చి సొమ్మసిల్లిన 
ఆ తల్లి పెట్టిన ఆక్రందన 
నీ జిందాబాదే అనుకో 

రిక్షలాగే అయ్య 
పాచి పని చేసే టమ్మ 
చచ్చింది పిల్లోడే 
నీకింక రెండోట్లున్నాయ్ గా ఇంట్లో 
పండగ చేసుకో 

యెంత మంది సస్తే ఏందీ 
దేశం స్మసానమైతే ఏంది 
ఆ సమాధుల పునాదులపై 
నీ రాజ్యం నిర్మించుకో 

పొద్దుగాలే బడికి పోయిన చిట్టి పొట్టి చిన్నారులు 
అమ్మ అయ్యా రెక్కలు  ముక్కలు  చేసుకు  
పూట గడవని దుస్తితిలో 
నాలుగు ముక్కలు నేర్చి 
రేపు మార్చే  చిన్న పాపలు. 

నీ  వ్యవస్థ అవ్యవస్థ
వొండి వడ్డించిన 
నెత్తుటి కూడు 
నరనరాన విషమై 
ఉసురు తీసుకుంటుంటే 
యాడ సస్తివోలీడరోడా 

చావు బతుకున 
కొడిగట్టిన పసిప్రాణం 
ఆసుపత్రి బెడ్డు మీద 
కొట్టుమిట్టలాడుతుంటే 
గాలిగూడ ఆడకుండా 
నీ రోదేందిర  సచ్చినోడా... 

చాప్రా విషాదాన్ని రాజకీయం చేస్తున్న రాబందులకు..... 


Tuesday, May 7, 2013

ఇండియన్ షేకు ... చైనా ఒంటె....


మంచి సందేశం ఉన్న కధ  ఇది. రాసిని వాసిని బట్టి చూస్తే అరబిక్ దేమో.  ఒక అరబ్బు షేకు దూర దేశం ప్రయాణ మవుతాడు. చిరకాలం పెంచుకున్న ఒంటె మీద. చీకటి పడటంతో ప్రయాణం మంచిది కాదని, ఎడారి మద్యలో గుడారం వేస్తాడు.

ఎడారి చలి. ఒంటె తట్టుకో లేక పోతుంది. కొద్దిగా మెడ లోపల పెట్టి, షేకు చలికి నా వొళ్ళంతా కొంకర్లు పోతుంది. కాని వొళ్ళంతా ఎలా ఉన్నా ఒక్క తల కాపాడుకుంటే, ఈ రాత్రి గట్టేక్కుతాను. కొంచెం తల లోపల పెట్టుకోవటానికి అనుమతి ఇవ్వండి.

షేకు ఆలోచించాడు. గుడారం పెద్దది. ఒంటె తల పెట్టుకుంటే, తన కేమి ఇబ్బంది లెద్దు. అల్లాగే జగిగింది. ఒక జాము గడిచింది. ఇదిగో, మళ్ళా ఒంటె ఒండ్ర పెట్టింది. షేకు షేకు ... నా శరీరంలో తల కన్నా ముఖ్యమైన భాగం నా మూపురం. నా ఒంట్లో కొవ్వంతా అక్కడే ఉంటుంది. కొంచెం దాన్ని కూడా లోన పెట్టుకోనిస్తే, మీకు రుణ పడి   ఉంటాను. షేక్కు అది సబబే అనిపించిన్ది.

అల్లా రెండు మూడు జాములు గడిచే కొద్దీ, ఒంటె గుడారాన్ని ఆక్రమించింది. షేకు వణుకుతూ చలి ఎడారిలో రాత్రి గడపాల్సి వచ్చింది.

చైనా ఆక్రమణ విషయం లో ఇండియా వ్యవహారం  అరబ్బు షేకు లాగే ఏడిచింది. నేడు 19 కీమీ లోనికొచ్చి వాళ్ళ డిమాండులు నెరవేర్చుకున్న చైనా, రేపు ఇంకో రెండు మైళ్ళు లోనికి రాదనీ , ఏ యాగి చేయ్యదంటే నమ్మలెము.

ఇంకా హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే చునార్ సెక్టార్ లో ఆక్రమణ రేఖ కు మనవైపున బంకర్లను మనమే నాశనం చేసుకుని లెంపలు వేసుకుని వెనక్కు తగ్గటం. రెండవ తరగతి పిల్లలకు కూడా అర్ధం కాని ఈ ఒప్పందం చేసుకుని మనోళ్ళు సాధించినది ఏమిటయ్యా అంటే, మీడియాలో తమ ప్రభుత్వ చేత కాని తనానికి ముసుగేసు కోవటం. ఘనత వహించిన మన మంత్రి వర్యులు చైనా పర్యటన, చైనా పెద్దాయన ఇండియా పర్యటన రద్దు కాకుండా, కాపాడుకోవటము.

మొదటి నుంచి మన విదేశాంగ విధానం తప్పుల తడకె. కాశ్మీరులో  మొదలుకొని కన్య  కుమారి దాక, రాన్ అఫ్ కచ్ నుంచి అరుణాచల  ప్రదేశ్ ఆవలి హద్దుల వరకు మన వెదవాయిత్వమ్ వెతకకనే కనపడుతుంది. టిబెట్ ఆపద్ధర్మ ప్రభుత్వానికి రాజధాని ని ఇచ్చిన మనం, టిబెట్ చైనా  లో భాగమని వోప్పేసుకుంటాం. అదే చైనా, సిక్కిం, అరుణాచల ప్రదేశ్ లను తన మాపు లో  కలిపెసుకుంటే కిమ్మనము.

బంగ్లా చొరబాట్లు ఈశాన్యం లో తల బొప్పి కట్టించినా మన వోటు బ్యాంకు రాజకీయాలకు వోట్లే తప్ప ప్రజల పాట్లు పట్టవు. మొన్న మొన్నటి సంఘటనే తీసుకుంటే, పోయిన భూమి ఎల్లాగు పోయింది. చైనా టెంట్ల ఎదురుగా మనము మన బలగాలను  పెంచు కుని, శత్రువు కళ్ళలో కళ్ళు పెట్టి చూసే ధైర్యం ఎందుకు చెయ్యలేక పొయాము. వాస్తవాధీన రేఖలను, అంతర్జాతీయ సరిహద్దులని  ఒప్పేసుకుంటే, సగం తలనొప్పులు తగ్గుతాయి. ఇలా వాళ్ళు రేఖలు ఉల్లంఘించినప్పుడు మీన  మేషాలు లెక్కించే పని ఉండదు.

మరి, మన భూమి నుంచి మనమే వెనక్కి తగ్గాల్సిన అవమానకర ఒప్పందం ఎందుకు చేసుకోవలసి వచ్చింది. ఏ రోజు కా రోజు పబ్బం గడుపుకునే రాజకీయులు అంత కంటే ఏమి ఆలొచిస్తారు.వీటన్నిటికీ వాళ్ళకు సమయం వుంటే కదా.. అయ్యా... ఎన్నికల సమయమ్.. అందరూ ప్రచారాల్లో బిజీ గా ఉన్నారు.. మీ చావు మీరు చావండి



Saturday, January 12, 2013

గుంజుకున్నావ్ ???

Kadali Movie lo Gunjukunnav ane paataku naa own lyrics :)
నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..

లేని పోనీ ఆశలు రేపే  కొంటె  చూపేలే 
తగ్గనంటుంది నా గుండె సడి తకదిమిలా...

మన ఈ ప్రణయం 
రాసే నవ కవనం 
ఇక ఈ లోకం అవదా నందనవనం 
నా మనసు వయసు నీ వెంటే పోతుంటే పోతుంటే 
నా కంటూ మిగిలేదిక ఏముందే 

ఇక నీవుంటే నా వెంట 
కాలమసలు కరగదుగా...
కలకాలం నా కలలా నిలుస్తోన్దిలా...

నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..

పొద్దే గడవను  అందే..
ప్రాయం నిలవకవుందే..
నా వంకే తొంగి చూసి 
చందమామ నవ్విందే...

ముసుగుతన్ని లోకమంతా నిదరోయే వేళల్లోన..
నా వయసే నీ తోడుకై వేచి వేచి చూసిందే...

నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..

నిలువంతటి నీ రూపం 
కన్నుల్లో నిలిచాక  
కనురెప్పలు మూయాలని ద్యాసే నాకే లేదే..

నా లో నీపై ప్రేమ 
కడలి అలై పొంగితే 
రగిలే నా మనసేమో 
పలకలేక మూగైందే 

నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే..

లేని పోనీ ఆశలు రేపే   చూపేలే 
తగ్గనంటుంది నా గుండె సడి తకదిమిలా...

మన ఈ ప్రణయం 
రాసే నవ కవనం 
ఇక ఈ లోకం అవదా నందనవనం 
నా మనసు వయసు నీ వెంటే పోతుంటే పోతుంటే 
నా కంటూ మిగిలేదిక ఏముందే 

ఇక నీవుంటే నా వెంట 
కాలమసలు కరగదుగా...
కలకాలం నా కలలా నిలుస్తోన్దిలా...

నిండి పోయావ్ నువ్వే ఎదలోనే..
నీ నీడై సాగి పోయే ఇక నా మనసే